ఓ నా పిచ్చి ప్రజల్లారా…. పత్రికలు, మీడియా అనగా నిష్పాక్షికంగా జనం కోసం ఎలుగెత్తే గొంతులు అని భ్రమపడితే ఇంకా మీ ఖర్మ… ఇంకా ఇంకా మీకు క్లారిటీ రాకపోతే అది మీ దరిద్రం… నాయకులు తిట్టుకోవడం అనేది గతం… పార్టీలు, నాయకుల కాళ్ల మీద పారాడే గొంగళిపురుగులు తిట్టుకోవడం ప్రజెంట్ ట్రెండ్… ప్రొఫెషనల్ ఎథిక్స్, మన్నూమశానం… అంతా ఓ ట్రాష్… అసలది ప్రొఫెషన్ అయితే కదా… ఏ మీడియా అయినా ఒకటే…. నీ పార్టీ ఏది, నీ నాయకుడు ఎవరు, నీ బాసుకు డప్పు కొడుతున్నావా లేదా, నీ ప్రత్యర్థిని తిడుతున్నావా లేదా…? అంతే……. అయితే కొన్నిసార్లు అవి చదువుతుంటే మనకు హాహాశ్చర్యం వేస్తుంది… ఈ మోకాలి బుర్రలు ఎక్కువగా జర్నలిస్టులకే సొంతమా అని…! నో, నో, జర్నలిస్టులు సర్వజ్ఞులు, సమాజానికి ఆశాకిరణాలు అనే భ్రమల్లో ఉన్నారా… సరే, మీ కళ్లు తెరుచుకునే తాజా కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం….
అసలు తెలుగునాట జర్నలిజం అంటేనే ఆంధ్రజ్యోతి, టీవీ9 కదా… (కింద పడిపోకండి… తేరుకొండి ప్లీజ్…)… ఆనందయ్య కరోనా మందు మీద టీవీ9 నురగలు కక్కుకుంటున్న అజ్ఞాన విషం చూస్తున్నాం కదా… థూమీబచె అని తిట్టకూడదు సుమీ, సంస్కారం అనిపించుకోదు ప్లీజ్… వాడూ, వాడి ఛానెలూ…!! సరే, విషయానికొస్తే… టీవీ9 తాత ఆంధ్రజ్యోతి పత్రిక… ఏబీఎన్ చానెల్… తోడుగా మరీ వీథికుళాయి ఆడమేళం బ్యాచ్ టీవీ5… వోకే, అసలు విషయానికొద్దాం… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ప్రముఖ సీపీఎం మనిషి నాగేశ్వర్‌కు ఓ సవాల్ విసిరాడు… (ఖచ్చితంగా డాక్టర్ నాగేశ్వర్ అనాలా..?)… ఏమోయ్, నాగేస్వరూ… నీకు తలకాయ్ ఉందా… మమ్మల్ని తెలుగుదేశం అనుకూల చానెల్ అంటావా..? నువ్వు సీపీఎం… నువ్వు తటస్థవాదిని అని చెప్పుకునే బోగస్ మేధావివి, నీ బుర్ర ఎక్కడుందో చూసుకో, అసలది బుర్రేనా… ఉత్త బుర్ర బుర్రా..? (బుర్ర అనగా డొల్ల అని అర్థం తెలంగాణలో కొన్నిచోట్ల… చాలామందికి అర్థం కాదు కదా, ఇంగ్లిషులో Hollow…)… నువ్వు సీపీఎం కాదా, నువ్వది అంగీకరిస్తే, మేమూ టీడీపీ అని అంగీకరిస్తాం అని రాధాకృష్ణ కొత్త సవాల్…
Ads
ఇక్కడ విచిత్రం ఏమిటంటే…. ఆంధ్రజ్యోతి, టీవీ5 తెలుగుదేశం చానెళ్లు, పత్రిక అని తెలుగునాట చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు… దీనికి పెద్ద నిరూపణలు దేనికి..? దానికి ఈ సవాళ్లేమిటి..? పైగా రాధాకృష్ణ పేరుకు న్యూట్రల్ జర్నలిస్టు అనే ముసుగులో ఉండవచ్చుగాక… కానీ ప్యూర్ టీడీపీ అని అందరికీ తెలిసిందే కదా… పోనీ, నాగేశ్వర్ తాను సీపీఎం మనిషిని కాను అని చెప్పాడా ఎక్కడైనా..? ఎప్పుడైనా..? అసలు ఇవి కాదు…. నాగేశ్వర్ వంటి జర్నలిస్టులకు రాధాకృష్ణ అనబడే సర్వాతీతుడు జవాబు చెప్పుకునే స్థితి వచ్చింది చూడు, అదీ అల్టిమేట్… నాగేశ్వర్‌కు ఫుల్ సర్టిఫికెట్ అది… ఎంతైనా నాగేస్పరుడు ధన్యజీవి… రాధాకృష్ణ గుర్తింపు అనేది మామూలు విషయమా…?! ఫాఫం, మనకు తెలుసు కదా, జనసేనతో పొత్తు పెట్టుకున్న పాపానికి పవన్ కల్యాణ్‌కు ఇదే నాగేశ్వరుడు ఎంత డప్పు కొట్టాడో… ఇప్పుడు న్యూట్రల్… అంతే మరి… ఎప్పటికెయ్యది ప్రస్తుతమో… అంతెందుకు..? ఈరోజు ప్రజాశక్తిలో కేరళ సీఎం తన అల్లుడికి మంత్రిపదవిని కట్నంగా ఇచ్చిన విషయం ప్రస్తావనకు రాకుండా… మా విజయన్ గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్టు, సూపర్ అని డప్పు కొట్టడానికి తెలకపల్లి రవి అనబడే ఎర్ర జర్నలిస్టు ఎంత ప్రయాసపడ్డాడో పాపం… ఎన్ని విన్యాసాలు చేయాల్సి వచ్చిందో… పార్టీ కార్యదర్శి భార్యకు, సీఎం అల్లుడికి మంత్రి పదవులు అనే బంధుప్రీతిని సమర్థించలేక… పగవాడికి కూడా రావొద్దు ఈ దుస్థితి రవి గారూ…
ఇది ఇంకో దరిద్రం… పేరుకు పత్రిక… జస్ట్, అందరికీ తెలిసిన ఓ కరపత్రం… ఏదో వెలుగు అనే దినపత్రికలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో రాశారట… ఫస్ట్ పేజీలో తెగ శోకాలు పెట్టారు… ఇక్కడ రెండు విషయాలు… నమస్తే తెలంగాణ పింక్ పత్రిక, అనగా కేసీయార్ పత్రిక… సారీ, కరపత్రం… అలాగే వెలుగు అనేది కూడా బీజేపీ కరపత్రం, దాని ఓనర్ ప్రస్తుతానికి కాషాయం బాపతు… అది అలాగే ఉంటుంది… బాసు ఆలోచనలకు తగ్గట్టు వార్తలు రాయకపోతే ప్రజెంట్ జర్నలిజానికి అర్థమేముంది..? అసలు పత్రికల తాజా ట్రెండే అది కదా… మమ్మల్ని పత్రిక అని ఎవడైనా అంటే ఖబడ్దార్ అన్నట్గుగానే రాస్తున్నయ్… ఇక్కడా అంతే… ఐనా..?
….. అసలు వెలుగు అనే పత్రిక ఏం రాసిందో ఎవరికీ తెలియదు, ఇప్పుడు నమస్తే తెలంగాణ పత్రికే తన పాఠకులకు చెబుతోంది… వెలుగు అనే పత్రిక ఉంది, అది ఇలా రాసింది అని… హహహ… పోనీ, అదయినా వెలుగు ఏం రాసిందో ఆ క్లిప్పింగు ఐనా ప్రచురించాలి కదా… ఆ సోయి లేదు… ఆ వెలుగు సైటంతా వెతికినా, అది ఏం రాసిందో కనిపించడం లేదు… అంటే, నమస్తే సదరు ప్రత్యర్థి పత్రికకు (సారీ, కరపత్రానికి) ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నదా..? వారెవ్వా..!! పోనీ, వివేక్ వెంకటస్వామి అనే వెలుగు కాషాయ దివ్వె క్షమాపణ చెప్పాడట… కానీ అదీ ఆయన పాంప్లెట్లో కనిపించలేదు… మరెక్కడ క్షమాపణ చెప్పాడో, నమస్తే ఆ ముక్కకు క్లారిటీ ఇస్తే బాగుండు కదా…. సర్లెండి… దొందూదొందే… ఒకటి గులాబీ, కాస్త రంగు వెలిస్తే కాషాయం… ఎస్, నాయకులు తిట్టేసుకోవడం పాత ట్రెండ్… పత్రికలు బజారున పడి తన్నుకోవడం కొత్త ట్రెండ్… జయహో తెలుగు జర్నలిజం…!!
Share this Article