ఏమైంది..? ఆనందయ్య కరోనా మందు పంపిణీ మళ్లీ స్టార్ట్ కాదేమిటి..? జగన్ సానుకూలంగా ఉన్నాడు అనేది ఉత్త తూచ్ ముచ్చటేనా..? ఈ పరిశీలనలు, ఈ అనుమతులు, ఈ కోర్టు విచారణలు తేలేదెన్నటికి..? అసలేం జరుగుతోంది..? ప్రజాశక్తులు, టీవీ9లు గట్రా విరజిమ్మే విషానికి ఆ మందు చచ్చిపోవాల్సిందేనా..? సగటు మనిషి ఆలోచనలు ఇలా సాగుతుంటయ్… మరోవైపు ఆనందయ్య మందుకు అప్పుడూ డూప్లికేట్లు వచ్చేస్తున్నయ్… అదీ బ్లాక్ మార్కెటే… ‘‘ష్, ఆనందయ్య మందును రహస్యంగా తయారు చేయిస్తున్నారు, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నె సినిమా, రాజకీయ ప్రముఖులకు, ధనికులకు ఆ మందు వాడేస్తున్నారు… మీకు కావాలంటే తెప్పిస్తా, కాకపోతే ఖర్చవుద్ది’’ అంటూ ఆఫర్లు… ‘‘హేమిటి నమ్మడం లేదా..? ఏబీఎన్, టీవీ5 చానెళ్లలో ఆయన రహస్య మందు తయారీ వీడియోలు కూడా పెట్టారు, ఓసారి చూడు…’’ అని నమ్మకం కలిగేట్టుగా గట్టిగా చెబుతుంటారు… నిజంగానే ఆ చానెళ్లలో రకరకాల కథనాలను అచ్చం ఆనందయ్య మందులాగే వండేస్తున్నారు కూడా…
వంట అంటే గుర్తొచ్చింది… ఏబీఎన్‌లో ఇండియన్ కిచెన్ అని ఓ ప్రోగ్రామ్… అనగా ఓ వంట తయారీ అనుకోకుండా చూడబడ్డాను… నవ్వు రాలేదు, జాలి కూడా కలగలేదు… ఉద్వేగరహితంగా రాధాకృష్ణ చానెల్ గొప్పతనాన్ని చూస్తూ ఉండిపోవడమే… అదేమిటో తెలుసా..? ఆంధ్రజ్యోతిలో నవ్య పేజీలో మొన్నామధ్య ఆనందయ్య మందులో వాడే దినుసులు, మూలికలు ఇవే అంటూ బొమ్మలతో సహా ఓ పెద్ద ఆర్టికల్ వచ్చింది… సరే, దానికి న్యూస్ లేదా ఫీచర్ లక్షణాలున్నయ్, వోకే… కానీ ఈ కిచెన్ ప్రోగ్రామ్‌లో యాంకరిణి ఏమన్నదంటే… నవ్య పేజీని చూపిస్తూ… ‘‘వీటితో మనమే చిటికెలో మన వంటింట్లోనే మందు తయారు చేసుకుందాం… ఏ మోతాదులో ఇవి కలుపుకోవాలో, ఎలా వండాలో చూద్దాం’’… ములక్కాడ సాంబార్, మిర్చికాసాలన్ తయారీ చెబుతున్నంత వీజీగా చెప్పేస్తోంది, ఐనా ఇదేదో ఇంట్రస్టింగుగా ఉందని మనం అనుకునేలోపు ఓ ఆయుర్వేద రీసెర్చిస్టు కనిపించాడు… ఏవేవో దినుసులు చెప్పి, ఇలా వండేయండి అని చెప్పి వెళ్లిపోయాడు… తీరాచూస్తే ఆనందయ్య మందులో వాడేవి వేరు, వీళ్లు చూపించిన ఈ వంట వేరు…
Ads
ఆనందయ్య వాడే దినుసులు, మూలికలు ఇవీ… పైగా ఆయన తేనె వేసి ఉడకబెడతాడు… ఆ మోతాదు ఎంతో ఆయనకే బాగా తెలుసు… ఎలా వండాలో కూడా ఆయనే బాగా చెప్పగలడు… నిజంగా ఆనందయ్యతో ఓ వీడియో గనుక రూపొందించగలిగితే..? ఎవరికివారు వండుకోగలరు కదా అనేది కొందరి ప్రశ్న… కాదు, ఏమాత్రం మోతాదు లెక్కతప్పినా అది దుష్పరిణామాలకు దారితీయవచ్చు… పైగా ఈ మూలికలన్నీ అంత వీజీగా అందరికీ దొరకవు కూడా… బోలెడు యూట్యూబ్ వీడియోలు ఆనందయ్య మందు పేరుతో కనిపిస్తున్నయ్… జనం అవేమీ తమ బుర్రల్లోకి ఎక్కించుకోకపోతే ఆరోగ్యానికి మంచిది… ఇదుగో ‘కబాసుర్’ అనే మందు, సేమ్, ఆనందయ్య వాడే సరుకులే ఇందులోనూ వాడారు అంటూ కొందరు మార్కెటింగుకు దిగారు… నిజానికి ఆ పదార్థాలు వేరు, ఆనందయ్య వాడేవి వేరు… మాత్రలు, పొడులు, లేహ్యాలు ప్రమోట్ చేయబడుతూనే ఉన్నయ్… అందరూ ఆనందయ్య మందు పాపులారిటీని వాడుకునేవాళ్లే… అదుగో అనంతపురం జిల్లాలో సేమ్ మందు, ఇదుగో ఆదిలాబాద్ జిల్లాలో సేమ్ మందు అంటూ మరోరకం దందా స్టార్టయిపోయింది… ఇవన్నీ సరే, అసలు ఆనందయ్య ఏమైపోయాడు..? మందు మళ్లీ స్టార్టవుతుందా..? ఇది థర్డ్ వేవ్ వస్తుందా అన్నంత చిక్కు ప్రశ్న…!!
Share this Article