ఔనా..? రామారావుకు ఇతోధిక ప్రచారం కల్పించి, అధికార పీఠం ఎక్కడానికి సాయం చేసిన రామోజీరావు తనే స్వయంగా రామారావు మీద కుట్ర పన్నాడా..? చంద్రబాబుకన్నా ముందే తిరుగుబాటుకు ప్రేరేపించాడా..? ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు చేశాడా..? ఆశ్చర్యం అనిపిస్తుంది కదా ఈ కథనం హెడింగ్ చూస్తేనే…. ఎవరైనా చెబితే నమ్మరు కూడా… కానీ చెబుతున్నది దగ్గుబాటి వెంకటేశ్వరరావు… ఎన్టీయార్ అల్లుడు… అప్పటి అనేక పరిణామాలకు సాక్షి… ఎన్టీయార్ పక్కనే ఉండి చూడటమే కాదు, పలు విషయాల్లో కలగజేసుకున్న వ్యక్తి… సో, చెబితే కొంత విశ్వసనీయత, ఆసక్తి సహజంగానే ఉంటయ్… ఆయన ఫేస్‌బుక్ పేజీలో రాసిన మొదటి భాగం ఇది… యథాతథంగానే చదువుకోవాలి, ఆయన భాషలోనే… అప్పటి రాజకీయ పరిస్థితిగతులు అర్థం కావడానికి కూడా దగ్గుబాటి నెమరేసుకుంటున్న స్మృతులు పనికొస్తాయి… ఇప్పుడు తను చెప్పే విషయాలు అబద్ధమైతే ఖండించాలని కూడా దగ్గుబాటి కోరుతున్నాడు ఇందులో… (ఎలాగూ పబ్లిక్ డొమెయిన్‌లో పోస్ట్ చేసిందే కాబట్టి.., టీడీపీకి సంబంధించి, అప్పటి రాష్ట్ర రాజకీయ చరిత్రపై, పరిణామాలపై పొలిటికల్ ఇంపార్టెన్స్ ఉన్న విషయాలు కాబట్టి… ఆయన పేరుతోనే…)


Venkateswara Rao Daggubati……… 

చరిత్ర లో N.T. రామారావు గారి చివరి ఘట్టం

నిజా- నిజాలు … నిష్పక్షపాత ధోరణిలో…

Ads

అసలు కారణాలు ఏమిటి.. ఎవరు కారకులు .?.. వారు ఎందుకు అలా ప్రవర్తించారు…?

అసలు ఈ విషయాలు నేను ఎందుకు రాయాలి….?

రామారావు గారు తెలుగువారి చరిత్రలో ఒక విశిష్టమైన వ్యక్తి …. సినిమా ప్రపంచంలో నటుడుగా శిఖరాగ్రే శ్వరుడు. ఎంతటివారంటే రాముడంటే, కృష్ణుడంటే, తెలుగువారి ఇలవేల్పు వెంకటేశ్వరుడు అంటే, వారితో పాటు దుర్యోధనుడు, భీష్ముడు , అర్జునుడు వంటి ఎన్నో పాత్రలు వీరికి ముందు, వీరికి వెనక వేరే ఎవ్వరూ గుర్తుకు రాకుండా చేసిన వ్యక్తి …. రాజకీయ రంగంలో కూడా ఒక్కడిగా వచ్చి, పార్టీని స్థాపించి అతి తక్కువ కాలంలోనే అధికారంలోకి వచ్చి పాలనను ప్రజల వద్దకు తెచ్చి రాజకీయాన్ని కొత్త పుంతలు తొక్కించిన వ్యక్తి…. అటువంటి వారి చివరి ప్రస్థానంకు సరైన సమాధానం చెప్పుకోవడానికి ఎంతో కొంత వెలితి కలిగిస్తున్న నేపథ్యంలో…

నా , ఈ కథనం అవసరం అనిపించింది….

రామారావు గారి జన్మదిన సందర్భంగా మరొక్కసారి Facebook ద్వారా…

ఒకేసారి కుదరదు కాబట్టి మూడు.. నాలుగు ఎపిసోడ్ లుగా….

రామారావు గారి చివరి ఘట్టానికి కారకులు ప్రముఖంగా కనపడేది చంద్రబాబు నాయుడు. అయితే మిగిలిన వారు కొంతమంది ఏ విధంగా తమ తమ స్వార్ధ ప్రయోజనాలు, ఆలోచనలతో దీనికి కారణమయ్యారు అనేది నేను చెప్పదలుచుకున్న విషయం. ఇందులో లక్ష్మీపార్వతి, రామోజీరావు , హరికృష్ణ, బాలకృష్ణ , యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఆనాటి శాసనసభ్యులతో పాటు నేను… వీరందరూ ఎంతో కొంత తెలిసి చేసినా, తెలియక చేసినా రామారావుగారి ఆనాటి పతనానికి, నిష్క్రమణకు కారణం అయ్యారు. ఎలా అంటారా….?

daggubati

…….మొదట ప్రారంభం ఎక్కడ జరిగిందంటే రామారావు గారిపై రామోజీరావు గారి ఆలోచనలలో తేడా రావడంతో మొదలయ్యింది. ఎందుకంటారా….? రామారావు గారు పార్టీని స్థాపించినప్పుడు రామోజీరావు గారు ఈనాడు పత్రిక ద్వారా రామారావు గారికి ప్రచారం చేయటం తెలిసిందే. ఆ నేపథ్యంలో తన వలనే రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారనే అభిప్రాయం రామోజీ రావు గారిలో గట్టి  స్థిరపడింది. తర్వాత రోజుల్లో రామారావు గారు రామోజీరావు గారి ఎడల ఎంతో గౌరవంతో ఉన్నప్పటికీ, తనతో చర్చించకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం రామోజీరావు గారికి నచ్చలేదు. ముఖ్యంగా కిలో రెండు రూపాయల బియ్యం ఇవ్వడం, పేదలకు పక్కా గృహ నిర్మాణాలు చేయడం, ట్యాంక్ బండ్ మీద తెలుగు ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయడం, వీటితోపాటు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా రామారావు గారు జాతీయ రాజకీయాలలో పాల్గొనడం, తనతో చర్చించకుండా మంత్రిమండలి నిర్ణయాలు తీసుకోవడం లాంటి నిర్ణయాలు అన్నీ తనకు తెలియకుండా జరిగిపోతున్నాయని, ఈ నేపథ్యంలో తన యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతున్నదని వారు భావించారు.. ఇంకా నేను ప్రత్యక్షంగా రామోజీ రావు గారితో కలిసిన సందర్భంగా ఈ విషయాలన్నిటి మీద మాట్లాడటం నాకు గుర్తు.”ఈనాడు “లో ఆరోజుల్లో అప్పుడప్పుడు వీటిపై కథనాలు కూడా వచ్చేవి.. ఒకసారైతే రామారావు గారు పక్కా గృహ నిర్మాణ నిర్ణయం తీసుకున్నప్పుడు ఏకంగా ఈనాడు ఫ్రంట్ పేజీలో రామారావు గారిని మాంత్రికునిగా వేషధారణ చేసి మెడలో పుర్రెలతో దండ వేసి చేతిలో పెద్ద ఎముకను పెట్టి … పైన “హామ్ ఫట్ – లక్ష ఇల్లు” అని కేప్షన్ వ్రాసి … వ్యతిరేకత వచ్చేలా కార్టూన్ వేశారు. ట్యాంక్ బండ్ మీద విగ్రహాలప్పుడు కూడా అన్ని రామారావు గారి ముఖాలు పెట్టి అవహేళన చేస్తూ పెద్ద కార్టూన్ ఈనాడు ఫ్రంట్ పేజీలో బ్యానర్ కార్టూన్ వేశారు… చంద్రబాబు మాత్రం రామోజీరావు గారితో సఖ్యతతో ఉండేవారు. నేను కొంచెం దూకుడుగా ఉండేవాడిని. ఈ విభేదం ఎంతవరకు వెళ్లిందంటే…1989 లో రామారావు గారు మంత్రి వర్గం నిర్ణయాలు లీకు అవుతున్నవని 30 మంది మంత్రులను ఒక్కసారి తొలగించినప్పుడు .రామారావు గారిని తొలగించాలనేదాకా … ప్రభుత్వాన్ని పడవేయాలనే దాకా రామోజీరావు గారు ఆలోచన చేశారు…

ఇంకా దీనికి మరింత సాక్ష్యాధారాలు కావాలంటే 1989 ప్రాంతంలో ఈనాడు పత్రిక తీసి చదవండి. అది ఏప్రిల్ మాసం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయం రామోజీరావు గారు రామారావు గారిని తొలగించటానికి గట్టి ప్రయత్నమే చేశారు…. 130 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఉన్నారు తిరగబడండి అని రామోజీ రావు గారు మూడు సార్లు ఎడిటోరియల్స్ రాశారు…. ఆ రోజు ఆ ప్రయత్నంలో మంత్రులుగా ఉన్న జానారెడ్డి , కే. ఈ కృష్ణమూర్తి ,వసంత నాగేశ్వరరావు, స్పీకర్ నారాయణరావు, ఉపేంద్ర వంటి ఇత్యాదులు కూడా చేరారు. చంద్రబాబు ప్రమేయం అనుమానాస్పదం. ఆశ్చర్యం కలిగించే విషయం కదా..?. అసలు ఇది జరిగినట్లు నేటి ప్రజలకు తెలియదు. కావాలంటే ఆనాడు ఈనాడులో బ్యూరో చీఫ్ గా ఉన్నటువంటి కృష్ణారావు గారిని అడగవచ్చు .వారు ప్రత్యక్ష సాక్షి. “ఈనాడు “లో పనిచేసిన రిపోర్టర్లు అందరూ కూడా ప్రత్యక్ష సాక్షులే….. నేను ఆ 130 మంది ఎమ్మెల్యేలను ఏ విధంగా మేనేజ్ చేశానో, ఏ విధంగా నచ్చజెప్పి, ఏ విధంగా వీరందరినీ తిరిగి రామారావు గారితో ఉండేవిధంగా చేశానో ఎవరికీ తెలియదు. ఆ రోజుల్లో హోటల్స్ లోనూ, రిసార్ట్స్ లోనూ క్యాంపులు పెట్టలేదు . కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వలేదు. మొత్తానికి వ్యతిరేక వర్గంలో (రామోజీ రావు గారి వర్గంలోకి) కేవలం ఏడుగురు మాత్రమే మిగిలేటట్లు చేశాను. ఇందాక చెప్పిన నలుగురితో పాటు ఎమ్మెల్యేలు దొమ్మేటి రామచంద్రారెడ్డి .. (మెదక్ జిల్లా ఎమ్మెల్యే)., బుడ్డా వెంగలరెడ్డి (ఆత్మకూరు కర్నూలు జిల్లా) ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీని వీడి వెళ్ళారు…. నేనే స్వయంగా రామోజీరావు గారి వద్దకు వెళ్లి … ప్రార్థించాను. మీరు ఈ విధంగా చేయటం బాగాలేదు, మీ వద్ద కేవలం ఆరు, ఏడు మంది శాసన సభ్యులు మాత్రమే మిగిలిపోతారని, డబల్ డిజిట్ శాసనసభ్యులు కూడా మీ వద్ద లేరని చేతులెత్తి పది వేళ్లు చూపించాను. రామోజీ రావు గారు నన్ను “నీవు చిన్నవాడివి, నీకు ఏమి తెలియదు వెళ్ళిపోమన్నారు”, పార్లమెంటు సభ్యులు కూడా మా దగ్గర ఉన్నారని చెప్పారు…. రామారావు గారిని దించేస్తున్నామని చెప్పారు….. చివరకు ఏడుగురు మాత్రమే బయటకు వెళ్ళారు.. విఫలమైనది భరించలేక చివరకు ఈ మత్రుల బొమ్మలు వేశి సొరకాయలు కోస్తున్నట్లు కార్టూన్ వేశారు. అంతేకాదు వారు వేరే పార్టీ కూడా పెట్టడం జరిగింది… ఈ ఉదంతాన్ని నా “ఒక చరిత్ర కొన్ని నిజాలు ” రచనలో వివరించాను. రామోజీ రావు గారు జీవించి ఉన్నారు కాబట్టి నా ఈ కథనంలో ఏదైనా అసత్యమనిపిస్తే ఖండించవచ్చు. …. చంద్రబాబు ఈ సందర్భంగా ఏమి చేస్తున్నారంటే… సైలెంట్ …

ఈ నేపథ్యంలో రామోజీ రావు గారు రామారావు గారి ఎడల ఎంతో వ్యతిరేకతతో ఉండి ఏ మాత్రం అవకాశం దొరికినా రామారావు గారిని వ్యతిరేకించడానికి “రెడీ”గా ఉన్నారు…. ఇందు చేతే రామారావు గారిని 1995 ఆగస్ట్ మాసంలో దించినప్పుడు రామోజీ రావు గారు…. ప్రధాన భూమిక పోషించింది. చంద్రబాబుకు అండగా నిలిచి, అనునిత్యం సంప్రదింపులు చేస్తూ వార్తాకథనాలు పుంఖాను పుంఖాలుగా చంద్రబాబుకు అనుకూలంగా రామారావు గారికి వ్యతిరేకంగా ప్రచురించారు. ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చేయగలిగారు. రామారావు గారు చనిపోయినప్పుడు చంద్రబాబు మీదకు విసిరిన చెప్పులు ఏరితే ఒక లారీడు అయ్యాయి.. అయినా చంద్రబాబు మీద వ్యతిరేకత రాకుండా చంద్రబాబుకు అంతా సులువు అయ్యేలా చేశారు. ఈవిధంగా రామోజీ రావు గారు రామారావు గారు నిష్క్రమించిన ఘట్టంలో ప్రధాన భూమిక పోషించారు….

— డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు (28 – 5 -2021) (మిగతా వివరాలు తర్వాత భాగంలో… )