ఏమిటి ఈ లక్షద్వీప్ గొడవ..? కేరళ అధికార పార్టీ సహా చాలామంది ఎందుకు మోడీ విధానాన్ని విమర్శిస్తున్నారు..? నిజానికి తెలుగు మీడియాలో పెద్దగా చర్చ జరగడం లేదు గానీ, జాతీయ మీడియాలో రచ్చ బాగానే సాగుతోంది… ప్రత్యేకించి ఇప్పుడు పరిశీలనలో ఉన్న మూడు కొత్త చట్టాలు విమర్శలకు కారణమవుతున్నయ్… ఓసారి వివరాల్లోకి వెళ్దాం… లక్షద్వీప్‌కు బీజేపీ ప్రభుత్వం ప్రఫుల్ పటేల్‌ను అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది… తను లక్షద్వీప్‌పై మతాన్ని రుద్దుతున్నాడనీ, అక్కడి 90-95 శాతం ముస్లింలకు వ్యతిరేకంగా వెళ్తున్నాడనేది విమర్శల ప్రధాన సారాంశం… ఆ మూడు ప్రతిపాదిత చట్టాలేమిటంటే..? 1) పాసా చట్టం అమలు… 2) జంతుసంరక్షణ చట్టం… 3) కొత్త పంచాయతీరాజ్ మార్గదర్శకాలు… వీటితోపాటు ఆల్కహాల్ అమ్మకాలకు అనుమతి… బ్యూరోక్రాట్ బదులు రాజకీయ నేతను నియమించడం, భూసేకరణ కొత్త విధానం, మత్స్యకారులపై ఆంక్షలు వంటివి కూడా…
- పాసా చట్టం అంటే సంఘవ్యతిరేక శక్తుల నియంత్రణ చట్టం.,. వ్యవహారంలో గూండా చట్టం అంటారు… ఫలానా వ్యక్తి సమాజానికి ప్రమాదకరం అని అధికార యంత్రాంగం భావిస్తే ఏడాదిపాటు లోపలేయొచ్చు… జస్ట్ లైక్, పీడీ యాక్ట్… అసలు లక్షద్వీప్‌లో క్రైం రేటు తక్కువ, అక్కడ జనాన్ని వేధించడానికి తప్ప ఇప్పుడు ఈ చట్టం ఎందుకనేది ఒక విమర్శ… ఉంటే తప్పేమిటి..? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది అడ్మినిస్ట్రేటర్ ప్రశ్న… గత మార్చిలో 300 కిలోల హెరాయిన్, 5 ఏకే-47 రైఫిల్స్, 1000 బుల్లెట్లను సీజ్ చేశాం, ఆర్గనైజ్డ్ క్రైం పెరగకుండా చూడాలి, ఐనా ఇక్కడే కొత్త కాదుగా, కేరళ, కర్నాటక, ఉత్తరప్రదేశ్, కర్నాటకల్లోనూ ఈ చట్టం ఉంది… లక్షద్వీప్‌లో చట్టం తెస్తే తప్పేమిటి అనేది అక్కడి అధికారయంత్రాంగం సమర్థన… ఇందులో మతం కోణం ఏమీ లేదు… నిజానికి ఉపా చట్టంతో పోలిస్తే అదెంత..?
- జంతుసంరక్షణ చట్టం పేరిట గోవులు, ఎద్దులు, బర్రెలు, దున్నపోతులను వధించడాన్ని, ఆ మాంసం అమ్మడాన్ని, రవాణా చేయడాన్ని నిషేధించబోతున్నారు… అంటే బీఫ్ బ్యాన్… అక్కడున్నదే ముస్లింలు, బీఫ్ వాళ్ల ఆహార అలవాట్లలో ఒకటి… కావాలనే ఈ నిషేధం తీసుకొస్తున్నారనేది విమర్శ… నిజంగానే గోవధ వరకూ నిషేధం వోకే… కానీ మిగతా ఎద్దులు, బర్రెలు, దున్నపోతుల మీద కూడా నిషేధం దేనికి..? ఈశాన్య రాష్ట్రాల్లో బీఫ్ మీద బీజేపీ మాట్లాడదు… కేరళ, అస్సాం మొన్నటి ఎన్నికల్లోనూ బీఫ్ గురించి బీజేపీ ఏమీ మాట్లాడలేదు… ఐనా ప్రజల ఆహారం మీద ఆంక్షలేమిటి..? అనేది ఆ విమర్శల సారం… నో, నో, పాలిచ్చే జంతువుల్ని రక్షించడం ఈ చట్టం ఉద్దేశం అని అధికారులు చెబుతున్నా అందులో పస లేదు, సమర్థనీయంగా లేదు…
Ads
- ఇద్దరు పిల్లలకన్నా ఎక్కువ సంతానం ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హతను నిర్దేశించేవి కొత్త పంచాయతీరాజ్ మార్గదర్శకాలు… ఇదీ మతం కోణంలోనే లక్షద్వీప్ మీద రుద్దుతున్నారనేది విమర్శ… సహజంగా ముస్లింలలో సంతానం ఎక్కువ కదా, దాన్ని బ్రేక్ చేయడం దీని ఉద్దేశం అని ఆ విమర్శ సారం… కానీ ఇలాంటి చట్టాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, కర్నాటక రాష్ట్రాల్లో ఉన్నవే… అయితే దీన్ని కొత్తగా ఇప్పుడు లక్షద్వీప్ మీద రుద్దాల్సిన అవసరం ఏముంది..? అక్కడున్న జనాభాయే 70, 80 వేలు… దీనికీ సరైన సమాధానం అక్కడి యంత్రాంగం దగ్గర లేదు…
- ముస్లిం ప్రాంతాల్లో ఆల్కహాల్ అనుమతించరు… కానీ అధికార యంత్రాంగం కొత్తగా అక్కడ ఆల్కహాల్ అమ్మకాల్ని స్టార్ట్ చేయబోతోంది… ఇదీ కావాలని చేస్తున్నదే తప్ప ఇప్పుడీ నిర్ణయం వల్ల సాధించేది ఏముంది అనే విమర్శకు కూడా సరైన జవాబు లేదు… ఆల్కహాల్ అమ్మకాలు ఉన్న ప్రాంతాల్లో దాన్ని నిషేధించి, అమలు చేయడమే పెద్ద ప్రయాస… అలాంటప్పుడు నిషేధం ఉన్న దగ్గర కొత్తగా ఆల్కహాల్‌ను పారించడం దేనికి..? అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ నిర్ణయాల్లో సంయమనం కనిపించడం లేదు… అందుకే సేవ్లక్షద్వీప్ అనే హ్యాష్‌ట్యాగ్ బాగా పాపులర్ అవుతోంది… పటేల్ నిర్ణయాల పట్ల వ్యతిరేకత కనిపిస్తోంది…!
Share this Article