సగటు జర్నలిస్టు బతుకు మరీ నరకప్రాయం అయిపోయింది… ఈ కరోనాకు చాలామంది బలైపోయారు… జర్నలిస్టే కాదు, పత్రికల్లో పనిచేసే ఇతర సిబ్బంది కూడా..! హఠాత్తుగా మనిషి చనిపోతే, ఆ కుటుంబం బజార్న పడితే అయ్యో అని ఆదుకునేవాడు లేడు… ఉండడు, ఈ ఫీల్డే అలాంటిది… ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇతోధికంగా, ఉదారంగా స్పందించి సాయాన్ని ప్రకటిస్తున్నయ్… డీఎంకే స్టాలిన్ ఏకంగా 10 లక్షల పరిహారాన్ని ప్రకటించాడు… మమ్మల్ని ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించండి మహాప్రభో అని మొరపెట్టుకుంటుంటే తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులను చివరకు ‘సూపర్ స్ప్రెడర్లు’గా గుర్తించింది… ఇదీ జర్నలిస్టుల పరిస్థితి… మీడియా అకాడమీ ఏం సాయం చేస్తున్నదో అందరికీ తెలుసు… ఏపీలోనూ దాదాపు ఇలాగే… కానీ… జగన్ తన సాక్షి టీవీ, సాక్షి పత్రిక రెగ్యులర్ ఉద్యోగులకు ప్రకటించిన ఓ కరోనా ప్యాకేజీని మాత్రం అభినందించాలి…
తమ ఉద్యోగుల్ని ఓన్ చేసుకోవడంలో టాటా స్టీల్ ప్రదర్శించిన ఔదార్యాన్ని మనం ముందే చెప్పుకున్నాం కదా… కరోనా వల్ల మరణిస్తే సదరు ఉద్యోగి చివరి జీతాన్ని, అరవయ్యేళ్లు నిండేవరకూ ఆ కుటుంబాన్ని ఇవ్వనుంది సంస్థ… తమ కోసం పనిచేసే వారిని తమ మనుషులుగానే, తమ కుటుంబసభ్యులుగానే పరిగణించే గొప్ప దృక్పథం… మరి తెలుగునాట మీడియా సంగతి..? తక్కువ సంఖ్యలో ఉద్యోగులున్న ఇంగ్లిష్, ఉర్దూ; హిందీ పత్రికల్ని…, టీవీ సంస్థల్ని వదిలేస్తే… విషయ వివరణ కోసం నాలుగు పెద్ద పత్రికలను తీసుకుందాం… అందులో రెండు అధికారంలో ఉన్న పత్రికలు, నమస్తే తెలంగాణ, సాక్షి… మిగతావి ఈనాడు, ఆంధ్రజ్యోతి… అసలు ఫస్ట్ వేవ్ నుంచే ఈనాడు తనకు మొదటి నుంచే అలవాటైన రీతిలో కర్కశంగా వ్యవహరించడం మొదలుపెట్టింది… లేఆఫ్ పేరిట జీతాల్ని కోసిపారేసింది, దాని అడ్వర్టయిజ్మెంట్ సిబ్బందిది మరీ నరకం… తీసేయరు, ఉంచుకోరు… కరోనా గనుక కబళిస్తే ఆదుకునే చేయి లేదు, భరోసాగా నిలిచే మనిషీ లేడు… మాట్లాడితే చాలు, సకల రంగాల కార్మికుల హక్కుల కోసం పిడికిళ్లు ఎత్తే నవతెలంగాణ వంటి ఎర్ర పత్రికలు కూడా ఉద్యోగవ్యతిరేకతను స్పష్టంగా చూపించుకున్నయ్…
Ads
సేమ్, ఆంధ్రజ్యోతి… ఫస్ట్ కొలువుల కోత, జీతాల కత్తిరింపు ప్రారంభించిందే రాధాకృష్ణ… తెల్లారిలేస్తే బోలెడు సంక్షేమ పాఠాలు చెబుతాడు పత్రికలో… మరి నమస్తే..? అదీ అంతే… అధికారంలో ఉంది, నాలుగు డబ్బులకు వెనుకాడే పరిస్థితి కాదు, ఐనా దానికీ సొంత ఉద్యోగులంటే చులకనే… సాక్షి మాత్రం ఎవరి కొలువుల్నీ పీకేయలేదు, జీతాలను కోసేయలేదు… తాజాగా ఇప్పుడు మరో ఉపశమన ప్యాకేజీ ప్రకటించింది… (ఇటీవల సాక్షి ఉన్నతోద్యోగంలో చేరిన ఓ మాజీ సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ చూపించిన చొరవ కావచ్చు ఇది బహుశా…)
తన పత్రిక, తన టీవీల్లో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులు… (జర్నలిస్టులే కాదు, ఇతర సిబ్బంది కూడా…) గనుక కరోనాతో మరణిస్తే ఆ కుటుంబాలకు ఆసరాగా నిలవడం కోసం ప్రస్తుత జీతాన్ని ఏడాదిపాటు నెలనెలా చెల్లిస్తారు… (నెల జీతం లేదా 25 వేలు, ఏది తక్కువైతే అది)… అంటే కనీసం ఓ ఏడాదిపాటు ఆ కుటుంబానికి గరిష్టంగా 25 వేల చొప్పున భరోసా చిక్కినట్టే…) గ్రూప్ టరమ్ లింక్ ఇన్స్యూరెన్స్ కింద 4 లక్షలు, ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ కింద 7 లక్షలు కూడా కంపెనీ చెల్లిస్తుంది… పీఎఫ్, గ్రాట్యుటీ, ఫుల్, ఫైనల్ సెటిల్మెంట్ సరేసరి, అది అన్ని సంస్థల్లోనూ తప్పదు… గుడ్…
ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే… పెద్దలారా, ఈ ఔదార్యం మీకెందుకు లేదు..? మీ ఉద్యోగుల్ని మీరు ఎందుకు ఓన్ చేసుకోరు..?! తన పత్రికలో ఉద్యోగుల్ని ఓన్ చేసుకున్నట్టుగానే, మెచ్చదగిన ఔదార్యాన్ని ప్రదర్శించినట్టుగానే… జగన్ తను అధికారంలో ఉన్న ఏపీలోని జర్నలిస్టుల పట్ల ఎందుకు కనబర్చకూడదు..? అప్పులు తెచ్చి మరీ, అన్ని రంగాల్లోని ప్రజలకు ఉదారంగా ఏదో ఓ స్కీం పేరిట డబ్బులిస్తున్న తనకు జర్నలిస్టులు ఎందుకు సాయపడాల్సిన కేటగిరీగా కనిపించడం లేదు..? అది వేరే ప్రశ్న… ఆ డిబేట్ వేరు…!
Share this Article