కరోనా ప్రళయం ముంచెత్తవచ్చుగాక… వందలాది శవాలు లేస్తుండవచ్చుగాక… జనం వేలాదిగా హాస్పిటళ్లలో రోదిస్తుండవచ్చుగాక… ఓ చిన్న సాయం చేద్దామని లేదు… నిర్మాణాత్మక కార్యాచరణ లేదు….. ఎంతసేపూ ఫేక్ వీడియోలు, ఫేక్ వార్తలతో సోషల్ మీడియాను నింపేయడమే పని కొందరికి…! హైదరాబాదులో ఓ అమాయక పోలీసును ముస్లింలు చితకబాదారని, అడిగేవాడు లేడని పొద్దున్నుంచీ ఓ వీడియో విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు… ఉద్దేశపూర్వకంగానే దీన్ని బాగా పుష్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది… ప్రధానంగా కాషాయం గ్రూపుల్లో ఎక్కువ సర్క్యులేట్ చేస్తున్నారని టీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి… ఇలాంటి వీడియోలను ఇప్పుడు సర్క్యులేషన్లోకి తీసుకురావడం వల్ల ఎవరికి, ఏం ప్రయోజనం..? కల్లోలాల్ని రేపితే ఇప్పుడేమైనా రాజకీయ లబ్ధి వచ్చేది ఉందా..? వీటితో కేసీయార్ కుర్చీ దిగిపోతాడా..?హేమిటో ఇదంతా…
నిజానికి ఈ వీడియోకూ హైదరాబాదుకూ సంబంధం లేదు… అప్పుడెప్పుడో 2020లో అక్టోబరులో, అహ్మదాబాదులో బాగా తాగిన ఓ కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తనకు స్థానికులు విధించిన శిక్ష అది… కుమ్మిపారేశారు… ఆ వార్తను దిగువన ఉన్న యూట్యూబ్ లింకులో చూడొచ్చు… ఆ వీడియోను హైదరాబాదులో కానిస్టేబుల్ను చితకబాదుతున్నట్టుగా చిత్రీకరించి సోషల్ మీడియాలోకి వదిలారు… దీనికి ఏ మార్ఫింగ్ ప్రయాస గానీ, వాయిస్ ఓవర్ వేషాలు గానీ అక్కర్లేదు… జస్ట్, ఆ వీడియో పెట్టేయడం, ఓ కామెంట్ జతచేయడం… ఇక ఆవేశకావేషాలు రేగితే చలికాచుకోవడం… ఈ వీడియోకు సంబంధించి సిటీ పోలీసులు కేసు కూడా పెట్టి, దర్యాప్తు చేస్తున్నారు… ఇదీ ఆ వార్త ఒరిజినల్…
Ads
Share this Article