ఊళ్లో ఓ మోస్తరు రైతు… ఊరంతా జ్వరాలే కమ్మేసినప్పుడు తనకు చేతనైన సాయాన్ని చేశాడు… దాదాపు ప్రతి ఇంటి యోగక్షేమాలు తెలుసుకున్నాడు… తన దగ్గరున్న మందూమాకూ సమకూర్చాడు… ఇప్పుడు తనకే జ్వరమొచ్చింది, నీరసపడిపోయాడు… పాపం, సమయానికి, అవసరానికి డబ్బు ఏమైనా ఉందో లేదో అని ఇరుగూపొరుగు రైతులు బియ్యం, ఉప్పు, పప్పు, సాయిత్యం పంపించారు… అదే ఊళ్లోని కొందరు కూలీలు కూడా సాయం చేశారు… ఊరంతా సంఘీభావం ప్రకటించింది… నీకు అండగా మేమున్నాం అన్నాయి… స్థూలంగా చూస్తే గొప్పగా ఉంది కదా ఇదంతా… ఒకరికొకరు అండగా నిలవాల్సిన మహావిపత్తువేళ మానవత్వం ఇలా ప్రదర్శితం కావడం అపూర్వం కదా… కానీ ప్రతి సాయాన్ని ఆ రైతు అంగీకరించాలా..? స్వీకరించాలా..? కృతజ్ఞతలు చెప్పి వదిలేయాలా..? ఇదీ ప్రశ్న… ఓ సందిగ్ధ స్థితి… స్నేహంగా ఎవరైనా సాయం చేస్తే దాన్ని కాదనడం విజ్ఞత అనిపించుకుంటుందా..? లేక దాన్ని ఆమోదించి స్వీకరించడం అప్రతిష్ట అవుతుందా..? అసహాయతను బయటపెట్టుకున్నట్టు అవుతుందా..?
ఇండియా సందిగ్ధత ఇదే… మనం బాగున్నప్పుడు హైడ్రాక్సీ క్లోరోక్విన్ బిళ్లలు ప్రపంచమంతా పంచాం… వేక్సిన్లు ఉచితంగా పంపిణీ చేశాం… కలలో కూడా కయ్యానికి కాలు దువ్వే పాకిస్థాన్ సహా ప్రతి దేశానికీ టీకాలు ఇచ్చాం… ఇప్పుడు సెకండ్ వేవ్ మనల్నే వణికించేస్తోంది… సంఘీభావంగా ఇప్పుడు ప్రతి దేశమూ సాయానికి సిద్ధపడుతోంది… చివరకు ఓ పేద దేశమైన కెన్యా కూడా 12 టన్నుల టీ, కాఫీ, వేరుశనగ ఉత్పత్తుల్ని రెడ్ క్రాస్ ద్వారా పంపించింది… మహారాష్ట్రలో వాటిని వినియోగించాల్సి ఉంది… కొన్ని దేశాలు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను, మరికొన్ని దేశాలు డ్రగ్స్ సాయం చేస్తున్నాయి… ‘‘స్వీకరిస్తున్నాం’’… రేప్పొద్దున సొమాలియా, రువాండా, రుమేనియా తదితర చిన్న, పేద దేశాలు సాయం చేసినా తీసుకుంటాం… అయితే ప్రతి దేశం పంపించే సాయాన్ని తీసుకోవాలా..? నామర్దా కాదా..? నామోషీ కాదా..? ఈ ప్రశ్నకు చాలా మంది సమాధానం ఏమిటంటే..? ‘‘కాదు, సాయం చేయడానికి ముందుకొచ్చే ఏ చేతినీ విసిరికొట్టొద్దు..’’ అయితే…?
Ads
2018… మునుపెన్నడూ ఎరగని రీతిలో భారీ వర్షాలు, వరదలు కేరళను ముంచెత్తాయి.., వేల ఇళ్లు కూలిపోయాయి… లక్షల మంది నిరాశ్రయులయ్యారు.., పలు ప్రాంతాలు కకావికలమయ్యాయి… ఎమిరేట్స్, ఖతార్ వంటి దేశాలతోపాటు కేరళీయులు అధికంగా పనుల కోసం వెళ్లే థాయ్‌లాండ్, మాల్దీవులు కూడా సాయం చేయడానికి ముందుకొచ్చాయి… కానీ కేంద్రప్రభుత్వం నిరాకరించింది… ‘‘మనకు విపత్తుల్ని తట్టుకునే సత్తా ఉంది… విదేశాల ప్రత్యక్షసాయానికి గేట్లు గనుక ఎత్తితే పలు దౌత్యపరమైన మొహమాటాలు, సందేహాస్పద సహాయాలు గట్రా వచ్చిపడతాయి… పైగా ప్రతి సాయాన్నీ ఆమోదించడం నామోషీ… నేరుగా పీఎం రిలీఫ్ ఫండ్ లేదా సీఎం రిలీఫ్ ఫండ్‌కు సాయం చేస్తే వోకే…’’ అని కేంద్రం వాదించింది… ఈ ధోరణిని కాంగ్రెస్, సీపీఎం తీవ్రంగా వ్యతిరేకించాయి…
‘‘మన దేశంగతంలో వ్యవహరించిన ధోరణికీ, ఇప్పటికీ ఏమిటి ఈ తేడా..? ఎందుకు..? కేంద్రం అడిగినంత సాయం చేయదు, ఇంకెవరినీ చేయనివ్వదు… నామోషీ అనేదే నిజమైతే పీఎం, సీఎం రిలీఫ్ ఫండ్స్‌లోకి సాయం తీసుకున్నా నామోషీయే కదా…’’ అని విమర్శించాయి ప్రతిపక్షాలు… మరి నిజంగానే ఓ చిన్న దేశం చేసే సాయాన్ని స్వీకరించడం ప్రతిష్టకు, గౌరవానికి సంబంధించిన విషయం అయితే ఇప్పుడు ప్రతి దేశం సాయాన్ని ఎందుకు అంగీకరిస్తున్నట్టు..? ఈ విపత్తును తట్టుకునే సత్తా లేదని అంగీకరిస్తున్నట్టా..? మన అసహాయతను ప్రదర్శిస్తున్నట్టా..? నో, నో, అలా అనుకోవద్దు, స్నేహహస్తాల్ని విసిరికొట్టడం మర్యాద కాదు అంటారా, మరి అలాంటప్పుడు కేరళకు విదేశీసాయాన్ని ఎందుకు తిరస్కరించినట్టు..? అసలు మోడీ ప్రభుత్వానికి ఇలాంటి విషయాల్లో ఓ స్థిరమైన, స్పష్టమైన విధానం ఉందా..? పాకిస్థాన్ వంటి శత్రుదేశం సాయం చేస్తే తీసుకుంటున్న మనం, మరి మన మిత్రదేశం ఎమిరేట్స్ చేయదలిచిన సాయాన్ని ఎందుకు వద్దన్నాం..?! కరోనాకు సంబంధించిన ప్రతి అంశంలోనూ ఇలాంటి విధానవైఫల్యాలు, స్తబ్దత, నష్టదాయక పంథా…!!
Share this Article