ఆనందయ్య మందు… ఈమధ్యకాలంలో ఇంత చర్చ ఏ విషయంలోనూ జరగలేదు… వేలాది మంది కరోనా బారిన పడుతూ.., కార్పొరేట్, ప్రైవేటు వైద్యం రోగుల ఒంటిని, ఇంటిని దివాలా తీయిస్తున్న దుర్దినాల్లో… ఉచితంగా ఆనందయ్య పంపిణీ చేసిన మందు వేల మందికి రిలీఫ్ ఇచ్చింది… కానీ ఒక్కసారిగా మెడికల్ మాఫియా పడగవిప్పింది… నెగెటివ్ క్యాంపెయిన్‌కు దిగింది… కార్పొరేట్, వేక్సిన్, డ్రగ్, మెడికల్ మాఫియాల మీద పల్లెత్తు మాట రాని టీవీ9, ప్రజాశక్తి తదితర మీడియా ఓ క్యాంపెయిన్ నడిపించాయి… (ఆకుపసరు అంటే ఏమిటో కూడా కనీస అవగాహన లేని ఘనజర్నలిజం…) అసలు ఆ మందు శాస్త్రీయత ఏమిటి అని మొదలుపెట్టిన చర్చ హోమియా, యునాని, ఆయుర్వేదం, సిద్ధవైద్యం వంటి దేశీయ వైద్యవిధానాల మీద వ్యతిరేకత దాకా వెళ్లిపోయింది… అసలు అవి వైద్యవిధానాలే కాదు అన్నంతగా చర్చ జరిగింది… ఆ మీడియా సంస్థలు అంతులేని తమ శాస్త్ర జ్ఞానాన్ని ప్రజలకు పంచిపెట్టాయి… మెడికల్ మాఫియా రాష్ట్ర సర్కారు మీద కూడా ఒత్తిడి పెంచింది… కానీ జగన్ సైలెంటుగా, అది శాస్త్రబద్ధమో కాదో తేల్చడానికి, అనుమతి ఇవ్వడానికి ఓ శాస్త్రీయ పంథాలో వెళ్లాడనే చెప్పుకోవాలి…
ఐసీఎంఆర్‌ను రమ్మన్నాడు, వాళ్లు పట్టించుకోలేదు, నిజానికి వాళ్లకు ఈ మందుతో సంబంధం లేదు కూడా… ఆయుష్‌ను రంగంలోకి దింపాడు… వాళ్లు ఈ మందు వాడిన వాళ్ల అభిప్రాయాలు తీసుకున్నారు, మందుకు వాడే దినుసులను, తయారీ తీరు పరిశీలించారు… మందును సీసీఆర్ఏఎస్ స్టడీకి పంపించారు… The Central Council for Research in Ayurvedic Sciences (CCRAS)… యోగ, సిద్ద, హోమియో, ఆయుర్వేద, నేచురోపతి, యునాని తదితర దేశీయ వైద్యవిధానాల అధ్యయనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పరిశోధన సంస్థ ఇది… అదీ మందు నష్టదాయకం కాదనీ, గతంలో ఆయుష్ విభాగం అనుమతించిన కబాసుర పద్ధతిలోనే ఈ మందు కూడా ఉందని చెప్పింది… మందు మీద శాస్త్ర ముద్ర పడింది… దాంతో మందు పంపిణీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది జగన్ ప్రభుత్వం… తద్వారా రేప్పొద్దున మందు నిష్ఫలమైనా సరే, తన మీదకు నింద రాకుండా జాగ్రత్తపడింది… ఇక్కడి వరకూ వోకే…
Ads
(మధ్యలో జగన్ సర్కారు ధోరణి మీద చాలామందిలో అనుమానాలు ప్రబలాయి… నిర్ణయంలో తాత్సారం, ఆనందయ్యను ఎటో పట్టుకుపోవడం, పోలీసుల సందేహాస్పద వైఖరి గట్రా… హైకోర్టు కూడా మందు పంపిణీ పట్ల సానుకూలంగా ఉండటంతో, ఆ తీర్పుకు ముందే తన నిర్ణయాన్ని వెలువరించినట్టుంది బహుశా… చుక్కల మందు మీద కూడా గురువారంలోపు తనకు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది… నిజానికి ఆ చుక్కల మందే కీలకం, రోగిని త్వరగా కోలుకునేట్టు చేసేది అదే… కోర్టులో వాదన సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ మందుకు వ్యతిరేకంగానే వ్యవహరించింది… మందు తీసుకున్నవాళ్లు నెల్లూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారనీ, ఈ మందు బ్లాక్ ఫంగస్‌కు దారితీస్తుందనే అనుమానాలున్నాయనీ ప్రభుత్వ న్యాయవాది వాదన… ఆది నుంచీ ఈ మందుపై ప్రభుత్వానివి అనుమానాస్పద అడుగులే.., కానీ చివరకు అనుమతి తప్పలేదు…)
గుడ్డిగా వ్యతిరేకించకుండా… ఈ విపత్తులో ప్రజలకు ఏ మందు ఏ కాస్త మంచి చేసినా ఆమోదించాలనే వైఖరినే చివరకు ప్రదర్శించింది… అదే సమయంలో తన జాగ్రత్తల్నీ తీసుకుంది… అయితే కంట్లో వేసే చుక్కలపై సీసీఆర్ఏఎస్ ఇంకా ఏమీ తేల్చనందున దానికి అనుమతి ఇవ్వలేదు… (నోట్లోకి తీసుకునే మందు మంచిదే అయినప్పుడు, సహజంగా కంటి చుక్కల మందు కూడా మంచిదే అన్నట్టు కదా…) పీ, ఎల్, ఎఫ్ కేటగిరీ మందులకు వోకే చెప్పిన సర్కారు కే అనే మందుకు అనుమతి ఇవ్వలేదు… ఇంకాస్త ఆలస్యమైనా, అవీ సరైనవే అని తేలుతాయేమో చూడాలి… 63 వేల మందికి రిలీఫ్ దక్కినప్పుడు, ఓ కంప్లయింటూ రానప్పుడు (ఒక సెక్షన్ మీడియా ఉద్దేశపూర్వకమైన క్యాంపెయిన్ వదిలేయండి) ఇప్పుడు కొత్తగా నష్టదాయకం అని తేలవు కదా… అయితే ఆ మందు వాడితే కరోనా తగ్గుతుందనే నిర్ధారణ లేదు కాబట్టి ఇతర మందులు ఆపొద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది… అదీ ముందు జాగ్రత్త చర్యగానే.., నేనయితే ముందే చెప్పాను సుమా అనే ధోరణి… మీ ఇష్టముంటే వాడండి అనేసింది… అయితే కరోనా రోగులు పంపిణీ దగ్గరకు వెళ్లకుండా ఉండాలని, వాళ్ల సంబంధీకులు వెళ్లాలని చెప్పింది… పంపిణీ దగ్గర కరోనా జాగ్రత్తలు పాటించాలని చెప్పింది… (చుక్కల మందు వేసే పక్షంలోనే రోగులు వెళ్లాలి, లేకపోతే సంబంధీకులు వెళ్లినా సరే)…
హమ్మయ్య, నామీద నింద పడకుండా, జనం తిట్టిపోయకుండా… జాగ్రత్తగా వ్యవహరించాను అని చేతులు దులుపుకోకుండా…. ఇక వదిలేయకుండా… ఆ మందు వాడే రోగుల మీద, ఆ మందు చూపించే రిజల్ట్ మీద కూడా రీసెర్చ్ కొనసాగించడం మంచిది… అదే సమయంలో రోగులను అలా గాలికి వదిలేయలేదనే మంచి సంకేతం కూడా ఇచ్చినట్టవుతుంది… పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదు, కనిపెడుతూనే ఉన్నాం సుమా అనీ చెప్పినట్టవుతుంది… కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళల నుంచి కూడా ఈ మందు కోసం వచ్చే అవకాశాలున్నందున, పూర్తిగా పంపిణీని నిర్వాహకులకే వదిలేయకుండా… ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయాల్సి ఉంది… మందుకు అవసరమయ్యే మూలికలు, ముడి దినుసులకు టీటీడీ సాయం చేసినా తప్పులేదు… భక్తుల సొమ్ముకు ఇంతకుమించి సార్థకత ఏముంటుంది..? (పనికిమాలిన ఖర్చులకు బదులు…)
ఒకవేళ మందు పనిచేస్తుందని, కరోనా నుంచి రిలీఫ్ ఉంటోందని ఈ శాస్త్రీయ పరిశీలనలో గనుక తేలితే… ప్రభుత్వం ఇంకాస్త మద్దతును ఇవ్వడానికి వీలుంటుంది… బ్లాక్ ఫంగస్‌కు తెలంగాణ ఆయుష్ విభాగం యునానీ మందును అధికారికంగానే ఉచితంగా ఇవ్వడానికి రెడీ అయ్యింది… అలాగే ఆనందయ్య మందును మరింత శాస్త్రీయంగా, పెద్ద ఎత్తున రూపొందించి, ఏపీ ఆయుష్ విభాగం తనే సొంతంగా ప్రజలకు ఇవ్వడానికి ఎందుకు సిద్ధపడకూడదు..? కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా వేల ప్రాణాల్ని బలిగొంటున్నవేళ… అది ప్రజలకూ ఉపయుక్తం అవుతుంది… ఈ రెమ్డెసివర్లు, స్టెరాయిడ్లు, పవర్ ఫుల్ యాంటీ బయాటిక్స్, ప్లాస్మాథెరపీలు గట్రా కొత్త రోగాల్ని కొని తెస్తున్నవేళ… సైడ్ ఎఫెక్ట్స్ లేని ఏ మందయితేనేం, సపోర్ట్ చేస్తే మంచిదేగా..!! సంప్రదాయ వైద్యానికి ఆదరణ దక్కితే మంచిదేగా..! మరి అనుకున్నంతగా ఫలించకపోతే ఎలా అంటారా..? ట్రయల్ అండ్ ఎర్రర్ ఎప్పుడూ తప్పదు… అది పనిచేయడం లేదని తేలితే జనమే వదిలేస్తారుగా…!!!
Share this Article