Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

77 వయస్సులో… 55 ఏళ్ల నాటి… ఓ ప్రేమ- పెళ్లి మురిపెం కథ…

April 16, 2026 by M S R

.

1) అటోగ్రాఫీలోని మధుర జ్ఞాపకాలను ఎంత రసభరితంగా; ఎంత భావస్ఫోరకంగా, భాషస్ఫోరకంగా పంచుకోవచ్చో తెలుసుకోవడం కోసం…
2) లాయరుగారు సాంకేతిక కారణాల వల్ల “లా” ని వాయిదా పద్ధతుల్లో చదివారన్న లాపాయింటు లాగడం కోసం చదవండి…! … Gottimukkala Kamalakar



మా కథ

Ads

Vruddhula Kalyana Rama Rao …. 
ఇవాళ మా పెళ్ళిరోజు. 55 ఏళ్ళు పూర్తయ్యేయి. పెద్దకథ. చదవండి.
#నేనూ-#ఆ #పిల్ల’ (లేక ఆ అమ్మాయి) – మొదటి భాగం

————————————- –
నాకు 19 న్నర ఏళ్ళుంటాయి. 1969 పెద్ద పండుగల రోజులు. ఆ పిల్లకి మరో రెండ్నెలలో 16 ఏళ్ళు నిండుతాయి.
ఆ పిల్లని నాకిద్దావఁనుకుంటున్నారని కర్ణాకర్ణిగ్గా విన్నాను. ఆ పిల్లావాళ్ళ నాన్నగారు మానాన్నగారికి మేనత్తకొడుకే. నాకు మాఁవ వరస అవుతారు. హోమియోపతి డాక్టర్ కూడానూ.
ఇహనేం! తరచుగా ఎదో చిన్న రోగం వంక పెట్టుకుని వాళ్ళింటికి వెళ్లేవాణ్ణి.

మాఁవగారెప్పుడూ మందిచ్చి పంపించీడమే కాని ఆ పిల్ల కనిపించీది కాదు. అదేదో సినిమాలో చూపించిన ‘మెరుపుతీగ’ లాగ ఒక్క క్షణం చూసిన సందర్భాలు ఒకటి రెండున్నాయి.
‘ఇహ లాభం లేదు ఆపిల్లన్చూడాల్సిందే’ అని ఓ రెండు నెలలు పోయింతరవాత ఓ ధృఢమైన నిర్ణయానికొచ్చేను.
అది 1969 మార్చి నెల. నేను ఫస్టియర్ law పరీక్షలు ఇంకా మే నెలలో రాయాలి. ఆ పిల్లకి 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలు అవుతునాయనీ, ఫలానా సెంటర్ లో రాస్తోందనీ, ఫలానా రోజు ఆఖరి పరీక్షనీ అభిజ్ఞవర్గాల ద్వారా రూఢిగా తెలిసుకున్నాను.

ఆఖరి పరీక్ష నాడు సెంటర్ కెళ్ళి కలిసి తీరాలని నిశ్చయించేను. పరీక్ష సమయం అయిపోడానికి అరగంట ముందే సెంటర్ మెయిన్ గేట్ దగ్గర వెయిట్ చేస్తునాను.
వెళ్ళడం అంటే వెళ్ళేను కాని తీరా వెళ్ళిన తరవాత ఆ పిల్ల కలిస్తే ‘ఏం మాట్లాడాలి’ అన్న మీమాంస పట్టుకుంది.

నేను ఆ రోజుల్లో ఎన్టీఆర్ కి వీర fan ని. నాగేశ్వర్రావు అంటే పడదు. అప్పటికే ‘మిస్సమ్మ’ ఆరు సార్లు చూసేను. ఎన్టీఆర్ లా ఊహించుకున్నాను.
డైలాగులు ‘మనసులో’ ప్రాక్టీస్ చేసుకుని ‘సిద్ధంగా’ ఉన్నాను.
మెయిన్ గేట్ నుండి ఒహళూ ఒహళూ వస్తునారు. ఇంక ఆ పిల్లొచ్చెస్తుంది. తీరా టైమొచ్చేవేళకు నాక్కొంచెం ‘ట్రెంబ్లింగ్’ పట్టుకుంది.

——————————-
#నేనూ- ఆ అమ్మాయి (#రెండో భాగం)
———————– —–
నేను PUC చదివినప్పుడే ‘కన్యాశుల్కం’ నాటకం మొత్తం కంఠతా పెట్టీసేను.
మధురవాణితోనూ, పూటకూళ్లమ్మతోనూ బాగా పరిచయం ఉన్న గిరీశానికే బుచ్చమ్మను చూడగానే ట్రెంబ్లింగ్ పట్టుకుంది.
అలాంటిది ఏ అడపిల్లతోనూ అప్పటివరకూ బాగా పరిచయం లేని నాకు (నిజంగా) ఆ అమ్మాయి రాబోతుందనే ఊహే ట్రెంబ్లింగ్ పట్టుకునేలా చేసింది.

ఇంతలో, నాకంటే చిన్నవయసుదీ ( సుమారు ఆ అమ్మాయి వయసే ఉన్నదీ), నాకు cousin మేనత్తా అయిన ‘నాగమణి’ , పరీక్ష రాసి ఆ గేటంటే వచ్చింది.
వెంటనే నా ట్రెంబ్లింగ్ పోగొట్టుకుందికి బ్రిలియంట్ ఐడియా నాకొచ్చింది.
గిరీశం ఆ కోతివెథవని (వెంకటేశాన్ని) అడ్డుపెట్టుకుని ట్రెంబ్లింగ్ పోగొట్టుకున్నట్టు నేను ‘నాగమణి మేనత్తని’ అడ్డుపెట్టుకుని ఆ అమ్మాయితో మాట్లాడదామని నిర్ణయించేను.

మా నాగమణి మేనత్త చిన్నవయసుదైనా, దాని జీన్స్ మా పూర్వీకులవే కదా!
ఆవులిస్తే పేగులు లెక్కెట్టీగలదు
‘నా కూతురు గురించి వచ్చినట్టుకున్నావు’ అని నవ్వింది. దొరికిపోయిన దొంగ తాలూకా అవస్థ నాది.
‘అల్లుడూ, నా కూతురు కనిపిస్తే ఏం చేస్తావు’ అని చిలిపిగా అడిగింది.
బుర్ర కొట్టీసినట్టు అయింది.

కొంచెం సేపు అలా వెటకారం ఆడి:
‘పావుగంట కిందటే పరీక్ష రాసీసి రెండో గేట్లోంచి వెళిపోయింది. తరవాత కనిపించినప్పుడు నువ్వచ్చేవని చెప్తానులే’ అంది.
మొత్తం నీరు కారిపోయేను. డైలాగులు మరిచిపోయేను. పావు కిలోమీటరు దూరం నడిచి ఇంటికి సిటీబస్సు ఎక్కీసేను


కాలేజీలో ఆ అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది. ఓ పదిరోజులు నాకు జొరం వచ్చీడంతో 1969 లో నేను ఫస్ట్ ఇయర్ law పరీక్షలకు వెళ్ళలేదు. అప్పటి రూల్స్ ప్రకారం సెకండ్ ఇయర్ కి ప్రమోషన్ లేదు. 1970 లో law ఫస్ట్ ఇయర్ పూర్తి చేసి 1970-71 సెకండ్ ఇయర్ చదివేను. ఆ ఏడాది 1970-71లో ఆ అమ్మాయి సెకండ్ ఇయర్ ఇంటర్.
మళ్లీ ఆ అమ్మాయి చదివే కాలేజీకి వెళ్లే సాహసం చెయ్యలేదు.

1971 మార్చ్ 16 కల్లా ఆ అమ్మాయికి 18 నిండుతాయి. నాకు మరో 4 నెలల్లో 22 నిండుతాయి. ఫిబ్రవరి లో మావయ్యింటినుండి కబురొచ్చింది.
‘పిల్లనిస్తాం, ఫలానా రోజున పెళ్ళి చూపులకు రండి’ అని సారాంశం.
‘నానా , వాళ్ళు పిల్లనిస్తారట. పెళ్ళిచూపుల కెళదాం. పిల్ల నచ్చితే ఓ సంవత్సరం ఆగి నీ మూడేళ్ళ law చదువూ అయిపోయిన తరవాత పెళ్ళిచేసుకోవచ్చు’ అంది మా అమ్మ.
‘అమ్మ కొంపకగ్గెట్టొస్తోంది’ అనుక్కుని నా గుండె గుభేలుమంది.

‘Law చదువు అవగానే ప్రాక్టీస్ లో డబ్బులు రావు. ఓ ఐదేళ్ళు ఆగాలి. వాళ్ళని 6 ఏళ్ళు ఆగమంటే బాగుండదు. మరో సంబంధం చేసుకోమందాం. పెళ్ళిచూపులు అక్కర్లేదు’ అని గట్టిగా చెప్పి;
‘కాదూ కూడదూ, ఆ పిల్లే నీకు కోడలు కావాలంటే పెళ్ళి చూపులకెల్దాం’ అన్నాను మెల్లిగా.
నా ‘ముచ్చట’ మా అమ్మకి అర్ధం అయిపోయింది.
పెళ్లిచూపులకు మావయ్య పెట్టిన ముహూర్తానికే వస్తున్నామని మా నాన్నగారు కబురు పెట్టేరు.
పెళ్ళిచూపులరోజు రానే వచ్చింది.

nostalgy


చాలా కాలం కిందటి మాట . ఆ శ్యామలాంబ సౌందర్యలహరి. ఆవిడ మానాన ఆవిడ బుద్దిగా కూచుంటే , ఉన్నవాడున్నట్టుగ ఊరుకోకుండా, చెరుకువిల్లు- పువ్వులబాణం పట్టుకుని, కళ్ళుమూసుకుని తప్పస్సులో ఉన్న శివుడు గ్గురిచూసి ఆవిడ మీద ఆయన దృష్టి పడేలా బాణం వదిలేడు మన్మథుడు. వాడి గురికి తిరుగు లేదు. వాడి వాడి బాణం మగాడికి తగిలితే ఏ సావిత్రో, ఏ హేమమాలినో అక్కరలేదు– ఆఖరికి ఋష్యేంద్రమణి అయినా చాలు దెబ్బతినడానికి.

అలాంటి స్థితిలో ఆవిడ అందం చూడ్డానికి రెండు కళ్ళూ సరిపోక ఆ ఫాలాక్షుడు మూడో కన్నూ తెరవ్వలసొచ్చింది. క్షణంలో తమాయించుకుని, తపోభంగం చేసినందుకు ఆ పుష్పబాణుణ్ణి ఆనంగుడైపోవాలని శపించేడు. అయినా వాడికి బుద్ధి రాలేదు.
అదిగో ఆ శాపం వరమై కూచుంది మన్మథుడికి.

కనిపించడు కదా ఆ వేళ మా పెళ్లి చూపులనాడు సరైన పొజిషన్ చూసుకుని ఏ కుర్చీ పక్కనో కూచుని తన time గురించి wait చేస్తున్నాడు.
ఆ తరుణిని తీసుకొచ్చేరు ఇద్దరు ఆడంగులు. చాపమీద బుర్రొంచుకుని కూర్చుందా ‘ముగ్ధ’.
‘అలాపంబునకుత్తరంబొసగదు ఆయాసంబున కాని తానాలోకింపదు..’ జ్ఞాపకం వచ్చింది.
‘తలెత్తమ్మా ‘అన్నారు మావయ్య. మెల్లిగా తలెత్తింది ఆ లలన.

నా గుండె ఝల్లుమంది. రంభా- ఊర్వశీ- మేనకా- తిలోత్తమా- ఘృతాచీ ; వీళ్ళందరిని ఒక ముద్ద చేసీసీ, తిరిగి బ్రహ్మ ప్రాణం పొసీసీ, ఆ గదిలో కూచోపెట్టీసేడనిపించింది.
(అప్పుడు నా BP ఎవరూ చూడలేదు కాబట్టి సరిపోయింది. 250/170 ఉండుండును).
ఓ ప్రాణం పోసుకున్న కుందనప్బొమ్మ ఎదురుకుండా కూచుందనిపించింది.

తలెత్తిందాముద్దుగుమ్మ.. సరిగ్గా అదే సమయానికి అక్కడే దాంకున్న ఆ పుష్పబాణుడు గురిచూసి నా మీద వదిలిన బాణం నాకు బలంగా తగిలింది.
అయితే, ఇవాళంటే షుగర్ వ్యాధి వచ్చి నేను తక్కువ తింటున్నాను కాని నేనాడేం తక్కువ తినలేదు. తెలీని వాళ్ళు రాజేష్ ఖన్నాలా ఉన్నావనే వారు. తెలిసున్నవాళ్ళు రాజేష్ ఖన్నా నాలాగే ఉంటాడనేవారు


#5 వ ఆఖరి భాగం
—————————-
ఎత్తిన తల ఒక్క క్షణంలో దించుకుంది ఆ పెళ్లికూతురు (ఆ రోజుల్లో ఏ ఆడపిల్లయినా నన్ను ఒక్క క్షణం చూస్తే చాలు, కొన్ని యుగాలు జ్ఞాపకం ఉంచుకుందికి. క్షమించాలి నిజం దాచకూడదు).
అదే క్షణంలో ఆవిడ మీదా పంచబాణుడి నారాచం గట్టిగానే తగిలుంటుంది.
‘ఓ పద్యం చదువమ్మా’ అన్నారు మావయ్య. ఊరుకుంది. మళ్ళీ చెప్పేరు. ఊరుకుంది. మావయ్యక్కోపం వచ్చింది. నాకు జాలేసింది. మూడోసారి గట్టిగా అరిచేరు.

ఎదురుగా పులి లేకపోయినా బెదురు చూపుల లేడికళ్ళతో చూసి గబగబా పద్యం చదివింది.
‘ జలజాతాసన వాసవాది సురపూజా భాజనంబై..’ ఇలా సాగింది. ఆ భామకి అర్ధం తెలీకపోవచ్చు.
నన్నడుగుతారేమోనని నేను మనసులో సిద్ధంగా ఉన్నాను:
‘నను భవదీయదాసుని మనంబున నెయ్యపు కిన్కబూని..’ ఇలా సాగును.
నన్ను చదవమనలేదు.

పెళ్ళి చూపులు అయిపోయేయి.
పిల్లనచ్చిందా అని నన్ను కాని, అబ్బాయి నచ్చేడా అని అమ్మాయిని కాని ఎవరూ అడగలేదు.
అందరికీ సీను అర్ధం అయిపోయింది.
ముహూర్తాలు పెట్టీసేరు.
ఏప్రిల్ 16, 1971 రాత్రి 8 గంటల చిల్లరకి.
జీలకర్ర, బెల్లం పెట్టించేరు. తలంబ్రాలు పోయించేరు. మూడుముళ్ళు వేయించేరు.
పెళ్ళి అయిపోయిందన్నారు.

కానీ అప్పటికే నేను హిందూ వివాహ చట్టం చదివేను. సుప్రీంకోర్టు తీర్పులు కూడా చదివేను.
సప్తపది అయింది. పెళ్ళి అయిపోయింది కదా అనుకున్నాను.
55 ఏళ్ళ కిందటి పెళ్ళి ముచ్చట.

  • ఇప్పుడు నలుగురు పిల్లలు; నలుగురూ లీగల్ ప్రొఫెషన్ లోనే ఉన్నారు. అందులో ఇద్దరు జిల్లా జడ్జి లు
    ఏడుగురు మనవలు (నలుగురు మనవళ్ళు, ముగ్గురు మనవరాళ్ళు) . ఒకరు advocate. నలుగురు law చదువుతున్నారు. ఇంకో ఇద్దరు లా చదువుతారు.
    ఆవిడకు 73 పూర్తయ్యేయి. మూణ్ణెళ్లలో నాకు 77 పూర్తవుతాయి
    అదీ కథ.
    పెద్దల ఆశీస్సులు కావాలి. పిన్నలకు మా ఆశీస్సులు.

(77 ఏళ్ల వయస్సులోనూ… 55 ఏళ్ల నాటి అదే మురిపెం, ప్రేమను వ్యక్తీకరిస్తూ సాగిన మీ జ్ఞాపకాలు బాగున్నాయి లా మాస్టారూ… అభినందనలు…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చైనాలో ఏం జరుగుతోంది..? వంద మంది సైనిక జనరల్స్ గల్లంతు..?
  • ఒమర్ అబ్దుల్లా తెలివైనవాడు… సమయస్పూర్తి ప్రదర్శించాడు…
  • కథ రాసేవాడికి చూసేవాడు లోకువ… ఫాఫం, రోజా ఫస్ట్ ఫిలిమ్ కథ ఇదే…
  • 77 వయస్సులో… 55 ఏళ్ల నాటి… ఓ ప్రేమ- పెళ్లి మురిపెం కథ…
  • సీఎం రేవంత్ రెడ్డి ఇది తప్పకుండా చదవాలని కోరుకుంటూ..!!
  • సమకాలీనులు వేరు- సమస్కంధులు వేరు… బోత్ ఆర్ నాట్ సేమ్…
  • లేడీ-D @ నిదా ఖాన్…! నాసిక్ మత స్కాం బట్టబయలైంది ఇలా..!!
  • మన అన్ని వ్యవస్థల్లోకీ జొరబడిన ‘టెర్రరిజం’… బహుపరాక్…
  • కొత్త సీన్..! ఈసారి తమిళేతరుల హవా..! ప్రత్యేకించి తెలుగు కులాలు..!!
  • ఆమె కథలో ఎన్ని ట్విస్టులో… ప్రతి ఫేకుగాడికీ ఆ పేరిప్పుడు లోకువ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions