Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏమో… ఎవరికి తెలుసు..? మనలో ఎన్ని బొద్దింకలు ఉన్నాయో…!

May 31, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. మనకు మూడు వైరాగ్యాలు ఉన్నాయి . అవి : శ్మశాన వైరాగ్యం , పురాణ వైరాగ్యం , ప్రసూతి వైరాగ్యం . ఆ కోవలో మరో వైరాగ్యం సినిమా వైరాగ్యం . దేశభక్తి గురించో , జనం గురించో , దురాచారాల గురించో సినిమా చూస్తున్నంత సేపు ఆ సినిమాలలో హీరోల పాత్రల్లోకి మనం దూరిపోతాం . దేశ ద్రోహులను , సమాజ ద్రోహులను నరికి పోగులు పెట్టాలని ఆవేశం వస్తుంది . థియేటర్ లోనుంచి బయటకు రాగానే మన ఒరిజనల్ బుధ్ధి మనల్ని ఆవహిస్తుంది .

అలాంటి దేశభక్తి సినిమాలలో ఒకటి ఈ రగులుతున్న భారతం . జర్నలిస్ట్ , రచయిత , దేశం కోసం పరితపించే వ్యక్తి చల్లా సుబ్రమణ్యం . ఆయన వ్రాసిన కధే ఇది . సినిమాకు డబ్బులు వచ్చాయో రాలేదో నాకు తెలియదు . కానీ ఈ సినిమాకు నంది అవార్డు మాత్రం వచ్చింది . ఉత్తమ కధగా రచయిత చల్లా సుబ్రమణ్యానికి అవార్డు వచ్చింది .

Ads

ఈ సినిమాకు అధికారికంగా నిర్మాత కూడా ఆయనే . మరింకా ఎవరయినా వెనుక ఉన్నారేమో తెలియదు . డైలాగులను కూడా ఆయన , దర్శకుడు అల్లాణి శ్రీధర్ కలిసి వ్రాసారు . స్క్రీన్ ప్లే , దర్శకత్వం అల్లాణి శ్రీధర్ గారివి .

ముగ్గురు దేశభక్తులు అండమాన్ జైలు నుండి పారిపోతారు . రఘుపతి (ఏయన్నార్) , రాఘవ (గొల్లపూడి మారుతీరావు) , రాజారాం (కోట శంకరరావు) . వారు బయటకొచ్చాక స్వాతంత్ర్యం రావటం , రఘుపతి కోమా లోకి వెళ్ళిపోవటం , రాఘవ ముఖ్యమంత్రి కావటం , రాజారాం నక్సలైట్ కావటం జరుగుతాయి .

నలభై ఏళ్ళ తర్వాత కోమా నుండి బయటకొచ్చిన రఘుపతికి దేశం ఎంత అభివృద్ధి చెందిందో , తన మిత్రుడు రాఘవ , అతని కొడుకు తిలక్ (పోకూరి బాబూరావు) ఎంత జన కంటకులు అవుతారో , రాజారాం తీవ్రవాది కావటం వంటి పరిణామాలు చూసి రఘుపతి డీలా పడిపోతాడు .

జర్నలిస్ట్ దివ్యవాణి , టాక్సీ బాబాయి దాసరి నారాయరావు , రఘుపతి , పోలీసు ఇనస్పెక్టర్ జగపతిబాబు జన కంటకుల అఘాయిత్యాలను ప్రతిఘటించటం మొదలుపెడతారు . క్లైమాక్సులో దాసరి నారాయణరావు , ఏయన్నార్ లను ముఖ్యమంత్రి కొడుకు చంపేస్తాడు . దివ్యవాణి , జగపతిబాబు శాంతి ఉద్యమాన్ని గాంధేయ మార్గంలో ముందుకు తీసుకుని వెళతారు . సినిమా అలా ముగుస్తుంది .

34 సంవత్సరాల కింద సినిమాలోనే కొడుకుల కోసం పార్టీని , పదవిని , అధికారాన్ని నాకించే ప్రజాప్రతినిధులు ఈ సినిమాలో తారసపడతారు . ఈ సన్నివేశాలన్నీ ఎన్నో సినిమాలలో చూసినవే . రోజూ నిజ జీవీతంలో చూస్తున్నవే . ఒకప్పుడు పత్రికల్లో చదివే వాళ్ళం . టివిల్లో చూసేవాళ్ళం . ఇప్పుడు ఆ రెండూ అమ్ముడు పోయాక కాస్తో కూస్తో సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నవే .

ఈ సినిమాకు పాటల్ని దేవీప్రియ అనబడే షేక్ ఖాజా హసన్ వ్రాసారు . ఆయనకు 2017 సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది . 1951 స్వాతంత్ర్య దినోత్సవం నాడు మా గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు . చాలా పాపులర్ రైటర్ . పాటల్ని బాగా వ్రాసారు .

సవాలుంటే జవాబుంది అనే పాట ఏయన్నార్ , పిల్లల మీద బాగా ఉంటుంది . జంపు జపా జంకు జమా అంటూ దాసరి తోటి టాక్సీ డ్రైవర్లతో కలిసి పాడతాడు . ముక్కలైన స్వప్నం ఇది నీ దేశం కాదు అంటూ సాగుతుంది దివ్యవాణి మీద . అది కూడా స్వాతంత్ర్య సమరయోధుల స్వప్నాలు ఎలా చిద్రం అయిపోయాయో చెపుతుంది .

గురుతుందా నీకు మరపు రాదు నాకు అనే డ్యూయెట్ జగపతిబాబు , దివ్యవాణి మీద చక్కగా చిత్రీకరించారు . క్లైమాక్సులో ఇది నిశాంత స్వతంత్రం అనే పాట ఉంటుంది . పాటల్ని బాలసుబ్రమణ్యం , జానకమ్మ , చిత్ర శ్రావ్యంగా పాడారు . తమిళ సంగీత దర్శకుడు దేవేంద్రన్ సంగీతాన్ని అందించారు .

నటనపరంగా ఏయన్నార్ , గొల్లపూడి గురించి చెప్పేదేముంది ! హీరోహీరోయిన్లుగా జగపతిబాబు , దివ్యవాణి , విలనుగా పోకూరి బాబూరావు బాగా నటించారు .ముఖ్యమంత్రి గారి ఆస్థాన జ్యోతిష్యుడిగా నల్ల దుస్తుల్లో తనికెళ్ళ భరణి , నిత్య అసమ్మతి రాజకీయుడిగా ధర్మవరపు సుబ్రమణ్యం , వై విజయ , బేబీ సునయన  తదితరులు నటించారు .

ఇలాంటి సినిమాలు , దిగంబర సాహిత్యం అరణ్య రోదనమే అయినా అవసరమే . చైతన్యం ఎప్పుడు వస్తుందో చెప్పలేం . ఓ అనామక డిజిటల్ బొద్దింకల జనతా పార్టీ నాలుగు రోజుల్లో ఎంత భయపెట్టిందో చూసాం కదా !
1992 ఫిబ్రవరిలో వచ్చిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . ఖాయంగా చాలా మంది చూసి ఉండరు . వాయిదాల పధ్ధతిలో అయినా చూడమని నా మనవి . ఎవరికి తెలుసు మనలో ఎన్ని బొద్దింకలు ఉన్నాయో !

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమో… ఎవరికి తెలుసు..? మనలో ఎన్ని బొద్దింకలు ఉన్నాయో…!
  • మంచు మేఘాలు తొలిగితేనే… కాంచనగంగ శిఖర దర్శనం… గొప్ప మూవీ…
  • Madhuvidhu … క్లీన్ ఫ్యామిలీ కామెడీ మూవీ..! మన జంధ్యాల గుర్తొస్తాడు..!
  • రియల్ సూపర్‌స్టార్ కృష్ణను సరిగ్గా ఆవిష్కరించిన కథనం ఇది..!!
  • ఆ బుడ్డోడు వైభవ్ మాత్రమే కాదు… ఈ గొప్పోడు కూడా గుర్తుకురావాలి…
  • దొందూ దొందే… నాగేశ్వర్- పవన్ కల్యాణ్… తెలంగాణకు అక్కర్లేని కేరక్టర్లు…
  • ఇక నీ కెరీర్ క్లోజ్ అన్నారందరూ… ఈమె అస్సలు లెక్కచేయలేదు…
  • ప్చ్, ఏం చేస్తాం..? జపానోడికి మన మామిడి తినే యోగం లేదు..!!
  • రేవంత్ సవాల్‌కు బీఆర్ఎస్ వద్ద జవాబు లేదు..! కిక్కుమనరు..!!
  • KCR పాలన బాపతు ఆ గ్లోబరీనా… కొత్త పేరుతో మళ్లీ పిల్లల జీవితాలతో ఆటలు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions