“రహేఁ నా రహేఁ హమ్, మెహకా కరెంగే బన్ కే కలీ, బన్ కే సబా, బాగ్-ఎ-వఫా మే…” (నేను ఉన్నా లేకపోయినా, నా సువాసనలు ఇక్కడే నిలిచిపోతాయి. నమ్మకమనే ఈ తోటలో ఒక వికసించే మొగ్గలా, ఒక చల్లని మలయమారుతంలా నేను ఎప్పుడూ విహరిస్తూనే ఉంటాను…)
నా కాలేజీ రోజుల్లో 1966 నాటి ‘మమత’ సినిమాలోని ఈ పాట విన్నప్పుడు, లతా మంగేష్కర్ అమృతగాత్రం నన్ను ఎంతగానో ముగ్ధుడ్ని చేసింది. సినిమా చూడకపోయినా, ఆ మధురమైన బాణీ, గుండెలను హత్తుకునే ఆ సాహిత్యం వల్ల ఈ పాట నా ఆల్-టైమ్ ఫేవరెట్లలో ఒకటిగా నిలిచిపోయింది… ( అప్పరుసు శ్రీనివాసరావు ) …
కాలక్రమేణా నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. ఈ పాటలో రెండు వెర్షన్లు ఉన్నాయి! సుచిత్రా సేన్‌పై చిత్రీకరించిన లతా వెర్షన్ ఒకటైతే… సుచిత్రా సేన్, ధర్మేంద్ర కాంబినేషన్‌లో వచ్చే మరో వెర్షన్ కూడా ఉంది. దాన్ని పాడింది లెజెండరీ సింగర్ మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ కాదు… సుమన్ కళ్యాణ్‌పూర్!
ఆ సంగతి తెలిసినప్పుడు నేను అక్షరాలా షాకయ్యాను. ఎందుకంటే, సుమన్ కళ్యాణ్‌పూర్ గొంతును నేను పూర్తిగా లతా మంగేష్కర్ గొంతు అనే భ్రమపడ్డాను. ఆ ఇద్దరి గొంతుల్లోని సారూప్యత (పోలిక) అంతలా మైమరపిస్తుంది!
Ads
కేవలం ఈ ఒక్క పాట మాత్రమే కాదు… నేను లతాజీ పాడారనుకుని, ఆ తర్వాత సుమన్ కళ్యాణ్‌పూర్ పాడినట్టు తెలుసుకుని నోరెళ్లబెట్టిన పాటలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు, 1962 నాటి ‘బాత్ ఏక్ రాత్ కీ’ సినిమాలోని ఈ ఫిమేల్ వెర్షన్ వినండి:
“నా తుమ్ హమే జానో, నా హమ్ తుమ్హే జానే, మగర్ లగ్తా హై కుచ్ ఐసా, మేరా హమ్దమ్ మిల్గయా…” (నీకు నేను తెలియదు, నాకు నువ్వు తెలియదు… అయినా ఎందుకో నా ప్రాణస్నేహితుడు దొరికాడన్న భావన కలుగుతోంది…)
ఈ పాట వింటుంటే క్షణకాలం పాటు లతా మంగేష్కరే పాడుతున్నదనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ, ఆ మధుర గళం సుమన్ కళ్యాణ్‌పూర్‌ది…
అలాగే ‘బ్రహ్మచారి’ (1968) సినిమాలోని ఎవర్‌గ్రీన్ హిట్ పార్టీ సాంగ్ “ఆజ్ కల్ తేరే మేరే ప్యార్ కే చర్చా హర్ జబాన్ పర్…” గుర్తుందిగా? రఫీతో కలిసి సుమన్ పాడిన సూపర్ హిట్ సాంగ్ ఇది. ఇలా చెప్పుకుంటూ పోతే… “తుమ్నే పుకారా ఔర్ హమ్ చలే ఆయే” (రాజ్‌కుమార్, 1964), “నా నా కర్తే ప్యార్” (జబ్ జబ్ ఫూల్ ఖిలే, 1965), “దిల్ ఏక్ మందిర్ హై” (దిల్ ఏక్ మందిర్, 1963), “మేరే మెహబూబ్ నా జా ఆజ్ కీ రాత్ నా జా…” (నూర్ మహల్, 1965) లాంటి ఎన్నో ఆణిముత్యాలు సుమన్ ఖాతాలో ఉన్నాయి.
విస్మృతికి గురైన స్వరం!
- ఇప్పటికీ ‘భారతరత్న’ లతా మంగేష్కర్‌ను ఆరాధించే నేటి తరం సంగీత ప్రియులకు ‘సుమన్ కళ్యాణ్‌పూర్’ అనే పేరు పెద్దగా గుర్తుండకపోవచ్చు. అందుకేనేమో, ముంబైలోని ఆమె నివాసంలో 89 ఏళ్ల వయసులో ఆదివారం రాత్రి ఆమె నిశ్శబ్దంగా కన్నుమూసినప్పుడు, మీడియాలో అది పెద్ద వార్త కాలేకపోయింది. కొన్ని జాతీయ వార్తా సంస్థలు మినహా, మన తెలుగు మీడియా సంస్థలతో సహా మిగతా వారికి ఆమె మరణం ఒక వార్తగానే అనిపించలేదు.
కానీ పాతతరం సంగీత అభిమానులకు మాత్రం సుమన్ కళ్యాణ్‌పూర్ మరణం తీవ్ర కలతను, ఒక రకమైన శూన్యాన్ని మిగిల్చింది. లతా గొంతుకు ఎంత దగ్గరగా ఉండేదామె స్వరం! అయినా సరే, ఆమెకు దక్కాల్సిన గుర్తింపు, గౌరవం దక్కలేదనే చేదు నిజం వారిని నేటికీ వేధిస్తూనే ఉంటుంది.
పద్మభూషణ్ గ్రహీత ఈ సీనియర్ గాయని… 1950ల నుండి 1970ల వరకు సాగిన హిందీ సినీ సంగీత స్వర్ణయుగంలో హిందీ, మరాఠీతో పాటు పలు భారతీయ భాషల్లో అద్భుతమైన పాటలు పాడింది. ఎందరో దిగ్గజ సంగీత దర్శకులతో, ముఖ్యంగా మొహమ్మద్ రఫీతో కలిసి ఆమె వందలాది పాటలను రికార్డ్ చేసింది.
కేవలం హిందీలోనే కాదు… మరాఠీ సంగీతంలో భావగీతాలు, భజనలతో ఆమె చెరగని ముద్ర వేసింది. పంజాబీ స్వరాలు, పెళ్లి పాటలతో పాటు బెంగాలీ, అస్సామీ, గుజరాతీ, కన్నడ వంటి అనేక ప్రాంతీయ భాషల్లోనూ ఆమె గానం అలరించింది.
సంగీత ప్రస్థానం.. లతాతో పోలిక
జనవరి 28, 1937న ఢాకా (ప్రస్తుత బంగ్లాదేశ్)లో ‘సుమన్ హేమ్మాడి’గా జన్మించిన ఆమె, ఆరేళ్ల వయసులోనే తన కుటుంబంతో కలిసి ముంబైకి వచ్చేసింది. సంగీతంలో, పెయింటింగ్‌లో శాస్త్రీయ శిక్షణ తీసుకుంది. 1952లో ఆల్ ఇండియా రేడియోలో పాడే అవకాశం వచ్చింది. ఆ మరుసటి ఏడాది ‘శుక్రాచి చాందిని’ అనే మరాఠీ సినిమాతో ప్లేబ్యాక్ సింగర్‌గా మారింది. 1954లో ‘మంగు’, ‘దర్వాజా’ వంటి హిందీ సినిమాల్లో పాడింది.
వివాహం తర్వాత, భర్త రామానంద్ కళ్యాణ్‌పూర్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె తన సింగింగ్ కెరీర్‌ను విజయవంతంగా కొనసాగించింది. పైన చెప్పుకున్న ఎన్నో సూపర్ హిట్ పాటలను ప్రేక్షకులకు అందించింది. అయితే, అదే సమయంలో సుమన్ గొంతు విన్యాసం, పాడే శైలి అచ్చం లతా మంగేష్కర్‌లాగే ఉండటాన్ని పరిశ్రమ గమనించింది. సాధారణ శ్రోతలకు వీరిద్దరి గొంతుల మధ్య తేడా కనిపెట్టడం దాదాపు అసాధ్యం!
అందివచ్చిన అవకాశాలు… అడ్డుపడిన అదృష్టం!
1960ల కాలంలో రాయల్టీ వివాదం కారణంగా మొహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ కలిసి పాడకూడదని నిర్ణయించుకున్నారు. ఆ వివాదం సుమన్ కళ్యాణ్‌పూర్‌కు పెద్ద వరంగా మారింది. ఆ ఆరేళ్ల కాలంలో ఆమె రఫీతో కలిసి దాదాపు 140 డ్యూయెట్లను రికార్డ్ చేసింది. లతా మంగేష్కర్ భారీ పారితోషికాన్ని భరించలేని సంగీత దర్శకులు సైతం సుమన్‌ను ఎంచుకునేవారు. అయినప్పటికీ, లతా మంగేష్కర్ అనే మహా వృక్షం నీడలో సుమన్ ప్రతిభ చాలా కాలం పాటు మరుగున పడిపోయింది.
అద్భుతమైన గొంతు, తిరుగులేని ప్రతిభ, లతాజీకి సరితూగే గాత్ర శుద్ధి ఉన్నప్పటికీ బాలీవుడ్‌లో ఆమెకు రావాల్సినన్ని అవకాశాలు రాలేదనే చెప్పుకోవచ్చు. అయినా సరే, 60లు, 70ల ప్రారంభంలో ఆమె ఎన్నో అద్భుతమైన సోలో, డ్యూయెట్ పాటలను తన ఖాతాలో వేసుకుంది…
తెరవెనుక రాజకీయాలు?
1970ల చివరి నాటికి ఆమె క్రమంగా పాటలు తగ్గించేసి, లైమ్ లైట్‌కు దూరంగా జరిగిపోయింది. ఆమె ఇచ్చిన కొన్ని అరుదైన ఇంటర్వ్యూలలో… తనకు దక్కాల్సిన గుర్తింపు దక్కకపోవడానికి ‘విధి’ (Destiny)ని తప్పుపట్టింది. కొన్ని సినిమాల నుండి తన పాటలను కావాలనే తొలగించారని కూడా ఆమె పేర్కొంది. ఆ విధి పేరు లతా మంగేష్కర్..?
ఆ రోజుల్లో బాలీవుడ్‌ను శాసిస్తున్న లతా మంగేష్కర్, ఆశా భోస్లేల గుత్తాధిపత్యం (Monopoly) వల్లే సుమన్‌కు అవకాశాలు రాలేదనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో బలంగా వినిపించేది. అచ్చం తనలాగే పాడుతున్న సుమన్‌కు అవకాశాలు ఇస్తే, తాను పాడబోనంటూ లతా నిర్మాతలను బెదిరించారనే ప్రచారమూ సాగింది. (లతా ఇలా చాలామంది అవకాశాలకు అడ్డుపడిందనే విమర్శలు ఎన్నో)…
ఈ నిజానిజాలు ఆ దేవుడికే తెలియాలి! కానీ, 70ల దశాబ్దం ముగిసేసరికి సుమన్ స్వరం బాలీవుడ్‌లో మూగబోయింది. ఆమె కేవలం కొన్ని లైవ్ షోలు, ప్రైవేట్ ఆల్బమ్స్‌కే పరిమితమైంది.
ఏది ఏమైనప్పటికీ, ఆమె మనకోసం వదిలివెళ్లిన ఆ మధుర గీతాలు సంగీత ప్రపంచంలో ఎప్పటికీ తరిగిపోని అమూల్యమైన నిధులు. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆ పాటల రూపంలో ఆమె స్వర సువాసనలు ఎప్పటికీ గుబాళిస్తూనే ఉంటాయి!
Share this Article