Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కాంచి- బొంగు- సీటు … సైకిల్- ఈత నేర్వనోడు అప్పట్లో శుద్ధ మొద్దు…

June 4, 2026 by M S R

.

Gottimukkala Kamalakar …. #కాంచి_తొక్కుడు_సుత_రాలే…! శిన్నప్పుడు నాకు సైకిల్ తొక్కెటోళ్లంటే మస్తు ఇజ్జతుంటుండె. ఆల్లు అంజనేయులు సామి భక్తులని, ఆల్లకు గాలిల ఎగురొస్తదనీ అనుకునేటిది. గంత శిన్న సీటూ, గంత సన్న గిల్లలతోటి ఎట్ల అది ముదట్కివోతుందో అస్సలు సమజయ్యేటిది గాదు. పెద్దోల్లు సైకిలు సీటుమీద కూసోని, శేతులతోటి హ్యాండిల్ను పట్కోని, మొకం సక్కగవెట్టి కాల్లతోటి కింద తొక్కుతుంటె ముందట్కి ఎట్లవొయ్యేటిదో నేను ఎనుకకెల్లి కండ్లు తెర్సుకోని సూశేటిది…!

మా నాయినకు సైకిలు లేదు. సైకిలున్నోల్లు ఆల్ల కొడుకులను ముందల కూసోవెట్కోని సైకిలు తొక్కుకుంట పస్నూరు దిక్కో, తిర్మలాపురం దిక్కో, సల్లోనికుంట దిక్కో పొయ్యేటిది. ముందల కూసున్న పోరలు హ్యాండిలు మీది బెల్లును ట్రింగ ట్రింగ వత్తుతుంటె నాకు మనసంత గాయిగాయి ఐపొయ్యి నాకు సైకిలు లేకపాయెనే అని మస్తు ఏడుపొచ్చేడిది.

Ads

నా బతుకంత సదువుకోసం నెల్లపెల్లి నల్లగొండ నడిమిట్ల షటిల్ సర్వీసుల ఉండె..! ఊర్లైతే ఆనికో, ఈనికో ఓ సైకిలుండేటిది. కానీ నల్లగొండ నిండ సైకిళ్లే..! బీయెస్సేలూ, అట్లాసులూ, హీరోలూ, హెర్కులస్లూ రకరకాల సైకిండ్లు. రంగురంగుల సైకిండ్లు..! బైసికిల్ థీవ్స్ సీన్మ హీరోకున్నంత కష్టముంది గాని, అండ్ల దొంగకున్నంత దమ్ము లేకపాయె..! ఉంటెగిట్లనా, ఎవనిదన్న సైకిలు దెంకపోతుంటి…!

మా దోస్తులల్ల కొందరు సైకిల్ కాంచి తొక్కుడు షురూ జేశిండ్రు. ఆ సీటు కింద సందులకెంచి కాళ్లు తీశి రివ్వరివ్వ #రింగన్నపురుగు లెక్క సైకిల్ తొక్కేటిది. ఆల్లను సూస్తే కడుపుల శానా గుబులయ్యేటిది. ఎవ్వడు సుత నాకు సైకిల్ తొక్కేటిది నేర్పియ్యలే..!

ఓపాలి మావూర్ల మాదిగ మల్లయ్య కొడుకు సైకిల్ కొనుక్కొచ్చిండు. రోజు ఆడు సైకిల్ మీదనే ఆల్ల శెల్కకాడికి పొయ్యేటిది. ఓ నాడు ఆడన్న ఇస్తడేమోనని పోయిన. “రావసామీ, రావసామీ.., నాకు కాంచి కొట్టుడు నేర్పియ్యవా..?” అన్న. నీకు సైకిలు నేర్పియ్యాలెనంటె, నిన్ను ముట్టుకోవాలె గద అయ్యగారూ..?” అన్నడు. “ఏంగాదు.., ఇంటికివొయి స్నానం జేస్త..!” అన్న.
“నన్ను ముట్టుకుంటెనేమో తప్పా..? మరి నా సైకిలు ముట్టుకుంటె ఒప్పా..? పోరా #బాపని_భాడ్_ఖావ్, పో..!” అని తిట్టి పంపిండు రావసామి.

ఇంగ నల్లగొండలనేమొ, మా దోస్తులందరికి సైకిలొచ్చింది. ఆడిపిల్లలు గుడ్క నేర్సుకోని ఆఫులంగలు కట్టుకోని శివాజినగర్ పార్కుల శిలుకలలెక్క సైకిల్ తొక్కుతుంటిరి. మా దోస్తులు రజినినో, భానురేఖనో, అనితనో, పద్మనో, రమావాణినో అడిగితె సైకిలిద్దురేమో గాని, నేర్పిచ్చెటోడెవ్వడు…? అల్లను నేర్పియ్యమంటె “అయ్యో, నీకు సైకిల్ తొక్కుడు రాదా..?” అని యెక్కిరిస్తరని భయమయ్యింది. బడిల దోస్తుల ముంగట ఇజ్జత్ తీస్తరని గుబులయ్యింది. అందుకని అడ్గలే…!
సూస్తుంటె, సూస్తుంటెనే పదోతరగతి ఐపొయ్యింది గాని, సైకిలైతె రాలే…!

****
మా ఇంటెదురుంగ బంటుకొండమ్మోళ్ల ఇల్లుండేది. ఆమె మనుమడు మేకలసీను మా శిన్నమామకు జిగిరీదోస్తు. ఆయనకో హీరో సైకిలుండేటిది. నా సైకిల్ తొక్కుడు ఖాయిష్ మేకలసీను మామకు శెప్పిన. నేర్పిచ్చనీక ఒప్పుకుండు. ఐతె మా ఇంట్ల మావిడికాయ పచ్చట్లయి ఇరువై ముక్కలు తీస్కపొయ్యి ఆయనకియ్యాలెనని షర్తు వెట్టిండు. నేను మా అమ్మ పగలు వంటయినంక పండుకోని నిద్రవోతున్నప్పుడు పిల్లి తీర్న సప్పుడ జెయ్యకుట్ట వొంటింట్లకు పొయ్యి, ఓ వర్కు కవర్ల మడిజాడీల కెంచి ఎడమశెయ్యితోని ఓ ఇరువై మామిడి కాయ పచ్చడ ముక్కలు లెక్కవెట్టుకుట్ట తీశి యేస్కోని పట్క పొయ్యి ఇచ్చిన..!

సీనుమామ ద్రోణుడు, నేను అర్జునుణ్ణి;
సీనుమామ అచ్రేకర్, నేను టెండూల్కర్;
సీనుమామ జయశంకర్ సారు; నేను కేసీఆర్…!
“కాంచీ నేర్పియ్యి సీనుమామా..!” అంటె “గాడిది లెక్క పెరిగినవ్. ఇంక కాంచేంది..?” అని ఆల్ల గంగాలంల కడుక్కున్న మా మామిడి పచ్చ తినుకుట్ట “ఛల్, సీటెక్కు..!” అన్నడు. .

ప్రాక్టీసు షురూ అయ్యింది. యెనుక సీటును పట్టుకోని సీనుమామ సైకిలెనుక ఉరుక్కుంట ఒచ్చేటిది. అప్పుడప్పుడు ఇడిశిపెట్టేడిది. నేనప్పుడు సాగరసంగమం సీన్మల కమల్ హాసన్ లెక్క అటు ఇటు ఊగుతుంటె మల్ల పట్టుకునేటిది. నాయి రెండు పాదాలు, రెండు మోకాళ్లు, రెండు మోచేతులు పచ్చలు పచ్చలైనయ్..! ఓ అంగి చినిగిపొయ్యింది. రెండుజతల స్లిప్పరుశెప్పుల గూడలూడిపొయినయ్…!
ఓనాడు సైకిల్ తొక్కుడు ఒచ్చిందుల్లా…!!

****
సీనుమామ ఆయిన చెయ్యిని సైకిల్ మీంచి తీశేసి “ఇంగపొయ్యి రా పో..!” అన్నడు. నేను పస్నూరు బాటమీద ఒక్కణ్ని సైకిల్ తొక్కుడు షురూ జేశిన..
మగమహారాజు సీన్మల చిరంజీవి లెక్క “నీ దారి పూలదారీ, పోవోయి బాటసారీ..” ఎమోషన్ల పాడుకుట్ట పోతున్న. కండ్లు రోడ్డును సూస్తున్నయి గాని, ఆటిముందల ఇంకేంటేంటిదో ఆడుతుంది. సైకిండ్లు తొక్కే దోస్తులతోని నేను సైకిల్ తొక్కుడు పోటీ వెట్టుకున్నట్టు…, ఆల్లు ఓడిపోతున్నట్టు…, రాజీవ్ గాంధీ మా ఊరొచ్చి నాకు లేపాక్షి వొయ్యినోటుపుస్కం ప్రజెంట్ చేశినట్టు…, “నన్ను ఢిల్లీల సైకిల్ మీద దింపవా…?” అని ఆయిన అడిగితె నేను “దింపుత సార్..!” అన్నట్టు…, రామగిరి చౌరస్తా కాడికెల్లి క్లాక్ టవర్ దాంకా రప్పరప్ప సైకిల్ తొక్కినట్టు ఊహలు కానొస్తున్నయ్…!

ఇంతల ప్రకాశం బజార్ల నేను సైకిలు తొక్కుతుంటె, ఎదురుగ్గ మా ఇస్కూలు హెడ్ మాస్టరు నరసిమ్మరావు సారు యెజ్డీ బండి మీద ఎదురొచ్చి నన్ను చూశి శెయ్యూపినట్టు నాకు ఓ ఆలోచనొచ్చింది. నేను గుడ్క నమస్తే చెప్పుకుట్ట శెయ్యూపాలె గద..? అందుకని ఎడమశేత్తోని హ్యాండిల్ను పట్టుకొని కుడిశెయ్యిని గాలిల ఊపిన…!

అప్పుడప్పుడే సైకిల్ తొక్కుడు నేర్సుకుంటున్నోడు చెయ్యిడిశిపెడితె బ్యాలెన్సు ఏడికెంచయితది…? సైకిలు బాట పక్కనున్న ఎండిపొయిన కాల్వలకు జర్రునవొయ్యి, దబక్కున అది పడి నన్ను పడేశింది. ఆ కాల్వల మొత్తం కంపశెట్లు. రెండు టైర్లు పంచరైనయి. నాకు పెయి నిండ ముండ్లు మస్తుగనం గుచ్చుకున్నయి. లేపేటోడెవ్వడు లేడు.

అట్లనే కొంచెంశేపు కూసోని, ఆ సైకిలును కాల్వలకెంచి బైటికి గుంజి, దాన్ని నూక్కుంట నూక్కుంట నిదానంగ ఊర్లకొచ్చిన. సీనుమామ సైకిలు ఖరాబయ్యింది కాబట్కె, ఇంకో ఇరువై మామిడి కాయ ముక్కలు తీసుకుండు.
ముచ్చట తెలిశిన మా నాయిన ఇంక నాలుగు దెబ్బలేశిండు.
మా అమ్మ ఆ దెబ్బలకు మందురాశింది.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అసలు సమస్యలు వేరు… అవి వదిలేసి బీజేపీ హైకమాండ్ తంటాలు…
  • వాడొకడు, వీడొకడు… ఏం మోపైనార్రా భయ్… అసలెవర్రా మీరంతా…
  • కాంచి- బొంగు- సీటు … సైకిల్- ఈత నేర్వనోడు అప్పట్లో శుద్ధ మొద్దు…
  • AI పై భయమొద్దు… పనికి ఢోకా లేదు, పని తీరు మారుతుంది… అంతే…
  • జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై కేటీయార్ కవరింగులు- సన్నాయి నొక్కులు..!!
  • డీకే బలంగా నమ్మే ఒకే ఒక పేరు..! ఇంతకీ ఈ గంగాధర అజ్జయ్య ఎవరు..?
  • అమీర్ ఖాన్ మూడో భార్య గౌరి..! ఆమె కుటుంబ నేపథ్యం ఇంట్రస్టింగ్..!!
  • డాన్-3 కంట్రవర్సీ..! అది కార్మిక సంఘమా..? పెదరాయుడు కోర్టా..?
  • పవన్ కల్యాణ్‌కు తెలంగాణ నిజతత్వం తెలిసింది… మాట మారింది…
  • నీరు- నెత్తురు… పాకిస్థాన్‌కు బుద్దిచెప్పే దిశలో హైడల్ ప్రాజెక్టులు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions