.
ఒక వీడియో… పరిగి బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీయార్ భేటీ… అర్థంతరంగా వెళ్లిపోతున్న కార్యకర్తలు… ఎందుకు వెళ్లిపోతున్నారు, కూర్చొండి, వినండి అని కేటీయార్ బతిమిలాడుతున్న దృశ్యం…
మరో వీడియో… బాల్క సుమన్ బీఆర్ఎస్ కార్యకర్తలతో ఏదో సింగరేణి ఏరియాలో భేటీ… ఉద్యమాలకు పిలుపు ఇస్తున్నా రైతులు రావడం లేదు, మనవాళ్లే చేయాల్సి వస్తోందని ఆ వీడియోలో చెబుతున్న దృశ్యం…
Ads
ఇంకో వీడియో… పదేళ్లలో కార్యకర్తల్ని పట్టించుకోని మాట, వాళ్ల అసంతృప్తి నిజమే. మళ్లీ అధికారంలోకి వస్తాం, ఆ తప్పులు మళ్లీ జరగనివ్వను, నాదీ భరోసా అని కేటీయార్ చెబుతున్న దృశ్యం…
…. బీఆర్ఎస్ పార్టీ ట్రూ సిట్యుయేషన్ ఇది. ప్రజలు స్పందించడం లేదు. కార్యకర్తల్లోనూ బాగా అసంతృప్తి ఉంది. వెరసి ప్రభుత్వ వ్యతిరేకతను పెంచడానికి, ఎంతోకొంత పార్టీ బలం పెంచడానికి బీఆర్ఎస్ ముఖ్యులు కేటీయార్, హరీష్ రావు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎంత ప్రయాసపడుతున్నా ఫలితం రావడం లేదు.
కేసీయార్ ఫామ్ హౌజు వీడి రావడం లేదు, పుణ్యకాలం గడిచిపోయింది, నన్ను ఓడిస్తారా అనే అహంతో జనం మీదే అలిగాడు కదా, ఇక ఇప్పుడు జనంలోకి వచ్చినా ఫాయిదా ఏమీ లేదనే భావన ఆ పార్టీ కార్యకర్తల్లోనూ కనిపిస్తోంది. జనం సమస్యలు పట్టని, జనంలోకి రాని, గెలిపిస్తేనే జనం అనే కేసీయార్ ధోరణి అచ్చంగా ఓ ‘ప్రజాజీవిత నైతికత’కు వ్యతిరేకం.
ఇదుగో బస్సు యాత్ర, అదుగో మళ్లీ జనంలోకి వస్తున్నాడు అనే ప్రచారాల్ని తీసుకురావడం తప్ప కేసీయార్ ఇల్లు కదలడు. ఊదు కాలదు, పీరు లేవదు. నిన్న ఎక్కడో కేటీయార్ చెబుతున్నాడు, మేం చెబుతున్నది కేసీయార్ మాటల్నే అనే. అదేదో కేసీయారే ఎందుకు చెప్పడు మరి? ఇది ప్రతిపక్షం బలంగా ఉండాలని కోరుకునే తటస్థుల కోరిక కూడా!
మళ్లీ జనం తీటకు వాళ్లే మనల్ని గెలిపిస్తారులే అనే కేసీయార్ భావన, అలక్ష్య ధోరణి ఆ పార్టీ కార్యకర్తల్లోనూ నైరాశ్యాన్ని మరింతగా నింపుతోంది. అందుకే ప్రతి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పరాజయ పరంపర కొనసాగుతూనే ఉంది.
రోజుకు ఏవో నాలుగు అంశాలు తీసుకుని, బోలెడు ఆరోపణల్ని గాలి పోగేసి, రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, తిడుతూ… ప్రెస్ మీట్లు, పార్టీ సోషల్ మీడియా, పార్టీ మీడియా, ట్వీట్లతో కేటీయార్, హరీష్ రావు మీడియాలో కనిపిస్తున్నా, కోట్లకుకోట్లు ఖర్చు చేస్తున్నా, ఫీల్డులో మాత్రం జనం స్పందించడం లేదు, అసలు సొంత పార్టీ కార్యకర్తల్లోనే స్పందన లేదు, పైగా కౌంటర్ ప్రొడక్ట్ అవుతోంది అని బీఆర్ఎస్ నేతల మాట్లలోనే ధ్వనిస్తోంది.
ఆ ఇద్దరి విమర్శలు కూడా రోజురోజుకూ తేలిపోతున్నాయి. విశ్వసనీయత ఉండటం లేదు. వీటికితోడు వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీచేస్తాయని… అవగాహనో, పొత్తో, విలీనమో తప్పదనే సందేహాలు పార్టీ కేడర్‌లో ఇంకా బలంగానే ఉన్నాయి. పెరుగుతున్నాయి. ఎవరికీ ఏ క్లారిటీ లేదు, దాంతో అనేకచోట్ల నియోజకవర్గ స్థాయి లీడర్లు కూడా నిరాసక్తంగా, పార్టీ యాక్టివిటీ ఏమీ పట్టకుండా ఉండిపోతున్నారు.
కవిత వెళ్లిపోయింది- కాదు, వెళ్లగొట్టారు… పార్టీ అధ్యక్షుడు కేసీయార్ బయటికి రాడు- ఎటు చూసినా ఆ ఇద్దరే. హరీష్ రావు, కేటీయార్..! పేరుకు హరీష్ రావు పైకి ప్రముఖంగా కనిపిస్తున్నా, పార్టీ ఉత్తరాధికారి, నిజవారసుడు కేటీయారే. కానీ కార్యకర్తల్లో భరోసా నింపే విషయంలో కేటీయార్ తేలిపోతున్నాడు. కేసీయార్ యాక్టివ్‌గా ఉన్న రోజులు వేరు. కానీ ఇప్పుడు? అసలు ఎవరు ఫేస్ ఆఫ్ ది పార్టీ?
Share this Article