.
దేన్ని ఎవరు, ఎందుకు వివాదంగా మలుస్తారో అర్థం కాదు… వివాదం అవుతుందనీ తెలిసి కొందరు ఎందుకు మారరో అర్థం కాదు… సున్నితమైన విషయాల పట్ల క్రియేటర్లు ఎందుకు జాగ్రత్తలు పాటించరో అర్థం కాదు…
ఈమధ్య ఏం జరిగిందంటే..? ఆగస్టు 8, 2026 న కోల్‌కతాలోని తాలా పార్క్ ఏరియాలో ఉన్న ‘మోహిత్ మోయిత్రా మంచా’ ఆడిటోరియంలో ఒక స్టేజ్ షో… నిత్య… ఫ్యాకల్టీ ఆఫ్ సైట్” (Nitya – Faculty of Sight) అనే డ్యాన్స్ గ్రూప్ ‘మహావిద్య’ అనే పౌరాణిక నృత్య రూపకాన్ని ప్రదర్శించింది…
Ads
ఈ ప్రదర్శనలో వేదికపైకి వచ్చిన ఓ మహిళా డాన్సర్, ఒంటిపై దాదాపు బట్టలేమీ లేనట్టుగా కనిపించే ఆహార్యంతో డాన్స్ చేసింది… దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి… హిందూ దేవతలను ఇలాంటి అపవిత్రమైన, గౌరవం లేని దుస్తులలో ప్రదర్శించడం హిందువుల మతపరమైన భావాలను దెబ్బతీస్తోందని పెద్ద ఎత్తున నెటిజన్లు, వీక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు…

సోషల్ మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత (బ్యాక్‌లాష్) రావడంతో నిర్వాహక బృందం అధికారికంగా క్షమాపణలు చెప్పింది. కొన్ని కథనాల ప్రకారం… ‘‘సదరు డాన్సర్ చాలా సీనియర్ కావడంతో తన సృజనాత్మకతకు (క్రియేటివ్ ఫ్రీడమ్‌కు) తాము పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం… కానీ ఇలా అవుతుందని అనుకోలేదు’’ అని ఓ సాకు చెప్పారు… ఈ ఘటన భారతదేశంలో కళాత్మక స్వేచ్ఛకు, మతపరమైన విశ్వాసాలకు మధ్య ఉండే సరిహద్దులపై మరోసారి పెద్ద చర్చకు దారితీసింది…
నిజానికి ఆ నిర్వాహకులు ఏం చెప్పారో, మీడియాలో ఎలా రిపోర్టయిందో సరిగ్గా తెలియదు గానీ… ఆ వేషధారిణి డాన్స్ చేసిన పాత్ర కాళికాదేవిది కాదు… అది ఛిన్న మస్తా దేవి రూపం… (దశమహావిద్యలలో ఆరవ రూపం)… ఆ స్టేజ్ షో పేరు కూడా మహావిద్య… అంటే దశమహా విద్యలకు సంబంధించిన షో అది…
దశమహావిద్యలలో ఛిన్నమస్తా దేవి అత్యంత భయంకరమైన, రహస్యమైన రూపం కలిగి ఉంటుంది. ఆమె తన స్వహస్తాలతో తన తలను తానే నరుక్కుని, ఆ తలను చేతిలో పట్టుకుని ఉంటుంది.
శాస్త్రాల ప్రకారం ఈ దేవి దిగంబరి (వస్త్రాలు లేని రూపం). ఆమె మెడలో పుర్రెల దండ, నడుముకు తెగిపడిన చేతుల మొలతాడు ఉంటాయి. ఈ దేవి ప్రాణాన్ని ఇచ్చే, ప్రాణాన్ని తీసే విశ్వశక్తికి ప్రతీక. “సంప్రదాయ ఛిన్నమస్తా ఐకానోగ్రఫీ” ఆమె వస్త్రరహితం… వేదికపై ఆ డ్యాన్స్ గ్రూప్ ప్రదర్శించాలనుకున్నది కూడా సరిగ్గా ఈ రూపమే.
సాధారణ ప్రజలకు దశమహావిద్యలలోని ఛిన్నమస్తా దేవి రూపం గురించి పూర్తి అవగాహన ఉండదు. సోషల్ మీడియాలో అందరూ దీనిని ‘కాళి దేవి’ రూపంగానే భావించారు. కానీ..?
పురాణ చిత్రాలలో లేదా తాంత్రిక పూజల్లో ఛిన్నమస్తా దేవిని దిగంబరంగా చూపించడం వెనుక ఎంతో ఆధ్యాత్మిక అంతరార్థం ఉంటుంది. కానీ, దానిని ఒక పబ్లిక్ స్టేజ్ షోలో, దాదాపు నగ్నంగా అనిపించేలా బాడీ సూట్ ధరించి ప్రదర్శించడం వల్ల సాధారణ వీక్షకులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది, అదే జరిగింది, వివాదానికి దారితీసింది. నా దృష్టిలో ఇక్కడ నిర్వాహకులదే తప్పు…

ఇక్కడే మరో ప్రస్తావన… రాజమౌళి భారీ ఎత్తున తీస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసిలోనూ ఛిన్న మస్తాదేవి ఉంటుంది… పైన కనిపించే ఫోటో ఆ సినిమా ట్రెయిలర్/ టీజర్‌లోనిదే… అది చిన్న మస్తాదేవి రూపమే… భీకరంగా కనిపిస్తూ, తన తలను తానే నరుక్కుని చేత్తో పట్టుకుని ఉంటుంది… దశ మహావిద్యలలో ఇదే భీకరమైన ఐకానోగ్రఫీ!!
చివరగా ఓ ట్విస్టు ఏమిటంటే..? ఈమధ్య పలు కంట్రవర్సీలకు తెరలేపుతున్న బీజేపీ నాయకురాలు మాధవీలత దీనిపైనా ఓ పోస్టు పెట్టింది… ఏమనీ అంటే..? ఆ వేషం కట్టింది మహిళా డాన్సర్ కాదు, మగ డాన్సర్ అని..!!
Share this Article