.
భారత్‌ను మట్టికరిపించిన భారతీయుడే! రాజస్థాన్ నుంచి ఐర్లాండ్ వరకు జై మూంద్ర అద్భుత ప్రయాణం
ఒకప్పుడు రాజస్థాన్‌లో క్రికెట్ ఆడిన యువకుడు… చదువు కోసం ఐర్లాండ్ వెళ్లాడు. ఐటీ ఉద్యోగం చేస్తూనే క్రికెట్ కలను వదల్లేదు. ఇప్పుడు అదే యువకుడు ఐర్లాండ్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసి, ప్రపంచ ఛాంపియన్ భారత జట్టునే సిరీస్‌లో ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. అతడే జై మూంద్ర.
Ads
భారత్‌పై టీ20 సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న ఐర్లాండ్ విజయానికి జై మూంద్ర హీరోగా నిలిచాడు. తొలి అంతర్జాతీయ సిరీస్‌లోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులను గెలుచుకుని ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు.
తనే కాదు, వరల్డ్ క్రికెెట్ అంటేనే ఇండియన్స్ లేదా ఇండియన్ రూట్స్… ఓసారి ‘ముచ్చట’ పాత స్టోరీ చదవండి దిగువ లింకులో…
వరల్డ్ క్రికెట్ అంటేనే ఇండియా… విదేశీ జట్లలో ఏకంగా 40 మంది మనోళ్లే..!!
భారత్‌కు ఊహించని షాక్…
2023 నుంచి వరుసగా 16 టీ20 అంతర్జాతీయ సిరీస్‌లు గెలిచిన భారత జట్టుకు ఐర్లాండ్ పెద్ద షాక్ ఇచ్చింది. తొలి మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో ఓడించిన ఐర్లాండ్, రెండో మ్యాచ్‌లో 155 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంటూ భారత్‌ను 153/9కే పరిమితం చేసింది. కేవలం ఒక పరుగుతో విజయం సాధించి సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
ఈ చారిత్రక విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది జై మూంద్ర బౌలింగ్…
జై మూంద్ర ఎవరు?
1997 జనవరి 10న రాజస్థాన్‌లోని టోంక్ పట్టణంలో జన్మించిన జై మూంద్ర, 2021లో ఉన్నత విద్య కోసం ఐర్లాండ్ వెళ్లాడు. డబ్లిన్‌లోని టెక్నాలజికల్ యూనివర్సిటీ డబ్లిన్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్ పూర్తి చేశాడు.
చదువుతో పాటు ఐటీ రంగంలో ఉద్యోగం చేస్తూనే క్రికెట్‌పై తన ఆసక్తిని కొనసాగించాడు. డబ్లిన్‌లోని లీన్‌స్టర్ క్రికెట్ క్లబ్లో చేరి తన ప్రతిభను మెరుగుపరుచుకున్నాడు.
ఎడమచేతి బ్యాటర్, ఎడమచేతి ఫాస్ట్- మీడియం బౌలర్ అయిన మూంద్ర, దేశీయ క్రికెట్‌లో లీన్స్టర్ తరఫున రాణిస్తూ ఐర్లాండ్ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు.

దేశీయ క్రికెట్ నుంచి అంతర్జాతీయ అరంగేట్రం వరకు….
2024 ఆగస్టులో నార్త్ వెస్ట్ వారియర్స్‌పై లీన్స్టర్ తరఫున టీ20 అరంగేట్రం చేశాడు. 2025 మేలో మన్‌స్టర్ రెడ్స్‌పై తన తొలి లిస్ట్-ఏ మ్యాచ్ ఆడాడు.
దేశీయ టోర్నీల్లో నిలకడగా రాణించిన మూంద్రకు 2026లో జరిగిన ఎమరాల్డ్ ఛాలెంజ్ ఫస్ట్‌క్లాస్ టోర్నీలో అవకాశం లభించింది. అక్కడి ప్రదర్శనే అతడికి భారత్‌తో టీ20 సిరీస్‌కు ఐర్లాండ్ జట్టులో చోటు కల్పించింది.
తొలి బంతికే సంజూ వికెట్….
2026 జూన్ 26న బెల్‌ఫాస్ట్‌లో జరిగిన తొలి టీ20తో జై మూంద్ర అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. తన మొదటి అంతర్జాతీయ బంతికే సంజూ శాంసన్‌ను ఔట్ చేసి అరుదైన ఘనత సాధించాడు.
ఆ మ్యాచ్‌లో అతడి బౌలింగ్ ఐర్లాండ్‌కు భారత్‌పై ఏ ఫార్మాట్‌లోనైనా తొలి విజయాన్ని అందించడంలో కీలకంగా మారింది.
రెండో టీ20లో కూడా అతడు 32 పరుగులకే మూడు వికెట్లు తీసి భారత్ బ్యాటింగ్‌ను కుదేలు చేశాడు. దీంతో ఐర్లాండ్ చారిత్రకంగా సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.
భారత మూలాలు… ఐర్లాండ్ విజయగాథ…
జై మూంద్ర ఇప్పటికీ భారత మూలాలు కలిగిన ఆటగాడే. రాజస్థాన్‌లో పుట్టి పెరిగిన అతడు, చదువు కోసం ఐర్లాండ్ వెళ్లి అక్కడే తన క్రికెట్ ప్రతిభతో జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. (ఇప్పటికీ ఇండియన్ పాస్‌పోర్టు ఉందంటారు. ఐర్లాండ్ పౌరసత్వంతోపాటు)
తొలి అంతర్జాతీయ సిరీస్‌లోనే ప్రపంచ ఛాంపియన్ భారత జట్టును ఓడించడంలో కీలక పాత్ర పోషించడం ద్వారా జై మూంద్ర పేరు ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అతని ప్రయాణం ప్రతిభ, పట్టుదల, అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ప్రపంచ వేదికపై ఎలా మెరవొచ్చో చూపించే గొప్ప ఉదాహరణగా నిలిచింది.
Share this Article