.
పదేళ్లలో స్వరాష్ట్రాన్ని అనేకరకాలుగా ఉద్దరించామని కదా బీఆర్ఎస్ క్లెయిమ్..? విద్యారంగంపై కేసీయార్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని కనబరిచింది, ప్రాథమిక విద్యను కూడా గాలికి వదిలేసింది. ఇది ఏదో ప్రత్యర్థి పార్టీ చేసే ఆరోపణ కాదు… సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటులో వెల్లడించిన వివరాలు…
ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాథమిక విద్యారంగాన్ని తిరిగి గాడిన పడేసేందుకు తెలంగాణ మోడల్ పబ్లిక్ స్కూల్స్, క్లస్టర్ స్కూల్స్ అనే ఉపయోగకర కాన్సెప్టుతో అడుగులు వేస్తుంటే, దాన్ని కూడా విమర్శిస్తున్నారు రాజకీయ కోణంలో… ఓసారి కేంద్రం ఏమంటుందో చూద్దాం…
Ads
నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ (NSSO) నిర్వహించిన ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే’ (PLFS) 2023-24 నివేదిక ప్రకారం, భారతదేశంలో 7 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో అక్షరాస్యత రేటు 80.9 శాతం కాగా తెలంగాణలో ఇది 76.90 శాతం మాత్రమే. (దిగువన ఇచ్చిన లింక్‌లో రాష్ట్రాలవారీగా శాతాల్ని చూడొచ్చు)
_loksabhaquestions_annex_185_AU100_a0extZ
కేరళ: 95.30% , మిజోరం: 98.20% , లక్షద్వీప్: 97.30% , నాగాలాండ్: 95.70% … చిన్న చిన్న ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చాలా నయం… ఇన్నాళ్లూ మనం ఆదర్శంగా ఊదరగొడుతున్న కేరళను కూడా దాటేసి పోయాయి… సొసైటీలోని పేదరికం, లింగ వివక్ష, సామాజిక అసమానతల కారణంగా ఈరోజుకూ మన దేశంలో 20 శాతం అక్షరాలకు దూరంగా ఉండిపోవడం ఓ విషాదమే.
ఐతే అభివృద్ధి సూచికల్లో మేం బాగా ముందున్నామహో అని చాటింపు వేసుకునే దక్షిణ రాష్ట్రాలు కూడా ప్రాథమిక విద్యపై నిర్లక్ష్యాన్ని కనబరిచాయి… తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే… పదేళ్ల కేసీయార్ పాలనా నిర్లక్ష్యం కారణంగా మనం ఎక్కడో దిగువన ఉండిపోయాం అక్షరాస్యత శాతంలో… 31వ ప్లేసు…
కుల, బూతు రాజకీయాలు తప్ప మరేమీ పట్టని ఏపీ తెలంగాణకన్నా కూడా దిగువన ఉండిపోయింది (36వ ప్లేసు)… కేవలం 72.6 శాతం మాత్రమే… పదే పదే మనం వెక్కిరిస్తున్న బీహార్, చత్తీస్‌గఢ్, ఒరిస్సా, యూపీలకన్నా దిగువన… జాబితాలో చిట్టచివరన! (విడిపోతే తెలంగాణ ఘోరంగా నష్టపోతుంది, మేం బాగుపడతాం అన్నది వీళ్లే కదా..!! ) అక్షరక్రమంలో టాప్- అక్షరాస్యతలో లాస్ట్

ULLAS పథకం…: 100% అక్షరాస్యత లక్ష్యంగా భారత ప్రభుత్వం 2022 నుంచి 2027 వరకు ‘ఉల్లాస్’ (ULLAS: Nav Bharat Saaksharta Karyakram) అనే పథకాన్ని అమలు చేస్తోంది. ఇది 15 ఏళ్లు పైబడిన, అధికారిక విద్యను అందుకోలేని వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. ఏదైనా రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం 95% అక్షరాస్యతను సాధిస్తే, దానిని ‘పూర్తి అక్షరాస్యత’ కలిగిన ప్రాంతంగా ప్రకటిస్తారు.
ఏపీలో ఈ వైఫల్యానికి, పదేళ్లలో జరిగిన నష్టానికి జగన్, చంద్రబాబుల్లో ఎవరిది ప్రధాన బాధ్యతో చెప్పడం కష్టం. కనీసం జగన్ కాలంలో బడుల రూపురేఖలు మార్చి, ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి ఏదో కొంత ప్రయత్నం జరిగింది గానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రాథమిక విద్యను మరీ అప్రధానరంగం చేసేసింది… పైగా మేం దేశానికే రోల్ మోడల్ అని గప్పాలు… డొల్ల, రోల్డ్ గోల్డ్ మోడల్…
ఇంకా ఇంకా పిల్లల్ని కనండి, 10 వేలిస్తాం, 20 వేలిస్తాం అనే ఊకదంపుడు, యూజ్‌లెస్ నినాదాలు కాదు… ఉన్న పిల్లల్ని ఏం ఉద్దరిస్తున్నామనేది కదా అసలు ప్రశ్న! రాబోయే తరాల భవిష్యత్తుకు సంబంధించిన కీలకాంశం 2014 నుంచి 2024 వరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ప్రాధాన్యాంశం ఎందుకు గాకుండా పోయింది..? (టీడీపీ, బీఆర్ఎస్, వైసీపీ… మూడూ ప్రాంతీయ పార్టీలే)…
ఈ రోజుల్లోనూ 20, 30 శాతం పిల్లలు స్కూల్ మొహం చూడటం లేదంటే… నిజంగా మనం ఎక్కడున్నట్టు? ఆత్మవిమర్శ చేసుకోవల్సిన సమయం!!
Share this Article