.
తెలుగుకు సంగీత మకుటం బాలమురళీకృష్ణ… ‘కర్ణాటక సంగీతం సంగతి’ శ్రీమాన్ మంగళంపల్లి బాల మురళీకృష్ణ. ఇవాళ బాలమురళీకృష్ణ జయంతి. కర్ణాటక సంగీత వైతాళికుడు బాలమురళీకృష్ణ.
1910 తరువాత కర్ణాటక సంగీతం వికలమైపోయి జనాదరణకు దూరమైపోయింది. ఆ తరుణంలో దాన్ని బతికించి, జనాళి ఆమోదాన్ని , ఆదరణను పొందేట్టు చేసిన మేధావంతమైన కళాకారులు మహారాజపురం విశ్వనాద(థ) అయ్యర్, చెంబై వైద్దియనాద(థ)బాగవదర్ (భాగవతార్), జీ.ఎన్.బాలసుబ్రహ్మణియన్, అరియక్కుడి రామానుజ అయ్యంగార్, సెమ్మఙ్గుడి (సెమ్మంగుడి) శ్రీనివాస అయ్యర్. ఈ ఐదుగురూ తమ మేధతో, గాన ప్రతిభతో కర్ణాటక సంగీతానికి విభవాన్ని తీసుకు వచ్చారు.
Ads
అటు తరువాత బాలమురళీకృష్ణ కర్ణాటక సంగీతానికి పెను ఊపును తీసుకు వచ్చారు. కర్ణాటక సంగీతంలో ఒక ఉద్ధృతి, ఒక వెల్లువ బాలమురళీకృష్ణ.
- ఒక దశలో బాలమురళి పాడేది సంగీతం కాదని మద్రాస్ కోర్ట్ లో కేసు కూడా జరిగింది! ఆ కేసులో బాలమురళి విజయం సాధించారు. బాలమురళి విజయం కర్ణాటక సంగీతం విజయం. బాలమురళి స్ఫూర్తిగా ఎందరో గాయకులు వచ్చారు. ఆయన ఆదిగా కర్ణాటక సంగీతంలోకి విశేషమైన మేధ వచ్చింది.
బాలమురళి వేదిక ఎక్కగానే సరస్వతి వారిని అవహిస్తుంది. వారు సంగీతం పాడరు. వారిని సంగీతం పాడుకుంటుంది. మామూలుగా శాస్త్రీయ సంగీత గాయకులు కఠోరమైన సాధన చేస్తారు. బాలమురళి చెయ్యరు. సభలో పాడడానికి కూర్చున్నాక, గళం విప్పాక వారి నుంచి సంగీతం వచ్చేస్తుంది. ఆదిభట్ల నారాయణ దాసు తమ హరిశ్చంద్రోపాఖ్యానంలో “నా నాల్క యద్దంబున బూని నిన్నే చూచుకో” అని అమ్మవారిని కోరుకుంటారు. మఱి బాలమురళి కూడా అలా అమ్మవారిని కోరుకున్నారేమో? బాలమురళి నాలుకపై సంగీత సరస్వతి తనను తాను చూసుకునేదేమో?
బాలమురళి సంగీతంలో ఒక బాలమేధావి ఆపై నిజ విద్వత్, విశేష సృజనాత్మకత ఉన్నవారు. బాలమురళి ఒక శాస్త్రీయ సంగీత పరిశోధకులు. కర్ణాటక సంగీతంలో వారు ఒక విప్లవం. బాలమురళి సంగీతంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. తన ప్రయోగశీలత్వంతో కొత్త రాగాల్ని కనిపెట్టారు. తాళగతి సూక్ష్మ భేదాలను కూడా దర్శించి అమలులోకి తెచ్చారు. బాలమురళి సంగీత స్రష్ట, ద్రష్ట. గానం మాత్రమే కాదు వైఅలిన్, వీణ, పిల్లనగ్రోవి, మృదంగం వంటి కొన్ని వాయిద్యాలను బహు నేర్పుతో వాయించేవారు బాలమురళి.
ఒక బాలమేధావిగా బాలమురళి తన సంగీత పయనాన్ని మొదలుపెట్టారు. వేలాది కచేరీలుగా వారి గాన గమనం సాగి, సాగి పలు ఎత్తులను ఆలింగనం చేసుకుంది. ‘కర్ణాటక సంగీతం సంగతి’ మాత్రమే కాదు
లోక గానంలో, గాన లోకంలో బాలమురళి ఒక విశిష్టమైన గమకం!
బాలమురళి కర్ణాటక సంగీతాన్ని, గానవిధానాన్ని చేపట్టిన తీరు మేధాత్మకం; ప్రజ్ఞాత్మకం; మహోన్నతం. రాగ, స్వర, తాళ మయంగా మాత్రమే కాదు భావమయంగానూ కర్ణాటక సంగీతాన్ని పాడారు బాలమురళి. స్వరాల్ని మాత్రమే కాదు సాహిత్యాన్నీ పాడారు బాలమురళి. విద్వత్తుతో పాటు విజ్ఞతతోనూ పాడారు బాలమురళి.
ఒకదశలో మనదేశంలో హిందూస్థానీ శాస్త్రీయ సంగీత గాయకులే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. ఆ దశలో బాలమురళి తన మేధతో, ప్రతిభతో, ప్రజ్ఞతో, ప్రౌఢిమతో హిందూస్థానీ శాస్త్రీయ సంగీత గాయకులు అమీర్ ఖాన్, అజయ్ చక్రవర్తి, భీమ్ సేన్ జోషీ వంటి ఉద్దండులకు సమ ఉజ్జీ అయ్యారు. వాళ్లతో జుగల్ బందీలు చేసి రసజ్ఞుల చేత షాభాష్ (శెహభాష్ లేదా శభాష్ అనడం సరికాదు) అనిపించుకున్నారు. ఒక కర్ణాటక సంగీత గాయకుడుగా బాలమురళి జాతీయ, అంతర్జాతీయ ప్రాచుర్యాన్ని, ఖ్యాతిని పొందారు.
సాహిత్యాన్ని చంపకుండా, జిడ్డు లేకుండా గొప్పగా పాడగలిగిన వారు ఆయన. సంగీతంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. తొలిదశలో జీ.ఎన్. బాలసుబ్రహ్మణ్యన్ గానాన్ని ఆదర్శంగా తీసుకున్న బాలమురళి తరువాతి కాలంలో కర్ణాటక సంగీత గానానికి అవసరమైన ఆదర్శమయ్యారు. కర్ణాటక సంగీతాన్ని తన గానంతో ఉజ్జ్వలనం చేశారు. బాల మురళి గాత్రం baritone. తన baritoneతో కర్ణాటక సంగీతానికి విశేషమైన శోభను తీసుకువచ్చారు బాలమురళి.
(Baritone అంటే పురుష గాత్రం; ఘంటసాలది మాత్రమే పురుష గాత్రం అన్న అజ్ఞానం నుంచి తెలుగు మధ్యతరగతి మాంద్యం 2026లోనైనా ‘చదువు’తో, అవగాహనతో బయటకు రావాలి. అంతేకాదు గాత్రం, గానం, సంగీతజ్ఞత, విద్వత్, సార్వజనీనత పరంగా బాలమురళి స్థాయి, స్థానం ఘంటసాలకు లేవు. అన్ని రకాలుగానూ బాలమురళిలో 10% శాతం కూడా కాదు ఘంటసాల.
కాలం చెల్లిన అభిప్రాయాలను, అజ్ఞానాన్ని, చెడ్డతనాన్ని వదిలేసుకుని తెలుగు మధ్యతరగతి బుద్ధి మాంద్యం ఈ 2026లోనైనా ఇతర భాషల వాళ్లలా గొప్ప సంగీతంలోకి వెళ్లాలి. ఘంటసాల అభిమానుల్లో కొందరు మానసిక రోగులు ఉన్నారు. ఆ మానసిక రోగులు బాలమురళిని ఆడిబోసుకోవడం గర్హనీయం. బాలమురళిని అభిశంసించడం ఆన్నది ఒక్క తెలుగు మూర్ఖులు, అజ్ఞానులు, రసజ్ఞతా హీనులు మాత్రమే చెయ్యగల ఘోరం. తమిళ్ష్, కన్నడం, మలయాళం వంటి ఏ ఇతర భాషల వాళ్లూ తెలుగు మూర్ఖలలా బాలమురళిని అభిశంసించ లేదు. ఘంటసాల అభిమానుల వల్ల తెలుగు పాటకు, తెలుగులో సంగీతానికి పెను హాని జరిగింది.)
మేధ… మేధ…మేధ... బాలమురళి అన్న మేధ కర్ణాటక సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసింది. బాలమురళి వేదికపై పాడుతున్నప్పుడు ప్రేక్షకుల్ని చూస్తూ, చిరునవ్వుతో పాడుతున్నట్టుగా ఉంటుంది. కానీ అది ప్రేక్షకుల్ని చూస్తూ చిరునవ్వు నవ్వడం కాదు.
ఆయన తాను పాడుతున్న రాగాన్ని చూస్తూ, ఆ రాగానికి తన చిరునవ్వుతో అభివాదం చేస్తూ పాడడం! తాను పాడుతున్న రాగాన్ని దర్శిస్తూ పాడతారు బాలమురళి!! (ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఆంతరంగీక చర్చల్లో కొందరితో తెలియజేశారు)
మహోన్నతమైన విషయం ఇది.
‘గానమో, సంగీతమో స్వరాలకు పైన ఉంటుంది’. ఆ తెలివిడి ఉన్నవారు, ఆ రహస్యం తెలిసినవారు బాలమురళి. పాడుతున్నది స్వరాలనే… కానీ ఆ స్వరాలకు పైన సంచరించడం బాలమురళి నైజం; విశిష్టత. కర్ణాటక సంగీతంలో మనోధర్మ సంగీతం అనేది ఉంటుంది. (ఇక్కడ మనోధర్మం అంటే mood అని కాదు) ఆ మనోధర్మ సంగీతంలో బాలమురళి మహనీయులు!
బాలమురళి బెంగాలీ రవీంద్ర సంగీతాన్ని గొప్పగా పాడారు. బాలమురళి పాడిన భద్రాచల రామదాసు కీర్తనలు ప్రశస్తమైనవి. అన్నమయ్య కీర్తనల్నీ ప్రశస్తంగా పాడారు బాలమురళి.
బాలమురళీకృష్ణ సినిమా పాటలూ పాడారు. బాలమురళి పాడిన తెలుగు, తమిళ్ష్, కన్నడం, సంస్కృతం భాషల సినిమా పాటలన్నీ గొప్పగా రాణించాయి. కొన్ని సినిమాలకు సంగీతం చేశారు. సినిమా గాయకుడుగానూ, సంగీత దర్శకుడుగానూ కేంద్ర ప్రభుత్వ పురస్కారాలను పొందారు. హంసగీతె అన్న కన్నడం సినిమాలో పాడినందుకు ఉత్తమ జాతీయ గాయకుడుగానూ, మధ్వాచార్య అన్న కన్నడం సినిమాకు సంగీతం చేసి ఉత్తమ జాతీయ సంగీత దర్శకుడుగానూ జాతీయ ప్రభుత్వ పురస్కారాల్ని అందుకున్నారు. బాలమురళి సినిమా నటుడు కూడా.
25,000కు పైగా కచేరీలు చేశారు బాలమురళి. ఎన్నెన్నో పురస్కారాల్ని, పలు రాష్ట్ర ప్రభుత్వాల పురస్కరాల్ని, పలు అంతర్జాతీయ పురస్కారాల్ని, పలు బిరుదుల్ని పొందారు. పద్మవిభూషణ్ పురస్కారాన్నీ అందుకున్నారు. భవిష్యత్తులో బాలమురళికి భారతరత్న పురస్కారం తప్పకుండా వస్తుంది.
బాలమురళి విజయవాడ నుండి మద్రాసుకు వెళ్లడంవ ల్ల వారికి, సంగీతానికి మేలు జరిగింది. ఆంధ్రలోనే ఉండి ఉంటే బాలమురళి ఈ మేరకు రాణించి ఉండేవారు కాదు.
(ఒక సందర్భంలో నా చిన్నప్పుడు నేను సభామర్యాదను కూడా పాటించకుండా ఓ పేరున్న గాయకుడి పాటకు పెద్దగా నవ్వేస్తే వారు నన్ను చూస్తూ మెచ్చుకోలుగా చేతి సైగ చెయ్యడం నాకు ఇప్పటికీ ఆశ్చర్యాన్నిస్తుంది. ఆ సంఘటన నాకు నాపై నమ్మకాన్ని కలిగించింది)
బాలమురళి విశేషమైన సంగీత కళాకారుడు, సంగీత వేత్త మాత్రమే కాదు ఓ కవి కూడా. ఎన్నో అద్భుతమైన కీర్తనలు రాశారు. మంచి వచనం రాశారు. తెలుగు, తమిళ్ష్, సంస్కృతం భాషల్లో కీర్తనలు రాశారు. ఆ భాషల్లో వారు రాసిన కీర్తనలు సూర్యకాంతి పేరుతో పుస్తకంగా వచ్చాయి. వారి చేతి రాతతోనే ఆ రచనల పుస్తకం అచ్చయింది. అందులో వారు రాసిన వర్ణాలు, కీర్తనలు, కృతులు, తిల్లానాలు ఉన్నాయి. బాలమురళి తన 15 సంవత్సరాల వయసుకే 72 మేళకర్త రాగాలకూ కృతులు రాశారు.
బాలమురళీకృష్ణ సంగీతం పరంగా భారతరత్న. మంగళంపల్లి బాలమురళీకృష్ణ “సంగీత నిజ విద్వత్ సరళి”. శ్రీమాన్ బాలమురళీకృష్ణ తెలుగుకు సంగీత మకుటం.
రోచిష్మాన్
9444012279
Share this Article