.
మీకు గుర్తుందా..? రీసెంటుగా తెలంగాణ, ఏపీ ఓ కలుపు మందును రెండు నెలలపాటు అమ్మకుండా నిషేధం విధించాయి… దాని పేరు పారాక్వాట్ డైక్లోరైడ్ (Paraquat Dichloride)… ఎందుకంటే..? అది అత్యంత విషపూరితం… ఈ మందు తాగి చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు… తక్కువ పరిమాణంలో శరీరంలోకి చేరినా ప్రాణాంతకం, విరుగుడు (Antidote) కూడా లేదు…
తెలంగాణ, ఏపీలకన్నా ముందే కేరళ, ఒడిశా బ్యాన్ విధించాయి… కానీ రాష్ట్రాల పరిమితి 60 రోజులే, ఇన్సెక్టిసైడ్స్ యాక్ట్, 1968 కింద రాష్ట్రాలకు ఉన్న అవకాశం అంతే… ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇప్పటికే దీనిని నిషేధించాయి. అదే తరహాలో భారతదేశంలో కూడా శాశ్వత నిషేధం విధించాలని వైద్య నిపుణులు, రైతు సంఘాలు కోరుతున్నాయి. కానీ మోదీ ప్రభుత్వం కదలడం లేదు…
Ads
నిజానికి మనల్ని కబళిస్తున్న మరో తీవ్ర అంశం ముందు ఈ పారాక్వాట్ సమస్య చాలా చిన్నది… విచ్చలవిడిగా రసాయనాలు, పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, వీడిసైడ్స్, హెర్బిసైడ్స్ వాడుతున్నాం మనం… దాని ప్రభావంతో రైతుకుటుంబాలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నాయి, సమాజం కూడా… కేన్సర్ కేసులు బాగా పెరగడానికి ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటి…
రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణాల్లో అప్పులు… ఆ అప్పులకు ప్రధాన కారణాల్లో వైద్యం ఖర్చులు… కేస్కేడింగ్ ఎఫెక్ట్… ఇదొక విషవలయం… సరిగ్గా ఈ సబ్జెక్టుతోనే బాలీవుడ్ ఓ మంచి సినిమా నిర్మిస్తోంది… దాని పేరు ‘‘ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్’ (The India Story: Slow Poison in Progress)… దీని విడుదలను అడ్డుకునే ప్రయత్నాలు అప్పుడే ప్రారంభమయ్యాయి… అగ్రి కెమికల్ మాఫియా!

అగ్రో కెమికల్ పరిశ్రమకు చెందిన కొన్ని సంస్థలు, అగ్రి బిజినెస్ సెంటర్ ప్రతినిధులు ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ (టీజర్, పోస్టర్లు) పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమా టీజర్లో “మనం ఆహారాన్ని పండించలేదు, విషాన్ని పండించాము” (We grew poison, not food) వంటి వాక్యాలు వాడటం, భారతీయ వ్యవసాయాన్ని “స్లో పాయిజన్” అని అభివర్ణించడం పట్ల వారు మండిపడుతున్నారు.
టీజర్లో చూపించిన డేటా, గణాంకాలు శాస్త్రీయంగా లేవని, ఇవి భారతీయ వ్యవసాయాన్ని, రైతులకు, డెయిరీ/ పౌల్ట్రీ పరిశ్రమలకు చెడ్డపేరు తెచ్చేలా ఉన్నాయని వారి వాదన. వీరు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)కి ఫిర్యాదు చేసి, సినిమా విడుదలపై స్టే విధించాలని కోరారు.
సినిమా దర్శకుడు చేతన్ డీకే స్పందిస్తూ, ఈ సినిమా పూర్తిగా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించామనీ, ఒక చిన్నారికి క్యాన్సర్ రావడం అనే వ్యక్తిగత ఘటనతో మొదలైన పరిశోధనే ఈ సినిమాకు దారితీసిందని అంటున్నాడు… రసాయనాల వినియోగం ఎంతవరకు ఉండాలో ప్రజలకు అవగాహన కల్పించడమేనని తమ ఉద్దేశమని వివరించాడు… సెన్సార్ బోర్డు నుండి ఎలాంటి కట్స్ (scenes cuts) ఆదేశాలు రాలేదని, తామే స్వయంగా కొన్ని సన్నివేశాలను మెరుగుపరిచామని చెప్పాడు…
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇది ఒక కోర్ట్‌రూమ్ డ్రామా (కోర్టు నేపథ్యంలో సాగే కథ). ఈ చిత్రం జూలై 24, 2026న విడుదల కావాల్సి ఉంది…
Share this Article