.
రాజకీయ నాయకులు, అందులోనూ అధికారంలో ఉన్నవాళ్లు దేన్నయినా భ్రష్టుపట్టించగలరు… అది వాళ్ల నిత్యకృత్యం… చివరకు దైవసన్నిధిని కూడా పంకిలం చేయగలరు… కర్నాటక కొత్త ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఆ కోవలోని వాడే… తిరుమలలో నిత్యహారతి వీక్షణ ప్రోటోకాల్‌ను కలుషితం చేయడానికి రెడీ అయిపోయాడు…
విషయం ఏమిటంటే..? బెంగళూరులోని బనశంకరిలో శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఓ కీలక ప్రకటన చేశాడు… ఇకపై తిరుమల స్వామివారి ఆలయంలో ప్రతిరోజూ నిర్వహించే తొలి హారతిని కర్ణాటకకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, న్యాయమూర్తులు, సీనియర్ ఐఏఎస్-ఐపీఎస్ అధికారులు తదితర ప్రముఖులు ప్రోటోకాల్ ప్రకారం వీక్షించే అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించాడు…
Ads
తిరుమలలో ప్రతి ఉదయం జరిగే తొలి హారతి కర్ణాటక రాష్ట్రానికి ప్రత్యేకమైన చారిత్రక సంప్రదాయంగా కొనసాగుతోంది. దీనికి దాదాపు 400 ఏళ్ల చరిత్ర ఉంది. విజయనగర సామ్రాజ్య రాజులు, అనంతరం మైసూరు వొడయార్ రాజవంశం తిరుమల దేవస్థానానికి బంగారు ఆభరణాలు, భూములు, అలాగే నిత్యపూజలకు అవసరమైన సామగ్రిని విరాళంగా అందించాయి.
మైసూరు సంస్థానం ఆలయ నిత్యపూజల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో, ప్రతి ఉదయం స్వామివారికి సమర్పించే తొలి హారతిని స్వీకరించే గౌరవం మైసూరు రాజవంశానికి దక్కింది. స్వాతంత్ర్యం అనంతరం ఆ సంప్రదాయాన్ని కర్ణాటక ప్రభుత్వం కొనసాగిస్తోంది. సంప్రదాయం ప్రకారం కర్ణాటక ముఖ్యమంత్రి గర్భాలయం వెలుపల కులశేఖరపడి వరకు వెళ్లి రాష్ట్ర ప్రజల తరఫున తొలి హారతిని స్వీకరిస్తారు. ముఖ్యమంత్రి హాజరుకాలేని సందర్భాల్లో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి ఆ బాధ్యతను నిర్వర్తిస్తారు. ఇదుగో ఇక్కడే అసలు తిరకాసు…
ఈ కొత్త నిర్ణయంతో కర్ణాటక ప్రభుత్వం తరఫున తిరుమలకు వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, న్యాయమూర్తులు, సీనియర్ అధికారులు కూడా తొలి హారతిని వీక్షించి స్వామివారి ప్రత్యేక దర్శనం చేసుకునే అవకాశం పొందనున్నారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు…
ఆలయానికి వొడయార్ రాజవంశం అందించిన భారీ విరాళాలు, ప్రోత్సాహం నేపథ్యంలో… స్వామి వారి ప్రథమ హారతిని దర్శించుకుని, కళ్లకద్దుకునే అవకాశం ఆ రాజవంశం వారసులకు ఇస్తే తప్పులేదు… కానీ దాన్ని కర్నాటక ప్రభుత్వానికి బదిలీ చేయడం దేనికి..? కర్నాటక ప్రభుత్వం మెహర్బానీ ఏముంది ఇందులో..? ఎప్పుడో ఈ సంప్రదాయాన్ని (కర్నాటక ముఖ్యులకు అవకాశం) రద్దు చేసి ఉండాల్సింది…
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్జిలు, ఐఏఎస్- ఐపీఎస్‌లు… ఎవరు పడితే వాళ్లు స్వామివారి గడప ముందే తిష్టవేసి, తొలిహారతికి ఎగబడతారు ఇక… అసలే తిరుమలను రకరకాల రాజకీయ కాలుష్యాలతో నింపేస్తున్నారు… ఇక డీకే బాపతు తొందరపాటు నిర్ణయం మరింత నష్టదాయకం… టీటీడీ ట్రస్టు బోర్డు వచ్చే సమావేశంలో తొలి హారతి స్వీకరించే అవకాశం ఎవరికీ లేకుండా ఓ నిర్ణయం తీసుకోవడం బెటర్…!! ప్రోటోకాల్ కోణంలో ఎంత ముఖ్యుడైనా సరే!! గుడి పవిత్రతను కాపాడండర్రా!! బోర్డు మెంబర్ ఎవరో స్పందించినట్టున్నారు, కానీ సరిపోదు, అసలు చైర్మన్ నాయుడూ సరిపోడు… చంద్రబాబు నిర్ణయమే కీలకం!!
Share this Article