.
బంగ్లాదేశ్‌లో మళ్లీ రాజకీయ దుమారం… అధ్యక్షుడి రాజీనామా వెనుక అసలు కథ ఏమిటి? బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరోసారి అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్షుడు మహ్మద్ షహాబుద్దీన్ తన పదవీకాలం పూర్తికాకముందే రాజీనామా చేయడం దక్షిణాసియా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికారికంగా ఆరోగ్య కారణాలను చూపించినప్పటికీ, ఈ రాజీనామా వెనుక ఉన్న రాజకీయ కారణాలే ఇప్పుడు ఎక్కువగా చర్చకు వస్తున్నాయి.
ఈ పరిణామం భారత్‌కు కూడా అత్యంత కీలకమైనది. ఎందుకంటే బంగ్లాదేశ్‌లో జరిగే ప్రతి రాజకీయ మార్పు సరిహద్దు భద్రత, అక్రమ వలసలు, ఈశాన్య రాష్ట్రాల పరిస్థితులు, చైనా ప్రభావం, భారత్- బంగ్లాదేశ్ సంబంధాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
Ads
షహాబుద్దీన్ ఎందుకు రాజీనామా చేశారు? 2023లో అవామీ లీగ్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో షహాబుద్దీన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2024లో విద్యార్థుల ఉద్యమం నేపథ్యంలో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయినా, పాత రాజ్యాంగ వ్యవస్థ నుంచి మిగిలిన ఏకైక ప్రధాన రాజ్యాంగ పదవిదారుడు ఆయనే.
అధికారికంగా ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా రాజీనామా చేస్తున్నానని చెప్పారు. అయితే బంగ్లాదేశ్ మీడియా కథనాల ప్రకారం అసలు కారణం రాజకీయమే. ఇటీవల భారతదేశంలో ప్రవాసంలో ఉన్న మాజీ ప్రధాని షేక్ హసీనాతో షహాబుద్దీన్ సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా మే నెలలో లండన్‌లో ఉన్నప్పుడు హసీనాతో మాట్లాడినట్లు ఇంటెలిజెన్స్ సంస్థలు గుర్తించాయని అక్కడి మీడియా పేర్కొంది. ఈ పరిణామాల తర్వాతే ఆయనపై రాజీనామా ఒత్తిడి పెరిగినట్లు సమాచారం.
హసీనా ప్రకటనతో మారిన సమీకరణాలు ఇటీవల రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షేక్ హసీనా ఈ ఏడాది చివర్లో బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చి చట్టాన్ని ఎదుర్కొంటానని ప్రకటించారు. ప్రస్తుతం హసీనాపై 2024 విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేసిన కేసుల్లో మరణశిక్ష సహా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఆమె పార్టీ అవామీ లీగ్ కార్యకలాపాలపై కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో హసీనాతో అధ్యక్షుడు సంబంధాలు కొనసాగించడం ప్రస్తుత అధికార వర్గాలకు ఆందోళన కలిగించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే రాజీనామా చేయించడం ద్వారా “ప్రభుత్వం ఎలాంటి పరిణామాన్నైనా కఠినంగా పర్యవేక్షిస్తోంది” అనే సంకేతాన్ని ఇవ్వాలనుకున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ముందు ఏమవుతుంది? బంగ్లాదేశ్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు రాజీనామా చేసిన 90 రోజుల్లో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. ప్రస్తుతం పార్లమెంట్‌లో మెజారిటీ ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) అభ్యర్థే అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే మాజీ మంత్రులు ఖందాకర్ మోషరఫ్ హుస్సేన్, అబ్దుల్ మొయిన్ ఖాన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.
భారత్‌కు ఎందుకు ఇది కీలకం? బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత ఏర్పడిన ప్రతిసారి దాని ప్రభావం ముందుగా భారత్‌పైనే కనిపిస్తుంది.
4,000 కిలోమీటర్లకు పైగా ఉన్న భారత్- బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉంది.
అక్రమ వలసలు, సరిహద్దు చొరబాట్లు పెరిగే ప్రమాదం ఉంటుంది.
పశ్చిమ బెంగాల్, అసోం, త్రిపుర, మేఘాలయ వంటి రాష్ట్రాలపై ప్రత్యక్ష ప్రభావం పడవచ్చు.
చైనా ప్రభావాన్ని అడ్డుకోవడంలో ఢాకా వైఖరి భారత్‌కు అత్యంత కీలకం.
వాణిజ్యం, కనెక్టివిటీ, ఈశాన్య భారత అభివృద్ధి ప్రాజెక్టులు కూడా బంగ్లాదేశ్ రాజకీయ స్థిరత్వంపై ఆధారపడి ఉంటాయి.
షేక్ హసీనా అధికారంలో ఉన్న సమయంలో భారత్ -బంగ్లాదేశ్ సంబంధాలు అత్యంత బలంగా మారాయి. ఇప్పుడు అక్కడి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతుండటంతో న్యూఢిల్లీ అత్యంత జాగ్రత్తగా పరిణామాలను గమనిస్తోంది.
ముందున్నది మరింత ఉత్కంఠే... అధ్యక్షుడి రాజీనామా అనేది కేవలం రాజ్యాంగ ప్రక్రియ మాత్రమే కాదు. ఇది బంగ్లాదేశ్‌లో కొత్త అధికార సమీకరణాలకు నాంది కావచ్చు....
Share this Article