.
హైడ్రా… ఇప్పుడు ఓ కలకలం… హైడ్రా చీఫ్ రంగనాథ్‌ను తొలగించాలని హైకోర్టు సూచన, అంతకుముందు ఆర్మీని పిలుస్తామని వ్యాఖ్య… 63 కోర్టు ధిక్కరణ కేసులున్నాయని ప్రస్తావన… దీనిపై రేవంత్ రెడ్డి స్ట్రెయిటుగా స్పందన…
హైడ్రాను మరింత పటిష్టం చేస్తాం… కోర్టు ధిక్కరణ కేసుల ప్రాతిపదికగా అధికారుల్ని మార్చాలా? ఏ అధికారిని ఎక్కడ నియమించాలనేది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణాధికారం… 400 కోర్టు ధిక్కరణ కేసులున్న సోమేష్ కుమార్ మాటేమిటి మరి..? తప్పుడు పత్రాలతో కబ్జాదారులు కోర్టుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు…
Ads
ఒక ప్రభుత్వ వ్యవస్థ హైడ్రా… అది 9 తలల విషసర్పమా? హిట్లర్ కోర్ టీమ్ పేరు హైడ్రా? ఈ చర్చల్ని పక్కన పెడితే… రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లనుందనేది స్పష్టం… అక్కడ చాలా అంశాలు విచారణకు రానున్నాయి కూడా… ఇవన్నీ ఎలా ఉన్నా… హైడ్రా ఓ రాజకీయ వివాదంగా మారడం వెనుక ఏముంది..?
మేం అధికారంలోకి రాగానే హైడ్రాను బంగాళాఖాతంలోకి అని కేసీయార్, కేటీయార్, హరీష్ రావు పదే పదే ఎందుకు అంటున్నారు..? నగరంలో బీఆర్ఎస్ నేతలు చెరబట్టిన భూములు, కుంటల్ని హైడ్రా బుల్డోజర్లు విడిపిస్తున్నందుకే కక్ష పెట్టుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపణ… బతుకమ్మ కుంట దగ్గర నుంచి హుసేన్ సాగర్ బ్లిస్ ప్రాజెక్టు దాకా ఎన్నో ఉదాహరణల్ని తను ఏకరువు పెట్టగలడు…
నిజానికి అదొక్కటే కాదు… నాలాల క్లీనింగ్, చెరువుల అభివృద్ధి, బౌండరీల నిర్ధారణ ఎట్సెట్రా… హైడ్రా పనితీరు బాగానే ఉంది… వేల ఎకరాల ప్రభుత్వ భూముల్ని, అంటే లక్షన్నర కోట్ల విలువైన ఆస్తుల్ని రక్షించడం ఇప్పటివరకు!
ఇక్కడ మరో అంశం… బీఆర్ఎస్ అక్రమ ఆక్రమణదారులకు వత్తాసుగా నిలబడిందీ అంటే ఎట్లీస్ట్ కొంత పాయింట్ ఉంది, ఆక్రమణదారుల్లో తమవాళ్లే ఎక్కువ కాబట్టి అనుకుందాం… కానీ బీజేపీ మరీ బీఆర్ఎస్ అనుబంధ సంస్థలాగా మాట్లాడుతున్నది దేనికి? అంటే, కబ్జాదారులపై ఏ చర్యలూ ఉండకూడదని చెబుతోందా? బీజేపీ ఐడియాలజీలో ఫిట్టవుతుందా ఇదంతా?
పేదల ఇళ్ల కూల్చివేత అంశానికి వస్తే… వాళ్లకు ఇంకెక్కడైనా ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేయడం వేరు, మొత్తం హైడ్రా అనే వ్యవస్థనే వ్యతిరేకించడం వేరు… తేడా బీజేపీకి తెలియడం లేదు… రేప్పొద్దున గులాబీలతో దోస్తీ, ఎన్నికల అవగాహన, పొత్తుల సంగతి వేరు, మరీ ఇప్పటి నుంచే కేసీయార్ ఎదుట మోకరిల్లడం దేనికి?
మొదటి నుంచీ ఈ హైడ్రా రంగనాథ్ కోర్టు ధిక్కరణ కేసు పరిశీలించేవారిలో ఎన్నో సందేహాలు… హైకోర్టు ఆర్మీని రంగంలోకి దింపగలదా? (అసలు ఆర్మీయే తమ భూముల్ని రక్షించాలని హైడ్రాకు మొరపెట్టుకోవడం వేరే సంగతి), ఒక పోస్టు నుంచి ఒక అధికారిని తొలగించాలని ఆదేశించగలదా? దానికి కోర్టు ధిక్కరణ కేసులే ప్రాతిపదికా? ఒక ప్రభుత్వ వ్యవస్థను 9 తలల విషసర్పంగా చిత్రీకరించడం న్యాయసమ్మతమేనా?
రేప్పొద్దున రంగనాథ్ బదులు మరో అధికారి వచ్చినా ప్రభుత్వ సంకల్పాలు, ఉద్దేశాలు, ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాల్సిందే కదా, మరి అప్పుడెలా..? అసలు ఈ మొత్తం వ్యవహారంలో న్యాయ వ్యవస్థ, శాసన- పాలన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థల నడుమ లక్ష్మణరేఖలు, అధికార పరిమితులపై స్పష్టత ఎలా..? రేవంత్ రెడ్డి అప్పీల్‌కు వెళ్తే ఇవన్నీ ఆ విచారణలో ప్రస్తావనకు వస్తాయా?
చివరగా... హైడ్రా ఓ వేటకుక్క అంటున్నాడు కేటీయార్... అది ఏ దొంగలను వేటాడుతున్నది అనేదే ముఖ్యం కదా మాస్టారూ..!!
Share this Article