.
రూ.438 కోట్ల డ్రగ్స్ సామ్రాజ్యం: టర్కీలో చిక్కిన దావూద్ అనుచరుడు ‘సలీం డోలా’ — గుజరాత్ ATS కస్టడీలోకి!
దేశీయ దర్యాప్తు సంస్థలను దశాబ్దాలుగా ముప్పుతిప్పలు పెడుతూ, విదేశాల నుంచి రూ. వందల కోట్ల మాదకద్రవ్యాల దందాను నడిపించిన అంతర్జాతీయ డ్రగ్ లార్డ్, దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు మహమ్మద్ సలీం ఇస్మాయిల్ డోలా (59) ఆటకట్టింది.
టర్కీ కేంద్రంగా గుట్టుచప్పుడు కాకుండా నెట్‌వర్క్ నడుపుతున్న అతడిని భారత ఏజెన్సీల సమన్వయంతో పట్టుకుని, తాజాగా గుజరాత్ యాంటీ-టెర్రరిజమ్ స్క్వాడ్ (ATS) తమ కస్టడీలోకి తీసుకుంది.
Ads
1. రూ. 438 కోట్ల మెఫెడ్రోన్ కేసు, సింధ్రోట్ దాడి డిసెంబర్ 1, 2022న గుజరాత్‌లోని వడోదరా జిల్లా సింధ్రోట్ సమీపంలో సాధారణ రసాయన కర్మాగారం ముసుగులో నడుస్తున్న ఒక డ్రగ్స్ తయారీ కేంద్రంపై గుజరాత్ ATS దాడులు నిర్వహించింది. అక్కడ 87.728 కిలోల మెఫెడ్రోన్ (MD డ్రగ్స్) ను స్వాధీనం చేసుకున్నారు, మార్కెట్లో దీని విలువ దాదాపు ₹438.64 కోట్లు.
ఈ విచారణలో డ్రగ్స్ తయారీకి కావాల్సిన ముడిపదార్థాల సరఫరా, తయారైన సరుకు కొనుగోలు, పంపిణీకి సలీం డోలానే ప్రధాన సూత్రధారి అని బయటపడింది.
2. ముంబై వీధుల నుంచి అంతర్జాతీయ నెట్‌వర్క్ వరకు … ముంబైలోని డోంగ్రీ ప్రాంతానికి చెందిన సలీం డోలా నేర జీవితం 1990ల కాలంలోనే మొదలైంది. దావూద్ లింకులు ఏమిటంటే… అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఇక్బాల్ మీర్చీతో చేతులు కలిపి ‘మాండ్రాక్స్’ స్మగ్లింగ్‌తో తన నెట్‌వర్క్‌ను ప్రారంభించాడు.
నేరాల చరిత్ర…: 1998లో ముంబై విమానాశ్రయంలో 40 కిలోల మాండ్రాక్స్‌తో పట్టుబడ్డాడు… ఆ తర్వాత 2013లో 79 కిలోల చరాస్ కేసు, 2017లో కువైట్‌కు గుట్కా అక్రమ రవాణా, 2018లో రూ. 1,000 కోట్ల విలువైన ఫెంటానిల్ కేసుల్లో ఇతడి పేరు నమోదైంది.
3. ‘గ్లోబల్ హంట్’: కొరియర్ ఆర్డర్‌తో చిక్కిన నెట్‌వర్క్… ఇండియా నుంచి పారిపోయిన సలీం డోలా యుఏఈ, కెన్యా, టర్కీ వంటి దేశాలు మారుతూ ఇంటర్‌పోల్ కంటికి చిక్కకుండా నెట్‌వర్క్ నడిపాడు. మార్చి 2024లో భారత ఏజెన్సీల విజ్ఞప్తి మేరకు ఇంటర్‌పోల్ రైడ్ కార్నర్ నోటీస్ (RCN) జారీ చేసింది.
ఇస్తాంబుల్‌లోని రహస్య స్థావరంలో ఉంటూ ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తపడిన సలీం డోలా, తన స్థావరానికి ఒక ఆన్‌లైన్ కొరియర్ ఆర్డర్ చేయడంతో చిరునామా ఆధారంగా భారత ఏజెన్సీలు టర్కీ పోలీసుల సహకారంతో అతడిని అదుపులోకి తీసుకున్నాయి.
4. ED రంగప్రవేశం & కస్టడీ విచారణ… ప్రస్తుతం గుజరాత్ ATS అధికారులు సలీం డోలాను సుదీర్ఘంగా విచారిస్తున్నారు. రసాయన సరఫరాదారులు ఎవరు? విదేశీ కొనుగోలుదారులు మరియు డబ్బును దారిమళ్లించిన హవాలా మార్గాలు ఏమిటి?
మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా ఇతనికి చెందిన అక్రమ ఆస్తులు, ముంబై, సూరత్, రాజ్‌కోట్ ప్రాంతాల్లో ఉన్న బినామీ ఆస్తులు, బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసి ఆర్థిక విచారణను వేగవంతం చేసింది. ఈ గ్లోబల్ ఆపరేషన్ విజయవంతం కావడం డ్రగ్స్ మాఫియాపై భారత భద్రతా ఏజెన్సీలకు లభించిన పెద్ద విజయం…
Share this Article