.
మనిషికి విశ్వాసం గురించి చాలా నిర్వచనాలు తెలుసు. ప్రేమ గురించి గొప్పగా మాట్లాడగలడు. సంబంధాల గురించి ఎన్నో నీతులు చెబుతాడు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం తన అవసరాలు, లాభనష్టాల లెక్కలు చూసుకుంటాడు.
కుక్కకు ఇవేవీ తెలియవు. విశ్వాసం అంటే ఏమిటో దానికి నిర్వచనాలు అవసరం లేదు. ప్రేమిస్తున్నానని చెప్పడం కూడా రాదు. కానీ తన మనిషి కోసం ప్రాణం పెట్టగలదు. మనిషి తన అవసరాల కోసం సంబంధాలను వెతుక్కుంటే.. కుక్క మాత్రం తన సంబంధాన్నే జీవితంగా మార్చుకుంటుంది. ఈ చిన్న తాత్విక వైరుధ్యాన్ని రెండు హృదయాలను కదిలించే కథలతో చెప్పిన సినిమా ‘ఓ మై డాగ్’ (Ohh My Dog).
Ads
ఇది ఇద్దరు తప్పిపోయినవాళ్ల కథ. ఒక కథలో ఒక పిల్లవాడు తన కుక్క కోసం వెతుకుతుంటాడు. మరో కథలో ఒక కుక్క తన మనిషి కోసం వెతుక్కుంటూ బయలుదేరుతుంది. వినడానికి సాధారణంగా అనిపించినా.. ఈ రెండు అన్వేషణల్లోనూ ఉన్నది ఒకటే భావోద్వేగం. మనకు ఇష్టమైనవాళ్లు కనిపించకపోతే కలిగే బాధ, వాళ్లను ఎలాగైనా తిరిగి కలుసుకోవాలనే తపన.
అప్పూ అనే పిల్లవాడికి మోమో అనే కుక్కపిల్ల అంటే ప్రాణం. అది అతనికి కేవలం పెంపుడు జంతువు కాదు. ఆటల్లో తోడు, ఒంటరితనంలో స్నేహితుడు, సంతోషంలో భాగస్వామి. అలాంటి మోమో ఒకరోజు కనిపించకుండా పోతుంది. దాన్ని ఎలాగైనా వెతికి తీసుకురావాలని అప్పూ ప్రయత్నిస్తాడు.
మరోవైపు భోపాల్‌లో ప్రిన్స్ అనే బాలకార్మికుడికి ఆస్కార్ అనే వీధికుక్కతో మంచి అనుబంధం ఉంటుంది. అయితే ఒకరోజు ప్రిన్స్ కూడా అదృశ్యమవుతాడు. తన మనిషి కనిపించకపోవడంతో ఆస్కార్ అతని కోసం వెతుక్కుంటూ బయలుదేరుతుంది. అలా ఒకవైపు కుక్కను వెతుక్కుంటూ పిల్లవాడు, మరోవైపు పిల్లవాడిని వెతుక్కుంటూ కుక్క చేసే ప్రయాణాలు మొదలవుతాయి.
ఈ క్రమంలో కుక్కల అక్రమ రవాణా ముఠా, బాలకార్మిక వ్యవస్థ, అవయవాల అక్రమ వ్యాపారం వంటి అంశాలు కథలోకి వస్తాయి. అప్పూ కుక్కల స్మగ్లింగ్ ముఠా నుంచి మోమోను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే.. ఆస్కార్ తన యజమానిని అవయవాల మాఫియా నుంచి రక్షించుకోవడానికి పోరాడుతుంది. ఈ రెండు కథల్లోనూ ఉత్కంఠతో పాటు సరదా సన్నివేశాలూ ఉంటాయి.
సినిమాలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ రెండు కథలూ ఒకదానితో ఒకటి కలవవు. ఒకే సినిమాలో రెండు వేర్వేరు కథలను చూపిస్తూ, చివరకు ఏదో ఒక లింక్ పెట్టి కలపాలనే ప్రయత్నం దర్శకుడు చేయలేదు. రెండూ స్వతంత్రంగా సాగుతాయి. వేర్వేరుగా ముగుస్తాయి. కానీ రెండింటిలోనూ ప్రేక్షకుడికి కలిగే అనుభూతి మాత్రం ఒక్కటే.
సాధారణంగా జంతువుల నేపథ్యంలో వచ్చే సినిమాల్లో మనిషే ప్రధాన పాత్రగా ఉంటాడు. జంతువు అతనికి తోడుగా కనిపిస్తుంది. కానీ ఇందులో ఆస్కార్‌ది కేవలం సహాయక పాత్ర కాదు. దానికి ఒక లక్ష్యం ఉంది. తన మనిషిని వెతుక్కోవడానికి ఒక ప్రయాణం ఉంది. దారిలో ఎదురయ్యే ప్రమాదాలున్నాయి. వాటిని అధిగమించే ప్రయత్నం ఉంది. అంటే ఇక్కడ కుక్క కూడా ఒక కథానాయకుడే. మనిషి లేకుండానే తన కథను తాను నడిపిస్తుంది.

ఇక సినిమాలో మరో ముఖ్యమైన అంశం నిస్సహాయులపై జరిగే దోపిడీ. బాలకార్మికుడు, పేదవాడు, వీధికుక్క.. వీళ్లందరికీ తమను తాము రక్షించుకునే శక్తి ఉండదు. వాళ్ల బలహీనతే కొందరికి వ్యాపారంగా మారుతుంది. కుక్కలను అక్రమంగా తరలించడం నుంచి మనుషుల అవయవాలను దోచుకోవడం వరకు ఈ దుర్మార్గాలన్నీ ఒకే కోణాన్ని చూపిస్తాయి. ఎదురు తిరగలేని వాళ్లను లక్ష్యంగా చేసుకునే సమాజంలోని మరో చీకటి ముఖాన్ని దర్శకుడు కథలో భాగం చేశాడు.
పంకజ్ త్రిపాఠి తన సహజమైన నటనతో కథకు మంచి మానవీయ స్పర్శను అందించాడు. పవన్ మల్హోత్రా పాత్ర కూడా బాగుంది. బాలనటుడు మాహి రాయ్ తన పాత్రకు తగ్గట్టుగా నటించాడు. అయితే వీళ్లందరికంటే ఎక్కువగా గుర్తుండిపోయేది ఆస్కార్ పాత్ర పోషించిన కుక్కే. దాని హావభావాలు, తన మనిషి కోసం పడే తపన ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక విషయం అనిపిస్తుంది. మనుషుల మధ్య సంబంధాలకు ఎన్నో లెక్కలు ఉంటాయి. డబ్బు, హోదా, అవసరం, అహం.. ఏదో ఒకటి వాటిని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. కానీ ఒక కుక్కకు తన మనిషితో ఉన్న అనుబంధంలో ఇలాంటి లెక్కలుండవు. అతను పేదవాడా, ధనవంతుడా, అధికారంలో ఉన్నాడా లేదా అన్నది దానికి అనవసరం. తనకు తెలిసింది ఒక్కటే.. అతనే తన ప్రపంచం…
ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే హిందీ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది.
Share this Article