Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కనిపించే దృశ్యం రికార్డవుతుంది – మరి పరిమళం, రుచి మాటేమిటి ?

August 10, 2026 by M S R

.

Raghu Mandaati …. వానను కూడా రికార్డ్ చేస్తారా…?
వాన పడితే… అగుంబేలో ఎవ్వరూ గొడుగు తెరవరు.
కొన్ని ఊళ్లకు ఒక అలవాటు ఉంటుంది.
అలా అగుంబేకి ఒక నమ్మకం ఉంది.
వాన నుంచి దాక్కోవడం అంటే…
ఒక ఆతిథ్యాన్ని తిరస్కరించడం.

అందుకే…
ఇక్కడ పిల్లలు వర్షంలోనే స్కూల్‌కి వెళ్తారు.
కాలంతో వయసు మళ్లిన వాళ్లు కూడా వానలోనే గుడికి వెళ్తారు.
ఇంటి ముంగిట కూర్చుని టీ తాగేవాళ్లు కూడా…
చినుకులు కప్పులో పడితే వాటిని తీసి పారేయరు.
హాయిగా స్వీకరిస్తూ… నవ్వుతూ తాగేస్తారు.

Ads

బహుశా…
వాళ్లకు వాన అంటే
తడిచే నీరు కాదు…
ఆకాశం పంపిన ఒక చిన్న పలకరింపు.
అగుంబేను మ్యాప్‌లో చూస్తే…
అది ఒక చిన్న చుక్క.

కానీ…
వాన దృష్టిలో చూస్తే…
అది ప్రపంచానికి ఒక చిరునామా.
కొన్ని ఉదయాల్లో
ఇక్కడ సూర్యుడు కూడా తొందరపడడు.
మేఘాలు కొండల మీద నిద్రలేస్తాయి.
చెట్లు ముందుగా మేల్కొంటాయి.
తర్వాత పక్షులు.
చివరగా మనుషులు.
రాత్రంతా వాన తడిపిన ఆకుల మీద
ఉదయపు వెలుగు నెమ్మదిగా జారుతూ ఉంటుంది.

చెట్ల కొమ్మల మధ్య చిక్కుకున్న మబ్బులు
ఇంకా వెళ్లిపోవాలా… వద్దా… అన్నట్టు కాసేపు అక్కడే ఆగిపోతాయి.
దూరంగా ఎక్కడో ఒక పక్షి అరుపు.
దాని తర్వాత మళ్లీ అదే తడి నిశ్శబ్దం.
ప్రకృతి ఇక్కడ…
మనుషుల కోసం జీవించదు.
మనుషులే ప్రకృతి సమయానికి జీవిస్తారు.

ఆ ఊరికి మొదట్లో…
అడవి మొదలయ్యే చోట…
పోక తోటల నడుమన
ఒక ఇల్లు ఉంది.
ఆ ఇంటికి పేరు లేదు.
కానీ…
ప్రతి ఏడాది మొదటి వర్షం మాత్రం…
ఆ ఇంటి ముంగిటే మొదట పడుతుంది.
ఎందుకో…
ఆ ఊరిలో ఎవరికీ తెలియదు.
తెలుసుకోవాలని కూడా ప్రయత్నించరు.
కొన్ని విషయాలు తెలుసుకుంటే…
వాటి అందం తగ్గిపోతుందని వాళ్ల నమ్మకం.

“కొన్ని ఊళ్లకు మనం వెళ్తాం…
కొన్ని ఊళ్లు మాత్రం…
మనల్ని పిలుస్తాయి.”
అగుంబే అలాంటి ఊరు.
ప్రతి ఉదయం మేఘాలు నేల మీదికి దిగివచ్చి
ఇళ్ల ముంగిట కూర్చుంటాయి.
ప్రతి చెట్టు
ఎవరో ఒకరి రహస్యాన్ని దాచుకున్నట్టు ఉంటుంది.
వాటి కొమ్మల మధ్య నుంచి కనిపించే ఆకాశం కూడా
పూర్తిగా ఆకాశంలా అనిపించదు…
ఎవరో తడిచిన నీలి వస్త్రాన్ని
చెట్ల మధ్య పరచినట్టుంటుంది.

ప్రతి వాన
కొత్త కథ మొదలుపెడుతుంది.
వాన ఆగిన సాయంత్రం.
నేను ఆ పాత ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డాను.
తడి ఎర్ర నేల.
నల్లని కలప స్తంభాలు.
గుమ్మానికి వేలాడుతున్న ఎండిన ఆకులు.
పైకప్పు అంచుల నుంచి
ఇంకా చినుకులు ఒక్కొక్కటిగా జారుతున్నాయి.
చుట్టూ తడిసిన నేల వాసన.
దూరంగా అడవి నుంచి వస్తున్న గాలి
ఆ ఇంటి ముంగిట ఉన్న ఆకులను మెల్లగా కదిలిస్తోంది.

ఇల్లు…
ఎవరికోసం ఇంకా ఎదురు చూస్తున్నట్టుంది.
నేను కెమెరా ఆన్ చేశాను.
రికార్డ్ బటన్ నొక్కగానే…
వెనక నుంచి ఒక స్వరం.
“వానను కూడా రికార్డ్ చేస్తారా?”
నేను తిరిగి చూసాను.
కళ్లలో…
వాన పడకముందు ఆకాశం ఎంత ప్రశాంతంగా ఉంటుందో…
అంత ప్రశాంతత.
ఆమెను చూసి కాసేపు ఏమీ మాట్లాడలేదు.

ఆ తర్వాత…
“వాన శబ్దం రికార్డ్ అవుతుందేమో కాని…
దాని వాసన మాత్రం కాదు కదా.”
అని తాను అన్న మాటతో కాసేపు ఆగిపోయాను.
నిజమే.
మన దగ్గర ఎంత మంచి కెమెరా ఉన్నా…
వాన వాసనను అందులో బంధించలేం.

తడి నేలని తాకిన మొదటి చినుకు ఇచ్చే అనుభూతిని కూడా కాదు.
కొన్ని జ్ఞాపకాలు కెమెరాలో కాదు…
మనసులో మాత్రమే ఉంటాయి.
ఆ ఇంటిని మళ్లీ చూశాను.
ఇప్పటి వరకు అది పాత ఇల్లుగా కనిపించింది.
తాను అన్న మాటతో…
ఇప్పుడు…
ఎవరో ఒకరి జ్ఞాపకంలా కనిపించింది.
నాచు పట్టిన పాత బావి అంచుల లోపల
పెరిగిన ఆకులు పచ్చని గుండ్రని తోరణాల్లా అనిపించింది.

బావి చుట్టూ తడిసిన రాళ్లు.
వాటి మీద జారుతున్న నీటి చారలు.
పక్కనే పెరిగిన చిన్న చిన్న అడవి మొక్కలు.
అందులోకి వంగి చూస్తే…
ఆకాశమే నీళ్లలో పడుకున్నట్టు ఉంది.

“ఈ బావిలో ఒక విచిత్రం ఉంది.”
“ఏంటి?”
“మనసులో ఎవరిని ఎక్కువగా గుర్తు చేసుకుంటామో…
వాళ్ల ముఖమే ఇందులో కనిపిస్తుందంటారు.”
నేను నవ్వి…
“ఇవన్నీ మీరు నమ్ముతారా?”
తాను నెమ్మదిగా బావిలోకి చూస్తూ…
“లేదు…
కానీ…
కొన్ని అబద్ధాలు కూడా చాలా అందంగా ఉంటాయి.”

అగుంబేలో వాన పడుతుంటే…
మొదట మనం వానను చూడం.
వాన మనల్ని చూస్తున్నట్టుగా ఉంటుంది.
ఎక్కడ చూసినా తడే.
తడి ఎర్ర నేల…
తడిసిన చెట్లు…
ఇళ్ల పైకప్పుల మీద నుంచి జారిపడుతున్న నీళ్లు…
ఆకుల మీద ఆగిన చినుకులు…
ఊపిరి తీసుకున్న ప్రతి సారి పచ్చి వాసన…
చెట్ల మధ్య నుంచి వినిపించే పక్షుల శబ్దాలు…
తడి మట్టిలో కలిసిపోయిన ఆకుల వాసన…
వాన తాకిన కొబ్బరి ఆకులు ఒకదానికొకటి రాసుకుంటూ చేసే శబ్దం…
అన్నీ కలిపి ఒక విచిత్రమైన నిశ్శబ్దం.

అది నిశ్శబ్దం కాదు.
ప్రకృతి తన భాషలో మాట్లాడుతున్న శబ్దం.
ఇక్కడ వాన ఒక్కసారిగా కురిసి వెళ్లిపోదు.
మెల్లగా మొదలవుతుంది.
ఒక్కసారిగా తెరలా కురుస్తుంది.
మళ్లీ ఆగిపోతుంది.
ఆ తర్వాత ఆకుల మీద మిగిలిపోయిన చినుకులు
చెట్ల నుంచి ఆలస్యంగా జారుతూ ఉంటాయి.
వాన ఆగిపోయినా…
అగుంబేలో వాన పూర్తిగా ఆగదు.

ఇక్కడి వాళ్లకు వానంటే…
దాక్కోవాల్సినది కాదని అదొక
ఆహ్వానమని తెలుస్తుంది.
ఆకాశం ఇచ్చిన ఆతిథ్యమని అర్ధమవుతుంది.
అందుకే ఇక్కడ వానలోనే నడుస్తారు.
వానలోనే తమ పనులు చేసుకుంటారు.

ఎక్కడో విన్న ఒక మాట గుర్తొచ్చింది…
“ఆకాశం ఇచ్చింది…
ఈ నేల తిరస్కరించదు.”
అది అగుంబేకి చాలా బాగా సరిపోతుంది.
నిజం చెప్పాలంటే…
అగుంబేకు ఇలా రావాలని ముందుగా అనుకోలేదు.
అనుకోకుండా షూటింగ్ మరియు స్క్రిప్ట్ డిస్కషన్ కోసం ఇక్కడ ఆగాల్సి వచ్చింది.

కానీ…
కొన్ని ప్రదేశాలకు మనం ప్లాన్ చేసుకుని వెళ్లం.
అవి మన జీవితంలోకి…
అనుకోకుండా వచ్చేస్తాయి.
అగుంబే కూడా అలాంటిదే.
మొదట కెమెరాతో వచ్చాను.
కొంత షూట్ చేద్దామని.
కొన్ని విజువల్స్ తీసుకుందామని.

కానీ…
కొద్దిసేపటికే కెమెరా పక్కన పెట్టి…
చుట్టూ చూడటం మొదలుపెట్టాను.
ఎందుకంటే…
ఇక్కడ కెమెరాలో బంధించాలనిపించే దానికంటే…
కెమెరాలో బంధించలేనిదే ఎక్కువగా ఉంది.
చెట్టు మీద పెరిగిన నాచు…
వాన తడిసిన నేల వాసన…
ఆకుల మీద జారుతున్న నీటి చుక్క…
దూరంగా కనిపించే మబ్బు…
తడిసిన పాత ఇల్లు…
వంటింటి నుంచి వస్తున్న వేడి ఆహారం వాసన…
ఇవన్నీ ఫొటోల్లో కనిపించవచ్చు.
కానీ…
వాటి అనుభూతి మాత్రం ఫొటోలోకి రాదు.

అందుకే కొన్ని జ్ఞాపకాలు…
కెమెరాలో ఉండవు.
మనలో ఉంటాయి.
మనకు అత్యంత ఇష్టమైన కొన్ని క్షణాలకు…
ఒక్క ఫొటో కూడా ఉండదు.
ఎందుకంటే…
అవి కెమెరా కోసం పుట్టినవి కావు.
మన మనసు కోసం పుట్టినవి.

ఫోన్ కెమెరా పక్కన పెట్టి అడవిలోకి కొంచెం నడిచాను. అవి ఉంటే వర్షంలో వాటిని కాపాడుకోవాలనే తాపత్రయ పడుతుంటాం.
ఏమి లేకుండా వాన చినుకుల్లో నడవడం ఎలా ఉందో తెలుసా…
మాటల్లో చెప్పలేం…
ఎలా అంటే అన్ని త్యజించిన సాధువు ఏ భారం లేకుండా ఆధ్యాత్మికంలో లీనమైనట్టు…
మన దగ్గర ఏదైనా ఉంటే…
వాన పడినప్పుడు దాన్ని కాపాడుకోవాలనే తాపత్రయం మొదలవుతుంది.
ఫోన్ తడవకూడదు…
కెమెరా తడవకూడదు…
బట్టలు తడవకూడదు…
మన మీద ఒక్క చుక్క కూడా పడకూడదనుకుంటాం.

అలా…
మన దగ్గర ఉన్నవాటిని కాపాడుకుంటూ…
మనలో ఉన్నదేదో కోల్పోతుంటాం.
ఆ రోజు మాత్రం…
ఏదీ కాపాడుకోవాలనిపించలేదు.
ఫోన్ లేదు.
కెమెరా లేదు.
గొడుగు లేదు.
వాన నుంచి దాక్కోవాలనే ఆలోచన కూడా లేదు.
వాన చినుకులు తల మీద పడుతున్నాయి…
జుట్టులోంచి జారుతున్నాయి…
ముఖాన్ని తడుపుతున్నాయి…
బట్టల్ని పూర్తిగా తడిపేస్తున్నాయి.

కాళ్ల కింద తడి మట్టి.
చుట్టూ అడవి.
చెట్ల ఆకుల మీద నుంచి జారుతున్న చినుకుల శబ్దం.
దూరంగా ఎక్కడో ఒక పక్షి పలకరింపు.
మధ్యలో… నేను.
అన్నీ వదిలేసిన ఒక సాధువు
తన చేతుల్లో ఏమీ లేకపోయినా…
తనలో మాత్రం ఒక విశ్వాన్ని మోస్తూ
నిశ్శబ్దంలో లీనమైపోయినట్టుగా…
అలా.

ఆ క్షణంలో…
నాకేమీ అవసరం అనిపించలేదు.
ఎక్కడికి వెళ్లాలి అన్న ఆలోచన లేదు.
ఎప్పుడు తిరిగి రావాలి అన్న తొందర లేదు.
ఏం షూట్ చేయాలి అన్న ఆలోచన లేదు.
ఏం రికార్డ్ చేయాలి అన్న ఆలోచన లేదు.
చూడాలనే కోరిక కూడా లేదు.
ఎందుకంటే…
ఆ క్షణాన్ని చూడటం కాదు…
ఆ క్షణంగా మారిపోతున్నాను.

వాన నన్ను తడపడం లేదు అనిపించింది.
చాలా కాలంగా మనసులో పేరుకుపోయిన
ఏదో తెలియని అలసటను…
ఒక్కో చినుకుతో కరిగిస్తున్నట్టనిపించింది.
మనిషి జీవితమంతా…
ఏదో ఒకటి పట్టుకోవడానికే పరుగెడతాడు.
డబ్బు, పేరు, గౌరవం, సంబంధాలు, గతం…
భవిష్యత్తు… మన గురించి ఎవరు ఏమనుకుంటారో అన్న భయం…
రేపు ఏం జరుగుతుందో అన్న ఆందోళన…
కనిపించని ఎన్నో వస్తువులను
మనసులో మోస్తూనే ఉంటాం.

ఆ రోజు అగుంబే వానలో…
ఆ బరువులన్నీ ఒక్కొక్కటిగా నేల మీద పడిపోతున్నట్టనిపించింది.
ఒక్కో చినుకు…
ఒక్కో జ్ఞాపకాన్ని తడిపింది.
ఒక్కో అడుగు…
ఒక్కో భయాన్ని వెనక్కి వదిలింది.
చివరికి…
నేను అడవిలో నడుస్తున్నానో…
అడవే నన్ను తనలోకి తీసుకెళ్తుందో…
తెలియని స్థితి.
వానను నేను చూస్తున్నానా…
వాన నా లోపల ఏదో చూస్తుందా…
అన్న తేడా కూడా మిగల్లేదు.

బహుశా…
ఆధ్యాత్మికత అంటే
ఎక్కడికో వెళ్లి దేవుడిని వెతకడం కాదేమో.
మన దగ్గర ఉన్నవన్నీ
కొద్దిసేపు పక్కన పెట్టి…
మనలో మిగిలింది ఏమిటో
మనమే నిశ్శబ్దంగా చూసుకోవడం.

  • ఆ రోజు…
    అగుంబే అడవిలో…
    వాన మధ్యలో…
    నాకు తెలిసింది ఒక్కటే.
    ఖాళీగా ఉండటం అంటే
    ఏమీ లేకపోవడం కాదు…
    మన మీద మనమే వేసుకున్న
    అన్ని పొరలను తీసేసుకున్న తర్వాత…
    మన అసలైన మనసుకు
    మొదటిసారి స్థలం దొరకడం.
    ఆ ఖాళీలోకి…
    ఒక వాన చినుకు పడింది.
    అంతే.

మనసు మళ్లీ నిండిపోయింది.
ఈ ప్రకృతిలో నడుస్తున్న మరి
వానలో తడిసిన దారి మీద
ప్రతి అడుగు ఒక కొత్త శబ్దం చేస్తోంది.
చెట్ల కొమ్మల మధ్య నుంచి జారిన చినుకులు
మనం ముందుకు వెళ్లేలోపే భుజాల మీద పడుతున్నాయి.
చుట్టూ చూస్తే…
మనిషి చేయి కనిపించదు.

కానీ…
ప్రకృతి చేతి పని మాత్రం ప్రతిచోటా కనిపిస్తుంది.
చెట్ల మీద పెరిగిన నాచు చూస్తే…
ప్రకృతి కూడా ఎప్పుడో ఒకప్పుడు
తన చేతులతో పెయింటింగ్ వేసుకుని…
అక్కడే వదిలేసినట్టుంది.
ఒక పెద్ద రాయి మీద వాన నీళ్లు జారుతున్నాయి.
దాని పక్కన చిన్న చిన్న ఆకులు.
ఎక్కడా మనిషి పేర్చిన డిజైన్ లేదు.
ఎక్కడా ప్లాన్ లేదు.

అయినా…
ప్రతి ఫ్రేమ్ ఒక కళాఖండంలా ఉంది.
నేను ఫొటోగ్రాఫర్‌ని.
కాబట్టి అందాన్ని వెతకడం నా పని.
కానీ అగుంబేలోకి వచ్చాక ఒక విషయం అర్థమైంది.
కొన్ని ప్రదేశాల్లో అందాన్ని వెతకాల్సిన అవసరం ఉండదు.
అది మన చుట్టూనే ఉంటుంది.
మనం చూడటానికి…
కాస్త నెమ్మదించాలి అంతే.

మధ్యాహ్నం తిన్న ఆ భోజనం కూడా మర్చిపోలేను.
అంత ఖరీదైన ప్లేటింగ్ కాదు.
అంత పెద్ద హోటల్ కాదు.
కానీ…
వానలో తడిసిన పచ్చదనం మధ్య…
వేడి వేడి ఇంటి భోజనం.
ప్లేట్‌లో ఉన్న ప్రతి పదార్థం కంటే
ఆ చుట్టూ ఉన్న వాతావరణమే ఎక్కువగా గుర్తుండిపోయింది.
వెనుక తడిసిన దారి.
పక్కనే పచ్చగా మెరిసే గడ్డి.
ఇంటి పైకప్పు మీద నుంచి ఇంకా జారుతున్న నీళ్లు.
దూరంగా వినిపించే పక్షుల శబ్దం.

ఆ భోజనానికి…
వాన కూడా ఒక వంటకంలా అనిపించింది.
బహుశా…
ఆహారానికి రుచి ఇచ్చేది వంట మాత్రమే కాదు.
దాని చుట్టూ ఉన్న వాతావరణం కూడా.

అగుంబేను మ్యాప్‌లో చూస్తే…
అది ఒక చిన్న చుక్క మాత్రమే.
కానీ అక్కడ కొన్ని గంటలు గడిపాక అనిపించింది…
కొన్ని ప్రదేశాలు మ్యాప్‌లో చిన్నవిగా ఉంటాయి.
మన జ్ఞాపకాల్లో మాత్రం చాలా పెద్దవిగా మారిపోతాయి.
ఇక్కడికొచ్చాక
ఎక్కడికీ వెళ్లాలనిపించదు.

అలా…
వానను చూస్తూ కూర్చోవాలనిపిస్తుంది.
అప్పుడు ఒక విషయం అనిపించింది.
మన జీవితంలో కొన్ని ప్రదేశాలు కూడా వానలాంటివే.
మనం వాటి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తాం.
కానీ…
అవి మన మీద పడాల్సిందే.
మనల్ని తడపాల్సిందే.
మనలో దాచుకున్న దుమ్మంతా కడిగేయాల్సిందే.
అప్పుడు మాత్రమే…
మనలో ఎంతకాలంగా ఎండిపోయి ఉన్నామో మనకే తెలుస్తుంది.

అగుంబే నాకు అలాంటి ఒక వాన.
నేను షూటింగ్ కోసం ఆగాను.
కానీ జ్ఞాపకంతో తిరిగి బయలుదేరాను.
కెమెరాలో ఎన్నో ఫ్రేములు ఉన్నాయి.
కానీ…
వాటికంటే ఎక్కువగా…
కెమెరాలో పడని కొన్ని క్షణాలు నాతో వచ్చాయి.
వాన శబ్దం.
తడి నేల వాసన.
ఆ పాత ఇల్లు.
ఆ పచ్చదనం.
వేడి భోజనం.
చెట్ల మధ్య నడిచిన ఆ నిశ్శబ్దం.

చిన్న లోయగుండా నడిచి…
గుండంలో మునిగి…
తేలుతూ సాగిన మనసు.
మరియు…
ఎక్కడో మనసులో మిగిలిపోయిన ఒక మాట
“కొన్ని జ్ఞాపకాలు కెమెరాలో కాదు…
మనసులో మాత్రమే ఉంటాయి.”
ఇక నుండి వానను ఇంకొంచెం దగ్గరగా అనుభవిస్తాను.
ఎందుకంటే…
కొన్ని వానలు తడపడానికి రావు.
మనలో ఏదో ఒకటి మేల్కొల్పడానికి వస్తాయి…
.
.
.
.
.
రఘు మందాటి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కనిపించే దృశ్యం రికార్డవుతుంది – మరి పరిమళం, రుచి మాటేమిటి ?
  • ఆర్థిక సంస్కరణలకు అసలు సూత్రధారి… వెంకిట రమణన్ !!
  • జీనత్ అమన్‌కూ ‘తెహెల్కా’ తేజ్‌పాల్‌కూ ఏమిటి సంబంధం?!
  • బొద్దింకలు సజీవంగా, చురుకుగా ఉండాలట – రాజకీయాల్లోకి రావద్దట..!!
  • … అంటే నగరజనం కాలుష్యంలోనే బతకాలా మిస్టర్ కేటీఆర్ ?!
  • GOBARdhan ! పెట్రోల్‌లో ఇథనాల్‌లాగే- గ్యాస్‌లో బయో CNG మిక్స్ !!
  • తొలి సినిమాతోనే మంచి పేరు ! ప్చ్, రిక్షా తోలుకుంటున్నాడు !!
  • Self Editing … అదే యూట్యూబర్లు అయితే దుమ్మురేపేవారు…
  • Peak Detailing – దురంధర్ అంత తేలికగా అద్భుతాన్ని సృష్టించలేదు !!
  • సూర్య ! ఇప్పుడిక తనకు పోటీ లేదు – మరో రేంజుకు ‘మార్కెట్ వాల్యూ’..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions