.
ఓ ముసలామె… అమెరికనే! మెల్లిగా నడుచుకుంటూ వచ్చింది అక్కడికి. తన కొడుకో, బంధువో, ఆత్మీయుడో.. ఎవరికి తెలుసు! అక్కడి స్మారక ఫలకంపై ఉన్న ఓ పేరు దగ్గర చిన్న అమెరికన్ జెండాను, ఓ పువ్వును ఉంచింది. కళ్లు మూసుకుంది. కానీ ఆ కళ్లల్లో నీళ్లు ఆగలేదు. అక్కడున్న జలపాతంలాగే కన్నీళ్లు ధారగా ప్రవహించాయి.
నిజమే! కొన్ని దృశ్యాలు మనల్ని కదిలించడానికి మాటలు అవసరం లేదు. ఆ కన్నీళ్లే చాలు!
Ads
అది న్యూయార్క్‌లోని 9/11 మెమోరియల్. ప్రపంచ ప్రఖ్యాత వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్లపై 2001 సెప్టెంబర్ 11న జరిగిన భయానక ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన దాదాపు మూడు వేల మందిని స్మరించుకునేందుకు నిర్మించిన స్మారకం. ఒకప్పుడు ఆకాశాన్ని తాకిన జంట టవర్లు నేలమట్టమైన చోట.. ఇప్పుడు కనిపించేది రెండు భారీ జలపాతాలు. కానీ అవి కేవలం నీటి ప్రవాహాలు కావు. వేల కుటుంబాల గుండెల్లో ఎప్పటికీ పూడ్చలేని శూన్యానికి ప్రతీకలు.

అక్కడ ప్రతి పేరు వెనుక ఓ మనిషి ఉన్నాడు. ఆ మనిషి వెనుక ఓ కుటుంబం ఉంది. ఆ కుటుంబం వెనుక ఎప్పటికీ చెరిగిపోని ఓ విషాదం ఉంది.
నాటి దాడిలో ప్రాణాలు కోల్పోయిన తమవారిని గుర్తు చేసుకునేందుకు ఇప్పటికీ అక్కడికి జనం వస్తూనే ఉంటారు. కొందరు పూలు పెడతారు. కొందరు చిన్న అమెరికన్ జెండాలు ఉంచుతారు. ఇంకొందరు మౌనంగా నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటారు. అక్కడి రెండు భారీ రిఫ్లెక్టింగ్ పూల్స్ అంచుల నుంచి నీరు లోపలికి పడుతూ ఉంటుంది. ఆ నీటిని చూస్తుంటే.. పోయిన ప్రాణాలు తిరిగి రావన్న చేదు నిజం గుర్తుకొస్తుంది. ఎంత నీరు ప్రవహించినా ఆ శూన్యం మాత్రం నిండదు.
ఆ పూల్స్ అంచులపై మృతుల పేర్లు చెక్కి ఉన్నాయి. పక్కనే 9/11 మ్యూజియం ఉంది. దాడి విధ్వంసం, శిథిలాలు, బాధితుల జీవితాలు, ప్రాణాలతో బయటపడినవారి అనుభవాలు, దాడి అనంతరం తలెత్తిన ఆరోగ్య సమస్యలతో మరణించినవారి కథలు.. ఇలా ఆ విషాదానికి సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలను అక్కడ భద్రపరిచారు.
చరిత్రను పుస్తకాల్లో రాసి వదిలేయలేదు. మనుషుల జ్ఞాపకాల్లో సజీవంగా ఉంచేందుకు ఓ వ్యవస్థను నిర్మించారు. తరువాతి తరాలు అక్కడికి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకునేలా చేశారు.

ఆ పరిసరాల్లోనే కొత్త వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణమైంది. పాత జంట టవర్లలో ఒకదాని ఎత్తును గుర్తు చేసేలా 1,776 అడుగుల ఎత్తుతో వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిలిచింది. అమెరికా స్వాతంత్ర్య ప్రకటన వెలువడిన 1776 సంవత్సరాన్ని గుర్తు చేసేలా ఆ ఎత్తును నిర్ణయించడం మరో విశేషం. కూలిపోయిన భవనాల స్థానంలో మళ్లీ నిలిచిన ఆకాశహర్మ్యం.. విధ్వంసం తమను ఆపలేదనే సందేశాన్నీ ఇస్తుంది.
ఆ పరిసరాలను చూస్తుంటే నాకు తెలంగాణ గుర్తొచ్చింది… తెలంగాణ సచివాలయానికి ఎదురుగా నిర్మించిన అమరవీరుల స్మారకం గుర్తుకొచ్చింది. ఓ ప్రమిద రూపంలో, అద్భుతమైన నిర్మాణశైలితో రూపుదిద్దుకున్న ఆ కట్టడం నిజంగా ప్రత్యేకమైనది. ప్రపంచంలోనే అతిపెద్ద సీమ్‌లెస్ స్టెయిన్‌లెస్ స్టీల్ నిర్మాణంగా దీనిని పేర్కొంటారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసినవారికి నివాళిగా నిర్మించిన స్మారకం అది.
కట్టడం బాగుంది. రూపకల్పన బాగుంది. అమరుల త్యాగాలకు ఓ ప్రతీకను నిలబెట్టాలన్న ఆలోచనా బాగుంది. కానీ.. ?
తెలంగాణ కోసం ప్రాణాలర్పించినవారు ఎవరు? వారి పేర్లేమిటి? ఏ ప్రాంతానికి చెందినవారు? వారి కుటుంబాల కథలేమిటి? ఆ త్యాగాల వెనుక ఉన్న మానవీయ విషాదమేమిటి? సచివాలయం ఎదుట నిలిచిన ఆ అద్భుతమైన కట్టడం దగ్గరికి వెళ్లిన సామాన్య తెలంగాణ బిడ్డకు ఈ వివరాలు తెలుసుకునే అవకాశం ఉందా?
రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజునో, మరో ప్రత్యేక సందర్భంలోనో అక్కడికి వెళ్లి అమరులకు అంజలి ఘటించేందుకు తగిన ఏర్పాట్లు ఉన్నాయా? అమరుల పేర్లను చూసి, వారి త్యాగాలను గుర్తు చేసుకుని, వారి కుటుంబాలకు మనసులోనైనా నమస్కరించే పరిస్థితి ఉందా?

ఇవే ప్రశ్నలు! ఒక స్మారకం అంటే అందమైన కట్టడం మాత్రమేనా? దాని చుట్టూ ఫొటోలు దిగడం, ప్రారంభోత్సవం చేయడం, అప్పుడప్పుడు అధికారిక కార్యక్రమాలు నిర్వహించడం మాత్రమేనా? అసలు ఆ స్మారకం ఎవరి కోసం నిర్మించాం? వారి త్యాగాలను భవిష్యత్తు తరాలకు పరిచయం చేయడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశాం?
అమెరికాలో 9/11 బాధితుల పేర్లను స్మారకంలో చెక్కారు. అక్కడికి వెళ్లినవారు తమవారి పేర్లను వెతుక్కోవచ్చు. పువ్వు ఉంచి నివాళి అర్పించవచ్చు. వారి జ్ఞాపకాలను తెలుసుకోవచ్చు. తెలంగాణ అమరవీరుల స్మారకం దగ్గర మాత్రం అలాంటి అనుభవం కల్పించడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అమెరికా చేసిన ప్రతి పనినీ మనం యథాతథంగా అనుసరించాల్సిన అవసరం లేదు. రెండు ప్రాంతాల చరిత్రలు, పరిస్థితులు వేరు. కానీ అమరుల త్యాగాలను గుర్తుంచుకోవాలనే ఆలోచనకు దేశం, ప్రాంతం అనే తేడా ఎందుకు ఉండాలి?
ఇంకో విషయం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వచ్చినప్పుడల్లా, ఇతర ముఖ్యమైన సందర్భాల్లోనూ ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు, వివిధ సంస్థల ప్రతినిధులు గన్‌పార్క్‌లోని 1969 తెలంగాణ ఉద్యమ అమరవీరుల స్మారక స్థూపం వద్దకు వెళ్లి పూలు సమర్పిస్తారు. అది సముచితమే. ఆ స్థూపానికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. అక్కడ నివాళులర్పించడం మన బాధ్యత కూడా.
మరి సచివాలయం ఎదుట నిర్మించిన స్మారకం సంగతేంటి? దాని లక్ష్యం ఏమిటి? అక్కడ అమరుల జ్ఞాపకాలను సజీవంగా ఉంచేందుకు ఏం చేస్తున్నారు? పేర్లతో కూడిన సమగ్ర జాబితా, వారి వివరాలు, త్యాగాల నేపథ్యం ప్రజలకు అందుబాటులో ఉన్నాయా? లేక ఇవన్నీ ఇంకా చేయాల్సిన పనులుగానే మిగిలిపోయాయా?
ఇది గత ప్రభుత్వాన్ని మాత్రమే అడగాల్సిన ప్రశ్న కాదు. ప్రస్తుత ప్రభుత్వానికీ వర్తిస్తుంది. స్మారకాన్ని నిర్మించడం ఒక దశ. దానికి జీవం పోయడం మరో దశ. ఆ రెండో దశను విస్మరిస్తే ఎంత గొప్ప కట్టడమైనా క్రమంగా ఓ అలంకారప్రాయమైన నిర్మాణంగా మిగిలిపోతుంది…
అమరవీరులపేర్లను భద్రపరచడం, వారి చరిత్రను ప్రజలకు పరిచయం చేయడం, వారి కుటుంబాలను గుర్తించడం, భావితరాలకు ఉద్యమ స్ఫూర్తిని అందించడం. అందుకు స్మారకం ఓ కేంద్రంగా మారాలి.
న్యూయార్క్‌లో ఆ వృద్ధురాలు ఓ పేరు ముందు నిలబడి కన్నీళ్లు పెట్టుకోవడం నేను చూశాను. ఆ పేరు ఆమెకు ఎంతటి బంధమో నాకు తెలియదు. కానీ ఆ స్మారకం ఆమెకు తన మనిషిని గుర్తు చేసుకునే ఓ చోటును ఇచ్చింది. ఆమె కన్నీళ్లకు ఓ చిరునామా ఇచ్చింది.
మరి తెలంగాణ కోసం ప్రాణాలర్పించినవారి కుటుంబాలకు మనం అలాంటి చిరునామా ఇచ్చామా? తెలంగాణ చరిత్ర తెలుసుకోవాలనుకునే రేపటి తరానికి ఆ స్మారకం సమాధానాలు చెప్పగలదా? అవేమీ లేకపోతే అది స్మారకం కాదు.. ఓ అందమైన కట్టడం మాత్రమే! న్యూయార్క్‌లో ఓ ‘గ్రౌండ్ జీరో’.. తెలంగాణలో మరో ‘గ్రౌండ్ జీరో’!…
Share this Article