Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ క్షుద్ర మోసం ! బిడ్డ మనసు మార్చడానికి ‘క్షుద్ర పూజలు’..!

November 29, 2026 by M S R

.

కూతురి మనసు మార్చడానికి క్షుద్రపూజలు! తండ్రి ప్రేమకు రూ.25 లక్షల వెల… ఓ క్షుద్రగాడి క్షుద్ర ఎత్తుగడ… మాయాజాలం!!

కన్నకూతురు ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. తన మాట కాదని, తనకు నచ్చని వ్యక్తిని పెళ్లాడింది. నాలుగు నెలలుగా తండ్రికి కూతురు దూరమైంది. ఆ బాధను భరించలేకపోయాడు. ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశాడు. చివరకు కూతురిని ఇంటికి రప్పించడానికి ఏం చేయాలో తెలియక దేవుడి గుడి మెట్లు ఎక్కాడు. రోజూ సాయంత్రం వరకు అక్కడే కూర్చుని మనసులోని బాధను వెళ్లగక్కుకునేవాడు.

Ads

అలాంటి తండ్రి బాధను ఓ వ్యక్తి కనిపెట్టాడు. పలకరించాడు. సమస్య ఏమిటో ఆరా తీశాడు. అంతే… నీ కూతురు నీ దగ్గరకు రావాలంటే సాధారణంగా కాదు, క్షుద్రపూజలతోనే సాధ్యమని ఓ కొత్త మార్గం చూపించాడు. తండ్రి కూడా నమ్మాడు. కూతురిపై ప్రేమ ఎంత గుడ్డిదో, ఆ ప్రేమను ఆసరా చేసుకున్నవాడి వ్యాపారం అంత పదునైనది!

  • కూతురు తిరిగి రావాలంటే రూ.50 లక్షలు ఖర్చవుతుందని బేరం పెట్టాడు. ముందుగా రూ.25 లక్షలు ఇస్తే పూజలు మొదలుపెడతానన్నాడు. కూతురి కోసం తండ్రి ఏకంగా తన ప్లాటు అమ్మి డబ్బు సమకూర్చాడు. పాతిక లక్షలు ముట్టజెప్పాడు. మూడు నెలలు గడిచాయి. పూజల జాడ లేదు. కూతురు తిరిగి ఇంటికి రాలేదు. చివరకు తాను మోసపోయానని గ్రహించి పోలీసుల దగ్గరకు వెళ్లాడు.

కీసర పోలీసుల విచారణలో ఈ వ్యవహారం బయటపడింది. వివరాలు ఇవీ… కుందన్‌పల్లికి చెందిన మణికంఠ రాము కూతురు బ్రహ్మమణి అదే గ్రామానికి చెందిన తుడం రామును ప్రేమించి నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకుంది. తండ్రి ఎంత నచ్చజెప్పినా వినలేదు. కూతురు వెళ్లిపోయిన బాధతో కుంగిపోయిన రాము కీసరలోని కాళీమాత ఆలయానికి వెళ్లి సమయం గడిపేవాడు.

అక్కడే అతడికి కల్లం క్రాంతికుమార్ పరిచయమయ్యాడు. బాధను తెలుసుకున్నాడు. కూతురిని తిరిగి రప్పించే మార్గం తన దగ్గర ఉందన్నాడు. అది క్షుద్రపూజలేనని నమ్మించాడు. రూ.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ముందుగా రూ.25 లక్షలు తీసుకున్నాడు. చివరకు పోలీసుల చేతికి చిక్కాడు. అతడి దగ్గర నుంచి రూ.22.52 లక్షల నగదు, రెండు వెండి బిస్కెట్లు, బంగారు ఉంగరం స్వాధీనం చేసుకున్నారు. అతడి భార్యతో పాటు సాయిలు అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇదీ అసలు కథ!



క్షుద్రపూజ

పరువు కోసం కూతుళ్ల ప్రాణాలు తీసే తండ్రుల గురించి విన్నాం. ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురిని చంపేందుకు సుపారీ ఇచ్చే తండ్రుల గురించి చూశాం. కానీ కూతురు తిరిగి రావాలనే ఆశతో క్షుద్రపూజలకు పాతిక లక్షలు ఖర్చు పెట్టిన తండ్రి కథ మాత్రం కొంచెం భిన్నం.

ఇక్కడ తండ్రి కూతురినో, ఆమె భర్తనో చంపాలనుకోలేదు.  ఆమె కాపురాన్ని చెడగొట్టాలని మాత్రం అనుకున్నాడు. తనను కాదని వెళ్లిపోయిన కూతురు, తన మాట విని తిరిగి ఇంటికి రావాలని కోరుకున్నాడు. ఆ కోరికలో ఎంత ప్రేమ ఉందో, అంతే స్వాధీన భావన కూడా ఉంది. కూతురి జీవితం మీద నిర్ణయం తీసుకునే హక్కు తనకే ఉందన్న ఆలోచన కూడా కనిపిస్తోంది.

ఇలాంటి బలహీనతలే మోసగాళ్లకు పెట్టుబడి. మనిషి కష్టంలో ఉన్నప్పుడు ధైర్యం చెప్పేవాళ్లు కావాలి. కానీ కొందరు ఆ కష్టాన్నే వ్యాపారంగా మార్చుకుంటారు. వైద్యం పేరుతోనో, జ్యోతిష్యం పేరుతోనో, దేవుడి పేరుతోనో, క్షుద్రపూజల పేరుతోనో అందినంత దోచుకుంటారు.

కూతురి మనసును మార్చలేనివాడు, క్షుద్రపూజలతో ఆమెను మార్చేస్తానని నమ్మించాడు. తండ్రి పాతిక లక్షలు ఇచ్చాడు. చివరకు కూతురూ రాలేదు, పూజలూ జరగలేదు. పోయిన డబ్బులో కొంతైనా పోలీసుల వల్ల తిరిగొచ్చింది.

క్షుద్రపూజలతో మనుషుల మనసుల్ని మార్చగలమన్న నమ్మకమే ఒక మోసం. అంతకంటే పెద్ద మోసం ఏమిటంటే… కన్నకూతురు తన జీవితాన్ని తాను ఎంచుకునే హక్కును అంగీకరించలేకపోవడం!

కూతురు తిరిగి రావాలంటే క్షుద్రపూజలు కాదు, తండ్రి ప్రేమలోని పట్టుదల కాస్త తగ్గాలి. ఆమె నిర్ణయాన్ని గౌరవించే మనసు కావాలి. డబ్బుతోనో, మంత్రాలతోనో, బెదిరింపులతోనో బంధాలు తిరిగి రావు. మనసులు కలిస్తేనే బంధాలు నిలుస్తాయి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓ క్షుద్ర మోసం ! బిడ్డ మనసు మార్చడానికి ‘క్షుద్ర పూజలు’..!
  • కత్తులు లేవు… రక్తపాతం లేదు… అయినా గుండెను తాకే ‘ఓ అమ్మ కథ..!
  • డీలిమిటేషన్‌తో మారిపోనున్న తెలంగాణ రాజకీయ ముఖచిత్రం!!
  • ఓహో… జగన్ యలహంక ప్యాలెస్ అసలు లీగల్ కథ ఇదన్నమాట!!
  • రియల్ మాటల మాంత్రికుడు- గురూజీ ఈయనే… పేరు పింగళి !!
  • రాజకీయం వీథి నాటకమైతే…. కనిపించేవి ‘బావర్చి బిర్యానీ’ సీన్లే !!
  • హోప్‌లెస్ సీఎం విజయ్… హీరో గారి జ్ఞానశూన్యతపై ఇదీ చార్జ్‌షీట్…
  • దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలకు కేంద్రం పరిష్కారం చూపిందా?
  • ఉప్పూనిప్పూ కలయిక! హరీశ్ తదుపరి అడుగులపై మళ్లీ చర్చ!!
  • మధురై కార్తీకదీపం… ఇద్దరే ఇద్దరు… ఆరిపోకుండా చూశారు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions