.
ఆంధ్రా తూర్పు తీరాన్ని.. నువ్వుల తీరం అని కూడా పిలిచారని తెలుసా? … G Srinivas
తూర్పు తీరపు చారిత్రక ప్రస్థానం వెనుక లోతుపాతులు…
జింజర్లీ తీరం (క్రీ.శ. 1500 – 1750): వర్తక నౌకలను నడిపించిన నువ్వుల సంపద…
తూర్పు సముద్ర తీరాన్ని ఆహార పంట అయిన ‘నువ్వుల’ పేరుతో పిలవడం ఏమిటని విడ్డూరంగా అనిపించవచ్చు. కానీ…
16, 17వ శతాబ్దాల డచ్, పోర్చుగీస్, బ్రిటిష్ నావికుల మ్యాపుల్లో గోదావరి ముఖద్వారం నుంచి వయా బీమిలి.. పూరీ దాకా పరచుకున్న సాగర రేఖ ‘కోస్ట్ ఆఫ్ జింజెలీ’ (Coast of Gingelly) గానే నమోదైంది. ఆంగ్ల నావికుడు, వర్తకుడు థామస్ బౌరీ తన రచన ‘ఎ జియోగ్రాఫికల్ అకౌంట్ ఆఫ్ కంట్రీస్ రౌండ్ ది బే ఆఫ్ బెంగాల్ (1669–1679)’ లో ఈ తీరపు వ్యాపారాన్నే కాక, స్థానిక సమాజ తీరుతెన్నులను అత్యంత ఆసక్తికరంగా నమోదు చేశాడు.
Ads
ఇక్కడి వర్తకులు అపారమైన ధనవంతులని, అయితే పాలకుల కన్నుపడితే ఆస్తిని లాక్కుంటారన్న భయంతో, సంపద బయటకు కనిపించకుండా ముతక బట్టలు కట్టుకుని పూరి గుడిసెల్లోనే నిరాడంబరంగా జీవించేవారని బౌరీ రాసుకొచ్చాడు. అలాగే దేవుడిని దర్శించుకోవాలన్నా పన్నులు కట్టాల్సిన దుస్థితిని కూడా అతడు ప్రస్తావించాడు.. అదే నటన ఇప్పటికీ ఈ తీరంలో కనిపిస్తూ ఉంటుంది…
ఇంగ్లీషులో ఈ తీరాన్ని జింజెలీ అని పిలిస్తే, 17వ శతాబ్దపు డచ్ రికార్డుల్లోనూ, నావికుల వాడుకలోనూ ఇది గింగాలీ లేదా గింగెలీ (Gingely / Gingalee – డచ్ ఉచ్చారణలో ‘జి’ బదులు స్పష్టమైన ‘గ’ శబ్దంతో /ˈɡɪŋ.ɡə.li/) గా వ్యవహరించబడింది. పోర్చుగీస్ వర్తకులు స్థానిక నువ్వులను ‘గింజెలిమ్’ (Gergelim) అని పిలవగా, అదే ఆంగ్ల, డచ్ నావిక భాషల్లోకి జింజర్లీగా రూపాంతరం చెందింది.
ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మెట్ట భూముల్లో విస్తారంగా పండిన నువ్వులు, గానుగల్లో తీసిన స్వచ్ఛమైన నూనె పీపాలు డచ్, బ్రిటిష్ నౌకల్లో నిండి బటావియా (నేటి జకార్తా), మలక్కా, సిలోన్ (శ్రీలంక) వంటి అంతర్జాతీయ వర్తక స్థావరాలతో పాటు యూరోపియన్ మార్కెట్లకు చేరేవి. ఎక్కువ కాలం నిల్వ ఉండే గుణం, అధిక పోషక విలువలు ఉండటంతో నెలల తరబడి సాగే సముద్ర ప్రయాణాల్లో నావికులకు స్కర్వీ వంటి వ్యాధులు రాకుండా ఈ నువ్వుల ఉత్పత్తులే ప్రాణరక్షణ కల్పించాయి.
సబ్బుల తయారీకి, ఔషధ లేపనాలకు, దీపాలకు ఈ నూనెకు మంచి గిరాకీ ఉండేది. తీరప్రాంత రేవుల నిండా నువ్వుల నూనె పీపాలు, బస్తాలే దర్శనమివ్వడంతో నావికులు తమ పటాలలో ఈ తీరాన్ని ‘జింజర్లీ తీరం’గా ముద్రించారు.
జింజర్లీ రేవులు: నావిక వర్తకపు నాడీ కేంద్రాలు
జింజర్లీ శకంలో ఈ తీరం వెంబడి వర్ధిల్లిన రేవు పట్టణాలు అంతర్జాతీయ నౌకలకు నిలయాలుగా మారాయి:
భీమిలి (భీమునిపట్నం)…: డచ్ వర్తకులకు కంచుకోట. నువ్వులు, నూనె పీపాలు, నీలిమందు, స్థానిక వస్త్రాలను పెద్ద ఎత్తున ఓడల్లోకి ఎక్కించిన ప్రధాన వాణిజ్య స్థావరం.
కోరంగి (కోరింగ)…: ఆసియాలోనే ప్రసిద్ధి గాంచిన సహజ డాక్‌యార్డు. భీకర తుపానుల తాకిడి నుంచి ఓడలకు రక్షణనిస్తూ, నౌకల నిర్మాణం, మరమ్మతులకు పేరొందిన మహా కేంద్రం.
కళింగపట్నం…: వంశధార సంగమ స్థానంలో ఉంటూ శ్రీకాకుళం, పర్లాకిమిడి ప్రాంతాల నుంచి సేకరించిన నూనెగింజలు, ధాన్యం ఎగుమతి చేసిన ప్రాచీన రేవు.
నర్సాపురం & మాధవాయపాలెం…: పడవల తయారీకి, కలప వర్తకానికి ప్రసిద్ధి. లండన్ బజార్లలో అమ్ముడైన ‘మడపోలం క్లాత్’ నేతకు, ఎగుమతులకు కేంద్రాలు.
విశాఖపట్నం & మాణికపట్నం…: సహజ కొండల రక్షణతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థావరాన్ని ఆకర్షించిన విశాఖ ఒకవైపు; చిల్కా తీరాన ఒడిశా సరిహద్దు సరుకులను అందించిన మాణికపట్నం మరొకవైపు కీలక పాత్ర పోషించాయి.
కళింగ తీరం (క్రీ.పూ. 400 – క్రీ.శ. 500)…: అంతర్జాతీయ వర్తకానికి తొలి తెరచాపలు
చరిత్ర పుటల్లో క్రీస్తుపూర్వానికే వెళితే ఈ తీరం ‘కళింగ’ పతాకంతో మెరిసింది. మహానది నుంచి గోదావరి ఉత్తర భాగం దాకా విస్తరించిన ఈ తీరంలో కళింగపట్నం, తామ్రలిప్తి వంటి రేవులు విలసిల్లాయి. అశోకుడు క్రీ.పూ. 261లో తలపెట్టిన భీకర కళింగ యుద్ధం వెనుక కేవలం భూవిస్తరణ కాంక్ష మాత్రమే కాదు, అంతర్జాతీయ సముద్ర రేవులపై గుత్తాధిపత్యం సాధించాలన్న వ్యూహమూ దాగి ఉంది.
ఇక్కడి నుంచే సాహసికులైన నావికులు రుతుపవనాల దిశను పట్టి జావా, సుమత్రా, బాలి దీవులకు ఏనుగు దంతపు శిల్పాలు, సుగంధ ద్రవ్యాలతో తెరచాపలెత్తేవారు. ఆ నావిక వైభవానికి సజీవ ప్రతీకే నేటికీ ఒడిశాలో జరుపుకునే ‘బాలి యాత్ర’.
మైసోలియా తీరం (క్రీ.పూ. 200 – క్రీ.శ. 300): రోమన్ బంగారాన్ని కొల్లగొట్టిన మస్లిన్
శాతవాహనులు, ఇక్ష్వాకుల కాలంలో కృష్ణా- గోదావరి డెల్టా పరిసరాలు గ్రీకు, రోమన్ నావికుల దృష్టిలో ‘మైసోలియా’గా స్థిరపడ్డాయి. ప్రాచీన గ్రీకు నావిక గ్రంథం ‘పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రోయన్ సీ’లో నమోదైన ఈ ప్రాంతం నుంచి మేలిమి మస్లిన్ వస్త్రాలు రోమన్ సామ్రాజ్యానికి తరలివెళ్లేవి.
భారతీయ వస్త్రాలు, సుగంధ ద్రవ్యాల కోసం రోమన్ వర్తకులు కుమ్మరించిన బంగారు, వెండి నాణేలు, వైన్ నిల్వ చేసే ‘యాంఫోరా’ జాడీలు కోడూరు, అరికమేడు, ధరణికోట తవ్వకాల్లో నేటికీ బయల్పడటం ఆనాటి ఆర్థిక ప్రాభవానికి సాక్ష్యం.

చోళమండలం (క్రీ.శ. 850 – 1279): బంగాళాఖాతాన్ని శాసించిన నౌకాదళం
దక్షిణాన 9వ శతాబ్దం నాటికి చోళుల ప్రభంజనం మొదలై తీరానికి ‘చోళమండలం’ అనే పేరు తెచ్చింది. విదేశీయుల నాలుకలపై అది ‘కోరమాండల్’గా మారింది. రాజేంద్ర చోళుడి హయాంలో బంగాళాఖాతాన్ని తమ సొంత సరస్సులా మార్చుకున్న చోళ నౌకాదళం, క్రీ.శ. 1025లో అంతర్జాతీయ వర్తక మార్గాలను అడ్డుకుంటున్న శ్రీవిజయ సామ్రాజ్యంపై విరుచుకుపడి మలక్కా జలసంధిని గుప్పిట్లోకి తెచ్చుకుంది. నాగపట్నం ప్రధాన రేవుగా చైనాలోని సాంగ్ రాజవంశంతో భారతీయ రత్నాలు, పట్టు వస్త్రాల వర్తకం సాగింది.
గోల్కొండ తీరం (క్రీ.శ. 1518 – 1687): కలంకారీ, వజ్రాల కాంతులు
కుతుబ్ షాహీల కాలంలో మచిలీపట్నం (బందరు) కేంద్రంగా ఉన్న తీరం ‘గోల్కొండ తీరం’గా ఖండాంతర ఖ్యాతి గడించింది. కొల్లూరు గనుల మేలిమి వజ్రాలు, ప్రపంచాన్ని మురిపించిన కలంకారీ అద్దకం వస్త్రాలు, మేలురకం ఉక్కు బందరు రేవు గుండా పర్షియా, యూరప్ దేశాలకు తరలిపోయేవి. 16, 17వ శతాబ్దాల్లో ప్రపంచ వస్త్ర విపణికి ఈ తీరమే ప్రధాన నాడీ కేంద్రంగా నిలిచింది.
ఉత్తర సర్కారులు (క్రీ.శ. 1753 – 1858): పరాయి పాలన నుంచి నేటి ఉత్తరాంధ్ర పిలుపు వరకూ..
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విస్తరణతో గుంటూరు నుంచి గంజాం వరకు విస్తరించిన మైదాన ప్రాంతం ‘ఉత్తర సర్కారులు’ (Northern Circars) గా మారింది. 1765లో మొఘల్ చక్రవర్తి షా ఆలం II ఇచ్చిన ఫర్మానా, నిజాంతో కుదిరిన ఒప్పందాలతో చికాకోల్, రాజమండ్రి, ఏలూరు, కొండపల్లి, గుంటూరు సర్కారులు బ్రిటిష్ పాలనలోకి వెళ్లాయి.
అయితే ఈ కాలంలోనే 1839 నవంబర్ 25 నాటి కోరంగి ఉప్పెన, 1864 అక్టోబర్ 5 నాటి మచిలీపట్నం పెను తుపానుల ధాటికి ప్రాచీన రేవులు తీవ్రంగా ధ్వంసమై తమ పూర్వ వైభవాన్ని కోల్పోయాయి.అయితే కాలక్రమంలో ఇప్పుడు అదే ఉత్తర సర్కారు ప్రాంతాలు ఉత్తరాంధ్రగా పిలుస్తున్నారు.

ఆధునిక భారతం (క్రీ.శ. 1947 నుంచి నేటి వరకు): ఉత్కళ, ఆంధ్ర తీరాల రక్షణ కవచం
1947 స్వాతంత్ర్యం తర్వాత భౌగోళిక సరిహద్దుల ప్రకారం ఈ తీరం ఒడిశాలో 480 కి.మీ ‘ఉత్కళ తీరం’గా, ఆంధ్రప్రదేశ్‌లో 974 కి.మీ ‘ఆంధ్ర తీరం’గా, తమిళనాడులో 1,076 కి.మీ ‘కోరమాండల్ తీరం’గా స్థిరపడింది. 1968లో ఏర్పాటైన విశాఖ తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం (ENC), 1971లో ప్రారంభమైన శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR), కేజీ బేసిన్ ఇంధన వనరులతో ఈ సాగర రేఖ దేశ రక్షణకు, అంతరిక్ష విజ్ఞానానికి వెన్నెముకగా నిలుస్తుంది.
కాలగర్భంలో కలిసిపోయిన శతాబ్దాల చరిత్రను స్మరించుకున్నప్పుడే, నేటి తరం ఈ సాగర తీరాన్ని విహార కేంద్రంగా కాక, జాతి అస్తిత్వ ప్రతీకగా చూడగలుగుతుంది.
Share this Article