Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Ellis Island – అమెరికా పారడాక్స్ వలస కథలకు అచ్చమైన సాక్ష్యం !!

October 13, 2026 by M S R

.

స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూడటానికి వెళ్తూ మధ్యలో ఎల్లిస్ ఐలాండ్‌లో కాసేపు ఆగాను… బయటికి చూస్తే అదొక చారిత్రక కట్టడం… లోపలికి వెళ్తే మాత్రం అదొక దేశపు పుట్టుక, ఎదుగుదల, వలసల చరిత్రకు సాక్ష్యం… అక్కడి బొమ్మలు, పాత ఫోటోలు, చార్టులు, ఏవీ ప్రజెంటేషన్లు చూస్తుంటే ఎన్నో ఆలోచనలు ఒక్కసారిగా ముప్పిరిగొన్నాయి…

అమెరికా అంటేనే వలసల దేశం… ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన మనుషులు తమ శ్రమతో, తెలివితేటలతో, ఆశలతో నిర్మించిన దేశం… ఆ దేశం తన గతాన్ని ఎంతో గర్వంగా చెప్పుకుంటుంది… కానీ అదే దేశం ఇప్పుడు వలసల విషయంలో అనుసరిస్తున్న వైఖరిని చూస్తే మాత్రం ఒక ప్రశ్న వేయకుండా ఉండలేం… ఒకప్పుడు వలసదారులను ఆహ్వానించి ఎదిగిన అమెరికా.. ఇప్పుడు కొత్తగా వచ్చే వలసదారులను ఎందుకు అడ్డుకుంటోంది..? పారడాక్స్… విరోదాభాస..!!

Ads

ఎల్లిస్ ఐలాండ్.. లక్షల ఆశలకు తొలి మజిలీ! న్యూయార్క్ హార్బర్‌లో ఉన్న ఎల్లిస్ ఐలాండ్‌ను చూస్తే అదొక చిన్న దీవి… కానీ అమెరికా చరిత్రలో దాని స్థానం చాలా పెద్దది. 1892 జనవరి 1న అక్కడ ఇమిగ్రేషన్ కేంద్రం ప్రారంభమైంది… 1954లో మూతపడే వరకు దాదాపు 1.2 కోట్ల మంది వలసదారుల ప్రవేశ ప్రక్రియ అక్కడే జరిగింది… ముఖ్యంగా యూరప్ నుంచి వచ్చినవారికి ఇది అమెరికాలోకి అడుగుపెట్టే ప్రధాన ద్వారంగా నిలిచింది…

ఆ దీవికి వచ్చిన ప్రతి ఒక్కరి కథా ఒకేలా ఉండేది కాదు… కొందరికి అది కొత్త జీవితానికి స్వాగత ద్వారం… మరికొందరికి అది కన్నీళ్ల మజిలీ… వైద్య పరీక్షలు, పత్రాల పరిశీలన, అధికారుల విచారణ.. అన్నీ దాటుకుని అనుమతి లభిస్తేనే అమెరికాలోకి ప్రవేశం… కొందరిని వెనక్కి పంపించేవారు కూడా… కాకపోతే అది 2 శాతమే అని అక్కడ చార్టులు చెబుతున్నాయి… అంటే అత్యంత ఉదారంగానే వలసల్ని అనుమతించినట్టే కదా…

ఇక్కడి ప్రదర్శనల్లో కనిపించే ప్రధాన సందేశం మాత్రం స్పష్టంగా ఉంటుంది… ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వలసదారులు అమెరికాను నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు… వాళ్ల శ్రమతోనే దేశం ఆర్థికంగా, సామాజికంగా ఎదిగింది… విభిన్న దేశాల నుంచి వచ్చిన ప్రజలు కలిసి ఒక బలమైన దేశాన్ని నిర్మించారు…

అది నిజంగా గర్వించదగిన చరిత్రే! కానీ ఆ చరిత్రను చదువుతున్నప్పుడే మరో విషయం గుర్తుకొస్తుంది… ఎల్లిస్ ఐలాండ్‌లో వలసల ప్రవేశ ప్రక్రియ 1954లోనే ముగిసింది… అంతకంటే ముందే, 1920లలో జాతీయత ఆధారంగా వలసలపై కోటాలు విధిస్తూ అమెరికా తన తలుపులను పరిమితం చేయడం ప్రారంభించింది… అంటే వలసలను స్వేచ్ఛగా ఆహ్వానించిన చరిత్రతోపాటే, ఎవరిని అనుమతించాలి, ఎవరిని అడ్డుకోవాలి అనే రాజకీయ చరిత్ర కూడా అమెరికాకు ఉంది…

memorial

వలసదారులతోనే ఎదిగి.. ఇప్పుడు వలసలకే అడ్డుకట్ట! అమెరికా అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు అక్కడికి వచ్చిన వలసదారుల పాత్రను విస్మరించలేం… వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు, నిర్మాణ రంగం నుంచి సాంకేతిక పరిజ్ఞానం వరకు, వ్యాపారాల నుంచి పరిశోధనల వరకు… ఎన్నో రంగాల్లో వలసదారులు తమ ముద్ర వేశారు… తరతరాలుగా అక్కడే స్థిరపడిన కుటుంబాలు అమెరికా సమాజంలో భాగమయ్యాయి…

ఇక్కడే అసలు వైరుధ్యం… ఒకప్పుడు తమ పూర్వీకులు మరో దేశం నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డ కుటుంబాల వారసులే ఇప్పుడు అమెరికా రాజకీయాల్లోనూ, పాలనా వ్యవస్థలోనూ కీలక స్థానాల్లో ఉన్నారు… వాళ్ల పిల్లలు అమెరికన్లు… వాళ్ల మనవళ్లు అమెరికన్లు… వాళ్లకు అమెరికానే సొంత దేశం… అది సహజమే…

కానీ వాళ్లు స్థిరపడిన తర్వాత వచ్చే కొత్తవాళ్ల విషయంలో మాత్రం ప్రశ్నలు మొదలవుతున్నాయి… ఎవరు రావాలి? ఎంతమంది రావాలి? వాళ్ల వల్ల స్థానికులకు ఉద్యోగాలు తగ్గుతాయా? దేశ భద్రతకు ముప్పు ఉందా? వలసల వల్ల ఆర్థిక వ్యవస్థకు లాభమా, నష్టమా?

ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడం ఏ దేశానికైనా అవసరమే… ఒక దేశానికి తన సరిహద్దులను నియంత్రించుకునే హక్కు ఉంటుంది… భద్రత, ఉద్యోగాలు, వనరులు, ప్రజాసేవలపై ఒత్తిడి వంటి అంశాలనూ విస్మరించలేం…

కానీ ఆ నియంత్రణకు ఒక చారిత్రక నేపథ్యం కూడా ఉంటుంది కదా! ఒకప్పుడు వలసదారులే తమ దేశాన్ని నిర్మించారని గర్వంగా చెప్పుకునే దేశం… ఇప్పుడు వలసలను పరిమితం చేయడాన్ని జాతీయ గొప్పతనంగా ఎలా నిర్వచిస్తోంది? ఇదే అసలు ప్రశ్న…

ellis

ట్రంప్ ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’… ఎవరి కోసం? డొనాల్డ్ ట్రంప్ రాజకీయాల్లో ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అనే నినాదానికి ప్రత్యేక స్థానం ఉంది… అమెరికా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడం, స్థానికుల ఉద్యోగాలను కాపాడడం, సరిహద్దులను కఠినంగా నియంత్రించడం… ఇవన్నీ ఆయన విధానాల్లో ప్రధాన అంశాలు…

ఆయన మద్దతుదారుల వాదనలోనూ ఒక కోణం ఉంది… దేశంలోకి ఎవరు పడితే వారు రావడానికి అనుమతించలేం… చట్టబద్ధమైన వలసలు ఉండాలి… దేశ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి… స్థానిక కార్మికుల ప్రయోజనాలను కాపాడాలి… ప్రభుత్వానికి వలసలపై నియంత్రణ ఉండాలి…

అయితే మరోవైపు చూస్తే, వలసలపై కఠినమైన వైఖరి వల్ల అమెరికాలో చదవాలని, పనిచేయాలని, స్థిరపడాలని ఆశించే లక్షల మందిలో అనిశ్చితి పెరుగుతోంది… ముఖ్యంగా సాంకేతిక రంగంలో నైపుణ్యమున్న విదేశీయులకు కూడా విధానపరమైన మార్పులు, వీసా నిబంధనలు, శాశ్వత నివాస అనుమతుల ప్రక్రియలో అడ్డంకులు ఎదురవుతున్నాయి… ఈ కోణంలో ట్రంప్ ధోరణి మరీ దూకుడుగా ఉండి, లక్షలాది మందిని ఆందోళనలోకి నెట్టేస్తోంది…

time square

2026 జనవరి నుంచి కొన్ని దేశాల పౌరుల ప్రవేశం, వీసాల జారీపై అమెరికా విస్తృత ఆంక్షలు అమల్లోకి వచ్చాయి… మరోవైపు, భారతీయ ఐటీ నిపుణులతో సహా విదేశీ నిపుణులకు సంబంధించిన ఉద్యోగ, శాశ్వత నివాస అనుమతుల విషయంలోనూ కఠినమైన చర్యలు వార్తల్లోకి వచ్చాయి… రోజుకొక నిర్ణయం ఓ పిడుగుపాటు…

మరి ‘అమెరికాను మళ్లీ గొప్పగా చేయడం’ అంటే ఏమిటి? విదేశీయుల రాకను తగ్గించడమేనా? లేక ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రతిభను ఉపయోగించుకుంటూ, స్థానికుల ప్రయోజనాలను కూడా కాపాడుకోవడమా? అమెరికా గొప్పతనాన్ని కొలిచే కొలమానం ఏదన్నది ఇక్కడ చర్చించాల్సిన విషయం…

అసలు ట్రూ అమెరికన్ ఎవరు? ఎల్లిస్ ఐలాండ్‌లో ఆ చరిత్రను చదువుతున్నప్పుడు నన్ను ఎక్కువగా ఆలోచింపజేసిన ప్రశ్న ఇదే… అమెరికాలో పుట్టినవాడే అసలైన అమెరికనా? అతడి తల్లిదండ్రులు వేరే దేశం నుంచి వచ్చి ఉండవచ్చు… తాతముత్తాతలు ఇంకో దేశం నుంచి వలస వచ్చి ఉండవచ్చు… మరి వాళ్లు వచ్చినప్పుడు అమెరికా తలుపులు తెరిచి ఉంటే, ఇప్పుడు అదే తలుపుల దగ్గర కొత్తగా వచ్చినవాళ్లను నిలిపివేసే అధికారం వాళ్లకు ఎక్కడి నుంచి వచ్చింది?

అదే సమయంలో, శతాబ్దాలుగా అమెరికాలో నివసించిన స్థానిక ఆదివాసీ ప్రజల చరిత్రను కూడా మర్చిపోలేం… యూరోపియన్ వలసలు పెరిగిన తర్వాత వారి భూములు, జీవన విధానాలు, జనాభా తీవ్రంగా దెబ్బతిన్నాయి… అందుకే అమెరికా వలసల చరిత్ర అంటే కేవలం విజయగాథ మాత్రమే కాదు… అది అవకాశాల కథ… అదే సమయంలో స్థానిక ప్రజలు ఎదుర్కొన్న విషాదాలు- నష్టాల కథ కూడా…

వలసదారులు లోకల్ అయ్యాక.. కొత్తవాళ్లు పరాయివాళ్లవుతారా? ఇది అమెరికాకు మాత్రమే పరిమితమైన ప్రశ్న కాదు… ప్రపంచంలోని అనేక దేశాల్లో కనిపించే సామాజిక పరిణామం…

.

ఎల్లిస్ ఐలాండ్ ఒకప్పుడు లక్షలాది మందికి అమెరికా కలల దేశమనే ఆశను ఇచ్చింది… ఇప్పుడు ఆ దీవి ఒక మ్యూజియంగా నిలబడి, ఆ కలల చరిత్రను కొత్త తరాలకు చెబుతోంది… అక్కడి నుంచి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ వైపు చూస్తే మరో ఆలోచన కలుగుతుంది… చేతిలో స్వేచ్ఛకు ప్రతీకగా నిలిచిన జ్యోతి… సముద్రం మీదుగా వచ్చే మనుషులకు ఒకప్పుడు ఆశాదీపంలా కనిపించి ఉంటుంది… మరి ఆ జ్యోతి వెలుగు ఎవరి కోసం?

ఒకప్పుడు లైట్ హౌస్‌లా దారిచూపిన, రారమ్మన్న దేశం ప్రస్తుతం ఇప్పటికే అమెరికన్లుగా మారిపోయిన వారి కోసమేనా? కొత్తగా అమెరికాకు రావాలని కలలు కంటున్న వారి కోసం కూడా ఉండాలా? ఎ బిగ్ డిబేటబుల్ క్వశ్చన్ !!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Ellis Island – అమెరికా పారడాక్స్ వలస కథలకు అచ్చమైన సాక్ష్యం !!
  • నిషా నూర్‌..! ఈమెదీ సిల్క్ స్మిత కథేనా..? డర్టీ పిక్చర్‌-2 అదేనా..?
  • ఘర్షణ వద్దు – అదెటు దారితీస్తుందో ఎవరూ చెప్పలేని రోజులివి !!
  • FSD … మస్కా కాదు, మస్క్ మార్క్ ఆటో పైలట్ Tesla కారు..!!
  • నిత్యం వార్తల్లో బొద్దింకలు ! రాహుల్‌ను సైడ్‌లైన్ చేసేందుకు బీజేపీ ప్లాన్ !!
  • తిలక్ వర్మ రనౌట్ స్వీయ తప్పిదమే… కానీ వెస్టిండీస్ క్రీడాస్పూర్తి !?
  • వేకువ ఝామున వెన్నెల మరకలుగా… రేపటి వాకిట ముగ్గులుగా…
  • క్రాంతికుమార్ – తెలుగు సినిమా కథల ప్రయోగాల సాహసి !!
  • 3 Statues Of Liberty – మూడు విగ్రహాలకూ ‘విముక్తి’ అంతఃసూత్రం !!
  • ఆంధ్రా తూర్పు తీరాన్ని.. నువ్వుల తీరం అనీ పిలిచారని తెలుసా ?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions