.
మూడు విగ్రహాలు… మూడు సందేశాలు… మన హైదరాబాద్‌కూ ఓ ప్రత్యేకత ఉంది! ఆగకుండా వర్షిస్తున్న ముసురులో న్యూయార్క్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూశాక అనుకోకుండా కొన్ని పోలికలు మదిలో గిర్రున తిరిగాయి… దేని కథ దానిదే, పోలిక దేనికి అంటారా..? అలా కొన్ని పోలికలు, ఆలోచనలు ముసురుగొంటాయి కొన్నిసార్లు… అవి చెప్పుకోవడమే… మూడింటికీ లిబర్టీతో సంబంధం ఉంది, ఎత్తు మరో విశేషం… నిర్మాణ కాలం ఏదైనా సరే…
ప్రపంచమంతా గొప్పగా చెప్పుకునే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహాన్ని చూడాలంటే అమెరికా వెళ్లాలి. స్టాట్యూ ఆఫ్ యూనిటీని చూడాలంటే గుజరాత్ వెళ్లాలి. కానీ మన హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో ఉన్న బుద్ధుడిని చూడాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. హైదరాబాద్‌లోనే ఉన్నాం కదా! ట్యాంక్‌బండ్‌కు వెళ్లి చూడొచ్చు. పడవలో ప్రయాణిస్తూ దగ్గరగా దర్శించుకోవచ్చు.
Ads
అయితే, ఈ మూడు విగ్రహాల మధ్య పోలిక ఏమిటి? ఎత్తులోనా? నిర్మాణంలోనా? చరిత్రలోనా? సందేశంలోనా? అన్నింటిలోనూ కొన్ని ప్రత్యేకతలున్నాయి. ముఖ్యంగా ఒక విగ్రహాన్ని చూసి మరొకటి తక్కువని చెప్పలేం. ఎందుకంటే వాటి లక్ష్యాలు వేరు. వాటి వెనుక ఉన్న భావాలు వేరు.
స్టాట్యూ ఆఫ్ లిబర్టీలో పేరులోనే లిబర్టీ ఉంది… దానికో చరిత్రా ఉంది… సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ అనైక్యత నుంచే కాదు, మన తెలంగాణకు లిబర్టీ ఇచ్చినవాడు… దర్శనీయుడు, స్మరణీయుడు… బుద్దుడు ప్రాపంచిక దుఃఖాల నుంచి వే ఆఫ్ లిబర్టీని (విముక్తి మార్గం) చూపించినవాడు… All are linked with Liberty…

ముందుగా ఎత్తుల లెక్క చూద్దాం!
స్టాట్యూ ఆఫ్ లిబర్టీ…… న్యూయార్క్ హార్బర్‌లో స్వాగతం పలుకుతున్నట్లుగా నిలబడే ఈ విగ్రహం మొత్తం ఎత్తు పీఠంతో కలిపి సుమారు 93 మీటర్లు. అంటే 305 అడుగులు. విగ్రహం ఒక్కటే సుమారు 46 మీటర్లు. ఫ్రాన్స్‌లో నిర్మించి, విడిభాగాలుగా అమెరికాకు తీసుకొచ్చి మళ్లీ అమర్చారు. 1886 అక్టోబర్ 28న అధికారికంగా ఆవిష్కరించారు. అమెరికా స్వాతంత్ర్య శతాబ్ది సందర్భంగా ఫ్రాన్స్ ఇచ్చిన స్నేహ కానుక ఇది. ఇప్పుడంటే ఏ చైనా కంపెనీయో కొద్ది నెలల్లో విగ్రహం డెలివర్ చేస్తుంది… 1886కన్నా ముందు అంటే ఇది నిర్మాణ అబ్బురమే…
స్టాట్యూ ఆఫ్ యూనిటీ…… గుజరాత్‌లోని సర్దార్ సరోవర్ డ్యామ్ సమీపంలో నిలిచిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహం. ఎత్తు 182 మీటర్లు, అంటే దాదాపు 597 అడుగులు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా గుర్తింపు పొందింది. 2013లో నిర్మాణం ప్రారంభమై, 2018 అక్టోబర్ 31న ప్రారంభించారు. భారతదేశంలోని సంస్థానాలను ఏకం చేయడంలో పటేల్ పోషించిన పాత్రకు గుర్తుగా ఈ విగ్రహాన్ని నిర్మించారు. అదే యూనిటీ స్పిరిట్… స్టాట్యూ ఆఫ్ లిబర్టీకన్నా ఎత్తుగా…
హైదరాబాద్ బుద్ధ విగ్రహం….. హుస్సేన్‌సాగర్ మధ్యలోని రాతి వేదికపై నిలిచిన గౌతమ బుద్ధుడి విగ్రహం ఎత్తు సుమారు 18 మీటర్లు, అంటే 58 అడుగులు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఏకశిలా బుద్ధ విగ్రహంగా ఇది ప్రసిద్ధి చెందింది… ఒకే భారీ తెల్ల గ్రానైట్ రాతి నుంచి చెక్కిన ఈ విగ్రహం బరువు 350 నుంచి 450 టన్నులు… 1992 డిసెంబర్ 1న హుస్సేన్‌సాగర్ మధ్యలో ప్రతిష్ఠించారు.
స్టాట్యూ ఆఫ్ లిబర్టీ… స్వేచ్ఛా దీపం! స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే కేవలం చేతిలో కాగడా పట్టుకున్న ఓ భారీ మహిళా విగ్రహం కాదు. దాని అధికారిక పేరు Liberty Enlightening the World. అంటే ప్రపంచానికి వెలుగునిచ్చే స్వేచ్ఛ. కుడిచేతిలో పైకెత్తిన కాగడా జ్ఞానానికి, వెలుగుకు ప్రతీక. ఎడమచేతిలోని పలకపై అమెరికా స్వాతంత్ర్య ప్రకటన (లిబర్టీ- ఫ్రీడం) తేదీ అయిన జూలై 4, 1776ను రోమన్ అంకెల్లో చెక్కారు. పాదాల దగ్గర విరిగిన సంకెళ్లు కూడా స్వేచ్ఛకు ప్రతీకలే. ఈఫిల్ టవర్‌తో అనుబంధమున్న ఇంజినీరింగ్ మేధస్సు ఈ విగ్రహ నిర్మాణంలోనూ కనిపిస్తుంది.
ఈ విగ్రహం వెనుక శిల్పి ప్రతిభ మాత్రమే లేదు. రెండు దేశాల స్నేహం, ప్రజల భాగస్వామ్యం, ఒక భావజాలం పట్ల నిబద్ధత కూడా ఉన్నాయి.
స్టాట్యూ ఆఫ్ యూనిటీ… దేశాన్ని ఏకం చేసిన నాయకుడికి నివాళి! భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వందలాది సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేయడంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌దే కీలక పాత్ర. అందుకే ఆయన భారత ఐక్యతకు ప్రతీక… ఆయనకు నివాళిగా నిర్మించిన స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఎత్తు స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి దాదాపు రెట్టింపు. అమెరికా విగ్రహం లిబర్టీని గుర్తుచేస్తే, గుజరాత్ విగ్రహం దేశాన్ని అనైక్యత నుంచి ట్రూ లిబర్టీ వైపు మళ్లించిన మార్గదర్శకుడిని గుర్తుచేస్తుంది… అఫ్‌కోర్స్, హైదరాబాద్ లిబర్టీ కూడా..!
మరి మన హైదరాబాద్ బుద్ధుడి కథేమిటి? 1985లో నిర్మాణ పనులు ప్రారంభం… ఆ భారీ గ్రానైట్ రాతి విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్ మధ్యలోకి తరలించడం అనుకున్నంత సులభం కాలేదు. 1990 మార్చిలో ప్రత్యేక బార్జ్‌పై తరలిస్తుండగా అది హుసేన్ సాగర్‌లో మునిగిపోయింది. విగ్రహాన్ని తిరిగి బయటకు తీసేందుకు నానా ప్రయాస… చివరకు 1992లో బయటికి తీసి ప్రతిష్టాపన జరిపారు…
మనిషి కోరికలకు బానిస కావచ్చు. అసూయకు, ద్వేషానికి, భయానికి, అహంకారానికి బందీ కావచ్చు. సంపద ఉన్నా ప్రశాంతత లేకపోవచ్చు. అధికారం ఉన్నా సంతృప్తి లేకపోవచ్చు. బుద్ధుడు చూపించిన విముక్తి మార్గం ఇక్కడే ప్రత్యేకం… అర్థం చేసుకోవడం, దాని కారణాలను తెలుసుకోవడం, దుఃఖ నిరోధానికి మార్గాన్ని అనుసరించడం. తృష్ణ నుంచి విముక్తి (లిబర్టీ) పొందే మార్గాన్ని చూపించడం…
దేని కథ దానిదే, దేని విశిష్టత దానిదే, దేని చరిత్ర దానిదే, దేని ప్రాంతీయత దానిదే… కానీ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూడగానే మిగతా రెండు ప్రత్యేక విగ్రహాలూ అలా గుర్తుకొచ్చాయి, అంతే… 1) ప్రపంచంలో తొలి ఎత్తయిన లిబర్టీ విగ్రహం… 2) ప్రపంచంలోకెల్లా ఎత్తయిన పటేల్ విగ్రహం, అనైక్యత నుంచి లిబర్టీ… 3 ప్రపంచంలోకెల్లా ఎత్తయిన ఏకశిలా విగ్రహం, ప్రాపంచిక దుఃఖాల నుంచి లిబర్టీ…
Share this Article