.
మొన్న చెప్పుకున్నాం కదా… తనలోని తెలంగాణతనాన్ని ఏళ్లుగా నిద్రపుచ్చిన తెలంగాణ బిడ్డ చంద్రబోస్ తొలిసారి కాస్త తెలంగాణ సోయితో భోగి అనే సినిమాకు ఓ పాట రాశాడనీ, బాగుందనీ..! ఐతే అది ప్యూర్ తెలంగాణ పాట ఏమీ కాదు, తెలంగాణ వ్యవహారిక ధోరణి, పదాలు ఇంకా పూర్తి మెలకువలోకి రాలేదు… ఆ పాటలో ఇంకా ఆంధ్రా వాసనలు ఉన్నాయనేదీ నిజమే…
అభ్యంతరకరం ఏమీ కాదు… కానీ స్వచ్ఛత 24 కేరట్లేమీ కాదు అని చెప్పుకోవడం… నో, నో, మీ అభిప్రాయం తప్పు, చంద్రబోస్ పాట ప్యూర్ తెలంగాణ మాండలికం అని కొందరు అభిప్రాయపడ్డారు… తప్పు, చంద్రబోస్ తన పాత వరంగల్ జిల్లాను, ఆ అస్థిత్వాన్ని ఏనాడో వదిలేశాడేమో గానీ… అదే వరంగల్ జిల్లాకు చెందిన నాకు నా యాస ఏమిటో తెలుసు… అందులోని విరుపు తెలుసు, మెరుపు తెలుసు, సొగసు తెలుసు… నేను నా భాషకు ప్రేమికుడిని…
Ads
సరే, పాటలోని పదాల్ని ఓసారి నెమరేసుకుంటూ… ఎక్కడెక్కడ సరిగ్గా పదాలు పడలేదో రాద్దామనుకున్నాను… ఈలోపు ఫేస్‌బుక్ మిత్రుడు Ratna Shree రాసిన పోస్టు కనిపించింది… అందులో కొన్ని బాగా పట్టుకుని, వివరంగా రాసుకొచ్చాడు… వరంగల్ జిల్లా కదా… ఇట్టే పట్టేశాడు… బాగుంది, ఆ ఉదాహరణలు చెప్పుకుంటే చాలు, చంద్రబోస్ తన ఉనికిని, తన సోయిని చాటుకోవడానికి ఇంకా చాలా శ్రమపడాలని చెప్పడానికి…
కొన్నాళ్లు చల్లగరిగెలో ఉండి, నీ ఊరివాళ్లు, మిత్రులతో సంభాషించు చంద్రబోస్… అప్పుడే నీ తెలంగాణ మలి పాటకు పదును… జోక్ కాదు, వెక్కిరింపు కాదు… దిద్దుబాటుకు వెరపెందుకు..? భేషజం ఎందుకు..? సరే, రత్నశ్రీ పోస్టు చదువుదాం… ఇదుగో…

ఫస్ట్ టైం అనుకుంటా చంద్రబోస్ తెలంగాణ మాండలికంలో పాట రాశాడు. బాగుంది.
ఒగ్గుకథ ట్యూన్ లో పాటని భీమ్స్ బాగా నడిపించాడు. డౌట్ లేదు.
అంతా బానే ఉంది కానీ.. చంద్రబోస్
ఒక చరణంలో అన్వయాలను మిస్ మ్యాచ్ చేశాడు.
మేదరి నరసన్న
బుట్టలు తేవంగ
తట్టలు తేవంగా
దీనికి బదులుగా
మేదరి నరసన్న
వెదుర్లు చీరంగా
బుట్టలు అల్లంగా
అని రాస్తే బాగుండేది
కమ్మరి గంగన్న
కత్తులు తేవంగా
కొడవళ్లు తేవంగా
దీనికి బదులుగా
కమ్మరి గంగన్న
కత్తులు సరపంగా
కొడవళ్లు నూరంగా
అని రాస్తే బాగుండేది
సాకలి సమ్మన్న
బట్టలు సుట్టంగా
బట్టలు సుట్టంగా
దీనికి బదులుగా
సాకలి సమ్మన్న
బట్టలు ఉతకంగా
మూటలు ముడువంగా
అని రాస్తే బాగుండేది
మాదిగ ఐలన్న
డప్పులు కొట్టంగా
సప్పుడు చేయంగా
దీనికి బదులుగా
మాదిగ ఐలన్న
దరవులు వేయంగా
సప్పుడు చేయంగా
అని రాస్తే బాగుండేది (అఫ్‌కోర్స్, డప్పులు కొట్టంగా కూడా బాగానే ఉంది)
గొల్లోల్ల సులోచన
మోదుగాకు తేవంగా
విస్తర్లు కుట్టంగా
దీనికి బదులుగా
గొల్లోల్ల సులోచన
మోదుగాకు తెంపంగా
విస్తర్లు కుట్టంగా
అని రాస్తే బాగుండేది
ఇక్కడ సీక్వెన్స్ మిస్ అయ్యాడని నా ఫీలింగ్.
తతిమ్మాది అంతా బరాబర్ ఉంది….
Share this Article