.
ఐడీబీఐ బ్యాంకును కొనేది ఒకప్పటి మన హైదరాబాదీయే… అవును, నిజమే… ప్రేమ్ వత్స తన పేరు… అసలు పేరు పున్నా రంగారావు వత్స అలియాస్ కెనడా వారెన్ బఫెట్… ఇంకాస్త వివరాల్లోకి వెళ్దాం…
కెనడా ‘వారెన్ బఫెట్’ ప్రేమ్ వత్స… హైదరాబాద్ వేర్లు నుంచి ఐడీబీఐ మెగా డీల్ వరకు… ప్రపంచ ఆర్థిక రంగంలో అసాధారణ పెట్టుబడిదారుడిగా, ‘కెనడా వారెన్ బఫెట్’ గా పేరుగాంచిన ప్రఖ్యాత భారతీయ-కెనడియన్ బిలియనీర్ ప్రేమ్ వత్స (Prem Watsa) మరోసారి సంచలనం సృష్టించాడు…
Ads
ఆయన సారథ్యంలోని ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ (Fairfax Financial Holdings) సంస్థ భారత బ్యాంకింగ్ చరిత్రలోనే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI) డీల్‌కు రంగం సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీ (LIC) సంయుక్తంగా కలిగి ఉన్న సుమారు 60.72% ఐడీబీఐ బ్యాంక్ (IDBI Bank) వాటాను రూ. 52,878 కోట్లకు (సుమారు 5.56 బిలియన్ డాలర్లు) కొనుగోలు చేసేందుకు ఫెయిర్‌ఫాక్స్ పెట్టిన బిడ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
సరిగ్గా ఇదే తరుణంలో, మన హైదరాబాద్‌తో విడదీయరాని బంధం ఉన్న ప్రేమ్ వత్స నేపథ్యం, ఆయన ప్రయాణం మరియు ఈ సరికొత్త మెగా డీల్ విశేషాలు ఆసక్తికరంగా మారాయి…

హైదరాబాద్ నుంచి కెనడా శిఖరాల వరకు… ప్రేమ్ వత్స ప్రయాణం … 1950 డిసెంబర్ 20న హైదరాబాద్‌లో ఓ క్రిస్టియన్ కుటుంబంలో జన్మించిన పున్నా రంగారావు వత్స (ప్రేమ్ వత్స అసలు పేరు) విద్యాభ్యాసమంతా ఇక్కడే… (తండ్రి ఓ టీచర్)… హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS) లో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆయన, ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), మద్రాస్ నుంచి కెమికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందాడు…
ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత కెనడా వెళ్లిన ఆయన, అక్కడ ఒంటారియోలోని ఐవీ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశాడు… సాధారణ ఉద్యోగంతో కెరీర్ ప్రారంభించిన ఆయన, అసాధారణ వ్యాపార దార్శనికతతో 1985లో టొరంటో కేంద్రంగా ‘ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్’ సంస్థను స్థాపించాడు…
వారెన్ బఫెట్ శైలి పెట్టుబడులు: మార్కెట్ ఒడిదుడుకులను లెక్కచేయకుండా, దీర్ఘకాలిక విలువ ఉన్న క్షీణించిన లేదా అండర్వాల్యూ అయిన వ్యాపారాలను గుర్తించి వాటిలో భారీగా పెట్టుబడులు పెట్టడం ప్రేమ్ వత్స శైలి… అందుకే ఆయనను కెనడా వారెన్ బఫెట్‌గా పిలుస్తారు…
భారత్‌పై ప్రత్యేక మమకారం: విదేశాల్లో స్థిరపడినప్పటికీ, భారతీయ మూలాలను ఎప్పుడూ మరిచిపోని ఆయన… భారత్ అభివృద్ధి కథపై అపారమైన నమ్మకంతో ఇక్కడ టెలికాం, డిజిటల్ ఇన్సూరెన్స్ (డిజిట్ ఇన్సూరెన్స్), ఫైనాన్స్, మౌలిక వసతులు, ఎన్బీఎఫ్సీ రంగాలలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాడు…
ఐడీబీఐ బ్యాంక్ మెగా డీల్- అసలు విషయాలు … భారత ఆర్థిక రంగంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద క్రాస్-బోర్డర్ బ్యాంకింగ్ డీల్ ఇదే కావడం విశేషం. కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న 30.48%, ఎల్ఐసీ (LIC) వద్ద ఉన్న 30.24% కలిపి మొత్తం 60.72% వాటాలు ఫెయిర్‌ఫాక్స్ అధీనంలోకి వెళ్లనున్నాయి. షేరు ధరను రూ. 81 చొప్పున నిర్ణయించారు…
రికార్డు లాభాల బాటలో ఐడీబీఐ: ఒకప్పుడు మొండి బకాయిలు (NPA), ఆర్బీఐ పీసీఏ (PCA) ఆంక్షలతో సతమతమైన ఐడీబీఐ బ్యాంక్, ఇటీవలి కాలంలో అద్భుతంగా కోలుకోవడం విశేషం… 2025-26 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ ఏకంగా రూ. 9,513 కోట్ల నికర లాభాన్ని ఆర్జించడంతో పాటు, దీని క్యాపిటల్ అడిక్వసీ రేషియో 26.65% కి మెరుగుపడింది…
భారీ ఆర్థిక సామ్రాజ్య నిర్మాణం: ఈ కొనుగోలు ద్వారా భారతదేశంలో బ్యాంకింగ్, బీమా (డిజిట్ ఇన్సూరెన్స్), వెల్త్ మేనేజ్మెంట్ (ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్) తదితర సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చి ఒక శక్తివంతమైన ఆర్థిక సామ్రాజ్యాన్ని (Financial Services Powerhouse) సృష్టించాలని ప్రేమ్ వత్స ప్రణాళికా రచన చేశాడు..
చివరగా… ప్రేమ్ వత్స భార్య పేరు నళినీ లోకనాథన్… ఐఐటీలో చదువుతున్నప్పుడు ఆమెతో పరిచయం… ఇద్దరు బిడ్డలు (Christine and Stephani) ఒక కొడుకు (Benjamin)…
- అతను తన జేబులో కేవలం 8 రూపాయలతో కెనడాకు వచ్చాడు, అది సుమారు 15 సెంట్లకి సమానం… తన చదువు కోసం, తను శీతాకాలంలో లెనాక్స్ ఫర్నేస్‌లను, వేసవిలో ఎయిర్ కండిషనర్ల సేల్స్‌మన్‌గా పనిచేశాడు…. ఇప్పుడు కెనడాలో అత్యధిక ధనవంతుల జాబితాలో 31 స్థానం..!! అన్నట్టు, బ్లాక్‌బెర్రీ ఫోన్లు తెలుసు కదా, ఆ కంపెనీని తనే కొనుగోలు చేశాడు..!!
Share this Article