.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన కొర్రీలకు గోదావరి- బనకచర్ల ప్లాన్లు అడ్డంగా ఫెయిలై… ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడిక తమిళనాడు సీఎం విజయ్ ద్వారా నరుక్కొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టాడా..? మొన్న ఏపీకి వచ్చిన విజయ్- చంద్రబాబు మంతనాల్లో బనకచర్ల / నల్లమలసాగర్ కూడా ఓ ప్రధానాంశమేనా..? తమిళనాడు నుంచి నరుక్కొస్తే కర్నాటక సీఎం డీకే శివకుమార్ కూడా సహకరిస్తాడా..?
కేసీయార్ భారీ ఏటీఎం కాళేశ్వరం ప్రాజెక్టును చూసిన చంద్రబాబు అదే రీతిలో బనకచర్ల ప్లాన్ చేశాడనేది పొలిటికల్ సర్కిళ్లలో ఉన్న ప్రచారమే… గోదావరి వృథాజలాల పేరిట ఓ ప్రహసనానికి తెరతీశాడు… తరువాత బనకచర్ల గాకుండా నల్లమలసాగర్ అని మార్చాడు… ఐతే అది తెలంగాణ నీటిప్రయోజనాలకు నష్టదాయకం కాబట్టి రేవంత్ రెడ్డి ఆ ప్లాన్లకు రకరకాల మార్గాల్లో అడ్డుకట్టలు వేశాడు…
Ads
దాంతో చంద్రబాబు ప్లాన్లు అనుకున్నట్టుగా సాగలేదు… ఇది అంతర్రాష్ట్ర వ్యవహారం, నదీజలాల హక్కుల విషయం కావడంతో కేంద్రం కూడా చంద్రబాబు ఒత్తిళ్లకు లొంగలేదు… అలా ఆ ప్రాజెక్టు అభయెన్స్లో పడింది… మరి తమిళనాడు ఎలా సహకరించగలదు, దాని ప్రయోజనాలు ఏమిటి అంటారా..?
కావేరి ఎప్పుడూ కర్నాటక- తమిళనాడు నడుమ ఓ తీవ్ర వివాదాంశం… గొడవలు, ఉద్రిక్తతలు, రాజకీయాలు అన్నీ… కావేరి మీద తమిళనాడుకు తరలింపు ఒత్తిడి తగ్గాలంటే… గోదావరి- కావేరి అనుసంధానం జరగాలి… ఏ కాలం నుంచో మహానది నుంచి కావేరి నదుల అనుసంధానం ప్రతిపాదన ఉంది, కేంద్రం చేపట్టాలి… కానీ ఈ వ్యవహారంలో చాలా చిక్కులున్నాయి… లెక్కలున్నాయి…
ఒడిశా, చత్తీస్గఢ్, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ అంగీకారాలు అవసరం… మహానదిలో అంతగా నీటిలభ్యత లేదు, సో, ఇచ్చంపల్లి నుంచి కావేరి లింక్ చేపట్టాలని మరో ఆలోచన… ఇప్పుడు చంద్రబాబు బనకచర్ల ఆలోచన గోదావరి టు పెన్నా… కానీ దాన్ని కావేరి దాకా పొడిగించే ప్రతిపాదనను ముందుపెట్టి తమిళనాడు- కర్నాటక సహకారం పొందాలనేది చంద్రబాబు ప్లాన్ అని చెబుతున్నారు…
చంద్రబాబు- విజయ్ నడుమ నీటిమంతనాల అసలు సారాంశం ఏమిటో గానీ… బయటికి మాత్రం ఇద్దరు ముఖ్యమంత్రులు గోదావరి- కావేరి అనుసంధానం గురించి చర్చించారనే బేసిక్ న్యూస్ పాయింట్ మాత్రం బయటికి వదిలారు… బహుశా గోదావరి- కావేరి… అంటే పోలవరం- కావేరి ప్రతిపాదించి, జాతీయ ప్రాజెక్టు హోదా సాధించి, పోలవరంలాగే దాన్ని కూడా చంద్రబాబే చేపట్టేలా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలనేది ప్లాన్ కావచ్చునని ఇంజినీరింగ్ నిపుణుల స్థూలాభిప్రాయం…

ఆ భేటీలో చర్చించిన ప్రతిపాదిత మార్గాన్ని ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలా వివరించింది… గోదావరి → కృష్ణా → బొల్లాపల్లి రిజర్వాయర్ → బనకచర్ల → పెన్నా → కండలేరు → కావేరి నదీ వ్యవస్థ… సీఎం విజయ్ ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాధాన్య ప్రాజెక్టుగా ప్రకటించాలని ప్రధాని మోదీని ఇప్పటికే కోరినట్లు కూడా వార్త పేర్కొంది…
సో… గోదావరి — పోలవరం… ప్రకాశం బ్యారేజీ / నాగార్జునసాగర్ కాలువల వ్యవస్థ… బొల్లాపల్లి — బనకచర్ల లేదా నల్లమలసాగర్… పెన్నా — సోమశిల / కండలేరు… కావేరి నదీ వ్యవస్థ… ఇదీ రఫ్ ప్రతిపాదన కావచ్చు…
ఇదే అసలు కీలకమైన అవకాశం… రాష్ట్రానికి మాత్రమే ఉపయోగపడే సాగునీటి ప్రాజెక్టుగా కాకుండా, దక్షిణాది రాష్ట్రాల నీటి భద్రతకు ఉపయోగపడే అంతర్రాష్ట్ర నదుల అనుసంధాన ప్రాజెక్టుగా రూపొందిస్తే, కేంద్రం నుంచి ఆమోదాలు, ఆర్థిక సహాయం కోరడానికి బలమైన ప్రాతిపదిక ఏర్పడుతుంది…
అయితే కేంద్ర నిధులు ఆటోమేటిక్గా రావు… ప్రాజెక్టు రూపకల్పన, నీటి లభ్యత, రాష్ట్రాల మధ్య అంగీకారం, తుది డీపీఆర్, పర్యావరణ అనుమతులు, ఆర్థిక నమూనా వంటి అంశాలు తేలాలి… ఎగువ రాష్ట్రాల ఒప్పుకోలు అన్నింటికన్నా ముఖ్యం… అయితే కృష్ణాలో మాకు న్యాయం జరిగితే, దీనికి ఏపీ, కర్నాటక అంగీకరిస్తే, గోదావరిపై కొంత ఉదారంగా సడలింపులకు తెలంగాణ సై అంటోంది..!!
Share this Article