.
కాశీపురం ప్రభాకర్ రెడ్డి ……. *గరివిడి లక్ష్మి కాదు.. తెలుగునాట ఇంటింటి మాలక్ష్మి*
———————–
నేను థియేటర్ దాకా వెళ్ళి సినిమాలు చూసేది చాలా తక్కువ. అందుకు తగ్గ కారణాలు ఉన్నాయి.
ఈ మధ్య గరివిడి లక్ష్మి సినిమాకు సంబంధించిన పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. చాలా ఏళ్ల క్రితం ఆమె పేరు విన్న జ్ఞాపకాలు కొన్ని వెన్నాడటంతో ఈ సినిమా చూడాలనుకున్నాను. బయోపిక్ సినిమాలన్నా, పుస్తకాలన్నా నాకు ఆసక్తి మెండు.
…. సినిమా గురించి రాసే ముందు.. నాకు ఈ సినిమా ఎందుకు చూడాలనిపించిందో కొన్ని విషయాలు నా పాఠకులతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు సందర్భోచితం కూడా…
……
అది 1998 సంవత్సరం అనుకుంట. హైదరాబాద్ లో సినిమా field లో ఉండే అంజిబాబు అనే మిత్రుడు, మరో ఇద్దరితో నంద్యాల వచ్చి నన్ను కలిశాడు.
తాను “ఆనందం” అనే పాటల ఆల్బమ్ చేస్తున్నానని మద్రాస్ లో రికార్డింగ్ చేయించాల్సి ఉందనీ, దానికోసం ఎనభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పాడు. ఒక 20,000 రూపాయలు కాంట్రిబ్యూట్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. అతడు ఒక ఫోటోగ్రాఫర్ . “ఆనందం” పేరుతో ఒక పోస్టర్ కూడా తెచ్చి నా ఆఫీస్ గోడకు అతికించాడు.
Ads
ప్రైవేట్ పాటల ఆల్బమ్ రూపొందించి మార్కెట్ చేసుకోగలవా.?. అంత పెట్టుబడి పోను ఆదాయం వస్తుందా..? అని అడిగాను. అందుకతడు.. ఆదాయం వస్తుందని కాదు గానీ, ఈ క్యాసెట్ ద్వారా ఆర్ పి పట్నాయక్ అనే యువ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ను వెలుగులోకి తెస్తున్నాం” అన్నాడు. ఆ మాట నన్ను టచ్ చేసిందనే చెప్పాలి.
భోజనాలయ్యాక 20,000 రూపాయలు అతడికి అందిస్తూ..” నీ క్యాసెట్ ద్వారా లాభాలేమైనా వస్తే నా డబ్బు నాకు తెచ్చివ్వు.. ఒకవేళ పెట్టుబడి వెనక్కి రాకపోతే, నువ్వు చెప్పిన ఆ ట్యాలెంట్ ను ప్రోత్సహించిన వాడిని అవుతాను ” అంటూ ఆల్ ది బెస్ట్ చెప్పాను. దాదాపు నెల రోజులు గడిచినా నాకు ఎలాంటి సమాచారం లేదు. ఏదో పని మీద హైదరాబాద్ పోయినప్పుడు అంజిబాబు ఇంటికి వెళ్ళాను.
సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రికి సమీపంలో ఉన్న షిర్డీ అపార్ట్మెంట్ లో అతడి నివాసం. అక్కడే తన స్టూడియో కూడా నడుపుతున్నాడు. ఒక సిగరెట్ కంపెనీ ప్రొడక్ట్ గురించిన షూటింగ్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈలోగా జీన్ ప్యాంట్ వేసుకున్న ఒక యువకుడు అక్కడికి వచ్చి నా పక్కనే నిలుచున్నాడు.
అంజిబాబు మా ఇద్దరినీ పరిచయం చేస్తూ..” ఈయన పేరు ఆర్ పి పట్నాయక్.. మేం ముద్దుగా ఆర్ పి. అని పిలుస్తాం.. మనం ప్రొడ్యూస్ చేస్తున్న మ్యూజిక్ క్యాసెట్ కు ఇతడే డైరెక్టర్.. సింగర్ కూడా” అన్నాడు. నేను ఎంతో హ్యాపీగా feel అయ్యాను. ఇద్దరం మాట్లాడుకుంటూ మెట్లెక్కి టెర్రేస్ చేరుకున్నాం. కాసేపు మ్యూజిక్ పోకడల గురించి చర్చించాం. అక్కడ కూర్చున్న అరగంట సేపు ఏదో ఒక రాగం హమ్ చేస్తూనే ఉండటం గమనించాను.
మధ్యలో ఒకసారి. “మీ ఫ్రెండ్ ఆ క్యాసెట్ రిలీజ్ ను ఆలస్యం చేస్తూ నా ట్యాలెంట్ అణచి వేస్తున్నాడు సార్” అన్నాడు నవ్వుతూ..
నేను కూడా అతడి నవ్వుతో శృతి కలిపేశాను.
అంజిబాబుకు తీరికయ్యాక మా దగ్గరికి వచ్చాడు. మరో వారం లేదా పది రోజుల్లో రిలీజ్ చేస్తున్నట్టు చెప్పాడు.
.. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆ క్యాసెట్ రిలీజ్ చేసారు. ఫంక్షన్ లాంటిది ఏదైనా చేసారో లేదో గుర్తు లేదు కానీ నాకు సరైన సమాచారం కూడా లేదు. కొరియర్ లో రెండు క్యాసెట్లు పంపారు. ఆ పాటలు వినసొంపుగానే ఉన్నాయి.
….. ఇదే పట్నాయక్ మరికొన్ని రోజులకు .. నీ కోసం, చిత్రం, నువ్వు నేను.. అనే సినిమాలకు బాణీలు ఇచ్చి పెద్ద మ్యూజిక్ డైరక్టర్ అయ్యాడు.
…….
హైదరాబాద్ లో అంజిబాబు స్టూడియో కు వెళ్ళినప్పుడల్లా ఆర్ పి పట్నాయక్ గురించిన చర్చ వచ్చేది. పేరు జ్ఞప్తికి లేదు గానీ తనకు తాను అసోసియేట్ డైరెక్టర్ అని చెప్పుకునే ఒక లావుపాటి వ్యక్తి కలిసేవాడు.
శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన గరివిడి లక్ష్మి అనే కళాకారిణి పాడే బుర్రకథల పాటలనే తన సినిమా బాణీలుగా చేసి ఆర్ పి పట్నాయక్ వాడుకుంటాడని చెప్పేవాడు. ఒకసారి ఆమె పాడిన బుర్రకథ క్యాసెట్ కూడా నాకు ఇచ్చాడు.
ఆ విధంగా నేను ఆ మహా కళాకారిణి పేరు విన్నాను.

……..
2002 లో నేను ఈనాడు దినపత్రికకు న్యూస్ కంట్రిబ్యూటర్ గా ఉన్నప్పుడు కర్నూలు డెస్క్ లో సబ్ ఎడిటర్ గా చేసే శివ ప్రసాద్ తో స్నేహం కుదిరింది. ఇతడు కూడా శ్రీకాకుళం జిల్లా వాడే.
మాటల సందర్భంగా తనో మ్యూజిక్ కంపోజర్ అనీ, సినిమా రంగంలోకి వెళ్లాలని ఉందని చెప్పాడు.
నేను ఆర్ పి పట్నాయక్ ఉదంతం చెప్పాను.
అయితే తనకు ఆర్ పి ని పరిచయం చేయాలని కోరాడు.
“నేను ఒక్కసారే కలిశాను.. నన్ను గుర్తు పడతాడో లేదో కూడా తెలియదు .. నీకు అంజిబాబును పరిచయం చేస్తా, అతడు నిన్ను ఆర్ పి దగ్గరికి తీసుకెళ్తాడు” అని చెప్పాను.
హైదరాబాద్ వెళ్ళి అంజిబాబును కలిశాం.
” కలవటం ఎందుకబ్బా.. నువ్వు సినిమా ఫీల్డ్ లోకి రావాలనుకుంటున్నావు కాబట్టి నీ మ్యూజిక్ తో ఒక క్యాసెట్ తయారు చేసి.. ఆర్ పి చేతుల మీదుగా రిలీజ్ చేద్దాం” అని సూచించాడు.
అయ్యప్ప మాల సీజన్ కాబట్టి అయ్యప్ప భక్తి పాటలతో క్యాసెట్ చేస్తే జనాల్లోకి బాగా పోతుందని సలహా ఇచ్చాడు.
శ్రీనగర్ కాలనీలో శశి ప్రీతం అనే మ్యూజిక్ డైరెక్టర్ ఒక రికార్డింగ్ స్టూడియో నడిపే వాడు. ఆ స్టూడియోను గంటల లెక్కన బాడుగకు తీసుకొని రికార్డింగ్ మొదలెట్టాం. శివ ప్రసాద్ ( శివ నందిగాం) అద్భుతమైన ట్యూన్లు ఇచ్చాడు.
- రికార్డింగ్ కోసం ఆ స్టూడియోకు కొందరు వాయిద్యకారులు వచ్చే వారు. విరామ సమయంలో తబలా ఆర్టిస్ట్ ఒకతను
” బాయ్ బాయే బంగారు రమణమ్మ” అంటూ పాడుతూ వాయించే వాడు.
“ఖుషీ ” సినిమాలోది కదా ఈ పాట..!?” అని అడిగాను.
“కాదు సార్.. ఇది ఒరిజినల్ గా గరివిడి లక్ష్మి పాడిన పాట” అన్నాడు.
“మరి ఆమెకి చెప్పకుండా ఆ ట్యూన్ ఎలా వాడారు..?”
అని సందేహం వ్యక్తం చేసాను.
సినిమా field లో అంతే సార్.. మనం క్యాష్ చేసుకున్నామా లేదా అనేదే ముఖ్యం”. అన్నాడు.
నేను ఆశ్చర్యపోయాను.
ఇలా రెండోసారి ఆ కళాకారిణి గురించి వినటం.

సింగర్లు రవి వర్మ, భీం శంకర్, మాధవిలను ఎంగేజ్ చేసుకుని పాటలు పాడించాం. మొత్తానికి “శరణం” పేరుతో ఒక క్యాసెట్ తయారు చేశాం.
అంజిబాబు, శివ ప్రసాద్ Prasu N S
ఈ ఇద్దరూ కలిసి ఎంత పెట్టారో కానీ నన్ను మొహమాట పెట్టీ 50,000 దాకా ఖర్చు పెట్టించారు. క్యాసెట్ పై నా పేరు కూడా లేకుండా నిర్మాత అంజిబాబు అని వేసుకున్నాడు. నా మిత్రుడు శివ మ్యూజిక్ డైరెక్టర్ అయితే చాలు అనుకుని నేను అసలు పట్టించుకోలేదు.
ఇక క్యాసెట్ విడుదల కోసం ఆర్ పి ని పిలవాల్సి ఉంది.
మేం ఆ సమీపం లోనే ఉన్న ఆర్ పి. రికార్డింగ్ స్టూడియో కి వెళ్ళాం.
సంతోషం సినిమా బ్యాక్ గ్రౌండ్ రికార్డింగ్ పనుల్లో ఆర్ పి బిజీగా ఉన్నారని చెప్పారు.
ఆ తర్వాత శ్రీనగర్ కాలనీలో.. ఆర్ పి నివాసానికి నేరుగా వెళ్ళి కలిశాం. నన్ను గుర్తు పట్టలేదు.
ఆయన ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే క్యాసెట్ విడుదల తేదీ నిర్ణయించాం. మా మ్యూజిక్ డైరెక్టర్ శివ ప్రసాద్ కజిన్ ( వార్త రిపోర్టర్) కి మంత్రి కోడెల శివ ప్రసాద్ బాగా సన్నిహితం. అందరం వెళ్ళి ఆయనను కూడా ఆహ్వానించాం.
…. మా “శరణం” క్యాసెట్ విడుదల రోజు రానే వచ్చింది సత్యసాయి మంటపం పక్కనే ఉన్న అయ్యప్ప స్వామి ఆలయమే వేదిక అయింది.
ఆర్ పి పట్నాయక్ తో పాటు అతిథులు, మీడియా వారు బాగానే వచ్చారు. మంత్రి కోడెల గారి కోసం ఎదురు చూస్తున్నాం. సినిమా ఫీల్డ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న యుగంధర్ అనే వ్యక్తి వచ్చి కలిశాడు.
మాటల్లో.. శివ కూడా శ్రీకాకుళం జిల్లా వాడేనన్న సంగతి తెలుసుకున్నాడు.
” ఏం మిత్రమా.. గరివిడి లక్ష్మి ట్యూన్ ఏదీ వాడుకోలేదా..?” అని సరదాగా అడిగాడు.
నేనైతే ” ఎవరీ గరివిడి లక్ష్మి..? సినిమా ఫీల్డ్ లో ఇంత పాపులరా..”?” అని ఒకింత షాక్ కి గురయ్యాను.
…..

….. శివ ప్రసాద్ .. NS Prasu పేరుతో కొన్ని సినిమాలు చేశాడు. అతడి సినీ ప్రయాణం ఎంత వరకు సాగింది.. .? ఆ ప్రాజెక్టు ల కోసం పెట్టిన డబ్బులు నాకు తిరిగొచ్చాయా లేదా ..లాంటి విషయాలు నేను వివరించదల్చుకోలేదు.
ఆ గరివిడి లక్ష్మి ఏమైందో కూడా తెలియదు.
ఇదిగో.. ఇన్నాళ్ళకి ఆ పేరు మళ్ళీ మారుమోగుతోంది.
ఆమె పేరుతో సినిమా తీశారు అని తెలిశాక.. చూసి తీరాలనే పట్టుదల పెరిగింది.
……….
ఇప్పుడు మళ్లీ ఆ సినిమా ముచ్చటకొస్తాను
పండక్కి ఇంటికొచ్చిన నా కూతురు హంస తో ఈ సినిమా ప్రపోజల్ పెట్టాను.
” వద్దు నాన్నా.. జైలర్ 2 సినిమా వెళ్దాం పద.. నువ్వు చెప్పే సినిమా ఇంకెప్పుడైనా చూద్దాం” అన్నది.
ఆమె మనసంతా రజనీకాంత్ యాక్షన్ సినిమా పైనే ఉందని నాకర్థమైంది. అయినా కష్టపడి కన్విన్స్ చేసి గరివిడి లక్ష్మి
సినిమాకు తీసుకెళ్ళాను.
నంద్యాల శ్రీరాం టాకీస్ వెళ్లి థియేటర్ లో కూర్చుంటే కేవలం ఆరు మంది ఆడియన్స్ ఉన్నారు.
నేను నా కూతురు ముఖం గమనించాను. తను చాలా అప్సెట్ లో ఉంది. నా సినిమా అభిరుచిని తనపై బలవంతంగా రుద్దటం లేదు కదా. ! అనిపించింది.
కాసేపట్లోనే సినిమా ఆరంభం అయింది. ఇంట్రో పార్ట్ చూస్తూ ఇంకేదో బయోపిక్ సినిమాను అనుకరిస్తున్న భావన కలిగింది. కొద్ది సేపట్లోనే సినిమా నన్ను లీనం చేసేసుకుంది. ఈ సినిమా హీరో, హీరోయిన్, దర్శకుడు లేదా నిర్మాణ సంస్థ.. ఇలా ఏ వివరాలు నాకు తెలియవు. ఒక్క నరేష్ తప్ప వేరే తెలిసిన ముఖమేది లేదు. అయినా నేను కన్నార్పకుండా చూశాను.
నా కూతురు ఆ సినిమా కథతో మమేకం అయిపోయింది.

…..
ఎంత గొప్పగా తీశారంటే..
సినిమాలో పాత్రలు తప్ప, పాత్రధారులు ఎవ్వరూ నాకు కనిపించలేదు. సినిమా కథ, కథనం, సంగీతం అన్నీ అద్భుతంగా కుదిరాయి.
ఇంటర్వెల్ చాలా తొందరగా అయింది. హాలు మొత్తం కలియచూసినా 20 మంది కంటే ఎక్కువ లేరు.
నాకు చాలా బాధ కలిగింది. ఇంత మంచి సినిమాకు ఆడియన్స్ లేరంటే ఈ సినిమా యూనిట్ ఎంత బాధ పడుతుందో కదా అనిపించింది.
ఇంటర్వెల్ గ్యాప్ లో గూగుల్ శోధిస్తే హీరోయిన్ పేరు ఆనంది అనీ, డైరెక్టర్ పేరు గౌరీ నాయుడు అని తెలిసింది.
నాకైతే తెలిసిన పేర్లు కావు.
గరివిడి లక్ష్మి గారికి సహజ సిద్ధమైన గాత్రం ఉంది. ఈ సినిమా కు మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్ చరణ్ కానీ, పాటలు పాడిన అనన్య భట్, మంగ్లీ కానీ ఆమెకి పూర్తి గా న్యాయం చేశారు.
సెకండాఫ్ లో పలు భావోద్వేగ సన్నివేశాలు ఉన్నాయి. బయోపిక్ కాబట్టి మన హృదయాలు బరువెక్కి పోతాయి.

ఒక మహా కళాకారిణిలో ఉన్న ట్యాలెంట్ ను ఎవరి అవసరాలకు వారు ఉపయోగించుకుని బాగా లబ్ది పొంది కూడా ఆమెకు గుర్తింపు రాకుండా అణచివేశారనీ.. తీవ్ర మనోవేదనతో ఆమె తన వృత్తిని వదులుకొని మరుగున పడిపోయారనీ తెలుసుకున్నప్పుడు ఒక ప్రేక్షకుడిగా నేను ఎంతో భావోద్వేగానికి గురయ్యాను.
ఆ పాత్రలో ఆనంది గారు జీవించేశారు.
ఎంతగా అంటే.. కళాకారిణి గా గరివిడి లక్ష్మి ప్రదర్శనలకు హాజరైన ప్రేక్షకులు రంజిల్లినట్టుగానే మనం కూడా ఉత్సాహంతో ఉరకలేస్తాం. ఆమె కుంగుబాటుకు గురైనప్పుడు మనం కూడా కుంగిపోయి కంట తడిపెడతాం.
అసలు ఈ దర్శకుడు గౌరి నాయుడు ఎవరో కానీ.. ఆ గరివిడి లక్ష్మి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆ కథ రాసుకున్నట్టుంది. మరుగున పడిన ఒక కళాకారిణి పట్ల ఆ ఆరాధన ఏమిటి..? ఆమెను వెలుగులోకి తీసుకు రావాలన్న ఆ తపన ఏమిటి.. అద్భుతం.
ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లే అల్లుకుని సినిమా ఫ్రేమ్ ఫ్రేమ్ నూ కళాత్మకంగా తీర్చి దిద్దిన తీరుకి ఈ నవ యువ దర్శకుడికి జైకొట్టి తీరాలి.
తెలుగు ప్రేక్షకులకు నా విజ్ఞప్తి.. ఇలాంటి మంచి సినిమాలు మళ్లీ మళ్లీ రావాలంటే ఈ సినిమా చూడండి.. చూసి మీ మీ అభిప్రాయాలు సోషల్ మీడియా వేదికగా పంచుకోండి.
ఈ సినిమా ఆడుతున్న హాళ్లు వెల వెల పోవడం కాదు.. కళకళ లాడుతూ నిండిపోవాలి.

…..
గౌరీ నాయుడు.. ఇన్నాళ్లు ఎక్కడున్నావయ్యా మహానుభావా ..?
ఈ సినిమా ద్వారా గరివిడి లక్ష్మి గారిని తెలుగునాట ఇంటింటి మా లక్ష్మి ని చేసేశావ్. మాలాంటి వారిని థియేటర్ల దాకా రప్పించావ్..
నా విన్నపం ఏమంటే…
శోధిస్తే మా రాయలసీమలో కూడా ఎన్నో హ్యూమన్ ఇంటరెస్టింగ్ కథలు వెలుగులోకి వస్తాయి.
సినిమా వాళ్ళు మా రాయలసీమ సంస్కృతిని ఇష్టమొచ్చినట్టు చిత్రీకరించారు. ఎక్కడో కొన్ని చోట్ల ఓ రెండు దశాబ్దాల పాటు ఫ్యాక్షన్ అనే రాక్షసి కరాళ నృత్యం చేసింది. మా ప్రాంతంలో నెలకొన్న కరువు లేదా భౌగోళిక కారణాలు ఇందుకు కారణం.
దీన్ని బూచి గా చూపిస్తూ అదే అసలైన రాయలసీమ అని బయట ప్రపంచం భ్రమ పడేలా మీ చిత్ర పరిశ్రమ మాపై పదేపదే సాంస్కృతిక దాడి చేస్తోంది.
ఇదిగో నీలాంటి దృష్టి కోణంలో ఆలోచించే యువ దర్శకులే సినిమా పరిశ్రమకు కావాలి.
మరుగున పడిన కళాకారులనే కాదు.. మా రాయలసీమను హృదయాత్మకంగా పారదర్శకంగా చిత్రించగల సత్తా గల్గిన నీలాంటి అభ్యుదయ దర్శకులకు స్వాగతం చెబుతూ..
గరివిడి లక్ష్మి చిత్ర యూనిట్ అందరికీ
నా ఈ వ్యాస సమర్పితం
……. కాశీపురం ప్రభాకర్ రెడ్డి,
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, నంద్యాల
Share this Article