.
నిజమే… ఆర్పీ పట్నాయక్ మంచి ప్రతిభ ఉన్న సంగీత దర్శకుడే… ఒకప్పుడు వైవిధ్యమైన బాణీలను అందించాడు… కానీ గరివిడి లక్ష్మిని కలిసి, ఆవిడ పాటల క్యాసెట్ తీసుకుని, ఆవిడకి సినీ అవకాశాలు కల్పిస్తామని నమ్మబలికి, అవకాశాలు ఇవ్వడం కాదు కదా, కనీసం ఆవిడ పేరు సైతం టైటిల్స్‌లో పేర్కొనకుండా, అందులోని కొన్ని ట్యూన్లని వాడుకుని ఆవిడకి ద్రోహం చేశారని ఆరోపణలు…
చాన్నాళ్లుగా ఉన్న ఆరోపణలే… ఇప్పుడు గరివిడి లక్ష్మి బయోపిక్ రావడం, ఆ సినిమా విమర్శకుల ప్రశంసలకు పొందడంతో… ఆర్పీ పట్నాయక్ ఆమెకు చేసిన అన్యాయం మళ్లీ బాగా చర్చల్లోకి వస్తోంది… సోషల్ మీడియాలో చాలా…
Ads
ఐతే సినిమాలో ఆర్పీ వివరణ కొంత కవర్ చేసినట్టున్నారు… కానీ అది సరిపోయిందా..? ఏమాత్రం సంతృప్తికరమైన వివరణ కాదని సోషల్ మీడియాలో అభిప్రాయాలు, విమర్శలు కనిపిస్తున్నాయి… బాగా ఆరోపణలు వినిపించే ఉదాహరణలు ఇవీ…
చిత్రం — “మామా వెళ్లిపోతున్నారు”
ఫ్యామిలీ సర్కస్ — “నన్ను కొట్టకురో”
జయం – “రాను రానంటూనే చిన్నదో.. చిన్నదో”
ఆవిడ గొంతు సినీపాటలకి సూట్ కాదు అనుకుని ఉంటే… ఇంకేదైనా కారణాలు ఉంటే… ఆమెకు స్వయంగా పాడే అవకాశం ఇవ్వకపోతే… అది ఆర్పీ ఇష్టం… చాలా లెక్కలుంటాయి… నిర్మాత, దర్శకుడు, హీరో, ఇమేజ్ మన్నూమశానం… కంపోజర్ అవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి… సినిమా అంటేనే ఓ దందా… అదేమీ కళాసేవ కాదు…
కానీ నైతికత అంటూ ఒకటి ఏడుస్తుంది… టైటిల్స్‌లో ఫలానా పాట, ఫలానా ఆవిడ పాడగా విని ప్రేరణ పొందాం అనైనా చెప్పి ఉంటే ఎంత హుందాగా ఉండి ఉండేది..? ఆమె కూడా ఆనందపడేదేమో… ఆ నిజాయితీ ఆర్పీలో కనిపించలేదా..?
తనకి టాలెంట్ ఉంది… ఆన్ ది స్పాట్ ఓ పాటకు బాణీ కట్టేయగలడు… కొత్తగా ఆలోచించగలడు… ఎటొచ్చీ, ఇదుగో ఇలాంటివే ఆ ప్రతిభకు మరకలు… నిజానికి వ్యక్తిగా కూడా సున్నిత హృదయుడు అంటారు తనను… ఏదో సినిమా నిర్మాణం దగ్గర నిర్మాత చులకనగా మాట్లాడితే ఆ వైరాగ్యంతో సినిమాలు వదిలేశాడనీ అంటారు…
తను కేవలం కంపోజర్ మాత్రమే కాదు, స్వయంగా గాయకుడు, నటుదు… దర్శకుడు, కథకుడు… ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి… “ఆమీ” అనే ఓ ఇంగ్లిష్ సూపర్ నాచురల్ చిత్రం కూడా తన ఖాతాలో ఉంది… ఆయన అంతర్జాతీయ సంగీత అవార్డుల కమిటీ గ్రామీ కమిటీ మెంబర్ కూడా… ఈయనలోని సహజ సంగీత జ్ఞానన్ని చూసి ఆ పెద్ద పీట వేసారు అలా…

ఉష తదితర పాతిక మంది యువ గాయనీగాయకులని సినీరంగానికి పరిచయం చేశాడు… ఆయన స్వయంగా సంగీత దర్శకుడే అయినప్పటికీ, ఇతర సంగీత దర్శకులు ఏరి కోరి ఆయన్ని పిలిచి ఆయనతో పాటలు పాడించుకున్నారు…
ఓ ఉదాహరణ… ఇంద్ర సినిమాకి సంగీత దర్శకుడు మణి శర్మ… సినీ నిర్మాణం, పాటలు రీరికార్డింగ్ కూడా పూర్తయ్యాక ఆయన విదేశాలకి వెళ్ళిపోయాడు. దర్శకుడికి సడన్‌గా ప్రేరణ కలిగి ఇంకొక పాట పెట్టాలని అనిపించింది. అప్పుడు మణి శర్మని సంప్రదించి వేరే ఎవరితోనైనా ఈ ఒక్క పాటని చేయించుకోమా అని అడిగితే, వేరెవ్వరితో చేయించుకున్నా నాకు సమ్మతం కాదు, ఒక్క ఆర్పీతో చేయించుకుంటే నాకు సమ్మతమే అని చెప్పాడట…
ఇటీవల భగవద్గీత శ్లోకాలకి వ్యాఖ్యాన్నాన్ని రాగయుక్తంగా పాడి ఇప్పటి యువతకి ఆధ్యాత్మిక జ్ఞానం అందించే ప్రయత్నం చేశాడు… సిరివెన్నెల సీతారామ శాస్త్రి మనసుని గెల్చుకున్న అతికొద్ది మంది సినీ ప్రముఖులలో ఒకరు ఆర్పీ… మరి కాపీ క్యాట్ అనే ముద్ర మాటేమిటి..? అఫ్కోర్స్, వర్తమాన పాపులర్ కంపోజర్లలో ఎవరూ కాపీలకు అతీతులు కారు… అది వేరే కథ…
లక్ష్మి ట్యూన్లను వాడుకున్నాడనే ఆరోపణ గూర్చి ఆయన మాటల్లోనే సినిమాలో వివరణ కూడా ఉంది… ఆ వివరణ సంతృప్తికరంగా లేదని సోషల్ మీడియా అంటోంది… మరి అలాంటప్పుడు ఆర్పీ ఓ సవివరణ వేరే వీడియో ద్వారా ఇస్తే బాగుంటుందనీ, అది తనకే మంచి పేరు తీసుకొస్తుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది…
ఇక కొందరు దొరికిందే సందని ఆయన కన్నడ సినిమాల నుంఛి, తమిళ సినిమాల నుంచి పాటల్ని కాపీ కొట్టాడని ఆరోపిస్తున్నారు… నిజానికి అవి ఆయన స్వయంగా కన్నడంలో, తమిళంలో చేసిన అల్బమ్స్ అవి…
కాకపోతే “తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక” పాట ఒరిజినల్ సాంగ్ మలయాళంలో విద్యాసాగర్ చేశాడు…
అదీ దానికి ఒరిజినల్ బాధ్యుల నుంచి అనుమతి పొందిన తరువాత తెలుగులో వాడుకున్నారు… ఇది మనసంతా నువ్వే సినిమాలోనిది… దీన్ని తమిళంలో రీమేక్ చేసినప్పుడు నిర్మాత ఎంఎస్ రాజు మళ్లీ అదే విద్యాసాగర్‌తో కంపోజ్ చేయించుకున్నాడు… సో, మరక మొత్తం పోయినట్టేనా..? లేదు… ఆర్పీ తనే ఆలోచించుకోవాలి…!! (few inputs from డా. రాయపెద్ది వివేకానంద్ )
Share this Article