.
నో డౌట్… లేమి నుంచి వేల కోట్ల వేతనం దాకా ఎదిగిన సుందర్ పిచ్చయ్‌ది అతి పెద్ద పెద్ద సక్సెస్ స్టోరీ… సగటు ఉద్యోగి కలలు కనేంత బిగ్ బిగ్ సక్సెస్ స్టోరీ… ఒక పోస్టు ఆసక్తికరం అనిపించింది… తన తల్లిదండ్రులు, తను ఎదిగిన నేపథ్యాన్ని చెప్పే వైరల్ పోస్టు అది… కానీ..? అందులో కొన్ని అంశాలు నిజమేనా అనీ సందేహాలు తలెత్తాయి… ఎందుకంటే..?
‘‘ఒక తల్లి తన కొడుకు కోసం బంగారు గాజులు అమ్మేసింది… అమెరికా వెళ్లి చదువుకోవాలన్న అతడి కలను నిజం చేయడానికి చివరి బంగారు ముక్కను కూడా త్యాగం చేసింది… చివరకు ఆ కొడుకు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన టెక్నాలజీ సంస్థల్లో ఒకటైన గూగుల్‌కు సీఈఓ అయ్యాడు… అతడి తల్లి త్యాగాన్ని గుర్తించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ… ఒక భారీ సభలో ఆమెకు పాదాభివందనం చేశాడు..!’’
Ads
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పోస్టులోని కథ ఇది… చదివితే ఎవరికైనా కళ్లు చెమ్మగిల్లాల్సిందే. తల్లి ప్రేమను, త్యాగాన్ని గుర్తు చేసే ఇలాంటి కథలను పంచుకోవాలనిపించడంలోనూ ఆశ్చర్యం లేదు. కానీ ఇందులో చెప్పిన ప్రతి అంశం నిజమేనా? ఢిల్లీలో నిజంగానే అలాంటి సన్నివేశం చోటుచేసుకుందా? గూగుల్ సీఈఓ సుందర్ పిచై తల్లి లక్ష్మి పిచై తన కొడుకు చదువు కోసం బంగారు గాజులు అమ్మేసిందా?
ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. వైరల్ కథలోని భావోద్వేగాలకు, సుందర్ పిచై నిజ జీవితానికి మధ్య ఆసక్తికరమైన తేడాలు కనిపిస్తాయి…
రెండు గదుల ఇంటి నుంచి ప్రపంచ టెక్నాలజీ సామ్రాజ్యం వరకు! సుందర్ పిచై జీవితం గురించి నిజంగా తెలుసుకోవాలంటే, మోదీ పాదాభివందనం కథతో పనిలేదు. ఆయన బాల్యం, తల్లిదండ్రుల కష్టాలు, చదువు కోసం కుటుంబం చేసిన త్యాగాలే ఒక అద్భుతమైన కథను చెబుతాయి…
1972లో తమిళనాడులోని మదురైలో జన్మించిన సుందర్ పిచై పెరిగింది చెన్నైలో… తండ్రి రఘునాథ పిచై ఎలక్ట్రికల్ ఇంజనీర్… తల్లి లక్ష్మి పిచై స్టెనోగ్రాఫర్‌గా పనిచేశారు… ఆ కుటుంబం సంపన్నుల జాబితాలో లేదు… చెన్నైలోని రెండు గదుల అపార్ట్‌మెంట్‌లో నివసించేవారు… సుందర్, అతడి తమ్ముడు గదిలో కాకుండా హాల్లోనే పడుకునేవారు…
ఇప్పటి పిల్లలకు మొబైల్ ఫోన్ లేకపోతేనే ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్లుంటుంది… కానీ సుందర్ పిచై పెరిగిన రోజుల్లో టెక్నాలజీ అందుబాటులో ఉండేది చాలా తక్కువగా… కుటుంబానికి చిన్నతనంలో కారు లేదు… టెలివిజన్ కూడా చాలా కాలం లేదు… ఇంటికి టెలిఫోన్ వచ్చిన తర్వాత, దానిలోని నంబర్లను గుర్తుపెట్టుకునే సుందర్ అసాధారణ జ్ఞాపకశక్తి గురించి బంధువులు ఆశ్చర్యపోయేవారు…
తండ్రి ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావడంతో ఆయన చేసే పనులు, టెక్నాలజీకి సంబంధించిన విషయాలపై చిన్నప్పటి నుంచే సుందర్‌కు ఆసక్తి ఉండేది. తండ్రి తన పనిలో ఎదుర్కొనే సాంకేతిక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడు. అలా మొదలైన ఆసక్తి, తర్వాత ప్రపంచాన్ని మార్చే సాంకేతిక ఉత్పత్తుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించే స్థాయికి తీసుకెళ్లింది.
కొడుకు అమెరికా ప్రయాణం కోసం తండ్రి చేసిన త్యాగం! సుందర్ పిచై జీవితంలో అత్యంత కీలకమైన మలుపు అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం రావడం… ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు…
అయితే అమెరికా ప్రయాణం అంత సులభంగా సాధ్యపడలేదు… ఆ రోజుల్లో విమాన టికెట్ ఖర్చు కూడా భారతీయ మధ్యతరగతి కుటుంబానికి చాలా పెద్ద మొత్తం… సుందర్ అమెరికా వెళ్లేందుకు ఆయన తండ్రి తన ఏడాది జీతానికి సమానమైన మొత్తాన్ని ఖర్చు చేశాడు…
ఒక్కసారి ఆలోచించండి! కుటుంబ అవసరాలు, భవిష్యత్తు ఖర్చులు ఎన్నో ఉంటాయి… అయినప్పటికీ కొడుకు ఉన్నత చదువుల కోసం తండ్రి ఏడాది సంపాదనకు సమానమైన మొత్తాన్ని వెచ్చించాడు… ఆ ప్రయాణం ఒక వ్యక్తి జీవితాన్నే కాదు, ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఆయన పోషించబోయే పాత్రను కూడా మలిచింది…
ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి… అమెరికా విమాన ప్రయాణం కోసం సుందర్ తల్లి తన చివరి బంగారు గాజులను అమ్మేశారన్న వాదనకు విశ్వసనీయ ఆధారం కనిపించడం లేదు… అంతమాత్రాన తల్లి పాత్రను తక్కువ చేసినట్లు కాదు… ఒక పిల్లవాడు జీవితంలో ఎదగడానికి తండ్రి ఆర్థిక సహకారం ఎంత అవసరమో, తల్లి ప్రోత్సాహం, కుటుంబం అందించే భరోసా కూడా అంతే అవసరం…
గూగుల్ సీఈఓగా ఎదిగిన ప్రయాణం! అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన సుందర్ పిచై, తర్వాత టెక్నాలజీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు… 2004లో గూగుల్‌లో చేరిన ఆయన, క్రోమ్ వంటి కీలక ఉత్పత్తుల అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించాడు… అంచెలంచెలుగా ఎదిగి 2015లో గూగుల్ సీఈఓ అయ్యాడు… 2019లో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ బాధ్యతలూ చేపట్టాడు…
ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే టెక్నాలజీ ఉత్పత్తులకు నాయకత్వం వహించే స్థాయికి చేరుకున్నాడు… ఇది కేవలం వ్యక్తిగత విజయగాథ కాదు… విద్య, పట్టుదల, కుటుంబం అందించిన అవకాశాలు ఒక జీవితాన్ని ఎంతగా మార్చగలవో చెప్పే ఉదాహరణ…

మరి.. మోదీ పాదాభివందనం కథ సంగతేమిటి? ఇప్పుడు అసలు వైరల్ పోస్టులోని ప్రధాన ఘట్టం దగ్గరకు వద్దాం… ఢిల్లీలో భారీ సభ ఏర్పాటు చేసి, సుందర్ పిచైని సత్కరించే సమయంలో ఆయన తల్లి లక్ష్మి పిచైని గుర్తించిన ప్రధాని మోదీ… వేదిక దిగి వెళ్లి ఆమెకు పాదాభివందనం చేశాడన్నది ఆ పోస్టు చెబుతున్న కథ…
అంతేకాదు, సుందర్ చదువు కోసం తల్లి తినకుండా ఉండేదని, బంగారు గాజులు అమ్మేసిందని మోదీ సభలో ప్రకటించినట్లు కూడా అందులో ఉంది… ఈ సన్నివేశం నిజంగా జరిగి ఉంటే అది ఎంతో హృద్యమైన సందర్భమే… కానీ ఇంతటి ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన కార్యక్రమం జరిగినట్లు నిర్ధారించే విశ్వసనీయ వార్తా కథనం, అధికారిక ప్రకటన లేదా ధ్రువీకరించిన వీడియో ఆధారం అందుబాటులో కనిపించడం లేదు…
ఒక నిజమైన వ్యక్తి జీవితానికి కొన్ని కల్పిత సన్నివేశాలను జోడిస్తే కథ మరింత హృద్యంగా మారవచ్చు… కానీ భావోద్వేగం కలిగించిందనే కారణంతోనే దాన్ని చరిత్రగా అంగీకరించలేం… అసలు ఆ తల్లి త్యాగాన్ని గుర్తించడానికి మోదీ పాదాభివందనం అవసరమా? ఆమె త్యాగాన్ని గుర్తించడానికి ప్రధాని పాదాభివందనం చేసినట్లు ఒక కల్పిత సన్నివేశాన్ని సృష్టించాల్సిన అవసరం ఏముంది?
Share this Article