.
బంగారం… అత్యంత విలువైన లోహం… దేశాల ఆర్థిక స్థాయిని, కరెన్సీల విలువను ఖరారు చేసే లోహం… బతుకుల్ని, చరిత్రల్ని మార్చేసే లోహం… దాని ఆకర్షణ అది… అందుకే బంగారాన్ని కృత్రిమంగా తయారు చేయడం మీద ఎన్నో ఊహలు, ఎన్నో కల్పనలు, ఎన్నో రచనలు, ఎన్నో ప్రయోగాలు… చాలాకాలంగా…
పరుసవేది నుంచి పరుసవేది నుంచి ప్రయోగశాల బంగారం వరకు ఓసారి పరిశీలిస్తే… తాజా వార్తల్ని చదివి విశ్లేషించుకుంటే… నిజంగానే మరో మూలకాన్ని లేబరేటరీలో బంగారంగా మార్చగలమా? చౌకగా ఎంతంటే అంత బంగారాన్ని ఉత్పత్తి చేయగలమా..?
Ads
ఒకప్పుడు పరుసవేది అనే మాట వినిపించేది… ఏదో ఒక రహస్య విద్య ద్వారా ఇనుమును బంగారంగా మార్చవచ్చని, కొన్ని ప్రత్యేక పదార్థాలను తాకిస్తే చాలు లోహాల స్వరూపమే మారిపోతుందని కథలు ప్రచారంలో ఉండేవి… పాశ్చాత్య దేశాల్లోనూ ఇదే తరహా నమ్మకానికి ‘ఆల్కెమీ’ (Alchemy) అనే పేరు ఉంది… ఈ నేపథ్యంలోనే పాలో కొయెల్హో రాసిన ‘ది ఆల్కెమిస్ట్’ నవల ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది… అందులోని కథకు పరుసవేది విద్యతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, మనిషి కలలు, అన్వేషణ, బంగారం కోసం సాగించే ప్రయాణం వంటి అంశాలు ఈ పాత నమ్మకాన్ని గుర్తుచేస్తాయి…
అయితే ఇన్నాళ్లూ పురాణాలు, కథలు, రసవాదుల ప్రయోగశాలలకే పరిమితమైన బంగారం తయారీ ఇప్పుడు ఆధునిక అణు విజ్ఞానంలోనూ సాధ్యమవుతోందా? అమెరికాకు చెందిన ఓ సంస్థ పాదరసం (మెర్క్యురీ) నుంచి బంగారం తయారుచేసినట్టు ప్రకటించడంతో ఈ ప్రశ్న మళ్లీ తెరపైకి వచ్చింది… (ఎంతోకాలంగా పాదరసం నుంచే బంగారం తయారు చేయవచ్చుననే భావనలు, కథలు ఎక్కువ… అదే రసవిద్య…)
నిజానికి మధ్యయుగాల్లో యూరప్, అరబ్ దేశాలు, చైనా, భారతదేశాల్లో రసవాదులు లోహాలను బంగారంగా మార్చేందుకు రకరకాల ప్రయోగాలు చేశారు… పాదరసం, సీసం వంటి లోహాలతో ఎన్నో ప్రయోగాలు జరిగాయి… కానీ రసాయన ప్రక్రియలతో ఒక మూలకాన్ని మరో మూలకంగా మార్చడం సాధ్యం కాదని ఆధునిక శాస్త్రం తేల్చింది…
అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన మలుపు ఉంది… రసాయన శాస్త్రం సాధ్యం కాదన్న పనిని అణు విజ్ఞానం సాధ్యం చేయగలదని 20వ శతాబ్దంలోనే నిరూపితమైంది!

మూలకాన్ని మార్చడం ఎలా సాధ్యం?
ఒక పదార్థం ఏ మూలకానికి చెందుతుందో నిర్ణయించేది దాని అణు కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య… ఉదాహరణకు బంగారం అణువులో 79 ప్రోటాన్లు ఉంటాయి… పాదరసంలో 80, సీసంలో 82 ఉంటాయి…
అందుకే బంగారంలా కనిపించేలా పాదరసానికి రంగు మార్చినా, దానితో బంగారం తయారుకాదు… దాని అణు కేంద్రకంలోనే మార్పు జరగాలి… ప్రోటాన్ల సంఖ్య 80 నుంచి 79కి మారితేనే అది బంగారంగా మారుతుంది…
ఇది వినడానికి విచిత్రంగా అనిపించినా శాస్త్రీయంగా సాధ్యమే… అణు పరివర్తన (Nuclear Transmutation) అని పిలిచే ఈ ప్రక్రియ ద్వారా ఒక మూలకాన్ని మరో మూలకంగా మార్చవచ్చు… 1940ల నుంచే శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో కృత్రిమంగా బంగారు అణువులను తయారుచేశారు… కాకపోతే అవి చాలా స్వల్ప పరిమాణంలోనే ఉండేవి…
ఇప్పుడు అమెరికా సంస్థ ఏం చేసింది?
శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన మారథాన్ ఫ్యూజన్ (Marathon Fusion) అనే సంస్థ ఈ పాత కలను కొత్త సాంకేతికతతో సాకారం చేయబోతున్నట్టు ప్రకటించింది… పాదరసంలోని మెర్క్యురీ-198 అనే ఐసోటోప్‌ను ఉపయోగించి బంగారం తయారుచేయడం ఈ విధానం ప్రత్యేకత… ఐసోటోప్ అంటే ఒకే మూలకానికి చెందిన అణువుల్లో న్యూట్రాన్ల సంఖ్య మారుతూ ఉండే రూపం…
ఫ్యూజన్ రియాక్టర్లలో అణువులు కలిసినప్పుడు అత్యంత శక్తిమంతమైన న్యూట్రాన్లు వెలువడతాయి… వాటిని మెర్క్యురీ-198పై ప్రయోగిస్తే మెర్క్యురీ-197 ఏర్పడుతుంది… అది రేడియోధార్మిక క్షయానికి గురై చివరకు బంగారం-197గా మారుతుంది… ఇది స్థిరమైన బంగారం…
2026 అక్టోబర్ 21న తమ ప్రయోగాల్లో స్థిరమైన బంగారాన్ని తయారుచేశామని మారథాన్ ఫ్యూజన్ ప్రకటించింది… CERN సాధించిన ఉత్పత్తి రేటుతో పోలిస్తే పది రెట్లు ఎక్కువ రేటును సాధించామని కూడా పేర్కొంది…
అయితే ఈ ప్రకటనను ఇంకా స్వతంత్ర శాస్త్రవేత్తలు ధ్రువీకరించలేదు… ఎంత పరిమాణంలో బంగారం తయారైంది, దాని స్వచ్ఛత ఎంత వంటి వివరాలు కూడా సంస్థ పూర్తిగా వెల్లడించలేదు… కాబట్టి ఇది ఆసక్తికరమైన ప్రకటన మాత్రమే తప్ప, వాణిజ్యపరంగా బంగారం తయారీ మొదలైందని చెప్పలేం…

అంతటి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది?
ఇక్కడ ఫ్యూజన్ టెక్నాలజీ గురించి కొంచెం తెలుసుకోవాలి… సూర్యుడిలో జరిగే ప్రక్రియనే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు… అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద హైడ్రోజన్ ఐసోటోపులైన డ్యూటీరియం, ట్రిటియం అణు కేంద్రకాలు కలిసిపోయి హీలియం ఏర్పడుతుంది… ఈ క్రమంలో అపారమైన శక్తి విడుదలవుతుంది… దాంతోపాటు అత్యంత వేగంగా ప్రయాణించే న్యూట్రాన్లు కూడా వెలువడతాయి…
ఆ న్యూట్రాన్లను ఉపయోగించి పాదరసాన్ని బంగారంగా మార్చవచ్చన్నది మారథాన్ ఫ్యూజన్ ప్రతిపాదన… అంటే బంగారం తయారీ కోసం ప్రత్యేకంగా మరో భారీ విద్యుత్ కేంద్రం నిర్మించాల్సిన అవసరం లేకుండా, భవిష్యత్తులో ఏర్పాటయ్యే ఫ్యూజన్ విద్యుత్ కేంద్రంలోని న్యూట్రాన్లను ఈ పనికీ ఉపయోగించుకోవచ్చన్నది ఆలోచన…
అయితే ఫ్యూజన్ విద్యుత్ కేంద్రాలే ఇంకా వాణిజ్య స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదు… అందువల్ల ఈ బంగారం తయారీ విధానానికి కూడా భారీ సాంకేతిక సవాళ్లు మిగిలే ఉన్నాయి…
ఎంత బంగారం తయారుచేయవచ్చు? ఇదే ఈ ప్రయోగంలో అత్యంత ఆసక్తికరమైన అంశం… మారథాన్ ఫ్యూజన్ 2025లో ప్రచురించిన పరిశోధనా పత్రంలో కంప్యూటర్ సిమ్యులేషన్ల ఆధారంగా ఒక గిగావాట్ థర్మల్ సామర్థ్యం కలిగిన ఫ్యూజన్ ప్లాంట్ ఏడాదికి రెండు టన్నులకు పైగా బంగారం ఉత్పత్తి చేయగలదని అంచనా వేసింది…
మరోవైపు మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఫ్యూజన్ నిపుణుడు కార్ల్ లాక్నర్ ఒక ఇంటర్వ్యూలో, ఒక గిగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేసే రియాక్టర్ ద్వారా ఏడాదికి సుమారు ఐదు టన్నుల బంగారం తయారుచేసే అవకాశం ఉందని వివరించాడు… ఇవి వేర్వేరు అంచనాలు మాత్రమే… ఇప్పటికే సాధించిన ఉత్పత్తి పరిమాణాలు కావు…
ప్రపంచంలో ప్రస్తుతం ఏడాదికి సుమారు 3,000 నుంచి 3,500 టన్నుల సహజ బంగారం గనుల ద్వారా వెలికితీస్తున్నారు… భవిష్యత్తులో ఇలాంటి ఫ్యూజన్ ప్లాంట్లు పెద్ద సంఖ్యలో ఏర్పాటైతే బంగారం సరఫరాలో కొంత మార్పు రావచ్చు… అయితే ఇప్పటికిప్పుడు బంగారం మార్కెట్‌ను కుదిపేసే పరిస్థితి లేదు…
ఇంతకీ ఖరీదు ఎంత? లాభదాయకమేనా?
ఇక్కడే అసలు చిక్కు ఉంది. బంగారం తయారుచేయడానికి పాదరసం ఒక్కటుంటే సరిపోదు… అందులో మనకు అవసరమైన మెర్క్యురీ-198 ఐసోటోప్‌ను అధిక శాతంలో వేరు చేయాలి… సహజ పాదరసంలో ఈ ఐసోటోప్ వాటా కేవలం 10 శాతం మాత్రమే… దాన్ని దాదాపు 90 శాతం స్వచ్ఛతకు చేర్చడం కూడా ఖరీదైన, క్లిష్టమైన ప్రక్రియ…
ఒక గిగావాట్ విద్యుత్ సామర్థ్యం గల ప్లాంట్‌లో ఈ విధానం ద్వారా ఏడాదికి ఐదు టన్నుల బంగారం తయారుచేయాలంటే సుమారు 500 టన్నుల ప్రత్యేకంగా శుద్ధి చేసిన పాదరసం ఐసోటోప్ అవసరమవుతుందని నిపుణుల అంచనా…
ఇక మరో సమస్య కూడా ఉంది… ప్రక్రియలో ఏర్పడే కొన్ని ఇతర ఐసోటోపుల వల్ల బంగారంలో రేడియో ధార్మికత ఉండే ప్రమాదం ఉంది… అలాంటి బంగారాన్ని వెంటనే ఆభరణాల తయారీకి ఉపయోగించలేరు… కొన్ని సందర్భాల్లో సుమారు 18 ఏళ్ల వరకు నిల్వ ఉంచాల్సి రావచ్చు…
అన్నింటికంటే ముఖ్యంగా ఈ విధానంలో కిలో బంగారం తయారీకి అయ్యే వాస్తవిక వ్యయాన్ని మారథాన్ ఫ్యూజన్ ఇంకా వెల్లడించలేదు… ఫ్యూజన్ రియాక్టర్ నిర్మాణం, నిర్వహణ, ఐసోటోప్ వేర్పాటు, భద్రతా ఏర్పాట్ల ఖర్చులన్నీ కలిపి లెక్కించాల్సి ఉంటుంది… అందువల్ల ఇప్పుడే ఇది గనుల్లో బంగారం తీయడం కంటే చౌక అని చెప్పలేం…

CERN కూడా బంగారం తయారుచేసింది!
బంగారం తయారుచేయాలన్న ప్రయత్నం మారథాన్ ఫ్యూజన్తోనే మొదలుకాలేదు… ఐరోపాలోని CERN పరిశోధనా సంస్థ 2025లో తన లార్జ్ హాడ్రాన్ కొలైడర్ (LHC) ప్రయోగాల్లో సీసం నుంచి బంగారు అణు కేంద్రకాలను ఉత్పత్తి చేసినట్టు ప్రకటించింది…
అత్యంత వేగంతో ప్రయాణించే సీసపు అణు కేంద్రకాలు ఒకదానికొకటి అత్యంత సమీపంగా వెళ్లినప్పుడు ఏర్పడే శక్తిమంతమైన విద్యుదయస్కాంత క్షేత్రాల కారణంగా వాటి కేంద్రకాల నుంచి ప్రోటాన్లు, న్యూట్రాన్లు బయటకు వస్తాయి… సీసంలో 82 ప్రోటాన్లు ఉంటాయి. వాటిలో మూడు ప్రోటాన్లు తగ్గితే బంగారం కేంద్రకం ఏర్పడుతుంది…
2015–2018 మధ్య జరిగిన ప్రయోగాల్లో మొత్తం 86 బిలియన్ల బంగారు కేంద్రకాలు ఏర్పడినట్టు CERN గుర్తించింది… వాటి మొత్తం బరువు కేవలం 29 పికోగ్రాములు మాత్రమే! అంటే ఒక గ్రాములో 29 ట్రిలియన్ల వంతు… పైగా అవి క్షణంలోనే విచ్ఛిన్నమయ్యాయి… అంటే లేబరేటరీ బంగారం ఇంకా చాలా చాలా దూరంలో కనిపిస్తోంది… ఇప్పటికైతే లీలగా… ఓ కల్పనగా మాత్రమే..!!
Share this Article