Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సల్మాన్ ఖాన్.., ముక్తిధామ్ గుడికొచ్చి క్షమాపణ చెప్పు… మన్నిస్తాం..!!

November 5, 2026 by M S R

.

( రమణ కొంటికర్ల ) … లారెన్స్ బిష్ణోయ్ వర్సెస్ సల్మాన్.. ఈ ఇద్దరి మధ్య కృష్ణజింక వేట వైరాన్ని తెచ్చిపెట్టింది. అది ఇప్పుడు సల్మాన్ సన్నిహితులకూ ముప్పుగా మారింది. తాజాగా టైగర్ ష్రాఫ్ ఉదంతం జగద్వితమే. అంతకుముందు మాజీ మంత్రి సిద్ధిఖీ మర్డర్ కేసూ తెలిసిందే. సిద్ధూ మూసేవాలా హత్యకూ కారణం ఎరిగిందే. ఇలా బాలీవుడ్ ను భయపెడుతున్న మాఫియాగా ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు వినిపిస్తోంది. అయితే, ఈ సమయంలో లారెన్స్ బిష్ణోయ్ నుంచి ఓ ప్రకటన ఆసక్తికరంగా మారింది. ఏంటది..?

సల్మాన్ ఖాన్‌కు క్షమాభిక్ష పెట్టేందుకు బిష్ణోయ్ సమాజం సిద్ధమేనా..? దాదాపు 28 ఏళ్ల క్రితం జరిగిన కృష్ణజింకల వేట ఘటనకు సంబంధించి సల్మాన్ ఖాన్.. బిష్ణోయ్ సమాజానికి క్షమాపణ చెప్పాలని లారెన్స్ బిష్ణోయ్ చిన్నాన్న రమేష్ బిష్ణోయ్ కోరుతున్నాడు. అంతేకాదు, రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో ఉన్న ముక్తిధామ్ ముకామ్ ఆలయానికి వచ్చి క్షమాపణ చెబితే.. ఆయనకు పూర్తి భద్రత కల్పిస్తానంటున్నాడు. మన్నిస్తాం అంటున్నాడు…

Ads

నవంబర్ 2న జరిగిన బిష్ణోయ్ సమాజ్ 542వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రమేష్ బిష్ణోయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సల్మాన్ ఖాన్‌పై తమకు వ్యక్తిగతంగా ఎలాంటి కక్ష లేదని.. 1998లో జరిగిన కృష్ణజింకల వేట ఘటనతో సమాజంలో ఏర్పడిన ఆగ్రహమే ఇప్పటికీ కొనసాగుతోందని చెబుతున్నారు.

హింసకు తాను మద్దతివ్వనంటున్న రమేష్ బిష్ణోయ్! సల్మాన్ ఖాన్, ఆయన కుటుంబ సభ్యులపై లారెన్స్ బిష్ణోయ్ ముఠా ఎలాంటి దాడులకు పాల్పడినా.. తాను సమర్థించబోనని రమేష్ స్పష్టం చేశారు. లారెన్స్‌తో పాటు ఇతరులకు కూడా హింసకు దూరంగా ఉండాలని ఇప్పటికే పలుమార్లు చెప్పానంటున్నారు రమేష్ బిష్ణోయ్. సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ గతంలో వ్యక్తం చేసిన భద్రతాపరమైన ఆందోళనలపైనా రమేష్ స్పందించారు. సల్మాన్ ఆలయానికి వస్తే.. తన తరఫున పూర్తి భద్రత ఉంటుందని వ్యక్తిగతంగా హామీ ఇచ్చారు. అయితే ఇది రమేష్ బిష్ణోయ్ ఇచ్చిన వ్యక్తిగత హామీ మాత్రమే.

salman khan

మరి 1998లో ఏం జరిగింది? ఈ వివాదానికి మూలం 1998 అక్టోబర్‌లో జరిగిన కృష్ణజింకల వేట. హమ్ సాథ్ సాథ్ హై’సినిమా షూటింగ్ సమయంలో రాజస్థాన్‌లోని కంకాణి గ్రామ పరిసరాల్లో రెండు కృష్ణజింకలను వేటాడినట్లు సల్మాన్ ఖాన్‌ ఆరోపణలెదుర్కొన్నాడు. ఆ కేసులో 2018లో జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు సల్మాన్ ఖాన్‌ను దోషిగా నిర్ధారించి ఐదేళ్ల జైలు శిక్ష కూడా విధించింది.

అనంతరం సల్మాన్ కు బెయిల్ లభించింది. ఆ కేసులో సహ నిందితులుగా ఉన్న సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి బింద్రే, నీలమ్‌ ను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఆ ఘటన బిష్ణోయ్ సమాజాన్ని తీవ్రంగా కలచివేసింది. ఎందుకంటే కృష్ణజింకలు ఆ సమాజానికి కేవలం వన్యప్రాణులు మాత్రమే కాదు.. వారి మత విశ్వాసాలు, ప్రకృతి పరిరక్షణ సిద్ధాంతాల్లో వాటిది ప్రత్యేక స్థానం ఉంది.

ప్రకృతిని కాపాడటమే ధర్మంగా భావించే బిష్ణోయ్ తెగ! బిష్ణోయ్ సమాజం ఆవిర్భావం 15వ శతాబ్దానికి చెందిన గురు జంభేశ్వర్ బోధనలతో ముడిపడి ఉంది. ఆయన నిర్దేశించిన 29 నియమాల ఆధారంగా ఈ సమాజం ఏర్పడింది. బిష్ణోయ్ అనే పేరు కూడా బిష్ అంటే 20, నోయ్ అంటే 9 అనే పదాల నుంచి వచ్చిందని చెబుతారు. ఈ 29 నియమాల్లో ప్రకృతి, పర్యావరణ పరిరక్షణకు విశేష ప్రాధాన్యం ఉంది.

చెట్లను నరకకూడదు, జంతువులను చంపకూడదు, జీవరాశుల పట్ల కరుణ చూపాలనే బోధనలు వారి జీవన విధానంలో భాగం. 1730లో రాజస్థాన్‌లోని ఖేజర్లీ గ్రామంలో చెట్లను నరికివేయడాన్ని అడ్డుకునేందుకు అమృతాదేవి సహా 363 మంది ప్రాణత్యాగం చేసిన ఘటన బిష్ణోయ్ సమాజ ప్రకృతి ప్రేమకు ఓ చారిత్రక ఉదాహరణ. అందుకే కృష్ణజింకల వేటను వారు సాధారణ వన్యప్రాణుల వేటలా కాకుండా తమ విశ్వాసాలకు జరిగిన అవమానంగా భావిస్తున్నారు.

మరి క్షమాపణతో వివాదం ముగుస్తుందా..? సల్మాన్ ఖాన్ క్షమాపణ చెబితే.. క్షమించే విషయాన్ని సమాజం పరిశీలించవచ్చని అఖిల భారత బిష్ణోయ్ మహాసభ ప్రతినిధులు కూడా గతంలో ప్రకటించారు. దీంతో క్షమాపణను అంగీకరించాలా వద్దా అనేది సమాజం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మరోవైపు, ఈ వివాదం కేవలం సామాజిక, మతపరమైన అంశంగా మాత్రమే మిగిలిపోలేదు. లారెన్స్ బిష్ణోయ్ ముఠా పేరుతో సల్మాన్ ఖాన్‌కు పలుమార్లు బెదిరింపులు రావడం, 2024 ఏప్రిల్‌లో ముంబైలోని ఆయన నివాసం వెలుపల కాల్పులు జరగడం పరిస్థితిని మరింత తీవ్రం చేశాయి.

ఇక్కడ మరో న్యాయపరమైన అంశం కూడా ఉంది. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుకు సంబంధించి సల్మాన్ చేసే క్షమాపణలోని పదాలు, సందర్భం కీలకమవుతాయి. ఒకవేళ నేరాన్ని అంగీకరించేలా క్షమాపణ చెబితే అది న్యాయపరమైన చిక్కులకూ దారితీయవచ్చని న్యాయ నిపుణులు గతంలో అభిప్రాయపడ్డారు.

దీంతో దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదానికి ఒక క్షమాపణ పరిష్కారం చూపగలదా.. లేక చట్టపరమైన ప్రక్రియే దీనికి తుది సమాధానం ఇవ్వాల్సి ఉంటుందా… అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు, బిష్ణోయ్ సమాజం, లారెన్స్ బిష్ణోయ్ చిన్నాన్నైన రమేష్ బిష్ణోయ్ హామీతో… లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ ను క్షమించేస్తాడా అన్నదీ ఓ పెద్ద ప్రశ్నే..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సల్మాన్ ఖాన్.., ముక్తిధామ్ గుడికొచ్చి క్షమాపణ చెప్పు… మన్నిస్తాం..!!
  • రామాయణం… ఓ గ్రాండియర్..! మహారాజసం… పాన్-వరల్డ్ వైభవం !!
  • ఈ ఇంగ్లిష్ వేరు..! పదాలు సేమ్- సందర్భాన్ని బట్టి వ్యక్తీకరణే వేర్వేరు..!!
  • ఓ వైరల్ పోస్టు- అంబానీల ఫోటోలు- సంధించిన ఓ విలువైన ప్రశ్న!!
  • హిందూ సంప్రదాయం ప్రకారం దత్తత అంత పెద్ద నేరమా..?!
  • మస్క్ ఓటమి- సోరోస్ గెలుపు… ఇండియాపై మిడ్ టరమ్ ప్రభావమెంత..?
  • New Alchemy – పరుసవేది – నిజంగానే పాదరసం బంగారం అవుతుందా?!
  • మనిషిని వెతుక్కుంటూ వెళ్లిన కుక్క… మనసును తాకే రెండు కథలు!
  • ‘Congestion Tax’…! A New Lesson for Hyderabad from New York..!!
  • ‘రద్దీ పన్ను’…! హైదరాబాద్‌కు న్యూయార్క్ చెప్పే ఓ కొత్త పాఠం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions