.
Jagannadh Goud … డీలిమిటేషన్, అదే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తెలంగాణ రాజకీయ ముఖచిత్రమే మారిపోతుంది. ఇప్పుడు మాట్లాడుకుంటున్న చాలా రాజకీయ లెక్కలు, సమీకరణాలు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు అప్పుడు పనిచేయకపోవచ్చు. ఇప్పుడు ఊహిస్తున్న ఫలితాలు అప్పుడు మారిపోవచ్చు. 2027 జనాభా లెక్కల ప్రక్రియ తర్వాత డీలిమిటేషన్‌కు మార్గం సుగమం కావచ్చనే అంచనాలు ఉన్నాయి.
అదే జరిగితే, మన రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలు 179 లేదా 182 వరకు పెరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అత్యంత వేగంగా జనాభా పెరుగుతున్న హైదరాబాద్–రంగారెడ్డి–మేడ్చల్ మల్కాజిగిరి ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న 28 నియోజకవర్గాల సంఖ్య గణనీయంగా పెరగవచ్చు. ఒక అంచనా ప్రకారం, ఈ ప్రాంతంలోనే అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 28 నుంచి సుమారు 47 వరకు పెరిగే అవకాశం ఉంది.
Ads
ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ, జనాభా పెరుగుదల, కొత్త residential & IT corridors ను పరిగణనలోకి తీసుకుంటే కొండాపూర్, హైటెక్ సిటీ, మణికొండ, నార్సింగి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, శంషాబాద్, బడంగ్పేట్, హయత్‌నగర్, తుక్కుగూడ, జీడిమెట్ల, కొంపల్లి, KPHB, అల్వాల్, కాప్రా, పీర్జాదిగూడ– బోడుప్పల్, బాచుపల్లి, నిజాంపేట్, టోలిచౌకి, బోరబండ వంటి ప్రాంతాలు కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలకు కేంద్రాలుగా మారే అవకాశాలను కొట్టిపారేయలేం.

ఉదాహరణకు ప్రస్తుతం భారీ urban constituencyగా ఉన్న శేరిలింగంపల్లి పునర్విభజనలో శేరిలింగంపల్లి – కొండాపూర్ – హైటెక్ సిటీ వంటి మూడు నియోజకవర్గాలుగా మారే అవకాశం ఉండవచ్చు. అదే విధంగా రాజేంద్రనగర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, మహేశ్వరం, ఉప్పల్, ఎల్బీనగర్ వంటి వేగంగా విస్తరిస్తున్న నియోజకవర్గాల్లో కూడా పెద్ద మార్పులు రావచ్చు.
ఇది కేవలం కొత్త నియోజకవర్గాల ఏర్పాటు మాత్రమే కాదు. కొత్త రాజకీయ సమీకరణాలు, కొత్త నాయకత్వం, కొత్త సామాజిక సమీకరణాలు, కొత్త రాజకీయ అవకాశాలకు కూడా ద్వారాలు తెరుస్తుంది.
2029 తెలంగాణ రాజకీయం ఇప్పటి రాజకీయానికి కొనసాగింపు మాత్రమే కాకపోవచ్చు; పూర్తిగా కొత్త రాజకీయ మ్యాప్ కావచ్చు.
రాజకీయాల్లో మ్యాప్ మారితే సరిహద్దులు మాత్రమే మారవు — అధికారానికి వెళ్లే మార్గాలు మారతాయి, నాయకులు మారతారు, చివరికి రాజకీయమే మారిపోతుంది…
కొత్తగా ఏర్పడే అవకాశమున్న అసెంబ్లీ నియోజకవర్గాలు. ఇది నా అంచనా మాత్రమే (గతంలో నేను డీలిమిటేషన్ ప్రస్తావన తెస్తూ రాసిన పోస్టు నుంచి)…
1. ఉమ్మడి ఖమ్మం జిల్లా (5): మణుగూరు లేదా బూర్గంపాడు, పాల్వంచ, కల్లూరు, దమ్మపేట లేదా అన్నపురెడ్డిపల్లి, నేలకొండపల్లి లేదా రఘునాథపాలెం. (పెరిగిన జనాభాను బట్టి ఖమ్మం రూరల్ పేరుతో నియోజకవర్గం ఏర్పడినా ఆశ్చర్యపోనవసరం లేదు.)
2. ఉమ్మడి నల్గొండ జిల్లా (6): యాదగిరిగుట్ట, చౌటుప్పల్, మోత్కూరు, రామన్నపేట, నేరేడుచర్ల లేదా హాలియా లేదా మిర్యాలగూడ రూరల్, మునగాల. (నల్గొండ రూరల్, సూర్యాపేట రూరల్ పేర్లకు కూడా అవకాశం లేకపోలేదు.)
3. ఉమ్మడి వరంగల్ జిల్లా (6): కాజీపేట, తొర్రూరు, మరిపెడ బంగ్లా లేదా మహబూబాబాద్ రూరల్, ఏటూరునాగారం, ఆత్మకూరు, కేసముద్రం లేదా నెక్కొండ లేదా గీసుకొండ. (వరంగల్ సెంట్రల్, హసన్‌పర్తి, శాయంపేట పేర్లను కూడా కొట్టిపారేయలేం.)
4. ఉమ్మడి కరీంనగర్ జిల్లా (6): మెట్పల్లి, సుల్తానాబాద్, ఎల్లారెడ్డిపేట, గోదావరిఖని, జమ్మికుంట, కాటారం. (చందుర్తి, కరీంనగర్ రూరల్ పేర్లకు కూడా అవకాశం లేకపోలేదు.)
5. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (5): మందమర్రి, లక్షెట్టిపేట, ఉట్నూర్ లేదా ఇంద్రవెల్లి, నర్సాపూర్ (జి), భైంసా. (ఆదిలాబాద్ రూరల్‌కు కూడా అవకాశం ఉంది.)
6. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (5): భీమ్‌గల్, డిచ్పల్లి, దోమకొండ, ఎడపల్లి, నిజాంసాగర్. (గాంధారి, నిజామాబాద్ నార్త్ లేదా సౌత్, కామారెడ్డి రూరల్ పేర్లతో కొత్త నియోజకవర్గాలు ఏర్పడే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం.)
7. ఉమ్మడి మెదక్ జిల్లా (5): సిద్దిపేట రూరల్, రామాయంపేట, సదాశివపేట లేదా దొమ్మాట, రామచంద్రాపురం, అమీన్పూర్. (తూప్రాన్ కూడా కొత్త నియోజకవర్గానికి కేంద్రంగా మారే అవకాశం ఉంది.)
8. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా (6): అమరచింత లేదా ఆత్మకూర్, అమ్రాబాద్ లేదా గోపాల్పేట, కోస్గి లేదా ఐజ, కొత్తూరు, పెబ్బేరు లేదా బిజినేపల్లి, మహబూబ్‌నగర్ రూరల్ లేదా గండీడ్.
9. గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిసరాలు (19): కొండాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మణికొండ, నార్సింగి, శంషాబాద్, హయత్‌నగర్, తుక్కుగూడ, జీడిమెట్ల, కొంపల్లి, KPHB, అల్వాల్, కాప్రా, పీర్జాదిగూడ–బోడుప్పల్, బాచుపల్లి, మియాపూర్, టోలిచౌకి, బోరబండ, హిమాయత్‌నగర్ వంటి ప్రాంతాలు కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలకు కేంద్రాలుగా మారే అవకాశాలను కొట్టిపారేయలేం.
ప్రస్తుత అసెంబ్లీ నియోజకవర్గాలు: 119
అదనంగా ఏర్పడే నియోజకవర్గాలు (నా అంచనా): 63
మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు: 182
గమనిక: ఇది అధికారిక జాబితా కాదు. గతంలో రద్దయిన నియోజకవర్గాలు, చారిత్రక నేపథ్యం, పాత తాలూకాలు, భౌగోళిక పరిస్థితులు, జనాభా పెరుగుదల, పట్టణీకరణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని రూపొందించిన నా వ్యక్తిగత అంచనా మాత్రమే. తుది నియోజకవర్గాల సంఖ్య, పేర్లు, సరిహద్దులు డీలిమిటేషన్ ప్రక్రియలో నిర్ణయిస్తారు….. – రచయిత పూర్తి వ్యక్తిగత అభిప్రాయం
Share this Article