.
పాకిస్థాన్ ఎడారుల్లో తెలుగు బంధువులు! వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా ద్రావిడ భాషా కుటుంబమే.. బ్రాహుయీలది చిత్రమైన చరిత్ర!
మన దగ్గర ఎవరైనా కాస్త మొరటుగా కనిపిస్తే, పద్ధతీ పాడూ లేనట్టుగా ప్రవర్తిస్తే చిన్నప్పుడు ఒక మాట అనేవాళ్లు. ‘ఏంట్రా.. బరాయోడి లెక్క ఉన్నవ్!, బరాయ్ నమూనా’ అని. ఆ మాట వెనుక ఏదైనా చరిత్ర ఉందా లేదా అన్నది పక్కనపెడితే.. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. పాకిస్థాన్‌లోని ఎడారి ప్రాంతాల్లో నివసించే ఒక తెగ మాట్లాడే భాషకు, మన తెలుగు భాషతో బంధుత్వం ఉందట! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. వాళ్ల పేరు బ్రాహుయీలు.
Ads
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్, సింధ్ ప్రాంతాల్లో బ్రాహుయీలు నివసిస్తుంటారు. చుట్టూ ఉన్నవాళ్లంతా ప్రధానంగా బలూచీ, సింధీ భాషలు మాట్లాడుతుంటే.. వీళ్లు మాత్రం ప్రత్యేకమైన భాష మాట్లాడతారు. ఆ భాష పేరు బ్రాహుయీ. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఇది మన తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషల కుటుంబానికి చెందినది. అంటే మనం ద్రావిడ భాషా కుటుంబం అని పిలుచుకునే పెద్ద కుటుంబంలో బ్రాహుయీ కూడా ఒక సభ్యురాలన్నమాట.
మరి మన తెలుగు వాళ్లకు, పాకిస్థాన్ ఎడారుల్లో ఉండే ఈ ప్రజలకు సంబంధం ఏమిటి? ఒకే భాషా కుటుంబానికి చెందినంత మాత్రాన ఒకే ప్రాంతంలో ఉండాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఒకే ప్రాంతంలో నివసించిన ప్రజలు కాలక్రమంలో వేర్వేరు దిశలకు వెళ్లి ఉండొచ్చు. వారి భాషలు మాత్రం కొన్ని పోలికలను ఇప్పటికీ నిలుపుకుని ఉండొచ్చు. బ్రాహుయీల విషయంలోనూ ఇలాంటి చారిత్రక పరిణామమే జరిగి ఉండొచ్చని భాషా పరిశోధకులు భావిస్తున్నారు.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. బ్రాహుయీకి దగ్గరి భాషా బంధువులు కర్ణాటకలోని కన్నడిగులు కాదు. మన దేశంలోని జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బిహార్ ప్రాంతాల్లో నివసించే ఓరాన్ ప్రజలు మాట్లాడే కురుఖ్ భాష, మాల్టో భాషలతో దీనికి ఎక్కువ దగ్గర సంబంధం ఉంది. అంటే ద్రావిడ భాషా కుటుంబం దక్షిణ భారతదేశానికే పరిమితం కాలేదన్నమాట.

అసలు బ్రాహుయీలు పాకిస్థాన్‌కు ఎలా చేరుకున్నారు? దీనిపై రెండు రకాల అభిప్రాయాలున్నాయి. ఒకప్పుడు ద్రావిడ భాషలు మాట్లాడే ప్రజలు ఉత్తర భారత ఉపఖండంలోనూ విస్తృతంగా ఉండేవారని, కాలక్రమంలో ఇతర భాషల ప్రభావంతో వారి భాషలు కనుమరుగయ్యాయని ఒక వాదన. మరో వాదన ప్రకారం బ్రాహుయీల పూర్వీకులు కొన్ని శతాబ్దాల క్రితం భారత ఉపఖండంలోని ఇతర ప్రాంతాల నుంచి వాయవ్య దిశగా వలస వెళ్లి బలూచిస్థాన్‌లో స్థిరపడ్డారు. ఏది నిజమన్నది ఇంకా పూర్తిగా తేలలేదు.
అయితే భాషా బంధుత్వం ఉందని రక్తసంబంధం కూడా ఉందని అనుకోవద్దు. జన్యు పరిశోధనలు బ్రాహుయీలకు దక్షిణ భారతీయులతో ప్రత్యేకమైన దగ్గరి జన్యు సంబంధం ఉందని నిరూపించలేదు. కాలక్రమంలో తమ చుట్టూ ఉన్న బలూచీ, సింధీ ప్రజలతో కలిసిపోయినా, వారి భాష మాత్రం ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఒకవిధంగా చెప్పాలంటే.. చుట్టూ ఉన్నవాళ్లతో జీవితం కలిసిపోయింది. కానీ భాష మాత్రం పూర్వీకుల జ్ఞాపకాన్ని మోస్తోంది.
ఇంకో కోణంలో చూస్తే.. మనం మాట్లాడే తెలుగు భాషకు వేల కిలోమీటర్ల దూరంలో, మరో దేశంలోని ఎడారుల్లో కూడా బంధువులు ఉన్నారన్నమాట. వాళ్లకు మన గురించి తెలియకపోవచ్చు. మనకూ వాళ్ల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ భాషా చరిత్ర మాత్రం మన ఇద్దరి మధ్య ఏదో పాత బంధం ఉందని చెబుతోంది.
భాషలకు దేశ సరిహద్దులు ఉండవు. రాజకీయ పటాల్లో గీతలు గీసినంత మాత్రాన వేల ఏళ్ల చరిత్ర చెరిగిపోదు. పాకిస్థాన్ ఎడారుల్లో వినిపించే బ్రాహుయీ భాష మనకు గుర్తుచేస్తున్న విషయం ఇదే!

Share this Article