Siva Racharla………. మరణ ఆదేశం…. “నేను పోయినప్పుడు” అని తన మరణం తరువాత అంత్యక్రియలు ఎలా జరగాలి అని కవిత రాసుకున్న కవయిత్రి Indira Bhyri గారు గత ఫిబ్రవరిలో చనిపోయినప్పుడు ఆ కవిత మీద మంచి చర్చ జరిగింది. మరణం తరువాత సంప్రదాయం మీద మంచి చర్చ జరిగింది. https://www.facebook.com/siva.racharla/posts/5927558923947437
ఈ ఉదయం నెల్లూరు మణి బుక్ స్టాల్ మణి గారు చనిపోయారు. ఆయన 30 సంవత్సరాల కిందటే “మరణ శాసనం” పేరుతో తన మరణం తరువాత ఎలాంటి మత క్రతువులు జరపొద్దని, దండలు కూడా వెయ్యొద్దని, మాములు కర్రలతోనే కాల్చాలని , కళ్ళను , శరీరాన్ని దానం చేయాలని రాసి తన కుటుంబ సభ్యులకు , తన ఉద్యమ సహచరులకు దాన్ని ఇచ్చారు. మరణ శాసనం మీద తన భార్య, కొడుకు మరియు ఉద్యమ సహచరుల సాక్షి సంతకాలు కూడా పెట్టించారు.
కేరళకు చెందిన మణిగారు చిన్నప్పుడే ఇంటిని వదిలి అనేక రాష్ట్రాలు తిరిగి చివరకు నెల్లూరులో స్థిరపడ్డారు. హోటల్లో సర్వర్ గా, కిరాణా సప్లయర్ గా చిన్న చిన్న పనులు చేస్తూ వామపక్ష ఉద్యమం వైపు మళ్ళారు. హేతువాదిగా సమాజంలో మార్పు కోసం కృషి చేశారు.
Ads
మరణానంతరం దేహానికి ప్రత్యేక అస్థిత్వం వుండదు. అందుచేత, ఆ దేహానికి ప్రత్యేక గౌరవం కూడా వుండదు అంటారు మణి గారు. నేను ఏ మతానికిగాని, ఏ కులానికిగాని సంబంధించిన మనిషిని కాదు, అందుచేత కుల, మత, ఆచార, సంప్రదాయాలు నాకు వర్తించవు. వాటియందు నాకు నమ్మకంగాని, గౌరవంగాని లేదు అని 30 సంవత్సరాల కిందటే మణి గారు ప్రకటించుకున్నారు.
మణి గారి మరణ శాసనం
టి.వి. మణి అనే వ్యవహారిక నామంతో పిలువబడే నేను, శారీరకంగా, పూర్తి ఆరోగ్యంతోను, మనస్థిమితంతోను మరియు మనస్సంతృప్తితోను వ్రాసిన మరణ ఆదేశం ఇది. నా మరణానంతర కార్యం ఈ ఆదేశాన్ని అనుసరించి అమలు జరపాలని ఇందుమూలంగా తెలియజేయడమైనది. అలా జరపడంలో ఎవరికి ఎటువంటి ఆశ్లేషణ (ఆక్షేపణ..?) వుండదని భావిస్తూ వున్నాను.
నేను ఏ మతానికిగాని, ఏ కులానికిగాని సంబంధించిన మనిషిని కాదు, అందుచేత కుల, మత, ఆచార, సంప్రదాయాలు నాకు వర్తించవు. వాటియందు నాకు నమ్మకంగాని, గౌరవంగాని లేదు. అందుచేత, ఆచార సంప్రదాయాలకు భిన్నంగా నేను జీవిస్తూ వున్నాను. అలా నా మనోభావాలకు అనుగుణంగా జీవిస్తూ వున్న నేను, నా మరణానంతరం నా మృతదేహానికి ఏ విధమైన ఆచార సాంప్రదాయాలు వర్తింపజేయనక్కరలేదని తెలియజేస్తూ వున్నాను. అలా తెలియజేసే హక్కు, స్వేచ్ఛ నాకున్నదని భావిస్తున్నాను. అంతేకాక, నా మృతదేహానికి జరగవలసిన అంతిమ సంస్కారం ఈ క్రింది విధంగా జరపవలసిందిగా నిర్వచిస్తూ, ఆదేశిస్తున్నాను. ఈ ఆదేశానికి భిన్నంగా నా సంతతిగాని, నా భార్యగాని, ఇతరులుగాని ప్రవర్తించరాదు. అలా ప్రవర్తించే నైతిక హక్కుగాని, కుల, మత పరమైన, ఆచార, సంప్రదాయ, సంస్కృతిపరమైన హక్కుగాని ఎవరికీ లేదు. నా యీ ప్రవృత్తికి భిన్నంగా ఎవరూ నడుచుకోరాదని కోరుచున్నాను.
మరణానంతరం దేహానికి ప్రత్యేక అస్థిత్వం వుండదు. అందుచేత, ఆ దేహానికి ప్రత్యేక గౌరవం కూడా వుండదు. చైతన్యరహితమైన ఆ దేహానికి ఎలాంటి గౌరవము ఇవ్వవలసిన అవసరం కూడా లేదు. ఆ కారణంగా ఆ దేహానికి వెంటనే దహన సంస్కారం జరపడం అవసరం. మరణానంతరం దేహంలో వచ్చే పరిణామం (మార్పు) వల్ల, అది సహజ స్థితిని కోల్పోతుంది. ఆ కారణంగా త్వరగా చెడిపోయి దుర్గంధపూరితం అవుతుంది. అందుచేత వీలైనంత త్వరలో (ఆరు గంటలకు మించకుండా) దానికి దహన సంస్కారం జరగాలి. ఈ పని జరిగేలోగా, నా దేహంలోని ఏ అవయవ భాగమైనా (కళ్లు వగైరా ఏవైనా) ఇతరులకు ఉపయోగపడే స్థితిలో వున్నవాటిని సద్వినియోగ పరచవలెను. నా కండ్లను నేను నెల్లూరు నేత్రదాతల సంస్థ ద్వారా సమాజానికి ఇచ్చుటకు అంగీకరించి వున్నాను. అందువలన, నా మరణ వార్తను నెల్లూరు నేత్రదాతల సంస్థకు వెంటనే తెలియజేయవలెను. కండ్లు సమర్పించుటకు నిశ్చయించుకొన్న నేను చనిపోయిన వెంటనే, దయవుంచి ఇతరులు కాని, కుటుంబ సభ్యులుకాని నా మృతదేహము నందలి కండ్ల రెప్పలు మూసి, వాటిపైన నీటితో తడిపిన దూదిని వుంచి ఇతరులకు ఉపయోగపడునట్లు చేయవలెనని కోరుతున్నాను. మరణాంతర దేహం మీద మమత, మమకారాలు పెంచుకోరాదు.
దూరంలో వున్న బంధుమిత్రులు రావాలనిగాని, ఇతర కారణాలవల్లగాని దహన సంస్కారాలకు ఆలశ్యం కాకూడదు. అలా ఆలశ్యం జరిగినందువల్ల భౌతికంగా శరీరంలో వచ్చే మార్పులవల్ల సభ్యసమాజానికి ఇబ్బంది కలిగే అవకాశమున్నది. మనిషి జీవించి వుండగా ఆ మనిషి మీద వుండే మమతానురాగాలు మరణానంతరం ఆ దేహం మీద చూపించవలసిన అవసరం లేదు. అలాంటి భావాలు మనసులో మిగిల్చుకోకూడదు. నా మరణానంతరం నా దేహానికి ఏవిధమైన అలంకారాలు చేయరాదు (హేతువాదులు బాహ్య సౌందర్యానికి విలువ నివ్వరుగనుక) బంధుమిత్రులుగాని, అభిమానులుగాని అభిమానంతో పూలుగాని, పూలమాలలుగాని తెచ్చినచో వాటిని నా దేహానికి ప్రక్కగా మాత్రమే వుంచండి. మెడకు వేయడంగాని, కాళ్ళమీద వుంచడంగాని చేయరాదు. ఎందుచేతనంటే, వాటిని గుర్తించే స్థితిలో ఆ దేహం ఉండదు. గనుక మరణాంతరం దేహం మీద పువ్వులుంచడం కూడా ఆచారంగా వస్తున్నది కనుక ఈ ఆచారాన్ని కూడా పాటించనవసరం లేదు (వ్యక్తి ఆరాధన, తద్వారా విగ్రహారాధన ఇలాగే ప్రారంభమైనవి). ఆరాధన తత్వం ఏరూపంలో వున్నా, దానిని హేతువాదులు పూర్తిగా నిరసించాలి. ఎందుచేతనంటే ఈ ఆరాధనా తత్వం నుండి బానిస మనస్థత్వం అభివృద్ధి అవుతుంది గనుక.
దేహానికి సాధారణంగా కట్టెలతోనే చితిని పేర్చాలి. ప్రత్యేకమైన వాసన ద్రవ్యాలనుగాని, విలువైన మరేవిధమైన వస్తువులుగాని చితియందుంచరాదు. చితికి పెట్టే నిప్పుని ఇంటి వద్ద నుండి శ్మశానమునకు ఒక మట్టి ముంతలో పెట్టి, తీసుకెళ్ళడం ఆచారంగా వున్నది. అలాకాక, సాధారణ అగ్గిపెట్టెనే తీసుకువెళ్ళి ఉపయోగించాలి. చితికి నిప్పుని ఒక్క ప్రక్కనేకాక నాలుగు ప్రక్కల నుండి నలుగురుగాని, అంతకంటే ఎక్కువ మందిగాని పెట్టవలెను. ఎందుకంటే, చితి అన్నివైపుల నుండి ఒకేసారి మండటం అవసరం గనుక. అంతేకాక, వారసులే చితికి నిప్పు (కొరివి పెట్టాలనే ఆచారం, నియమం దీని వలన రద్దవుతుంది. చితి పూర్తిగా కాలి, దేహం పూర్తిగా దహనమయ్యేలాగా చూడటం తప్ప, మరే కార్యక్రమం అక్కడ వుండకూడదు. వైదిక పద్ధతి అని చెప్పబడే ఏ విధమైన ఆచార, సంప్రదాయాలు పాటించరాదు. వాటిని హేతువాదులు పూర్తిగా నిషేదించాలి. మైల పాటించడం, మరోరోజు పాలు పొయ్యడం, అస్థికలు సేకరించడం చేయరాదు. తిథి, కర్మలు ఏవీ చేయనక్కరలేదు. వాటిని పూర్తిగా నిషేధించడమే నా ఆశయం.
మనసు పనిచేస్తున్న దశలో, అది వ్యక్తపరిచిన భావాలకు శాశ్వత అస్థిత్వం వుంటుంది. ఆ భావాలను గుర్తుంచుకోవడం ద్వారా, ఆ మనిషి శాశ్వతంగా గుర్తుంటాడు. అలా వ్యక్తి గౌరవించబడుతూ వుంటాడు. అలా భావాల రూపంలో మిగలని మనిషి ఏరూపంలోనూ మిగలడు, గుర్తుండడు, మీరు జ్ఞాపకం వుంచు కోవలసింది ఆ మనిషిని గానీ దేహాన్ని కాదు. ఆ దేహాన్ని అభిమానించి, దానినే జ్ఞాపకం వుంచుకుంటే, దుఃఖమే మిగులుతుంది. అందుచేత, దేహరూపాన్ని మరచి, మానసిక రూపాన్ని మననం చేయాలని ఈ మరణ అదేశం కోరుచున్నది.
ఈ మరణ ఆదేశం యెక్క ఒక ప్రతిని కుంటుంబ సభ్యుల వద్ద, మరొక ప్రతిని హేతువాద సంఘ కార్యాలయంలోను వుంచుచున్నాను. ఇదే విధంగా ప్రతి హేతువాది, మరణ ఆదేశాన్ని వ్రాసిపెట్టుకోవడం ఎంతైనా అవసరం అని భావిస్తున్నాను. లేనిచో, మత భావాలుగల బంధుమిత్రులు ఆచార సాంప్రదాయాల పేరుతో దుష్ట సంప్రదాయాలను ప్రవేశపెట్టి, మన ఉనికి పై దెబ్బకొట్టి, మన అస్థిత్వాన్ని నాశనం చేస్తారు. మనిషి పుట్టిన్నాటి నుండి మరణించేదాకా ఆచార, సంప్రదాయాల పేర అన్నీ జరుగుతూ వున్నవి. అది చాలదన్నట్లుగా, మరణానంతరం కూడా ఇవి సాగాలా? అందుకు ఈ మరణ ఆదేశం అవసరమైనది.
ముఖ్య గమనిక…… నా మరణం తర్వాత, నాదేహం నుండి నెల్లూరు నేత్రదాతల సంస్థ నా కళ్లను స్వీకరించిన తర్వాత, మిగిలిన నా దేహాన్ని సమీపంలోని వైద్య కళాశాలకు ఇవ్వవలెను. ఈ బాధ్యతను తిక్కవరపు సుకుమార్ రెడ్డి (వైద్యరంగంలో సామాజిక కార్యకర్త) గారికి అప్పగించడమైనది. ఏ కారణం చేతనైనా, నా దేహాన్ని వైద్య కళాశాలకు ఇవ్వటం సాధ్యంకాకపోతే, పైన తెలిపిన ప్రకారం నా అంత్యక్రియలు జరపాలి….. టి. పి. మణి హేతువాది, నెల్లూరుజిల్లా హేతువాద సంఘ కార్యకర్త
———————–
మణి గారి మరణ శాసనం మేరకు ఆయన కుమారుడు Dr. దుర్గేష్ మణిగారి దేహాన్ని బళ్ళారి ప్రభుత్వ ఆసుపత్రికి అప్పచెబుతున్నారు. ఆలోచనే ఆశయంగా జీవితాంతం బతికినా మణి గారి లాంటి వారి స్ఫూర్తి వర్ధిల్లాలి. వయసు మళ్ళిన తరువాతనో లేక ఏదో అవసరం కోసమో యవ్వన సిద్ధాంతాలకు భిన్నంగా 20, 30 సంవత్సరాల పాటు పాటించిన సిద్ధాంతాలకు భిన్నంగా వ్యవహరించే పాపులరిస్టులు, సెన్షేషన్ కామెంట్ మేకర్స్ చాలా మంది ఉండొచ్చు కానీ నిర్మాణాత్మకంగా అంటే ఆలోచన ఆచరణ ఒకే విధముగా జీవితాంతం జీవించిన మణి గారికి నివాళి…
Share this Article