దర్శకత్వం వహించే సామర్ద్యం ఉన్న ఇద్దరు వ్యక్తులు అనుకోకుండా ఒక చోట కల్సి సినిమా తీయాలనుకున్నారు. వారే కథ తయారు చేసుకుని ఓ మంచి దర్శకుడి నేతృత్వంలో సినిమా తీసేశారు. ఆ తర్వాత కొంతకాలానికి వారే దర్శకులై అద్భుతమైన సినిమాలు తీశారు. ఆ ఇద్దరిలో ఒకరు వీరమాచినేని హనుమాన్ ప్రసాద్. మరొకరు క్రాంతికుమార్.
క్రాంతికుమార్ పుట్టింది కృష్ణాజిల్లా గన్నవరంలో. చదువు గుడివాడ, విజయవాడ, ఏలూరు, నాగపూర్ లలో నడిచింది. గుడివాడలో విశ్వశాంతి విశ్వేశ్వరావుగారు నడిపిన జ్యోతి ట్యూటోరియల్స్ లో క్రాంతిగారు చదివినట్టు గుర్తు. సినిమాల మీద ఇంట్రస్ట్ తో నిర్మాణరంగంలోకి ప్రవేశించాలనుకున్నారు.
కొందరు మిత్రులతో కల్సి రామకృష్ణా పిలింస్ బ్యానర్ మీద గుత్తా రామినీడు దర్శకత్వంలో తల్లీకూతుళ్లు నిర్మించారు. శోభన్ బాబు హీరోగా చేసిన ఆ సినిమా పెద్దగా సక్సస్ కాలేదు. దీంతో కొంత నిరుత్సాహపడ్డారు క్రాంతికుమార్. ఆ తర్వాత విజయవాడకు చెందిన హనుమాన్ ప్రసాద్ తో కల్సి శారద తీశారు. ఇక వెనక్కి తిరిగి చూడలేదు.
Ads
దీనికన్నా ముందు జరిగిన కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సినిమా నటుడు కావడానికి ముందు అప్పటికి మాగంటి రాజబాబుగా ఉన్న మురళీమోహన్ విజయవాడలో అన్నపూర్ణ ఎగ్రికల్చర్ కార్పోరేషన్ స్థాపించారు. ఆయన మిత్రులు హనుమాన్ ప్రసాద్, చటర్జీలు దాని వ్యవహారాలు చూసేవారు. చటర్జీ స్నేహితుడైన క్రాంతికుమార్ తరచు షాపుకు వచ్చి వీళ్లతో కబుర్లు చెప్తూ ఉండేవాడు. ఛటర్జీ అంటే చాటపర్రు కుర్రాడే… వెంకటగిరి జమీందారీ వారసులతో కలసి … ఇదాలోకం, జేబుదొంగ, జూదగాడు లాంటి సినిమాలు తీశారు…
ఎక్కువగా సినిమా కబుర్లు చెప్పుకునే ఈ ముగ్గురూ కల్సి ఓ ఫైన్ మార్నింగ్ సినిమా తీద్దామనుకున్నారు. వాటాలు నిర్ణయమైపోయాయి. శారద టైటిల్ తో సినిమా తీశారు . గీతాసింగ్ అనే మరాఠా డైరక్టరు కన్నడంలో యావద జన్మ మైత్రి సినిమా తీశారు. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే… విని, రైట్స్ తీసుకుని హనుమాన్ ప్రసాద్ తో ట్రీట్ మెంట్ రాయించారు.
అసలు ఆ కన్నడ సినిమా గురించి క్రాంతికుమార్ హనుమాన్ ప్రసాద్ లకు చెప్పింది సంగీత దర్శకుడు చక్రవర్తి. సరే, కథ దొరికింది. హీరో శోభన్ ను కల్సి కథ చెప్పారు. ఆయన సజషన్ మేరకు కె. విశ్వనాథ్ ను డైరక్టర్ గా తీసుకుని ఆయన చేతుల్లో స్క్రిప్ట్ పెట్టారు. శారద హిట్ కొట్టడమే కాదు విలన్ సత్యనారాయణకు కారక్టర్ ఆర్టిస్ట్ గా టర్నింగ్ ఇచ్చింది. చక్రవర్తిని బిగ్ మ్యూజిక్ డైరక్టర్ ను చేసింది.
శారద క్లైమాక్స్ సుఖాంతం చేయాలని సీనియర్ దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు సలహా చెప్పారు. అంటే వితంతువుగా కూడా ఊరు శారదను నెత్తిన పెట్టుకుంటుంది. అలా శోభన్ సమాధి దగ్గరే బతుకీడుస్తూ… వృద్దాప్యంలో కన్నుమూస్తుందనేది ప్రకాశరావుగారు చెప్పిన క్లైమాక్స్. నిజానికి అది క్రాంతికుమార్ అభిప్రాయం. ప్రకాశరావుగారు సపోర్ట్ చేసారు.
అయితే ఈ క్లైమాక్స్ ను హనుమాన్ ప్రసాద్ కాదనడంతో విశ్వనాథ్ కలుగజేసుకుని ఊరు చేరుతూనే పడవలోనే శారద కన్నుమూస్తుంది అన్నారు. సరే, అలాగే చేద్దాం అనుకున్నారు అందరూ. ఆడియన్స్ కు ఈ క్లైమాక్స్ బాగా కనెక్ట్ అయింది.
క్రాంతికుమార్ కొత్త తరహా కథాంశాలను ఎన్నుకోవడంలో చాలా ముందుంటారు. కథలో ఓ కొత్త కాన్ ప్లిక్ట్ కోరుకుంటారాయన. ఇదే ఆయన చిత్రాలకు ప్రత్యేకత సాధించిపెట్టింది. క్రాంతికుమార్ చిత్రాలతోనే రాఘవేంద్రరావు డైరక్టర్ గా సక్సస్ ట్రాక్ ఎక్కారు. కోదండరామిరెడ్డిని మాస్ డైరక్టర్ ను చేసిందీ క్రాంతికుమారే.
ఇక్కడే ఇంకో విషయం ఈరోజు పాన్ ఇండియా డైరెక్టర్ అనిపించుకున్న రాజమౌళి కూడా క్రాంతి గారి ఆఫీసు మెట్లెక్కిన వారే. మళ్లీ కథలోకి వస్తే … శారద సక్సస్ అయ్యాక వెంటనే శారదతోనే కొత్త సినిమా అనౌన్స్ చేశారు క్రాంతికుమార్. కథ కురూపితనం నేపద్యంలో సాగుతుంది. స్వార్ధపర సమాజంలో కురూపుల జీవితాలు ఎలా బలైపోతాయనే కథాంశంతో సినిమా తీయడం నిజంగా సాహసమే.
వర్గ సమాజంలో ఆస్తి కోసం కురూపుల్ని పెళ్లి చేసుకునే వారు ఉండొచ్చు… వర్గ రహిత సమాజంలో వారి పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్న. కాని కొత్త సంఘర్షణలను తెరకెక్కించాలనుకునే క్రాంతికుమార్ ఎవరి సలహాలను లెక్కచేయకుండా కలర్ లో తీసిన సినిమా ఊర్వశి. చక్రవర్తే మ్యూజిక్ చేసిన ఈ సినిమాలో ప్రతి అందం జంట కోసం కలవరించి పోతుంది… పాట సూపర్ డూపర్ హిట్ కొట్టింది.
నిజానికి ఊర్వశి చిత్రానికి రాఘవేంద్రరావును దర్శకుడుగా పెట్టుకోవాలనుకున్నారు. చివరి నిమిషంలో బాపయ్యకు బాద్యతలు అప్పగించారు. ఊర్వశి ఫ్లాప్ కావడంతో నెక్ట్స్ మూవీ జ్యోతిని డైరక్ట్ చేసే బాధ్యత రాఘవేంద్రరావుకే అప్పగించారు. రాఘవేంద్రరావు తొలి చిత్రం బాబు కూడా ఓ మోస్తరుగానే ఆడింది. దీంతో కసిగా జ్యోతి సినిమా తీశారాయన.
అనుకోని పరిస్ధితుల్లో ఓ పదహారేళ్ల అమ్మాయి ఆరు పదులు దాటేసిన ముసలాణ్ణి పెళ్లి చేసుకుంటుంది… ఈ సంఘర్షణను అందంగా, అర్ధవంతంగానూ తెరకెక్కించి సక్సస్ కొట్టారు క్రాంతికుమార్, రాఘవేంద్రరావులు. సి.ఆనందారామం గారు రాసిన మమతల కోవెల నవల ఈ సినిమాకు మూలం.
దాసరి దర్శకత్వంలో హనుమాన్ ప్రసాద్ స్వంతంగా తీసిన తిరుపతి సినిమాలో నటించిన మురళీమోహన్, జయసుధలనే జ్యోతి హీరో హీరోయిన్స్ గా ఎంపిక చేసుకున్నారు. జ్యోతి సినిమా దర్శకుడుగా రాఘవేంద్రరావు కెపాసిటీ మీద ఆడియన్స్ లో నమ్మకాన్ని నింపింది. అలాగే నిర్మాతగా క్రాంతికుమార్ కు తన మీద తనకు నమ్మకాన్నిచ్చింది.
రాఘవేంద్రరావు కాంబినేషన్ లోనే తెరకెక్కిన మరో క్రాంతికుమార్ చిత్రం ఆమె కథ. స్క్రిజోఫెర్నియాతో బాధపడుతున్న ఓ అమ్మాయి … కొత్తగా పెళ్లైన ఓ జంట జీవితంలో ఎలాంటి కల్లోలం సృష్టించిందనే కాన్సెప్ట్ తో సాగుతుంది ఆమె కథ చిత్రం. మహిళా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందీ సినిమా. జయసుధకు ఆ తర్వాత వచ్చిన సహజనటి బిరుదు వెనుక ఈ సినిమా కూడా ఉంది.
క్రాంతికుమార్ నిర్మాణంలో రాఘవేంద్రరావు తీసిన జ్యోతి, ఆమె కథ, కల్పన చిత్రాలన్నీ లోబడ్జట్ చిత్రాలే. కథను నమ్ముకుని తీసినవే. వాస్తవిక ధోరణితో సాగేవే. తమిళ్ లో సక్సస్ ఫుల్ ట్రెండ్ గా కంటిన్యూ అవుతున్న బాలచందర్ మార్క్ చిత్రాల తరహాలోనే ఈ సినిమాలు కూడా పెద్ద సినిమాలతో పోటీ పడి విజయాలు సాధించాయి.
కల్పన తర్వాత రాఘవేంద్రరావు పూర్తి స్థాయిలో బిగ్ సినిమాలకే పరిమితం అయ్యారు. మంచి సినిమా, చెడ్డ సినిమా అనే తేడాలుంటాయి గానీ… స్టార్ సినిమా, నాన్ స్టార్ సినిమా అనే తేడాలుండవని తరచు చెప్పేవారు క్రాంతికుమార్. బిగ్ స్టార్స్ తో కూడా సెన్స్ బుల్ మూవీస్ చేయవచ్చని ఆయన బలంగా నమ్మేవారు.
నమ్మడమే కాదు… ఆచరణలో చేసి చూపించారు కూడా. కథను నమ్ముకుని సినిమా తీస్తే జనం తప్పకుండా చూస్తారని క్రాంతికుమార్ నమ్మిన సూత్రమే ఆయన్ను సక్సస్ ఫుల్ ప్రొడ్యూసర్ ని చేసింది. కల్పన తర్వాత రాఘవేంద్రరావు బిగ్ అండ్ బిజీ డైరక్టర్ అయిపోవడంతో ఆల్డర్ నేటివ్స్ కోసం వెతకడం మొదలెట్టారు క్రాంతికుమార్.
అప్పుడు రవీంద్రభారతిలో అనుకోకుండా సి.ఎస్.రావు రచన ప్రాణం ఖరీదు నాటకం చూశారు క్రాంతికుమార్. విపరీతంగా నచ్చేసింది. ప్రత్యగాత్మ కొడుకు వాసుకు దాని దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. మెగాస్టార్ చిరంజీవి నటించగా విడుదలైన మొదటి చిత్రంగానే కాదు.. ఓ మంచి చిత్రంగా కూడా ప్రాణం ఖరీదు మంచి మార్కులే సాధించింది.
శారదలో కొత్త ఇమేజ్ అందించిన సత్యనారాయణతోనే ప్రాణం ఖరీదులో ఓ అద్భుతమైన పాత్ర చేయించారు క్రాంతికుమార్.
ఆ పాత్రకు జాలాదితో అనితరసాధ్యం అనిపించే స్టైల్ లో ఓ పాట రాయించారు. యాతమేసి తోడినా… ఏరు ఎండదు… పాట అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయే పాట…
ప్రాణం ఖరీదు తర్వాత ఓ హిందీ సినిమా ఆధారంగా రాఘవేంద్రరావు డైరక్షన్ లో కమర్షియల్ మూవీ తీశారు క్రాంతికుమార్.
మోసగాడు టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాలో మొదటిసారిగా శ్రీదేవితో కల్సి డాన్స్ చేస్తారు చిరంజీవి. చిరంజీవి మెయిన్ విలన్ గా చేసిన ఏకైక సినిమాగా కూడా మోసగాడు చరిత్రలో నిల్చిపోతుంది.
స్టార్స్ తో అయినా సెన్సు బుల్ మూవీస్ చేయచ్చని ప్రూవ్ చేసిన వాడు క్రాంతికుమార్. ఎన్.టి.రామారావు అనగానే… అడవిరాముడు, వేటగాడు లాంటి కథలే కావాలనుకోనవసరం లేదని ప్రూవ్ చేసిన సినిమా సర్దార్ పాపారాయుడు. క్రాంతి కుమార్ ఓ లైన్ తయారు చేసుకుని రాఘవేంద్ర రావు తో డైరెక్ట్ చేయించాలి అనుకున్నారు. రాఘవేంద్రరావు బీజీ కావడంతో దాసరి కి బాధ్యత అప్పగించారు.
క్రాంతి గారు చెప్పిన స్టోరీ లైన్ కు వెంటనే ఓకే చెప్పి తన పద్దతిలో ట్రీట్మెంట్ రాసుకుని దాసరి భారీ ఎత్తున తెరకెక్కించిన సర్దార్ పాపారాయుడు ఎన్.టి.ఆర్ కెరీర్ లోనే ఓ స్పెషల్ మూవీగా నిల్చిపోయింది. పాపారాయుడు సెట్స్ మీద ఉండగానే ప్రాజెక్టు తనకు అమ్మేయమన్నారు ఎన్టీఆర్. సున్నితంగా తిరస్కరించి తనే రిలీజ్ చేసుకున్నారు.
సర్దార్ పాపారాయుడు తర్వాత కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో సక్సస్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్లతో పాటు ఆలోచనాత్మక చిత్రాలూ తెరకెక్కించారు క్రాంతికుమార్. ఆ తర్వాత తనే డైరక్టర్ గా మారి బయట నిర్మాతలకూ అద్భుతమైన చిత్రాలు తీసిపెట్టారు. అయితే కమర్షియల్ చిత్రాలు పవర్ ఫుల్ గా తీయాలనే తపన మాత్రం తీరలేదు.
సర్దార్ పాపారాయుడు తర్వాత డి.కామేశ్వరి నవల కొత్తమలుపు నవల హక్కులు తీసుకున్నారు క్రాంతికుమార్. న్యాయం కావాలి పేరుతో ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, రాధిక కాంబినేషన్ లో తెరకెక్కించారు. ప్రియుడి చేతిలో మోసపోయిన స్త్రీ ఆత్మహత్యకు పాల్పడకుండా ధైర్యంగా కోర్టు బోనులో నిలబడి అతని మోసాన్ని బయటపెట్టటం ప్రేక్షకుల జేజేలు అందుకుని కొత్త పోకడలకు శ్రీకారం చుట్టింది.
న్యాయం కావాలి తర్వాత చిరంజీవి, మోహన్ బాబులతో కోదండరామిరెడ్డి డైరక్షన్ లోనే కిరాయి రౌడీలు పేరుతో పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ తీశారు. చిరంజీవికి మాస్ లో క్రేజీ ఇమేజ్ తెచ్చిన చిత్రాల్లో కిరాయి రౌడీలు ఒకటి. సంధ్య, న్యాయంకావాలి చిత్రాలతో మహిళా దర్శకుడు ఇమేజ్ తెచ్చుకున్న కోదండరామిరెడ్డిని మాస్ డైరక్టర్ గా ప్రూవ్ చేసిన సినిమా కిరాయి రౌడీలు.
కోదండరామిరెడ్డితో క్రాంతికుమార్ చివరి సినిమా శివుడు శివుడు శివుడు. అప్పట్లో తెలుగు ప్రేక్షకులను ఓ ఊపు ఊపుతున్న మార్షల్ ఆర్ట్స్ మూవీస్ కి తెలుగు కమర్షియల్ అనుసరణే ఈ చిత్రం. సినిమా అద్భుతంగా తెరకెక్కించినా… ఆడియన్స్ ప్రాపర్ గా రిసీవ్ చేసుకోలేదు. దీంతో ఓపెనింగ్స్ కే పరిమితం అయిపోయింది.
ఈ సినిమా షూటింగ్ సమయంలో క్రాంతికుమార్ వ్యవహారశైలి నచ్చక కోదండరామిరెడ్డి ఈ సినిమా మధ్యలో వదిలేసి వెళ్లి శ్రీరంగనీతులు కమిట్ అయ్యారు. ఆ సిన్మా హిట్టు కొట్టింది. క్రాంతిగారే కంప్లిట్ చేసిన శివుడు శివుడు శివుడు ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత మళ్లీ చిరంజీవితోనే ఇది పెళ్లంటారా ? అని ప్రశ్నించారు. విజయభాస్కర్ డైరెక్టర్. అదీ ఆడలేదు.
అప్పటి వరకు నిర్మాణానికే పరిమితం అయిన క్రాంతికుమార్ మెగాఫోన్ పట్టాలని నిర్ణయించుకున్నారు. పాపారాయుడు కథలో శారద, యంగ్ ఎన్.టి.ఆర్ పాత్రలనే తీసుకుని ఎన్.టి.ఆర్ కారక్టర్ ను అమ్మాయిగా మార్చి చేసిన ప్రయోగం స్వాతి. భర్త ఎవరో చెప్పలేని తల్లి. తండ్రి ఎవరో తెలియని కూతురు సాగించే జీవన ప్రయాణం స్వాతి. సినిమా అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. సుహాసినికి స్ఠార్ ఇమేజ్ తీసుకువచ్చింది.
క్రాంతికుమార్ తరచు ఓ మాట చెప్పేవారు. మృణాల్ సేన్ తరహా చిత్రాలు తీయడం పెద్ద కష్టం కాదుగానీ… మన్మోహన్ దేశాయ్ తీసే కమర్షియల్ ఎంటర్ టైనర్లు తీయడం చాలా కష్టం అనేవారు. ఆయన జీవితంలో అదే జరిగింది. సెన్సుబుల్ సినిమాలు అద్భుతంగా తెరకెక్కించిన క్రాంతికుమార్ భారీ కమర్షియల్ ఎంటర్ టైనర్లు తీయాలనుకున్న ప్రతిసారీ భంగపడుతూనే వచ్చారు.
స్వాతి సంచలన విజయం సాధించిన తర్వాత క్రాంతి చిత్ర బ్యానర్ లో తెరకెక్కిన చిత్రం అగ్నిగుండం. తన బ్యానర్ హీరో చిరంజీవితో దర్శకుడుగా క్రాంతికుమార్ తీసిన అగ్నిగుండం బాక్సాఫీసు దగ్గర ఢమాల్ అనేసింది. కానీ డబ్బులు భారీగానే వచ్చాయి.
నాగార్జునతో నేటి సిద్దార్ద టైటిల్ తో చేసిన ప్రయత్నం కూడా కలసి రాలేదు. ఇలా లాభం లేదనుకుని… తను కేవలం తెర వెనక్కే పరిమితమై కోడి రామకృష్ణతో తీయించిన రిక్షావోడు కూడా సేమ్ రిజల్ట్ రిపీట్ చేసింది. అగ్నిగుండం డిజాస్టర్ తర్వాత తనదైన స్టైల్ లో శారద ప్రధాన పాత్రలో మరో మహిళా చిత్రం తెరకెక్కించారు క్రాంతికుమార్.
చలం ఆలోచనల ప్రభావం క్రాంతికుమార్ మీద ఉందని అంటారు. తెలుగు సినిమా చలం అని కూడా అంటారు. శారదాంబ చిత్రంలో చలం ఫొటో చూపెడతారు. గడ్డంతో ఉన్న చలాన్ని నక్సలైట్ నాయకుడని భావించి ఆ ఫొటో పెట్టుకున్న విద్యార్ధిని అరెస్ట్ చేస్తారు పోలీసులు.
క్రాంతికుమార్ బయట నిర్మాతలకు కూడా కొన్ని అద్భుతమైన చిత్రాలు తీసిపెట్టారు. అలా వచ్చిన వాటిలో అక్కినేనితో చేసిన సీతారామయ్యగారి మనవరాలు ఒకటి. వి.ఎమ్.సి దొరస్వామి రాజు నిర్మాతగా వచ్చిన ఈ చిత్రం ఓ కొత్త నాగేశ్వర్రావును ప్రేక్షకులకు పరిచయం చేసింది. విగ్గులేకుండా మీసం పెంచి… అక్కినేని చాలా కొత్తగా అందంగా, హుందాగా ఉంటారు.
అయితే సీతారామయ్య పాత్రను వేటూరి సుందరరామ్మూర్తిగారితో చేయిద్దామనుకున్నారు. ఆయన సలహా మేరకు అక్కినేనికి టర్న్ అయ్యింది. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా సి.హెచ్.వి. అప్పారావు కోసం తీసిన అక్కమొగుడు చిత్రం కూడా మంచి విజయం సాధించింది. యాక్షన్ హీరోగా ఎదుగుతున్న రాజశేఖర్ తో సెంటిమెంటల్ చిత్రం తీసి సక్సస్ కొట్టడం మామూలు విషయం కాదు. ఆ ఫీట్ క్రాంతికుమార్ చాలా అద్భుతంగా చేసేశారు.
అక్కమొగుడు తర్వాత క్రాంతికుమార్ చేసిన ఏ ప్రయత్నమూ కల్సిరాలేదు. ఓ తమిళ దర్శకుడితో చేసిన ప్రేమించేది ఎందుకమ్మా సినిమా ఆడలేదు. సౌందర్యతో తీసిన ప్రయోగాత్మక చిత్రం తొమ్మిది నెలలు చిత్రానికి రావల్సిన ప్రేక్షకుల గుర్తింపు దక్కలేదు. అవార్టులకే పరిమితం అయిపోవడం వల్ల క్రాంతికుమార్ దర్శకుడుగా సంతోషపడ్డా… నిర్మాతగా మాత్రం డీలా పడ్డారు.
తెలుగులోనే కాకుండా హిందీలో రెండు, కన్నడంలో మూడు, ఒరియాలో మూడు చిత్రాలకు నిర్మాతగా, దర్శకునిగా ఉన్న క్రాంతికుమార్ 2003 మే 9న కన్నుమూశారు. తెలుగులో ఆలోచనాత్మక చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన నిర్మాతల్లో ముందువరసగా ఉండే క్రాంతికుమార్ నిర్మించిన దర్శకత్వం వహించిన చిత్రాల విశేషాలు ఇవీ…. ( By రంగావఝల భరధ్వాజ )
Share this Article