.
అసలు సిగ్గు లేనిది మన మీడియాకు, మన మేధావులకు..! ఎవడో ఎక్కడో కూర్చుని ఓ పిచ్చి సర్వే, తిక్క ర్యాంకింగ్స్ విడుదల చేస్తాడు… ఇంకేముంది..? మన తలకాయలు పెడబొబ్బలు, శోకాలు, గుండెలు బాదుకుంటాయి… ఏమనీ..? అయ్యో, అయ్యో, ఇండియాలో ప్రెస్ ఫ్రీడమ్ లేదు, తొక్కేస్తున్నారు, ఘోరం, దారుణం అని..!
ఆ ఏజెన్సీ ఏమిటి..? ర్యాంకింగులకు తీసుకునే ప్రామాణికాలు, పాటించే పద్ధతి ఏమిటీ అనేది కూడా ఆలోచించకుండా మన మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా గుడ్డిగా అచ్చేసి, లబలబ మొత్తుకుంటుంది… వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్… 2016లో 133 ర్యాంకు ఉంటే ప్రతి ఏటా పడిపోతూ ప్రస్తుతం 157కు చేరుకుందని RSF ఏజెన్సీ ర్యాంకింగ్స్ విడుదల చేసింది…
Ads

ఇక్కడ యూపీఏ ప్రభుత్వం ఉందా..? ఎన్డీయే ప్రభుత్వం ఉందా వదిలేయండి కాసేపు… అసలు ఆ ఏజెన్సీ ప్రామాణికాలు ఎంత దరిద్రమో చూద్దాం… ఈ ర్యాంకింగులను పట్టుకుని శోెకాలు పెట్టే తలకాయలకు నివాళిగా…
శ్రీలంక, పాకిస్థాన్, నేపాల్, భూటాన్ మనచుట్టూ మస్తు ప్రెస్ ఫ్రీడమ్ ఉందట… తెల్లారిలేస్తే ప్రభుత్వాల మీద, సమాజం మీద, ఒక మతం మీద అంతులేని విద్వేషం, విషం కక్కుతూ ఆందోళనల్ని ఉసిగొల్పుతూ, అశాంతిని రేపే మీడియా ఉన్న మన దేశంలో మాత్రం ప్రెస్ ఫ్రీడమ్ లేదట… అసలు ఇక్కడున్నంత స్వేచ్ఛ ఇంకెక్కడ ఉందని..?
ఇక్కడ సిస్టం సపోర్ట్ ఉంది, కోర్టుల సపోర్ట్ ఉంది, ఎన్జీవోల సపోర్ట్ ఉంది… అవసరమైతే అర్బన్ నక్సల్స్, ఉగ్రవాద సానుభూతి ఆర్గనైజేషన్ల సపోర్ట్ కూడా..! సదరు ఆర్ఎస్ఎఫ్ (రిపోర్టర్స్ బియాండ్ బోర్డర్స్) 180 దేశాల్లో మన పొరుగునే ఉన్న మయన్మార్‌కు 166 (డిఫికల్ట్), అప్ఘనిస్థాన్‌కు 175 (అత్యంత దారుణం), చైనాకు 178 (అత్యంత దారుణం) ర్యాంకులు ఇచ్చింది… 180లో చైనాకు 178 అర్థం చేసుకొండి… (సిరియా, ఎరిట్రియా మాత్రమే 179, 180 ర్యాంకులు అర్థమైందా?)
మరి సోకాల్డ్ చైనా మానసపుత్రికలు కమ్యూనిస్టు పత్రికలు, మేధావులు మాత్రం నోరు మెదపరు… ఆ మూడు దేశాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఒక్క వార్త రాస్తే ఆ రిపోర్టర్, ఆ మీడియా తెల్లవారి మళ్లీ కనిపించరు, కనిపించదు… ఏమైపోయారో కూడా ఎవరికీ తెలియదు…
అసలు ఏమిటిదంతా అని మూణ్నాలుగు ఎఐ ప్లాట్‌ఫారాలను అడిగితే విస్తుపోయే జవాబులు కనిపించాయి… వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ (విలేకరుల స్వేచ్ఛా సూచీ) ర్యాంకింగ్‌లు వివాదాస్పదం కావడానికి ప్రధాన కారణం, అది జర్నలిజం “నాణ్యత”ను కాకుండా, కేవలం “పరిస్థితులను” మాత్రమే కొలవడమే… చాలా దేశాలు, ముఖ్యంగా భారతదేశం వంటి పెద్ద ప్రజాస్వామ్య దేశాలు ఈ ర్యాంకింగ్‌లు తప్పని వాదించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి…
RSF ఈ ర్యాంకులను కేవలం ఒక ప్రశ్నావళి (Questionnaire) ఆధారంగా రూపొందిస్తుంది… ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే “నిపుణులు” (జర్నలిస్టులు, లాయర్లు, హక్కుల కార్యకర్తలు) ఎవరో RSF బయటపెట్టదు… ఎంచుకున్న ఆ కొద్దిమంది వ్యక్తుల వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలు లేదా పక్షపాతం మొత్తం దేశం ర్యాంకుపై ప్రభావం చూపుతాయి… ఇది వాస్తవ పరిస్థితులను ఎలా ప్రతిబింబిస్తుంది…
పెద్ద దేశాలను, చిన్న దేశాలను ఒకే కోణంలో చూడటం ఈ ఇండెక్స్‌లో ఉన్న అతిపెద్ద లోపం… భారతదేశం వంటి 140 కోట్ల జనాభా, వందలు- వేల మీడియా సంస్థలున్న దేశంలో ఎక్కడో ఒక మూల జరిగిన చిన్న సంఘటనను కూడా, ఐస్లాండ్ వంటి అతి తక్కువ జనాభా ఉన్న దేశంలో జరిగిన ఘటనతో సమానంగా చూస్తారు… పెద్ద దేశాల్లో ఉండే వైవిధ్యం, సంక్లిష్టతలను RSF లెక్కల్లోకి తీసుకోదు…
RSF దృష్టిలో ఒక దేశంలో మీడియా ఎంత అబద్ధపు వార్తలు (Fake News) రాసినా, ఎంత రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నా పర్వాలేదు కానీ… ప్రభుత్వం వాటిని నియంత్రించే ప్రయత్నం చేస్తే మాత్రం అది “స్వేచ్ఛను హరించడమే” అవుతుంది… ఫలితంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే మీడియా ఉన్న దేశాలు కూడా ఈ ర్యాంకింగ్‌లో పైన ఉండవచ్చు… (రష్యా, ఉక్రెయిన్, ఇరాన్, ఇజ్రాయిల్, లెబనాన్, పాలస్తీనా వంటి దేశాల ర్యాంకులను ఓసారి పరిశీలించాల్సి ఉంది…)
యుద్ధాల్లో చిక్కుకున్న దేశాలు లేదా కనీస ప్రజాస్వామ్యం లేని దేశాల ర్యాంకు కూడా భారతదేశం వంటి దేశాల కంటే మెరుగ్గా ఉంటుంది… ఇది గ్రౌండ్ రియాలిటీకి విరుద్ధంగా ఉండటం వల్ల చాలామంది ఈ ర్యాంకులను “తప్పు” (Wrong) అని కొట్టిపారేస్తారు…
రహస్యంగా ఎంచుకున్న కొద్దిమంది అభిప్రాయాలే దేశ ర్యాంకుల్ని, ప్రజాస్వామిక స్పూర్తిని నిర్ణయించకూడదు… దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల పరిస్థితులను RSF పరిశీలించదు… అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రతిష్టను దెబ్బతీయడానికి పాశ్చాత్య దేశాల ఎజెండాలో భాగంగా ఈ ర్యాంకులు ఉంటాయి… ఇదీ అసలు రియాలిటీ…
క్లుప్తంగా చెప్పాలంటే, ఈ ర్యాంకింగ్‌లు కేవలం రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (RSF) సంస్థకు చెందిన ఒక నిర్దిష్టమైన దృక్కోణం మాత్రమే తప్ప, అవి అంతిమ సత్యం కావు… భారతదేశం వంటి భారీ జనాభా ఉన్న దేశంలో కూడా రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (RSF) సంస్థ కేవలం అతి తక్కువ మంది నుంచి మాత్రమే అభిప్రాయాలు సేకరిస్తుంది. ఇదే ఈ సూచీపై ప్రధాన విమర్శలకు దారితీస్తోంది…
ఇదెంత దారుణమో చెప్పుకుందాం… RSF అధికారికంగా ఒక దేశం నుండి ఎంతమంది సమాధానాలు ఇచ్చారో ఎప్పుడూ బహిర్గతం చేయదు… అయితే, లభించిన సమాచారం ప్రకారం… ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలకు కలిపి సుమారు 150 మంది కరస్పాండెంట్లు, కొంతమంది ఎంపిక చేసిన నిపుణులు (జర్నలిస్టులు, లాయర్లు, హక్కుల కార్యకర్తలు) ఈ ప్రశ్నావళికి సమాధానాలు ఇస్తారు…
భారతదేశం విషయానికి వస్తే నీతి ఆయోగ్, ఇతర విశ్లేషకుల నివేదికల ప్రకారం, భారతదేశం వంటి పెద్ద దేశానికి కూడా ఈ సంస్థ కేవలం కొద్దిమంది (సుమారు 10 నుండి 20 మంది లోపు) నిపుణుల అభిప్రాయాలనే పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది…
ఈ సంస్థ అభిప్రాయాలు తీసుకునే వ్యక్తుల వివరాలు అత్యంత రహస్యంగా ఉంచుతారు… సాధారణంగా వీరు RSF నెట్‌వర్క్‌లో ఉన్న కరస్పాండెంట్లు, ఆ దేశానికి చెందిన మానవ హక్కుల కార్యకర్తలు, స్వతంత్ర జర్నలిస్టులు లేదా మీడియా విశ్లేషకులు…
భారతదేశం వంటి 140 కోట్ల జనాభా, వేల సంఖ్యలో వార్తాపత్రికలు, ఛానళ్లు ఉన్న దేశంలో కేవలం పిడికెెడు మందితో కూడిన ఒక చిన్న బృందం ఇచ్చే సమాచారాన్ని బట్టి ర్యాంకు కేటాయించడం అబ్సర్డ్… మన సమాచార ప్రసార శాఖ కూడా అదే చెబుతోంది… ఆ ‘నిపుణులు’ ఎవరు? వారిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు? అన్నది ఎవరికీ తెలియదు… ఢిల్లీ లేదా ముంబై వంటి నగరాల్లో ఉండే కొద్దిమంది అభిప్రాయాలు మొత్తం దేశంలోని (ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని) పరిస్థితులకు అద్దం పట్టవు… ఈ ప్రశ్నావళికి సమాధానం ఇచ్చే వ్యక్తుల వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలు ర్యాంకును ప్రభావితం చేస్తుంది…
అంటే… బహుశా ఈ టీమ్‌లో రాజదీప్ సర్దేశాయ్, ధృవ్ రాఠీ, రవీష్, బర్ఖాదత్, ప్రణయ్ రాయ్, కరణ్ థాపర్, తికాయత్, యోగేంద్ర యాదవ్, నిధి రజదాన్… ఇలాంటి వాళ్లే ఉండి ఉంటారా..? ఏమో..!!
Share this Article