Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సినారె..! జ్ఞానపీఠమైనా ఈ కవి పాదపీఠమే…! అనితరసాధ్యం..!!

June 12, 2026 by M S R

.

Gottimukkala Kamalakar… జ్ఞానపీఠమైనా కవి పాదపీఠమే…!
ఈ నేల మీద పుట్టిన పోతన తర్వాత అంతటి పాండిత్యప్రకర్ష గల సాహితీ ధురీణుడు సినారె..!
జానపదాలు, సినీగీతాలు, జ్ఞానపథాలు, గజళ్లూ, ద్విపదలూ, ఖండకావ్యాలు, దీర్ఘ కవితలూ, లఘు కవితలూ, పరిశోధనా గ్రంధాలూ, ఓ సినిమా కి మాటలూ, ఆయన రాసిన ప్రతీ అక్షరమూ అక్షయమే…!
ఆయన చిరంజీవి..!

**** పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటె నురగ తీరుగా ఉంటవే…!
విచ్చుకోని మొగ్గవోలె, పచ్చిపాల నిగ్గువోలె ముచ్చటెత్తి పోతున్నావే…!
ఇది పల్లెపడుచును వర్ణించిన జనపదం.

Ads

*** వినీల కచభర విలాసబంధుర తనూలతిక చంచలించి పోగా ఆడవే..!
ఇది కవి రసహృదయం.

*** సౌందర్యమూ, సౌశీల్యమూ నిలువెల్ల నెలకొన్న కలభాషిణికి అభినందన మందారమాలా…!
ఇది ప్రబంధకారుడి ప్రణయోద్వేగం.

*** ఆ నెన్నడుము ఆడిన చాలూ; రవళించులే నవకవితా ప్రబంధాలు..!
ఇది అభిమాని ఆరాధనాగీతం.

*** చిట్టి ఈడు పాయెనని, చిగురు ఈడు వచ్చెనని చీర కట్టినారె గుమ్మలూ..!
అంటూ పల్లెపిల్ల సవర్తాడిన ముచ్చట చెప్పినా,
కొండపల్లి కొయ్యబొమ్మా కోక కట్టి కూర్చుందమ్మా..!
అంటూ పుష్పవతి ఐన మేనమరదలి ముందు బావ సింగారాలు పోయినా అది సినారె పాటే..!

**** రామచక్కని బంగారు బొమ్మ రాత రంపపుకోత అయ్యిందన్నా అది సినారె రాతే…!

**** తెలుగు సినిమా పాటకు కవిత్వాన్ని వేటూరి అద్దితే; అదే తెలుగు పాటకు సినారె కావ్య నగిషీలు అద్దాడని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు.
కిలికించితం; అమవస నిశి; గుత్తపు రవిక; అమ్మకచెల్ల లాంటి ప్రయోగాలు ఆయనకు పెన్నుతో పెట్టిన విద్య..!
ఓ పక్క పల్లెపదం; ఇంకోపక్క పండితపథం..!

ఎంతటి మహరాజైనా “బింబాధర మధురిమలనూ, బిగికౌగిలి గుసగుసలనూ” వాంఛిస్తాడని ఖలనాయకుడితో ఆయన పలికించిన యుగళ గీతం న భూతో..!
NTR బ్లాక్ &వైట్ సినిమా ఎంతిష్టమో, ఆయన ద్వారా సినిమా కి పరిచయమైన సినారె సాహిత్యం అంటే అంత వెర్రి ప్రేమ నాకు.

  • సీతారామశాస్త్రి గారి భాషలో చెప్పాలంటే సినారె సెలయేరులాంటి సముద్రం. నా భాషలో మహాసాగరం. జానపదమైనా; జాణపదమైనా; ఙ్ఞానపథమైనా ఆ కారణజన్ముడి ముందు మిగిలిపోయిన మూక అంగుష్ఠసమానులు.

సినిమా పాటలు; ఏకవీరకి మాటలు; కవితలు ; కావ్యాలు; దీర్ఘకావ్యాలు; గజల్లు; వచన సాహిత్యం; ఉర్దూ సాహిత్యం..! ఆయన అధిరోహించని శిఖరాలులేవు.

***
ఆయన ఙ్ఞానపీఠాన్ని అధిరోహించినపుడు
ఎవడికిరా సన్మానం
ఎందుకురా సన్మానం
చెట్టంతటి పేరొందిన
చిగురుకు ఈ సన్మానం..!
పేరేమో సింగిరెడ్డి
నారాయణ రెడ్డి కాని
కులంకీళ్లు విరిచే
నా కలానికీ సన్మానం…!
అన్నారు. కానీ ఆయన చిగురంత పేరే పొందిన మహావృక్షం.

**** మహాకవీ.., జాషువా గారు చెప్పినట్లు మీకు మరణం ఉండదు. మీరు కాలత్రయాతీతులు.
మృత్యోర్మా అమృతంగమయా....!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫాఫం పూజా హెగ్డే ! ‘జననాయకుడి’ కథలో ఎడాపెడా కట్ కట్ !!
  • మిస్టర్ పవన్ కల్యాణ్… కోడి చెరువు కబ్జాపై మాట మీద నిలబడతావా…
  • 52 లోనూ అదే 25 … నాటి ‘గాయం’- నేటికీ అదే ప్రాయం… ఆమే ఊర్మిళ !!
  • ఏదో ఓరోజు నిజం అబద్ధాన్ని చెప్పుతో కొడుతుంది ! ఎవరన్నారు? ఎవరిని?
  • ముట్టడి పోరాటాలన్నీ మైలేజీ పోరాటాలే… ఎవ్వడూ తగ్గట్లేదు…
  • ధర్మేంద్ర ప్రధాన్… విద్యార్థి రాజకీయాల నుంచి ఎదిగినవాడే…
  • బీజేపీ- బీఆర్ఎస్ ‘పొత్తుపొడుపు’..! అమిత్ షా సంకేతాలు ఇవే !!
  • ఈ చట్టాలు ఎందుకూ పనికిరావు – ముళ్లు పీకాల్సింది బుల్‌డోజర్లే !!
  • జస్ట్, సెకన్ల ఆపరేషన్ – ఖేల్ ఖతం – ఉగ్రవాది హతం – 141 ప్రాణాలు సేఫ్
  • అప్పటి సంచలనం… ఇప్పటి మీడియాకూ తెలియదేమో ఈ కథ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions