ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టే… విరాటపర్వంలో వెన్నెల హత్య వెనుక పోలీసుల కుట్ర ఉన్నట్టుగా దర్శకుడు ఊడుగుల వేణు చిత్రీకరించిన తీరు మీద చాలామందిలో అసంతృప్తి ఉంది… నక్సలైట్లు చేసిన హత్యకు ఏదో జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు… క్రియేటివ్ ఫ్రీడం అంటే నిజాల్ని దాచేయడమా..? నిజాయితీ లేకపోవడమా..? అసలు ఒరిజినల్ కథలో వెన్నెల అలియాస్ సరళ ప్రాణాలు తీసిన రోజు ఏం జరిగిందో ఈ పోస్టు వివరిస్తోంది… ఆ వార్త కవర్ చేయడానికి ఓ గ్రామీణ జర్నలిస్టు పడిన శ్రమ, అప్పట్లో జర్నలిస్టుల పరిస్థితి ఎలా ఉండోదో… కోవర్టులు, -ఇన్ఫార్మర్ల నిర్ధారణ కూడా ఎంత లోపభూయిష్టంగా ఉండేదో కూడా ఈ పోస్టు స్పష్టీకరిస్తోంది… పెద్ద పోస్టే… పలు భాషాపరమైన తప్పులు కూడా ఉన్నందున కాస్త మార్చుకుని చదువుకుందాం…
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
విరాట పర్వం సినిమాలో తూము సరళ (ఖమ్మం) పాత్ర ఉందని సోషల్ మీడియాలో వార్తలు రావడం, సరళను అప్పట్లో పీపుల్స్ వార్ నక్సల్స్ హత్య చేయడం, అప్పటి ఘటనలను సోషల్ మీడియాలో పెట్టాల్సిందిగా, అప్పుడు నాతో పని చేసిన జర్నలిస్టులు కోరారు… (సరళను నక్సల్స్ పోలీస్ ఇన్ఫార్మర్ పేరిట కాల్చి చంపిన వైనం మొదట ఆంధ్రజ్యోతిలో నేనే వ్రాశాను) నాకు ఫేస్ బుక్ లో పోస్టులు రాసే ఓపిక, తీరిక లేదు అని చెప్పినా వినక మా ఊళ్ళో ఉన్న యువ కవి, చిత్రకారుడు సాయి నన్ను పోస్ట్ పెట్టమని పదే పదే కోరాడు… (మేము ఇద్దరమే మా ఊళ్ళో వామపక్ష రాజాకీయాలు, మత ప్రమాదం, సాహిత్యం,.,. వర్ధమాన రాజకీయాల గూర్చి మాట్లాడుకొంటాం… నా కంటే వయస్సులో ఇరవై ఏళ్ల చిన్నోడు, చాలా మందికి వీడికి వాడికి ఏం దోస్తానా అని అనుమానంతో చూస్తారు, కానీ మా పిచ్చి మాది)
Ads
వివరాల్లోకి వెళితే—- 1990 దశకంలో అనుకుంటా, అప్పుడు ఆంధ్రజ్యోతికి దర్పల్లి నుండి కంట్రిబ్యూటర్ గా పనిచేస్తున్నాను, జూన్, జులై మాసం మధ్యలో ఓసారి నిజామాబాద్ కుమార్ గల్లీలోని ఆంధ్రజ్యోతి ఆఫీస్ కు వార్తలు రాయడానికి వెళ్ళాను, మధ్యాన్నం టైంలో అప్పటి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సిర్ప గంగాధర్ సర్ “నరేందర్, నక్సల్స్ ఎవరో అమ్మాయిని హత్య చేశారు, ఇది ఎక్కడ జరిగిందో తెలుసుకుని, కొంచెం ఓ స్టోరీ రాయి అని ఆదేశాలు జారీ చేశారు
అప్పటి పీపుల్స్ వార్ జిల్లా కార్యదర్శి శంకర్ @ దొంత మార్కండేయ ఓ ప్రకటన జారీ చేశారు, ఆ ప్రకటనలో పోలీసులు కొత్తగా ఆడవాళ్ళను ఇన్ఫార్మర్లుగా తయారు చేశారు, మేము అందులో ఒక లేడీ ఇన్ ఫార్మర్ ను పట్టుకొని ప్రజా కోర్టులో శిక్షించామ్ అని సిర్నాపల్లి దళం లెట్టర్ పాడ్ పై శంకర్ ప్రకటన చేశాడు… శంకరన్న జిల్లా కమిటీ పేరుతో గల లెటర్ హెడ్ పై ప్రకటన జారీ చేయాలి కానీ ఓ దళం లెట్టర్ హెడ్ పై చేయడం ఏంటి అని అనుమానం నాలో మొదలైనది… అవే ఆలోచనలతో వార్తలు రాసి, బస్ ఎక్కి ఇండల్వాయిలో దిగాను
రాత్రి అక్కడి నుండి ఏదయినా టూ వీలర్ దొరికితే ఎక్కి, తొందరగా ఇంటికి పోవచ్చునని బస్టాండ్ లో అటు ఇటూ తిరుగుతున్నాను, రాత్రి 8 గంటల టైంలో, అప్పటి డొంకల్ సర్పంచ్ నారాయణ్ రెడ్డి కలిశాడు, ఏమి నరేందర్, ఎటు పోయావ్ అంటూ కుశల ప్రశ్నలు వేశాడు, నా మనసులో సరళ హత్య విషయాన్ని రాబట్టాలి అన్న ఆలోచన మెదులుతూనే.ఉంది
డొంకల్ అప్పుడు, ఇప్పుడు కూడా పూర్తి గా అడవి ప్రాంతంలో ఉంటుంది, ఈ సర్పంచ్ దగ్గర ఏమైనా క్లూ దొరుకుతుందేమోనన్న డిటెక్టివ్ బుర్రతో సర్పంచ్ తో ‘‘ఏం, సర్పంచ్ సాబ్, మీ జంగల్ లోనే ఆ పిల్లను అన్నలు చంపినారట, ఒక మాట చెప్పకపోతివి” అన్నాను
వెంటనే సర్పంచ్ కొంత గందరగోళానికి గురై, వెంటనే నన్ను పక్కకు తీసుకపోయి, అయ్యో, చంపుతారు అని తెలిస్తే నేను ఆ పిల్లను వాళ్లకు అప్పగించక పోతుంటిని అన్నాడు
ఒక్కసారి నాలో ఎక్కడ లేని హుషారు వచ్చింది, దీన్ని బయట పెట్టాలి అనుకున్నాను, సర్పంచ్ నారాయణ్ రెడ్డి జరిగింది మొత్తం చెప్పేశాడు, సరళ హత్యకు మొదటి సాక్షి ఆ సర్పంచే…
—————– – —- – —– – – – — – – –
సర్పంచ్ నారాయణరెడ్డి చెప్పిన విషయం మనసులో బాగా నాటుకుపోయింది… మేము ఇద్దరం మాట్లాడుతుండగా డొంకల్ బస్ వచ్చింది. నేను పోతున్నాను విలేకరి సర్ అంటూ నారాయణరెడ్డి వాళ్ళ గ్రామానికి వెళ్ళిపోయాడు
మనసులో ఏదో అలజడి, ఇంత ఘోరం నక్సల్స్ ఎలా చేశారబ్బా? అని నాకు నేను ప్రశ్నించుకుంటుండగా నైట్ హాల్ట్ వాల్గోట్- దుబ్బాక బస్ ఇండల్వాయి బస్ స్టాండ్ లోకి రాగానే, నేను బస్ ఎక్కి మా ఊరు ఐనా దర్పల్లి (మండల కేంద్రం) కి వెళ్ళిపోయాను, ఇంటికి చేరుకున్నాక కూడా నారాయణ్ రెడ్డి మాటలే ఇంకా వినిపిస్తున్నాయి
మరుసటి ఉదయమే 5 గంటలకే లేచి (అప్పుడు ఇప్పుడు కూడా ఉదయమే లేస్తాను) పాత బస్ స్టాండ్ లో బాలాజీ హోటల్ లో చాయ్ తాగి ఈనాడు, ఆంధ్రజ్యోతి, భూమి, ప్రభ పేపర్ల కోసం ఎదురు చూస్తున్నాను (అప్పుడు పేపర్లు బస్ ద్వారానే పంపేవారు) 6 గంటల ప్రాంతంలో బస్ రాగానే నేను బసులో నుంచి పేపర్ పార్శిళ్ళు తీసి, అప్పటి పేపర్ ఏజెంట్ క్యాదరి రామన్న ఇంటికి తీసుకెళ్లి, నేనే అన్ని పేపర్ పార్శిళ్ళు విప్పి, సరళ హత్యపై ఏమైనా వార్తలు వచ్చాయా? అని పేపర్లు తిరిగేశాను, ఏదో పేపర్లో పోలీస్ ఇన్ఫార్మర్ లలో మహిళలా అంటూ ఫాలోఅప్ స్టోరీ ఉంది
ఇది వాస్తవం కాదు కదా! గబ గబా ఇంటికి వెళ్లి స్నానం చేసి బయటకు వెళుతుండగా, మా అమ్మమ్మ “ఒరేయ్ ,యాడికి పోతన్నవ్… పొద్దికి వచ్చుడు, పొద్దుగాళ్ల ఉరుకుడు” అంటూ తిట్ల దండకం అందుకుంది
. . . …….. . . ……
అమ్మమ్మ మాటలను పట్టించుకోక సంఘటనకు ప్రధాన కారణమైన సిర్నపల్లి గ్రామానికి వెళ్లాలని అనుకున్నాను, మా ఊరి నుంచి సిర్నపల్లికి డైరెక్ట్ బస్ లేదు… వయా ఇండల్వాయి, గన్నారం మీదుగా వెళ్ళాలి, వెంటనే అప్పటి దర్పల్లి మండల ఎంపిపి సత్తెమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి, ఆమె భర్త కిష్టయ్య సేటును ‘‘సేటూ, జర స్కూటర్ ఇయ్యి, గీడి దాకా పోయి వస్తా” అనగానే సేటు బండి ఇచ్చాడు… వెంటనే బండి మీద సిర్నపల్లికి బయలు దేరాను,. మధ్యలో గన్నారం గ్రామంలో ఆగాను… ఏమైనా అదనపు సమాచారం దొరుకుందేమో అన్న ఆలోచనతో ఓ హోటల్ దగ్గర ఆగాను
కొంచెం ఐన తరువాత అటుగా వెళుతున్న వెంకటేష్ (బీడీ టెకేదార్) నన్ను చూసి, దగ్గరకి వచ్చి చాయ్ తాగిచ్చి “అన్నా, ఏమైనా అయిందా? ఇంత పొద్దున్నే బయలు దేరావ్ అంటూ’’ మాటలు కలిపాడు… ‘‘ఏమీలేదు వెంకన్నా, మన సైడ్ మొన్న మన సిర్నాపల్లి దళం ఎవరో లేడి ఇన్ఫార్మర్ పేరిట చంపారట, ఆమె అల్లాంటిది కాదు అని తెలుస్తుంది’’ అన్నాను… ‘‘అయ్యో అన్నా, మన శంకరన్న (అప్పటి పీపుల్స్ వార్ జిల్లా కార్యదర్శి) వచ్చేవరకు సిర్నాపల్లిలోనే మన వాళ్ళు ఉంచారు’’ అన్నాడు తను… వెంటనే సిర్నాపల్లి వెళ్లి, రైల్వే స్టేషన్ వద్ద స్తూపం వద్ద ఆగాను
ఎవరూ తెలిసిన వారు కనిపించక పోయే సరికి ఊళ్ళోకి వెళ్ళాను
అక్కడ చాలా సీనియర్ మిలిటెంట్ ఐన సాకలి సాయిలును కలిసి, సరళ హత్య విషయాన్ని ప్రస్తావించాను… అన్నా, ఆమెను పార్టీ చంపవలసింది కాదు, కొన్ని రోజుల పాటు చెక్ చేయవలసింది అంటూ జరిగిన స్టోరీ నాకు చెప్పసాగాడు, శంకరన్న భార్య జ్యోతి @ స్వరూప (ఈమె స్వగ్రామం నల్లవేల్లి) మదనపల్లి ఎన్కౌంటర్ లో చనిపోయి, అప్పట్లో ఆ వార్త ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించింది,. ఆమె ఎన్కౌంటర్ కు నిరసనగా నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు, జ్యోతి పీపుల్స్ వార్ ప్రస్థానంపై అన్ని ప్రధాన పత్రికల్లో సాహసాల స్టోరీలు వచ్చాయి
ఈ పిల్ల అవి చదివి, ఆగమై ఇటు వచ్చింది అని సాయన్న చెప్పాడు, ఖమ్మం నుండి రైల్‌లో మన జిల్లాకు వచ్చిందని అన్నాడు, మల్లాపూర్ కు చెందిన పార్టీ సానుభూతిపరులు దళం కాంటాక్ట్ ఈ సరళకు ఇప్పించాలని మనకు అప్పగించారు అని సాయన్న తన మాటల్లో చెప్పాడు, సిర్నాపల్లి గ్రామంలో దళం కాంటాక్ట్ దొరికే వరకు ఉన్న సరళ అలా ఉన్నన్ని రోజులూ ప్రజలు, మిలిటెంట్లు, అందరితో కలిసి మెలిసి ఉన్నట్లు గ్రామస్థులు చెప్పారు, గ్రామంలోని దొమ్మరి గంగారాం ఇంట్లో ఏదో చిన్న ఫంక్షన్ జరిగితే కూడా విందుకు వచ్చిన వారందరికి సరళనే స్వయంగా వడ్డించినట్లు గ్రామస్థులు తెలిపారు. సాధారణంగా అప్పట్లో దళ కాంటాక్ట్ దొరుకాలంటే కొంత టైం పట్టేది, సరళ ఊళ్ళో స్వేచ్ఛగా తిరిగేసరికి ఎవరో అమ్మాయి అన్నల్లో కలుస్తానని మన ఊరికి వచ్చిందని ఊరందరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు…
.. ….. . …… . . ….
ఈ విషయం లోకల్ మిలిటెంట్లలో కలవరం పుట్టించింది, పోలీసులకు తెలిస్తే తమకు ప్రమాదమని భావించిన మిలిటెంట్లు అప్పటి సిర్నాపల్లి దళ నాయకుడు గంగన్నకు ఈ విషయాన్ని చేరవేశారు,,. సరళ సిర్నాపల్లిలో వున్నప్పుడు తన గూర్చి వెతుకవద్దని, తాను క్షేమంగా ఉన్నట్లు తల్లిదండ్రులకు ఉత్తరాలు రాసినట్లు గ్రామస్థులు తెలిపారు, చదువు రాని కొంత మంది మిలిటెంట్లు సరళ పోలీసులకు ఉత్తరాలు రాసినట్లుగా తమ అనుమానాన్ని పార్టీ ముందు ఉంచారు, ఎందుకైనా మంచిదని దళ నాయకుడు గంగన్న ఈ విషయాన్ని జిల్లా కమిటి దృష్టికి, కార్యదర్శి శంకరన్న దృష్టి కి తీసుకపోతాను అంటూ, అప్పటి వరకు సరళను డొంకల్ సర్పంచ్ నారాయణ్ రెడ్డి ఇంట్లో ఉంచే ఏర్పాటు చేశారు… వారం పది రోజుల తరువాత అప్పటికి శంకరన్న సిర్నాపల్లి అటవీ ప్రాంతానికి చేరుకున్నాడు, అప్పుడే శంకరన్నకు పీపుల్స్ వార్ లో ప్రమోషన్ వచ్చింది, శంకరన్నను మురళి పేరుతో రాష్ట్ర కమిటీ (ఉత్తర తెలంగాణ)లో సభ్యున్ని చేసింది.. అప్పటికి పలు రాష్ట్రాల్లో పీపుల్స్ వార్ వునికి ఉన్నప్పటికి తెలంగాణలో నక్సల్స్ మూమెంట్ ఉవ్వెత్తున ఉంది
….. …… .
శంకరన్న వచ్చిన రోజే వేకువ జామునే నారాయణ్ రెడ్డికి కబురు పంపారు నక్సల్స్.., సరళను తీసుకొని సిర్నాపల్లి గ్రామపరిధిలో “రామ్ సాగర్” తాండ అటవీ ప్రాంతానికి రావాలని వాళ్లు ఆదేశాలు జారీ చేశారు… నారాయణ్ రెడ్డి సరళను దళానికి అప్పగించాడు… అక్కడి నుంచి వెళ్లిపోవాలని వారు చెప్పడంతో నారాయణ్ రెడ్డి వెనుతిరిగాడు, నారాయణ్ రెడ్డి ఇంట్లో సరళ ఉన్నన్ని రోజులు ఉల్లాసంగా ఉన్నట్లు సర్పంచ్ చెప్పాడు… సరళను రామ్ సాగర్ తాండ అటవీ ప్రాంతంలో శంకరన్న విచారిస్తున్నప్పుడు అప్పటి జిల్లా కమిటీ సభ్యుడు హరి భూషణ్, గంగన్న, మరో సభ్యుడు ప్రభాకర్ (రామడుగు ప్రాజెక్టు) ఉన్నట్లు తెలిసింది… నక్సల్స్ విచారణలో సరళ పదే పదే తాను పోలీస్ ఇన్ఫార్మర్ కాదని, తాను అన్నల్లో చేరడానికి వచ్చానని నవ్వుతూ చెప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు,…. సరళను భయపెట్టడానికి అక్కడే ఉన్న చెట్టుకు కట్టేసి, కొట్టి, శంకరన్న తుపాకీతో భయపెట్టడానికి ప్రయత్నించగా, అది మిస్ ఫైర్ అయినట్లు మిలిటెంట్లు చెప్పారు
ఊహించని సంఘటన జరగడంతో శంకరన్న వెంటనే శవాన్ని సిర్నాపల్లి మార్నింగ్ బస్ లో వేసి, నిజామాబాద్ బస్ట్ స్టాండ్ లో పోలీస్ లకు అప్పగించాలని మిలిటెంట్ల, గ్రామస్థులకు చెప్పడంతో గ్రామస్థులు ససేమిరా అన్నారు, అన్నా, మీరు మా ఊరి బస్ లో వేసి పోతారు., ఆ తరువాత పోలీసులు వచ్చి మా సావు చేస్తారు అని గ్రామస్థులు ఎదురు తిరగడంతో నక్సల్స్ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు… అక్కడే సరళ మృతదేహానికి అంత్య క్రియలు శంకరన్న, మిగతా నక్సల్స్ నిర్వహించారు, అది వర్షాకాలం కావడంతో అడవంత పచ్చిగా వుంది, ఎండిన కట్టెలు ఎక్కడా దొరకక పోవడంతో, సిర్నాపల్లి, డొంకల్ గ్రామాల నుండి నక్సల్స్ గ్యాస్ నూనె తెప్పించి., సరళ భౌతిక కాయానికి నిప్పు ఆంటించడంతో సరళ కథ అలా ముగిసింది
>>>
అప్పటికి శంకరన్నంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హడల్, శంకరన్న తన తప్పును కప్పిపుచుకోవడానికి అప్పటి జిల్లా జర్నలిస్టుల నాయకుడు, ఆంధ్రప్రభ స్టాఫ్ రిపోర్టర్ రేపాక జైపాల్ రెడ్డి సర్ కు, “మేము లేడి ఇన్ఫార్మర్ కు శిక్ష వేశాము, దీనికి మీరు హైలెట్ చేయాలని” లేఖ రాశారు, మొత్తం స్టోరీ తెలుసుకొన్న అదే రోజు సాయంత్రం నిజామాబాద్ ఆంధ్రజ్యోతి ఆఫీస్ కు వార్త ఇవ్వాలని వెళ్ళాను, అప్పటికే సాయంత్రం అయింది… నేను ఆఫీస్ లోకి వెళ్ళగానే మా బాస్ గంగాధర్ సర్ ‘‘ఏం వార్తలు ఉన్నాయి నరేందర్’’ అంటూ ప్రశ్నించాడు… జరిగింది అంతా చెప్పేసరికి, వెంటనే అప్పటి టిపి ఆపరేటర్ గిరిధర్ ను పిలిచి, కొట్టే వార్తలు ఆపి, మనోడు తెచ్చిన వార్త వెంటనే కొట్టు అని నన్ను ఉత్సాహపరిచారు… మరుసటి రోజు ఆంధ్రజ్యోతిలో మెయిన్ పేపర్ లో బాక్స్ కట్టి “మురళి సమక్షంలోనే సరళ హత్య” వేశారు, ఇది సంచలనం సృష్టించింది, వార్త వచ్చిన మరుసటి రోజు అదే జ్యోతిలో నక్సల్స్ ఘాతుకాన్ని ఎండగడుతూ ఎడిటర్ ఎడిటోరియల్ రాసాడు.., నేను రాసిన వార్తను అదే పత్రికలో ఎడిటర్ ప్రస్తావించడంతో నా సంతోషానికి అవధులు లేకుండా పోయింది, అప్పటికి పీపుల్స్ వార్ కు, జనశక్తి నక్సల్స్ కు సిరిసిల్ల ఏరియాలో నిత్యం యుద్ధమే నడుస్తుండేది, జనశక్తి. ప్రాబల్యం ఉన్న గ్రామాల్లో శంకరన్న, పీపుల్స్ వార్ ను విమర్శిస్తూ వాళ్ళు వాల్ రైటింగ్ రాశారు
… .. ……. ……..
అప్పుడే కొత్తగా మా జిల్లా ఎస్పిగా మహేందర్ రెడ్డి (ఇప్పటి డిజిపి) చార్జి తీసుకున్నారు, వెంటనే పోలీసులు నక్సల్స్ చర్యను ఎండగడుతూ కరపత్రాలు ఊరూరా వేశారు, కొద్దిరోజులకే అప్పట్లో “సుప్రభాతం” అనే మ్యాగజైన్ లో వాళ్లు ఫోటోలతో సహా కథనాన్ని ప్రచురించారు, రాష్ట్ర వ్యాప్తంగా సరళ హత్యను పౌరహక్కుల సంఘాలు, విద్యార్థి, మహిళ సంఘాలు ఖండించడమే కాక, నిరసన ప్రోగ్రామ్స్ చేశాయి, కొద్ది రోజులకే పీపుల్స్ వార్ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో శంకరన్నది దుందుడుకు చర్యగా అభివర్ణించారు, ప్రజలకు క్షమాపణ చెప్పారు, తరువాత రెండు నెలలకు శంకరన్న సిరికొండ అడవుల్లోకి నన్ను పిలిపించుకుని ‘‘తమ్ముడూ, నేను సరళను చంపానని నీకు ఎవరు చెప్పారు’’ అనడిగాడు… “అన్నా, నా ప్రాణం పోయినా నా సోర్సు చెప్పను అన్నాను, వెళుతుంటే శంకరన్న ‘‘తమ్మీ, నీవు మా వాడివే’’ అంటూ అన్నం తినిపించి పంపించాడు,. ఆ రువాత జనవరి 27 న నిజామాబాద్ లోని హౌజింగ్ బోర్డ్ లో జరిగిన కాల్పుల్లో శంకర్ @ దొంత మార్కండేయ చనిపోయినట్లు ఇదే మహేందర్ రెడ్డి (ప్రస్తుత డి జి పి) ప్రకటించారు….
Share this Article