.
Nàgaràju Munnuru …. అతను అడవిని సృష్టించాడు కానీ మూర్ఖ మనుషులను మార్చలేకపోయాడు.!
ఎవరికైనా కుటుంబ వారసత్వంగా భూమి వస్తె ఏం జేస్తరు? కొంచెం సోయి ఉన్నోడు అయితే వ్యవసాయం చేస్తడు. సోయి లేనోడు భూమి అమ్ముకుని ఊర్ల రెండస్తుల బంగ్ల కట్టి, పడవ లాంటి కారు కొని, తులాల కమానం బంగారం కొని, పెండ్లిలు జేసి, ఉన్న పైసల్ అయిపోయిందాక దావత్ లు జేస్తడు.
సూర్యాపేట జిల్లా, మోతె మండలం, రాఘవపురం గ్రామానికి చెందిన దుశ్శర్ల సత్యనారాయణకు కుటుంబం నుండి వారసత్వంగా ఎకరం రెండెకరాలు కాదు, ఏకంగా 70 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది. ప్రకృతి ప్రేమికుడైన సత్యనారాయణ గారు ఆ భూమిలో వ్యవసాయం చేయలేదు, అమ్ముకుని సొమ్ము చేసుకోలేదు.
Ads

ప్రకృతి మీద ప్రేమతో 15 ఏళ్లుగా వందలు వేలుగా మొక్కలు నాటుతూ బీడు భూమిని దట్టమైన అటవీ ప్రాంతంగా తీర్చిదిద్దాడు. ఈ భూమిలో పెరిగిన చెట్లు పక్షులకు ఆవాసం అయ్యాయి, పండిన పండ్లు జంతువులకు ఆహారం అయ్యాయి. మొత్తంగా ఒకప్పటి బీడు భూమి నేడు పశుపక్ష్యాదులకు సురక్షిత కేంద్రంగా మారింది.
గిసంటి మంచి మనిషి మీద, ఆయన భూమిలకే పోయి, ఆయన పెంచుకున్న చెట్లనే నరుకుతుంటే.. చెట్లను చంపొద్దురా నాయనా అని అడ్డుకుంటే, ఆయన భూమిలోనే ఆయన మీదే కర్రలు, గొడ్డళ్లతో దాడి చేసిండ్రు కొందరు… దాడి చేసిన వారిలో వయసు మీదపడ్డ వాళ్ళే కాదు, యువకులు, ఆడోళ్ళు కూడా ఉన్నరు.

ఏం మనుషులురా ఛీ
గిసంటి వాళ్ళ కోసమా సారు మీరు మీ బతుకంతా ధారబోసింది? ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితుల పక్షాన నిలబడి పోరాడిన మంచి మనిషి. ఇంచు ఇంచు తెలంగాణ భూమిని తడపాలని తపించిన జలసాధన సమితి వ్యవస్థాపకులు దుశ్శర్ల సత్యనారాయణ సారు… మీలాంటి వారు నిండు నూరేళ్ళు క్షేమంగా ఉండాలి. క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్న.
దుశ్శర్ల సత్యనారాయణ గారి మీద దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్న.
Share this Article