నిజానికి ఈ పండక్కి రావడం నాగార్జునకు ఆనందాన్ని, విజయాన్ని అందించాలి… థియేటర్లలో వేరే పెద్ద సినిమాలేమీ లేవు… హిట్ సినిమాలు పుష్ప, అఖండ మెల్లిగా పాతబడిపోయాయ్… ఓటీటీల్లోకి కూడా వచ్చేస్తున్నయ్… పండుగపూట సినిమాను చూడాలనుకునేవాళ్లకు బంగార్రాజు ఓ చాయిస్… నాగార్జున, రమ్యకృష్ణ, చైతూ, కృతిశెట్టి… సరదాసరదాగా సాగే కథ… గతంలో ఆరేళ్ల క్రితం హిట్టయిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్… దర్శకుడు కల్యాణ కృష్ణ కూడా పెద్ద ప్రయోగాల జోలికి ఏమీ పోలేదు… రిస్క్ లేని ధోరణిలో వెళ్లిపోయాడు… కానీ అనుకున్నంతగా నాగార్జునకు, ఆయన కొడుక్కి ఈ సినిమా గెలుపును అందిస్తుందా..?
అదే సినిమా ఆగిన చోటే ఈ కథ స్టార్ట్… స్వర్గంలో ఉన్న నాగార్జున, రమ్యకృష్ణ భూలోకం వచ్చి చైతూ సమస్యల్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలని అనుకుంటారు… ఇంద్రుడు ససేమిరా అంటాడు… యముడు నచ్చజెబుతాడు… ఆ ఇద్దరూ స్వర్గం నుంచి దిగివస్తారు… ఓ ఫాంటసీ… సూపర్ నేచురల్ పవర్స్… మధ్యలో క్రైం, విలన్ శక్తులు, వాటితో పోరాటం గట్రా… అసలు బేసిక్ సినిమా థ్రెడ్ అంతా ఓ పల్లెటూరి వాతావరణం, పండుగవేళ… నాగ్, చైతూల సందడి… కృతిశెట్టి అందాలు… డాన్సులు, పాటలు… ఎక్కడా బోర్ రాకుండా సజావుగా కథను నడిపిస్తూ పోయాడు దర్శకుడు… పాత సినిమాలో కొడుక్కి సాయం చేసిన పెద్ద నాగార్జున ఇప్పుడు మనమడికి సాయం చేయడానికి వస్తాడన్నమాట…
నాగార్జున అంటేనే వినోదం… ఎన్ని ఫ్లాపులు వస్తున్నా సరే, సినిమాలు వస్తూనే ఉంటయ్… తన డిమాండ్ తగ్గదు, తన ఎనర్జీ తగ్గదు… ఈ వయస్సులో కూడా కుర్ర హీరోలకు దీటుగా సినిమాను ఒంటి చేత్తో నడిపించేస్తాడు… ఇంకేం కావాలి ఓ సగటు ప్రేక్షకుడికి ఈ పండగపూట…? కానీ కథాగమనంలో ఓ థ్రిల్ ఉండదు, సంగీతం పెద్దగా కనెక్టయ్యేదిలా లేదు… ఓ తెలుగు సినిమా చూశామా అంటే చూశామన్నట్టుగా… అంతే… నాగార్జున కూడా పెద్ద రిస్కీ బాధ్యతలేమీ అప్పగించలేదు కల్యాణకృష్ణకు… ఆ పాత సినిమాకు ఇది ఓ సరదా కొనసాగింపు… లాజిక్కులు, మన్నూమశానం జాన్తా నై… ఫాంటసీ కథ అంటేనే ఇక లాజిక్కుల జోలికి పోవద్దు… స్వర్గంలో సీన్లు కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేవు… అదేమిటో…
Ads
నిజానికి సినిమా అంతా నాగార్జునే… చివరకు రమ్యకృష్ణ, చైతూ, కృతి కూడా పెద్దగా ప్రాధాన్యానికి నోచని పాత్రలు… ఇంకొన్ని పాత్రలు కూడా జస్ట్, అలా కనిపిస్తయ్… ఓపాటలో దక్ష, మరోపాటలో ఫరియా సందడి కనిపిస్తుంది, కానీ సినిమాలో పెద్దగా కామెడీ కూడా పండలేదు… తాత ఆత్మ తనలో ప్రవేశిస్తే తప్ప ఏమీ చేయలేని చైతూ పాత్ర ఓ మైనస్… ఆ పాత్ర కేరక్టరైజేషన్ వీక్… ఫస్టాఫ్ అంతా బోర్‌గా సాగుతూ ఉంటుంది… నిజానికి సినిమాలో చివరి అరగంటే కాస్త ఆసక్తికరంగా మలిచాడు దర్శకుడు… చివరాఖరుకు చెప్పొచ్చేదేమిటీ అంటే… ఓ సాదాసీదా సగటు తెలుగు కమర్షియల్ సినిమా… అంతకుమించి పెద్దగా ఆశించకూడదు… ఆశపడితేనే కదా నిరాశ…
Share this Article