ఎవరు ఈ పిల్ల..? సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్… ఈమధ్య ఇన్‌స్టాలో ఆమె మేజర్ సినిమాకు సంబంధించి పెట్టిన రీల్ ఏకంగా 18.4 లక్షల లైకులు… అడవి శేషు, మహేష్ బాబుతో కూడిన ఆ ఫన్నీ కమర్షియల్ వీడియో ఆరు రోజులుగా వైరల్… అదొక్కటే కాదు… కేజీఎఫ్-2 కోసం యశ్‌తో… సర్కారువారి పాట కోసం మహేష్ బాబుతో… ఆమధ్య అజయ్ దేవగణ్‌తో… షాహిద్ కపూర్‌తో… లక్షలకులక్షల లైకులే కాదు… సోషల్ మీడియాలో ఆమెను స్టార్‌ను చేసేస్తున్నాయి… పెద్ద పెద్ద స్టార్ హీరోలు సైతం ఆమెతో రీల్స్ చేయడానికి సై అంటున్నారు…
తద్వారా ఆమెకు ఆదాయం… ఆ హీరోల సినిమాలకు సోషల్ ప్రమోషన్… ఆమె పేరు నీహారిక (https://www.instagram.com/niharika_nm/reels/)… ఆమె రూట్స్ చెన్నై… అక్కడే పుట్టింది, బెంగుళూరులో చదువుకుంది… ఇప్పుడు అడ్డా ముంబై… వయస్సు 24… మొదట్లో చిన్న చిన్న కామెడీ వీడియోలను క్రియేటివ్‌గా ప్రిపేర్ చేసి యూట్యూబులో పెట్టేది… పదో తరగతి చదువుతున్నప్పటి నుంచే యూట్యూబర్… స్వతహాగా డాన్సర్, ఇంజనీరింగ్ చేసింది… యాక్టింగ్, మోడలింగ్… మన చుట్టూ పరుచుకున్న కామన్ అంశాల నుంచే మంచి క్రియేటివ్ కామెడీ వీడియోలను చేస్తుంది…
Ads
ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాలో 25 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు… యూట్యూబులో 12 లక్షల మంది… ఈమధ్య కేన్స్‌లో ‘యూత్ ఐకన్ ఎంటర్‌టెయిన్‌మెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది… అంటే ఈ క్రియేటర్ ఏ రేంజుకు వెళ్లిపోయిందో అర్థమవుతోందిగా… నిజంగానే ఆమె తాజా వీడియోలు, రీల్స్ కొన్ని పరిశీలిస్తే… చాలా సింపుల్ ఇంగ్లిషుతో దడదడ మాట్లాడేస్తుంటుంది… మన సుమకు అమ్మమ్మే… కాస్త కొత్తగా, సరదాగా, భిన్నంగా ఉంటున్నయ్ షార్ట్స్ అండ్ రీల్స్… తెలుగు కూడా వచ్చు… దరిద్రం, దిష్టి వంటి పదాలు వచ్చేస్తుంటయ్…
అవును మరి… కొత్తొక వింత, పాతొక రోత… జనానికి కొత్తగా వినోదం పంచేవాళ్లు కావాలి… అదేసమయంలో బ్రీఫ్‌గా ఉండాలి… లంబాచోరా అక్కర్లేదు… అఫ్‌కోర్స్, రీల్స్ ఉండేవే బ్రీఫ్‌గా… కానీ ఆమె యూట్యూబ్ వీడియోలు కూడా చిన్నచిన్నవే… Creators for Change అని యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఓ గ్లోబల్ అంబాసిడర్స్ ఇనీషియేటివ్‌లో ఈమె కూడా ఉంది… రెవిన్యూ ఏమీ రాదు కాబట్టి ఫేస్‌బుక్ పేజీ జోలికి పెద్దగా పోదు… పేరుకు ఒకటి ఉంటుంది… 17 వేల మంది ఫాలోయర్స్…
టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్, శాండల్‌వుడ్… చాలా వుడ్ల పెద్ద స్టార్లు ఇప్పుడు ఆమెకు ఫాలోయర్స్, ఫాన్స్… నేను రీల్ చేస్తాను అనడిగితే బహుశా ఇప్పుడు వద్దనేవాళ్లు ఉండరేమో ఆమెకు… మహేష్ బాబుతో రెండు రీల్స్ చేస్తే ఒకదానికి కోటి, మరోదానికి రెండుకోట్ల వ్యూస్… ఒకటి మెచ్చుకోవచ్చు… మోడరన్ లుక్‌లో, గ్లామర్ విషయంలో రాజీ పడదు కానీ ఎక్కడా అసభ్యత, అశ్లీలం జోలికి పోదు ఆమె… ఫన్… ఫన్…
ఈమధ్య ఓ హైదరాబాదీ ఇంగ్లిష్ పత్రికతో మాట్లాడుతూ… బ్రహ్మానందం నుంచి వడివేలు, జిమ్ కేరీ నుంచి అట్కిన్‌సన్, వివేక్, సంతానం, వెన్నెల కిషోర్… అందరూ నాకు స్పూర్తే… సమయానికి ఐడియా దొరక్కపోతే మన చుట్టూ ఉన్న సాధారణ అంశాల నుంచే ఫన్ క్రియేట్ చేసే వీడియోలకు వెళ్లిపోతాను అనేసింది… నిజమే… కారులో కూర్చుంటాం, అది మధ్యలో ఆగిపోతుంది… ఈ అంశం మీద కూడా ఓ వీడియో… మొదటిసారి డేటింగ్ యాప్‌తో రొమాన్స్, అంచనాలు వర్సెస్ రియాలిటీ, హార్ష్ అమ్మలు, అమ్మలు-మూఢనమ్మకాలు, ఇండియన్స్ వర్సెస్ ఫారినర్స్, పరీక్షలకు ముందు విద్యార్థులు… ఇలా…
తను ట్రోలర్స్‌ను అస్సలు దేకదు… పట్టించుకోదు… అసలు ఆ కామెంట్స్ చదవను అంటున్నది… నెట్‌లో రకరకాల అభిప్రాయాలు కలిగినవాళ్లు ఉంటారు, చల్నేదేవ్ అనేస్తుంది… ఇంకా కొత్త కొత్త ఆలోచనలున్నయ్, బాగా క్లిక్కవుతాయ్ చూస్తూ ఉండండి అంటోంది ధీమాగా… బెస్టాఫ్ లక్ ఇన్‌స్టారికా..!
Share this Article