ముఖ్యమంత్రులు వెళ్లి సాగిలబడినంత మాత్రాన ఆయన అందరికీ ఆమోదయోగ్యుడైన ఆచార్యుడేమీ కాదు… వివాదాస్పదుడే… అప్పట్లో తిరుమల వేయికాళ్ల మంటపం దగ్గర నుంచి లక్ష్మి నరసింహులను విడదీసి, విడివిడిగా విగ్రహాలు ఉండాలనే దాకా… యాదగిరిగుట్ట పేరును యాాదాద్రిగా మార్చడం నుంచి పాదపూజల వసూళ్లు, రామనుజ ప్రాజెక్టుకు వసూళ్ల దాకా… ఆధ్యాత్మిక స్పృహకన్నా అధికారకేంద్రంగా ఉండటంపై ధ్యాస దాకా… చాలామంది అర్చకవర్గ ప్రముఖులకే నచ్చడు తను… (శైవ, వైష్ణవ తేడాలు, గురుపరంపర సంబంధిత విభేదాలు కాదు, తన ధోరణే చాలామందికి అంతుపట్టదు)
ఇప్పుడు తాజాగా పంది మాంసం తింటే పంది బుద్ధులు… మేకను తింటే ఆ నడత… గుడ్లు తింటే పెంటకుప్పల మీద ఏరుకుతినే బుద్ధి వస్తాయీ అంటూ ఇంకా ఏదేదో ప్రవచించారు స్వాముల వారు… చాలా చిల్లర వ్యాఖ్యలు… నిజానికి మన రాజకీయాల్లో జలీల్, బండ్ల, కేఏపాల్ వంటి బోలెడు మంది కమెడియన్లను చూస్తూనే ఉన్నాం… ఆధ్యాత్మికరంగంలో ఆ లోటు తీరుస్తున్నట్టున్నారు ఈ ధర్మస్వరూపులు… అంతెందుకు..? ఒక్కసారిగా ఆ కైలాస దేశాధిపతి నిత్యానంద స్వామి నయం అనిపిస్తున్నాడు… తను ఏవో పిచ్చి పిచ్చి ప్రవచనాలు చేస్తాడు గానీ మరీ ఇలా ఒకరి ఆహారాన్ని వెక్కిరించిన చరిత్ర లేదు… ఈ స్వామి తను బాగా చదువుకున్నాడనే కలరింగు ఇచ్చేలా మాట్లాడుతుంటాడు… కానీ డొక్కశుద్ధి, వాక్శుద్ధి ఏమీ లేవన్నమాట…
ఒకవేళ మాంసాహారం బదులు శాకాహారాన్ని ప్రమోట్ చేయాలనుకుంటే అది మరీ ఈ వెగటు భాషలో చెప్పాల్సిన పని లేదు… ఇలా పది మందీ పక్కున నవ్వుకుని, స్వామి వైపు జాలిగా చూసే పరిస్థితిని తెచ్చుకోవద్దు… ఆయన వ్యాఖ్యల మీద తెలుగు సోషల్ మీడియా పెద్ద ఎత్తున ‘ఇచ్చి పడేస్తోంది’… నిజానికి అన్ని మతాల్లోనూ ఇలాంటి వింత వ్యాఖ్యల మతప్రముఖులున్నారు, ఏవేవో మాట్లాడుతూనే ఉంటారు… ఏ మతమూ దీనికి మినహాయింపు ఏమీ కాదు… కానీ ఒకవైపు పందిగుండెను మనిషికి అమర్చి, కొత్త కొత్త శాస్త్రీయ వైద్య ఆవిష్కరణలకు తెరలు తొలుగుతున్నవేళ కూడా పందిమాంసం మీద, మేక మాంసం మీద, గుడ్లు తినడం మీద ఈ వ్యాఖ్యలేమిటో ఆయనకే అర్థం కావాలి…
అసలు గుడ్లు శాకాహారమా..? మాంసాహారమా..? ఏం స్వామీ..? తమరేమని సెలవిస్తారు..? పోనీ, పుట్టగొడుగులు శాకాహారమా..? మాంసాహారమా..? ఏ జంతువును తింటే ఆ జంతులక్షణాలు వస్తాయని తమరికి ఏ దేవుడు కలలో కనిపించి బోధించాడు స్వామీ..? పర్ సపోజ్, మనకు మరింత జ్ఞానం కలిగేలా, బుర్ర పెరగాలంటే ఏం తినాలి స్వామీ..? ఇలాంటి బేజా ఫ్రై వ్యాఖ్యలేనా..?… ఇదుగో ఇలా జియ్యరుడిపై సెటైర్లు పడుతున్నయ్ బాగానే… నిజమే కదా మరి… పది మందీ పకపకా నవ్వుతారనే సోయి కూడా లేకుండా చేసే ప్రవచనాలు, బోధలు, వ్యాఖ్యలు ఈ సోషల్ వెక్కిరింపులకు అర్హత కలిగినవే…!!
Share this Article