Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అక్కడికి నాటి తక్షశిల, నలందలే ఇప్పుడు చైతన్య, నారాయణలు అన్నట్టు…

June 16, 2023 by M S R

Success Stake: సనాతన ధర్మానికి మూల స్తంభమయినది అద్వైత సిద్ధాంతం. దేవుడు- జీవుడు ఒకటే అన్న అహం బ్రహ్మాస్మి సూత్రాన్ని అర్థం చేసుకోవడమే అద్వైత సాధకుల అంతిమ లక్ష్యం. ఇది ఎంత సులభమయినదో అంత సంక్లిష్టమయినది కూడా. కళ్ల ముందు కనిపించే ప్రపంచం అద్దంలో ప్రతిబింబమే తప్ప నిజం కాదట! ఇంతకంటే లోతుగా వెళితే ఇది వేదాంత పాఠమవుతుంది. ప్రస్తుతం మన చర్చ అది కాదు. “పారాయణ నిశ్చైతన్యం” గురించి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో…ఆ మాటకొస్తే బహుశా దేశ వ్యాప్తంగా “పారాయణ నిశ్చైతన్యం” గురించి తెలియని వారుండరు. ఇవి రెండుగా కనిపిస్తున్నా…స్వరూప, స్వభావాల రీత్యా ఒకటే. కృత, త్రేతా, ద్వాపర, కలియుగాల్లో విద్యా విధానంలో కొద్దిపాటి మార్పులు ఉండవచ్చు కానీ…విద్యకు ఉన్న విలువలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

కృతయుగంలో బ్రహ్మ విద్యార్థిగా ఎన్నో నేర్చుకున్నాడు. త్రేతాయుగంలో సాక్షాత్తు నారాయణుడయిన రాముడు వసిష్ఠ, విశ్వామిత్రుల దగ్గర విద్యార్థిగా చదువుకున్నాడు. ద్వాపరంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడు సాందీపుడి దగ్గర హాస్టల్లో ఉండి చదువుకున్నాడు. కాబట్టి అంతటి అవతార పురుషులే…అనాది కాలంలోనే నారాయణ నారాయణ అంటూ విద్యా చైతన్యాన్ని వెతుక్కుంటూ అడవుల్లో ఆశ్రమ పాఠశాలలకు వెళ్లినట్లు పురాణాల్లో స్పష్టమయిన ఆధారాలుండగా…ఇప్పుడు మనం పారాయణ నిశ్చైతన్యానికి భిన్నమయిన దాంట్లో ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఉంటే…మనం మహా పాపం చేస్తున్నట్లు!

Ads

ఈ సోది అంతా ఎందుకంటే…ఈరోజు అఖిల భారత వైద్య విద్యా ప్రవేశ పరీక్ష- నీట్ ఫలితాల్లో ఆ పారాయణ నిశ్చైతన్యానికే అఖిల భారత మెదటి ర్యాంకులు వచ్చాయి. వస్తాయి. రావాలి కూడా. రాకపోతే ఆశ్చర్యపోవాలి.

అనవసరంగా ఈ రెండు సంస్థలు అన్ని పత్రికల్లో మొదటి నాలుగు పేజీల రంగుల ప్రకటనల కోసం; టీవీ, రేడియో, డిజిటల్ యాడ్స్ కోసం వందల కోట్లు నీళ్లలా ఖర్చు పెట్టాయి. డబ్బు ఎవరిదయినా డబ్బే కదా? చెమటోడ్చి, అహోరాత్రులు నిద్రాహారాలు మాని…పైసా పైసా వారు సంపాదించిన సొమ్మును ఇలా వారు ఖర్చు చేయడంతో వారి అభిమానుల, శ్రేయోభిలాషుల గుండె తరుక్కుపోతోంది.

1. దాదాపు ముప్పయ్ ఏళ్లుగా ఏ పరీక్షలో అయినా పారాయణ వెనుకబడిందా? నిశ్చైతన్య ఏ పరీక్షలో అయినా పక్కకు తప్పుకుందా? లేదే? ఇప్పుడు కొత్తగా ప్రకటనలెందుకు?

2. దేశ స్థాయిలో పది వేల ర్యాంకులు ఉంటే…అందులో మొదటి వంద ర్యాంకులను పారాయణ నిశ్చైతన్యానికి బ్రహ్మ సృష్టికి పూర్వమే సర్దుబాటు చేశాడు కదా? ఇప్పుడు కొత్తగా ప్రకటనలెందుకు?

3. చదువును మానవ నాగరికతలో ఎవరూ ఊహించలేనంత ఒక మహోన్నత పరిశ్రమగా మార్చిన పారాయణ నిశ్చైతన్యానికి ఇప్పటిదాకా నోబుల్ లాంటి చిన్నా చితకా పురస్కారాలయినా రాకపోవడం విచారించదగ్గ విషయం కాదా? అలాంటివారు ఇప్పుడు కొత్తగా ప్రకటనలు ఇచ్చుకోవాలా?

4. కాకి లెక్కగా చూసినా ఒక పారాయణలో నలభై లేదా యాభై వేల మంది విద్యార్థులు ఉన్నారనుకుంటే…ఒక్కొక్కరు ఏటా సగటున ఒకటిన్నర లక్ష ఫీజు చెల్లిస్తున్నారనుకుంటే...యాభై వేలు ఇంటూ ఒకటిన్నర లక్ష ఈజ్ ఈక్వల్ టు- 750 కోట్ల రూపాయలు కావాలి. నిశ్చైతన్యది మరో వెయ్యి కోట్ల రూపాయలు. ఇందులో ఖర్చులు పోను వారికి ఏం మిగులుతుందని…పాపం ఇంతింతగా ప్రకటనల మీద ఖర్చు పెడుతున్నారు?

5. వీరి విద్యాసేవను గుర్తించి ప్రభుత్వాలు ఆదాయప్పన్ను మినహాయింపును ఈపాటికే ప్రకటించి ఉండాల్సింది కదా? ఎందుకింత తీవ్ర జాప్యం జరుగుతోంది?

6. ఐఐటీ జేఈఈ అడ్వాన్స్, మెయిన్స్, నీటు, నాటు, ఇంటరు, టెంత్, డిగ్రీ, పి జి, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు…ఇలా ప్రపంచంలో ఉన్న అన్ని పరీక్షల్లో మొదటి వంద ర్యాంకులను పారాయణ నిశ్చైతన్యానికి మినహాయించి మిగతా ర్యాంకులను మాత్రమే మిగతా ప్రపంచానికి ఇచ్చే ఒక అభ్యుదయ, ఆదర్శ అలిఖిత విద్యా విధానాన్ని అమలు చేయకపోతే… పారాయణ నిశ్చైతన్యాన్ని మనం ఏమి గౌరవించినట్లు? మనల్ను మనుషులుగా తీర్చి దిద్దిన సంస్థలను గౌరవిస్తే…మనల్ను మనం గౌరవించుకున్నట్లే కదా? కొంచెం పెద్ద మనసుతో ఆలోచించండి!

(లెక్కల్లో సున్నాలు ఎక్కువై ఉంటే తీసేసుకోగలరు. తక్కువై ఉంటే కలుపుకోగలరు. ఇన్ఫినిటీ నంబర్లు కనుక్కున్న శ్రీనివాస రామానుజన్ మళ్లీ పుట్టినా…చెప్పలేని లెక్కలవి. నేనెంత? నా లెక్కల చదువెంత?)

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…
  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions