పండుగపూట ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉన్న చౌక వినోదం టీవీ… థియేటర్లకు వెళ్తే నిలువుదోపిడీ… మన ధనిక ప్రభుత్వ అత్యంత తీవ్ర ఔదార్యం పుణ్యమాని ఈ థియేటర్ల వాళ్లు నిలబెట్టి జేబులు కత్తిరిస్తారు… పైగా ఒమిక్రాన్ భయం ఉండనే ఉంది… వేరే బయట వినోద కార్యక్రమాలు, పర్యటనలకు వెళ్లేంత సీన్ లేదు… సో, టీవీయే శరణ్యం… కానీ ఈసారి భోగి, సంక్రాంతి పండుగ వంటల్ని మన ప్రధాన టీవీలు ఈటీవీ, జీతెలుగు, స్టార్‌మా మరీ చప్పిడి పథ్యం తిండిలా మార్చేశాయి…
ఒక్క పెద్ద సినిమా లేదు… పోనీ, పాత వాటిల్లో కాస్త చూడబుల్ సినిమా వేశారా అంటే అదీ లేదు… ఇక వాటి ప్రత్యేక ప్రోగ్రాములైతే పరమ దరిద్రం ఈసారి… ఏదో సగటు తెలుగు సాదాసీదా సినిమాను చుట్టేసి జనం మీదకు వదిలినట్టుగా వదిలేశారు… మీ చావు మీరు చావండి అన్నట్టుగా… నిజానికి ప్రతి పండక్కి టీవీల్లోని ప్రత్యేక కార్యక్రమాల్లో పెద్ద రిలీఫ్ ఈరోజుల్లో… ఈసారి దాన్ని కూడా నాశనం చేసేశారు… ప్రత్యేకించి జీతెలుగు వాడు… దరిద్రంన్నర… రెండురోజులపాటు ప్రసారం చేశాడు… కేరళలో సంక్రాంతి అల్లుళ్లు అని పేరు పెట్టి… ఓ కొత్త కోణం జతచేసి, తెలుగు ప్రేక్షకుల్ని చావగొట్టి, చెవులు మూశాడు…
Ads
అందుబాటులో ఉన్న కొందరు సీరియళ్ల నటులను కేరళ దాకా పట్టుకుపోయి, అక్కడ కూడా కిట్టీపార్టీలు చేయించి, ఇదుగో చూడండి, మా స్పెషల్ షోలు అన్నట్టుగా రెండురోజులపాటు ఉదయం వేళల్లో ప్రసారం చేశాడు… ఆ నటీనటుల మొహాల్లో 80 శాతం ఎరుక లేనివాళ్లే… ఎప్పటిలాగే ఆ మొనాటనస్ సుమను గాకుండా ఈసారి ఉదయభాను కనిపించి సందడి చేయడం ఒక్కటే కాస్త విశేషం… అంతకుమించి ఆ ఆరుగంటల ప్రసారంలో ఇది బాగుందిరోయ్ అని చెప్పడానికి ఏమీలేదు…
ఈటీవీది మరో దరిద్రం… ఎప్పటిలాగే రోజాకు ఓ డాన్స్ కావాలి… ఏవో గెంతులు వేస్తుందిగా… ఇంకా శుభలగ్నం రోజుల్లో ఉన్నానని అనుకుంటున్నట్టుంది… ఈమెకు తోడుగా ఈసారి ఆమని… అదే హైపర్ ఆది, అదే ఆటో రాంప్రసాద్, అదే ఇమ్ము, అదే రోహిణి, అదే వర్ష, అదే నరేష్… ఎప్పటిలాగే బాబూమోహన్, అన్నపూర్ణ… పైగా రోజా, ఆమని తదితరుల కబడ్డీ… కమెడియన్ల ఇంటి సభ్యులను తీసుకొచ్చి, వాళ్లకు ముందే స్క్రిప్టు రాసిచ్చి, బట్టీ పట్టించి, నాలుగు చెత్త డైలాగులు పలికించి, ఇదే కామెడీ, నవ్వండ్రా అని హుకుం జారీచేసింది మల్లెమాల టీం… రోజురోజుకూ బాగా దరిద్రం దట్టంగా అంటుకుంటోంది… కాకపోతే ప్రదీప్ యాంకరింగ్ కాస్త ఎప్పటిలాగే సరదాగా ఉంది…
జెమిని వాడికి ఇవేమీ చేతకావు… అసలు అదొక చానెల్ ఉందని కూడా జనం మరిచిపోయారు… పేరుకు అది దేశంలోకెల్లా టాప్ టీవీ నెట్‌వర్కుల్లో ఒకటి… కానీ జెమిని మరీ యూట్యూబ్ చానెళ్ల స్థాయికి దిగజారిపోయింది… అది ఇప్పట్లో లేవదు… ఇక మాటీవీ… మంచి రీచ్ ఉంది, సాధనసంపత్తి ఉంది, ఖర్చు పెట్టగలదు… కానీ ఏం సుఖం..? క్రియేటివ్ లెవల్స్ మరీ ఘోరం… మొన్నటి బిగ్‌బాస్ సీజన్ చూస్తేనే అర్థమైంది కదా… మా క్రియేటివ్ టీంకు ఎన్నిరకాల అవలక్షణాలు అంటాయో… చెత్త… ఇప్పుడది ఇదుగో ఇలాంటి పండగ స్పెషల్ షోలకూ పట్టుకుంది… సంక్రాంతిన మధ్యాహ్నం ప్రసారం చేసిన పండుగ స్పెషల్ ఓ స్క్రాప్…
సీరియళ్లలోని కొందరు నటులు… (అందులో సగం మందిని మనం గుర్తుపట్టలేం…) వాళ్లతో పిచ్చాపాటీ… ఇటు కొందరు, అటు కొందరు… పిచ్చి మెదళ్ల పోటీలు… చివరలో భోజనాలు… మధ్యలో ఇక వేరే దిక్కులేదు కాబట్టి, బిగ్‌బాస్ పాత కంటెస్టెంట్లను పట్టుకొచ్చి, ఏదో హంగామా క్రియేట్ చేయడానికి విఫల ప్రయత్నం… అదీ ఈసారి బోర్, బోరర్, బోరెస్ట్… పైగా రవి యాంకరింగ్ కూడా సో సో… వర్షిణిని వదిలేయండి… ఫిట్ ఫర్ నథింగ్… మొత్తానికి మూడు మెయిన్ స్ట్రీమ్ వినోద చానెళ్లు ఉప్పులేని పప్పును వడ్డించాయి… ఎటొచ్చీ ఈసారి బంగార్రాజు హీరోయిన్ కృతిశెట్టి ప్రజెన్స్ బాగుంది… సిగ్ధంగా, ముద్దుగా తెర మీద కనిపించినంతసేపూ బాగుంది… ఊ అంటావా, ఊఊ అంటావా పాట ఫుల్ డామినేట్ చేసింది… రష్మితో కూడా గెంతులు వేయించారు… (నిజానికి ఆమె ఇంకా బాగా చేయగలదు, ఈ కంపోజింగ్ కూడా సరిగ్గా లేదు)… మొత్తానికి ఒక్క రెండు నిమిషాల కొత్తదనం కనిపించలేదు… ఈ మూడు చానెళ్ల 12 గంటల పండుగ ప్రత్యేక ప్రసారాల్లో…!!
Share this Article